e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home బతుకమ్మ జన ఘనపదం!

జన ఘనపదం!

పల్లె పదాల పులకరింత.. తల్లి పెదాల పలకరింత.. మట్టి వాసన.. విత్తు పరిమళం..పక్షి సోయగం.. చినుకు చిటపట.. జానపదం! జీవితపు కష్టసుఖాల కావడిలో అనుభవమే పెనవేసుకొని పల్లవై.. బతుకు పోరాటపర్వంలో ఆస్వాదనే అల్లుకొని చరణాలై.. సామాన్యుడి స్వరం నుంచి జాలువారుతుంది జానపదం. మత్తడి దుంకిన ఒరవడితో.. మొక్క చిగురించిన అనుభూతితో.. పల్లెదనపు అందం, ఆనందం కలగలిసి కమ్మని పాటగా ఉద్భవిస్తుంది జానపదం. సరిగమల సమకూర్పు తెలియకపోయినా..గమకాల గారడి నేర్వకపోయినా..సంగీత ప్రపంచాన్ని ప్రదక్షిణలు చేయించే సత్తా జానపదానికి ఉన్నది. అందుకే, దునియా మొత్తం జానపదం చుట్టూ తిరుగుతున్నది! లక్షణమైన పేరు.. విలక్షణమైన గుర్తింపు.. లక్షల రూపాయల సంపాదన ఇస్తూ జానపదం ఘనపదమై వెలుగుతున్నది!

శ్రమజీవుల కష్టం నుంచి.. చెమట చుక్కల నుంచి.. మట్టి వాసన నుంచి.. పుడమి పులకరింత నుంచి పుట్టింది జానపదం. కష్టాన్ని మర్చిపోవాలన్నా.. సంతోషాన్ని పంచుకోవాలన్నా అన్నీ పాట ద్వారానే జరిగేవి ఒకప్పుడు. పని-పాట కవల పిల్లలుగా మెలిగేవి. పుట్టినప్పటి నుంచి బిడ్డ పెద్దవుతున్న ప్రతీ దశలో పాట పరవశింపజేసేది. మెట్టినింటి ముచ్చట్లు, పుట్టినింటి ప్రేమలు, అప్పగింతలు, సీమంతం, పురుడు వంటి సందర్భాల్లో వినిపించే అచ్చమైన ఆణి
ముత్యపు తీరొక్క పల్లె పదాలు మట్టిబిడ్డల దగ్గర ఇంకా పదిలంగానే ఉన్నాయి. సేకరించి ఒడిసిపడితే డిజిటల్‌ యుగపు చరిత్రలోనే జానపదం ఘనపదమై నిలిచిపోతుంది. జనామోదం పొంది జెమిడిక మోతలు మోగిస్తుంది.

