e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home బతుకమ్మ జనానందమే.. సదానందం!

జనానందమే.. సదానందం!

‘ఓ అవ్వా.. తిన్నవా? ఏంజేత్తానవ్‌? ఓ బాపూ ఎటువోతానవే? అగ్గో చూసిగూడా పల్కరిస్తలేవుగా’.. ఇండ్లల్ల వినిపించే ఇసొంటి పల్లె తెలంగాణ పదాలు సినిమా తెరమీద కనిపించేదాకా వచ్చినయి అంటే.. ఓ వ్యక్తి కష్టాన్ని కచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అతడే రాదండి సదయ్య. ఇటీవల, ‘గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్‌’ కళారంగ అవార్డును అందుకున్న సందర్భంగా సదన్న చెప్పే తీరొక్క ముచ్చట.

అందరికీ శనార్తి.. మా సొంతూరు కనగర్తి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం. నా పేరు రాదండి సదయ్య. అందరూ నన్ను ఆర్‌ఎస్‌ నందా అని ముద్దుగా పిలుచుకుంటరు. నాన్న భూమయ్య నా చిన్నతనంలోనే జరిగిపోయిండు. అష్టకష్టాలు పడి అమ్మ నంబమ్మ ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్దజేసింది. అప్పుడు నేను తొమ్మిదేండ్ల పిలగాన్ని. ఊళ్లె వీరబ్రహ్మేంద్ర స్వామి బుర్రకథ చెప్పిండ్రు. మూడ్రోజులకు కథ అయిపోయింది. ఇగ నాలుగో రోజు నుంచి నా కథ మొదలైంది. ఆనిక్కాయ బుర్ర తీస్కొని సోపతిగాళ్లను వెంటేసుకొని తెల్లారితే చాలు ‘తందాన తానా’ అనుకుంట కథ చెప్పుడు మొదలువెట్టిన. మాకు లెక్కల పాఠాలు చెప్పే మధుసూదన్‌ సార్‌ నా కళా ప్రదర్శనను ఎప్పుడు చూసిండ్రో ఏమోగనీ, ఒకరోజు ‘సదయ్యా! బుర్రకథ చెప్పాల్సి ఉంటది బిడ్డా’ అన్నడు. చెప్పకపోతే కొడ్తడేమో అనే భయంతో ‘సరే సార్‌’ అని మాటిచ్చిన. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర, బుర్రలు తీసుకొచ్చి ఇచ్చిండు. మూడ్రోజులు ప్రాక్టీస్‌ చేసినం. నాలుగోరోజు నేను ప్రధాన కథకుడిగా బుర్రకథ చెప్పిన. చూసినోళ్లు ‘శభాష్‌’ అన్నరు.

- Advertisement -

పరిశీలనే నా గురువు
ఒకసారి కనగర్తిలో ‘రాజకీయ వీధి బాగోతం’ నాటకం నడుస్తున్నది. ఏమైందో ఏమో కీలక పాత్రధారి రాలేదు. కొంతసేపు నాటకాన్ని ఆపేసిండ్రు. అక్కడున్నవాళ్లెవరో నా పేరు చెప్పిండ్రంట. నాకు నాటకాలంటే ఇష్టమేనాయె.. వేషమిస్తే వద్దంటనా? సరే అని వేసిన. ఇదే నాటకాన్ని తర్వాత వేరే ఊర్లల్ల కూడా వేసిండ్రు. నాటకం ప్రదర్శించిన ప్రతీచోటా ఆ పాత్రకు నన్నే పెట్టుకుండ్రు. ఇగ ఊళ్లె ఏ నాటకం వేసినా నాకు ఏదో ఒక పాత్ర ఇస్తుండె. అట్లాఏకపాత్రాభినయం, తుపాకి రాముడు వంటి పాత్రలు చేసిన. ‘ఏందిరా ఏమైనా ఆటలూ, నాటకాలని గటువోతవ్‌? బాపు లేడాయె. అమ్మ ఒక్కతే కట్టంజేసి మీ ఐదుగురిని పెద్దజేయాలె’ అని వాళ్లూ వీళ్లూ అంటుంటె బాధనిపించేది. వాస్తవానికి కళ నాకు వారసత్వంగా అబ్బలే. మా నాయన కళాకారుడేం కాదు.

పరిశీలనే సినిమాలపై దృష్టి
చదువుతో పాటు ఇంకేదైనా నేర్చుకోవాలనే తపన ఉండేది. కానీ పేదరికం అడ్డొచ్చేది. చేతిల పది పైసలు కూడా లేకుంటుండె. చినిగిపోయిన బట్టలేసుకొనే ఇంటర్‌ దాకా వెళ్లిన. పుస్తకాలు, గైడ్లుగూడా కొనుక్కునే స్థోమత లేకపోతే, దోస్తుగాళ్లవే వాడుకున్నా. అమ్మను ఇబ్బంది పెట్టుడెందుకని డప్పుకొట్టవొయ్యి ఖర్సులమందం సంపాదించుకునేది. పదో తరగతి వచ్చేనాటికి జిల్లాస్థాయి పోటీలకు వెళ్లిన. ఒకసారి ‘మహతీ కళాక్షేత్రం’ వాళ్ల నాటక పోటీల్లో ‘మాకు పెండ్లి కావాలె’ నాటకం వేసిన. నాది పిచ్చోడి పాత్ర. ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. మా ఊళ్లె వెంకటేశ్వర థియేటర్‌ అని ఉండె అప్పట్ల. సినిమాలు చూడాలని ఖాయిష్‌ ఉంటుండె. కానీ పైసల్లేకపోవు. థియేటర్‌ వాళ్లతోటి మాట్లాడి సినిమా అనౌన్స్‌మెంట్‌ చేసేది ఊళ్లె. అట్లా నాకు సినిమా ఫ్రీగా చూసే అవకాశం దొరికేది. గోడమీద సీన్మబొమ్మలు చూస్తుంటే నన్ను నేను ఊహించుకుందును. అప్పుడే సినిమాలపై దృష్టి మళ్లింది.

క్రిష్ణానగర్‌లో తిరిగేవాణ్ని
సినిమాల మీద ఆసక్తితోటి హైదరాబాద్‌ వచ్చిన. రవీంద్రభారతిలో పరుచూరి నాటకోత్సవాలు జరుగుతున్నయి. అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా చేరిన. వారం రోజుల పాటు నాటకోత్సవాలు జరిగినయి. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసిన. అప్పుడే, టీటీసీ నోటిఫికేషన్‌ పడింది. ఇంటికి రమ్మని అమ్మ కబురు పంపింది. పరీక్షలు అయిపోంగనే మల్లొచ్చి హైద్రాబాద్‌లోనే పడ్డ. అంతలోపే డీఎస్సీ పడింది.. నౌకరీ కూడా వచ్చింది. దాంతోటి పిల్లలకు పాఠాలు చెప్పుట్ల బిజీ అయిన. ఊళ్లె ఉంటున్నగానీ నా ఆత్మ మొత్తం నటన పైనే ఉంది. ప్రతీ శనివారం సాయంత్ర బస్సెక్కి క్రిష్ణానగర్‌లో వాలిపోదును. సినిమాలల్ల