- Advertisement -

పనితో పుట్టింది
పక్షవాతం వచ్చిన వ్యక్తి హాస్పిటల్‌ మంచంపై పడుకొని ఉన్నాడు. డాక్టర్లు ఎంతో ప్రయత్నించారు. నర్సులు చేతనైన సాయం చేశారు. కానీ అతని శరీరంలో ఎలాంటి స్పందనలూ రాలేదు. కదలికలే లేవు. నర్సుకు ఒక ఐడియా వచ్చింది. మొబైల్‌లో పాట పెట్టి డ్యాన్స్‌ చేయసాగింది. మంచంపై నిస్తేజంగా ఉన్న రోగి హఠాత్తుగా ఉత్తేజితుడు అయ్యాడు. అసంకల్పితంగా అటూ ఇటూ కాళ్లూ, చేతులూ కదిలించాడు. ఆ పాట అతని వ్యాధిని తగ్గించకపోయి ఉండొచ్చు. కానీ రోగి ముఖంలో ఆ క్షణాన కనిపించిన సంతోషం, ధైర్యం ఎంతో విలువైనవి. జానపదానికి ఉన్న గొప్పదనం ఇది. ఆ పాటే.. యావత్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ‘బుల్లెట్టు బండి’. ఈ పాటకు యూ
ట్యూబ్‌లో, బయట అభిమానులు కోట్లలో ఉన్నారు. పసిపాప గొంతెత్తి పాడుతున్నది. ముసలి తాత ముచ్చటపడి కాలెత్తి ఎగురుతున్నడు. ఇది జానపదం గొప్పదనం. తెలంగాణ పల్లెదనం గొప్పదనం.
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నట్లుగా ‘టప టప టప టప టప టప చెమట బొట్లు తాళాలై పడుతుంటే.. కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే.. పాటా పనితో పాటే పుట్టింది. పనీ పాటతో జతకట్టింది’ అనేదే నర్సు విషయంలోనూ జరిగిందని చెప్పవచ్చు. గతంలో ఒడ్లు దంచుతున్నప్పుడు, నాట్లేస్తున్నప్పుడు, కలుపు తీస్తున్నప్పుడు జానపదాలు జాలువారేవి. ఇప్పుడు, వృత్తులను బట్టి వాటి తీరు మారుతున్నది. పాట మాత్రం పల్లె పదమే. ఒకప్పుడు ఇలా బహిరంగంగా పల్లె పాటలు, జానపదాలు పాడితే నామోషీగా భావించేవాళ్లు. డిజిటల్‌ మీడియా పుణ్యంగట్టుకొని మళ్లీ జానపదాన్ని బతికిస్తున్నది. ఫోక్‌ను బాజాప్తా.. బరాబర్‌ భుజాలకెత్తుకొనే అవకాశం కల్పించింది. ఇప్పుడు, జానపదం బంగారు బాతు. ట్రెండ్‌ సెట్టర్‌. వైరల్‌ కంటెంట్‌. నమ్ముకుంటే ఫేమ్‌ వస్తుంది, నేమ్‌ వస్తుంది. ఎడ్ల బండి నుంచి మొదలుకొని బెంజ్‌కారు దాకా అన్నిచోట్లా వినిపిస్తూ క్లాస్‌.. మాస్‌ అందర్నీ ఉర్రూతలూగిస్తుంది. బుల్లెట్టు బండి పాట లెక్క!

చితికిన చోటే బతికి
సినిమా పాటల క్రేజ్‌ తగ్గింది. జానపదం క్రేజ్‌ పెరిగింది. నాడు జానపద వైభవాన్ని తగ్గించిన సినిమానే ఇప్పుడు జానపద పరిశోధనలో మునిగిపోతున్నది. జనాదరణ పొందిన పల్లె పాటలను ఒడిసిపట్టి సినిమాల్లో పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఒకరకంగా ‘ఫోక్‌’ ఐటమ్‌ సాంగ్‌ ట్రెండ్‌కు బ్రేక్‌లు వేసింది. ‘సినిమాకు ఊపురావాలన్నా, కుర్రకారును హుషారెత్తించాలన్నా పల్లెపదం గడప తొక్కాల్సిందే’ అని సినీ మేధావులకు అర్థమైంది. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల్లో సినిమా పాటల్లో జానపదాలే ఎక్కువగా ఉండేవి.

‘ఏరువాకా సాగారో రన్నో సిన్నన్నా’, ‘మావా మావా మావా.. ఏమే ఏమే భామ’, ‘పచ్చగడ్డి కోసేటి పడుసు పిల్లో’, ‘ముద్దబంతి పూలుపెట్టి మొగలి రేకులు జడలో చుట్టి’ ‘నీ సోకు సూడకుండా నవనీతమ్మా నే నిమిషమైన ఉండలేనమ్మా’, ‘నిలపర సిన్నోడో నీ సోకు నీగీకు’, ‘ఒసే ఒయ్యారీ రంగీ.. ఒగలమారి బుంగీ’, ‘మాయదారి సిన్నోడు.. మనసే లాగేసిండు’ వంటి జానపదాలను ప్రేమగీతాలుగా మార్చి సినిమాల్లో పెట్టారు. ఇవి ఆ రోజుల్లో సూపర్‌హిట్‌గా నిలిచాయి. సినిమా ఎప్పుడైతే రంగుల్లోకి మారిందో దానితో పాటే డిస్కో పాటలు ఊపందుకున్నాయి. సినిమా ఎదుగుతున్న కొద్దీ జానపదం కనుమరుగవుతూ వచ్చింది. నేటితరం దర్శకుల్లో తేజ తన ప్రతీ సినిమాలో జానపదం ఉండేలా చూసేవాడు. ఇక ఐటమ్‌ సాంగ్స్‌ శ్రుతి మించడంతో ఫోక్‌ జాడ లేకుండా పోయింది. తెలంగాణ జానపద సంస్కృతి తరుచూ కనుమరుగువుతూ వచ్చింది. జానపదం అంటేనే చులకనగా చూస్తూ సంస్కృతిని అవమానించిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ జానపద సంస్కృతి, పాట ఎక్కడ అవమానం ఎదుర్కొన్నదో అదే వెండితెర వేదికపై ఇప్పుడు కాసుల వర్షం కురిపించే వనరుగా మారింది. డిజిటల్‌ మీడియా పుణ్యమాని తెలంగాణ జానపదం ఇప్పుడు తెరమీద మెరుస్తున్నది.

వివాదం.. వైరల్‌
జన సామాన్యం వాడుక నుంచి పుట్టిందే జానపదం. వీటికి రచయిత ఎవరూ ఉండరు. ఉన్నా వారి పేరు ఎక్కడా వెలుగులోకి రాదు. తరాల నుంచి జానపదం వారసత్వంగా వస్తున్నది. మన సంస్కృతిలో భాగమైపోయింది. పని పాటల్లో, పంట చేలల్లో పుట్టిన జానపదం నేడు తెరమీద తేనెలొలికే స్థాయికి ఎదిగింది. జానపదాలకు కాపీ రైట్‌ లేకపోవడంతో ఎవరు ముందుగా సేకరించి వెలుగులోకి తీసుకొస్తే వాళ్లే ఆ పాట తమదని చెప్తున్నారు. ఈ క్రమంలో జానపదం తరుచూ వివాదానికి గురవుతున్నది. సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్నాయంటూ కూడా జానపదం కాంట్రవర్సీకి గురవుతున్నది. ‘వరుడు కావలెను’ సినిమా కోసం చిత్రీకరించిన ‘దిగు దిగు దిగు నాగ’ పాటను ఐటమ్‌సాంగ్‌గా మార్చారని ధర్మ పరిరక్షణ సమితి ఆందోళనకు దిగింది. ఇలాంటి ట్యూన్స్‌ భక్తికోసం వాడాలి తప్ప రక్తి కోసం కాదని హెచ్చరించారు. ‘చెట్టుకింద కూసున్నవమ్మా సల్లంగా సూడే ఓ మైసమ్మా’.. మంగ్లీ పాడిన బోనం పాట పెద్ద దుమారమే లేపింది.

ప్రముఖ జానపద గాయకుడు రామస్వామి రాసిన ఈ పాటకు సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌ అదనపు పదాలు జోడించారు. మైసమ్మను ‘మోతెవరీ లెక్క కూసున్నవమ్మా’ అని సంబోధించడంతో వివాదం మొదలైంది. ‘దేవతలను, హిందూ సంస్కృతిని కించపరుస్తూ పాడటం తప్పు’ అని కొందరు అభ్యంతరం తెలపగా, ‘నిందాస్తుతిలో దేవుడిని కొలుస్తూ పాడాను తప్ప దేవతలను, సంస్కృతిని అవమానించలేదు’ అని మంగ్లీ వివరణ ఇవ్వడంతో పాటు ‘మోతెవరీ’ పదాన్ని తొలగించింది. ‘మోతెవరి అని మంగ్లీ అనడం తప్పు అయితే తనికెళ్ల భరణిలాంటి వారు ‘ఆట కదరా శివా’ అని పేర్కొనడం కూడా తప్పే అవుతుంది’ అని కొందరు కౌంటర్‌ ఇచ్చారు. ‘లవ్‌స్టోరీ’ లోని ‘సారంగ దరియా’ పాట కూడా పెద్ద దుమారమే లేపింది. ‘ఈ పాటను నేను వెలుగులోకి తీసుకొచ్చిన. మా అమ్మమ్మ ఈ పాటను ఇచ్చింది’ అని జానపద గాయని కోమలి అభ్యంతరం వ్యక్తం చేయగా.. ‘చిన్నతనంలో నేను ఈ పాటను విన్నాను. నేనే కాదు ప్రతీ పల్లెలో ఈ పాట ఫేమస్‌’ అన్నారు గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ. నెలరోజుల పాటు ఈ వివాదం నడిచింది. న్యాయం చేస్తానని శేఖర్‌ కమ్ముల హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

బతుకుతూ.. బతికిస్తూ
తాను బతుకుతూ, సంస్కృతిని బతికిస్తూ, మరికొంత మందికి బతుకు దారి చూపిస్తున్నది జానపదం. అదొక అప్పగింతల కార్యక్రమం. మామూలుగా ఇలాంటి ఘట్టాల్లో పెండ్లి కూతురు ఏడుస్తూ కనిపిస్తుంది. అందరిలా తాను ఏడవకుండా కట్టుకున్నవాడికి తాను పుట్టి పెరిగిన పరిస్థితుల గురించి బుల్లెట్టు బండి పాట రూపంలో చెప్తూ స్టెప్పులేసి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన నవ వధువు సాయి శ్రియ పెండ్లి గతనెల 14వ తేదీన జరిగింది. అప్పగింతల సమయంలో సాయి శ్రియ చేసిన డ్యాన్స్‌ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్‌ కావడంతో ఆమె ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ అయిపోయింది. ఒరిజినల్‌ పాటను ప్రొడ్యూస్‌ చేసినవాళ్లు తమ రాబోయే పాటలో నటించేందుకు ఆఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. కనకవ్వ పేరు తెలియని వారు ఉండరు కావచ్చు. 60 ఏండ్ల కనకవ్వ ఓ టీవీ షోలో పాల్గొని జానపదానికి సరికొత్త నిర్వచనం చెప్పింది. ‘నర్సపెల్లీ గండిలోని గంగధారి.. ఆడినెమలీ ఆటలాకు గంగధారి’ అంటూ యూట్యూబ్‌ వేదికగా పాడటంతో కోట్లాది ప్రజలు పట్టంగట్టారు. దీంతో కనకవ్వ సెలబ్రిటీ అయిపోయింది. చేలల్లో, చెలకల్లో కూలి పనులు చేసుకునే కనకవ్వకు పాటల్లో యాక్టింగ్‌ చేసే, పాడే అవకాశాలు చాలా వస్తున్నాయి. కష్టాల కావడిని మోసిన కనకవ్వకు జానపదం కొత్త జీవితాన్ని ఇచ్చింది. జానపద కల్చర్‌ అంటేనే అవమానకరంగా చూసిన ఎన్నో చానెల్స్‌లో, వేదికల్లో తెలంగాణ జానపదం గెలిచి నిలిచింది. లక్ష్మి, మౌనిక, శిరీష, స్ఫూర్తి వంటి జానపద కళాకారులు ‘ఈటీవీ’ వంటి బహుళ ప్రజాదరణ కలిగిన చానెల్స్‌లో షోస్‌ చేసే స్థాయికి ఎదిగారు అంటే అది కేవలం జానపదం ద్వారానే సాధ్యమైందని చెప్పొచ్చు.

ఐదు వందల ఏండ్ల నాటి పన్నెండు మెట్ల కిన్నెరను భుజాలపై మోస్తూ, వారసత్వంగా భరిస్తూ వస్తున్న కిన్నెర మొగులయ్య గురించి పాఠ్యపుస్తకాల్లో పాఠం ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. అలాంటి కిన్నెర మొగులయ్యను, ఆయన కళను ‘భీమ్లా నాయక్‌’ సినిమా మరింత ఎక్కువమందికి తెలిసేలా చేయడంలో ఉపయోగపడింది. యూట్యూబ్‌లో, సోషల్‌మీడియాలో ఇప్పుడు ట్రెండ్‌ అవ్వాలన్నా, వైరల్‌ కావాలన్నా ఫోక్‌ సాంగ్సే ముందంజలో ఉంటున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో జానపదాలు యూట్యూబ్‌ వేదికగా విడుదల అవుతూ ఎంతోమంది కళాకారులకు కొత్త జీవితాన్ని ఇస్తూ జానపదం ఘనపదంగా నిలుస్తున్నది.

పల్లె నుంచి ప్రపంచ వేదికలపై
జానపదం మారుమూల పల్లెల నుంచి ప్రపంచ వేదికల వరకూ ఎగురుకుంటూ వెళ్లింది. మట్టి మనుషుల నోటి నుంచి పుట్టి విదేశీ వీధుల్లో వీర విహారం చేస్తున్నది. అమెరికాలో ‘నాట్స్‌’ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు, భాష, కళలకు అద్దంపట్టేలా ప్రతీ సంవత్సరం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈసారి కూడా నిర్వహించింది. కార్యక్రమం పేరు ‘పల్లెపాట’. 20 మంది జానపద కళాకారులు పాల్గొన్నారు. ఎక్కడో న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో ‘తిన్నా తిరంబడుతలే. కూసున్నా తిరంబడుతలే. ఏడున్న తిరంబడుతలె. ఎవరున్నా తిరంబడుతలె. బాధైతుందే.. నీ యాదిల మనసంత మస్తు బరువైతుందె’, ‘ఆనాడేమన్నంటినా తిరుపతి.. నిన్నీనాడేమన్నంటినా తిరుపతి’ అంటూ పల్లె పదాలు వినిపించి ఫోక్‌ సింగర్‌ లక్ష్మి తెలంగాణ మట్టితనాన్ని తెలియజేసింది. ‘ఈ కాలమ్మీద మన్నువొయ్యా.. నిన్ను నన్ను దూరం చేసెనయ్యా.. పానం ఆగదు ఏందిరయ్యా నిన్నుసూడకుండా బావయ్యా’ వంటి బావా మరదళ్ల పాటలతో వినీల శివపురం సందడి చేసింది. పల్లెల్లో ఉండే ప్రేమలు, ఆప్యాయతల్ని కండ్లకు కట్టినట్లు వినిపించింది. ‘నీ ఆగం మీదా అగ్గివొయ్యా దూరంజేస్తివి బావయ్యా’ అంటూ ప్రేమ చూపిస్తూనే తిట్టే పాటలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) ఆధ్వర్యంలో బే ఏరియాలో నిర్వహించిన ఉత్సవాల్లో కూడా తెలంగాణ జానపదం ధూమ్‌ధామ్‌ చేసింది. ఇవేకావు.. తానా, బాటా, వేటా వంటి అమెరికన్‌ తెలుగు సంఘాలు నిర్వహించిన ప్రతీ కార్యక్రమంలోనూ పల్లెపాటలే హైలైట్‌గా నిలుస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది? జానపదం వినిపిస్తే ‘ఏంట్రా బాబూ.. ఆ ఊరు పాటలు’ అని హేళన చేసేవాళ్లు. ఇప్పుడు ముత్యాల్లాంటి ముచ్చటైన జానపదాలను జైకొట్టి పాడుకుంటున్నాం. పగడాల్లాంటి పసందైన పల్లెపాటలను వింటూ పరవశించిపోతున్నాం. మన ఊర్లో, పట్నంలోనే కాదు.. అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ వంటి తెలంగాణ ప్రజలు ఉండే ప్రతీ దేశంలో జానపదం ధూమ్‌ తడాఖా చేస్తున్నది.

వెండితెరపై బంగారు పాట
తరతరాలుగా ప్రజల నోళ్లలో నానే పల్లె పదాలను, ట్యూన్స్‌ మూలాలను తీసుకొని సినిమాల్లో పెట్టుకునే ట్రెండ్‌ సెట్‌ చేసింది శేఖర్‌ కమ్ముల. ‘ఫిదా’ సినిమాలో ‘పిల్లా రేణుకా పిలగాడొచ్చిండే’ పాటతో ఈ ఒరవడికి శ్రీకారం చుట్టాడు ఆయన. ‘లవ్‌స్టోరీ’ సినిమాలో ‘సారంగ దరియా’ పాటను పెట్టి మరోసారి ఫోక్‌ గురించి తెరలేపాడు. ‘వరుడు కావలెను’ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగా నాగో నా దివ్యా సుందర నాగో’ పాటను పెట్టుకోవడం, అది వైరల్‌ అవ్వడం, సినిమా ప్రమోషన్‌కు అది బాగా కలిసి రావడం… ఇవన్నీ చూస్తుంటే ‘జానపదం’ వెండితెరకు బంగారు బాతే అని చెప్పొచ్చు. ఉత్తరాంధ్ర జానపదం కూడా మెరుస్తున్నది. ‘పలాస’లో ‘నాదీ నక్కిలేసు గొలుసు.. నీ పక్కన పడ్డాది’ అనే పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. జీవనోపాధి కోసం రైల్వే స్టేషన్లలో పాటలు పాడుకునే అసిరయ్య దగ్గర రఘుకుంచె ఈ పాటను సేకరించాడు. జానపద గాయకుడు పెంచల్‌ దాస్‌ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘దారిసూడు దుమ్ముసూడూ మావా’ వంటి దుమ్ములేపే పాటలను అందిస్తుండటం వల్ల సినీ జానపదంపై అంచనాలు రెట్టింపయ్యాయి. శ్రీకారం సినిమాలో ‘వస్తానంటివో పోతానంటివో’ పాట కూడా పెంచల్‌దాస్‌ పాడాడు. ‘అలవైకుంఠ పురం’లో ‘రాములో రాములా నన్నాగం జేసిందిరో’, ‘రాజా ది గ్రేట్‌’లో ‘గున్నా గున్నా మామిడి.. పిల్లా గున్నా మామిడి తోటకీ’, ‘రంగస్థలం’లో ‘ఆగట్టునుంటావా నాగన్నా.. ఈ గట్టునుంటావా’ వంటి జానపదాలు వెండితెరపై సందడి చేశాయి.

జానపదానికి సినిమాల్లో చోటు కల్పించే విషయంలో పవన్‌ కల్యాణ్‌ను అభినందించాలి. ఐదు తరాల కళ ‘కిన్నెర’కు పట్టంగట్టి తన సినిమాలో పెట్టుకోవడమే కాదు మొగిలయ్యతో టైటిల్‌ సాంగ్‌ పాడించి జానపదాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు. ‘ఆడగాదు ఈడగాదు.. అమీరోల్లా మేడగాదు’ అంటూ హీరో పుట్టు పూర్వోత్తరాలను కిన్నెర వాయిస్తూ మొగులయ్య పాడిన ఈ పాట కోట్లాది హృదయాలను గెలుచుకున్నది. తన ప్రతీ సినిమాలో ఓ చిన్న బిట్‌ అయినా జానపదానికి సంబంధించినది పెట్టుకుంటాడు పవన్‌. ‘అజ్ఞాతవాసి’లో ‘కొడకా కోటేశ్వర్రావు.. కరుసైపోతవురో’, ‘అత్తారింటికి దారేది’లో ‘కాటమరాయుడా కదిరీ నరసింహుడా’, ‘ఖుషి’లో ‘బైబయ్యే బంగారు రమణమ్మా.. బాయి సెరువుకాడ బోరింగూ రమణమ్మా’, ‘తమ్ముడు’లో ‘తాటి చెట్టెక్కలేవు తాటికల్లు తెంపలేవు’ వంటి ఫోక్‌ బిట్స్‌తో అలరించాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement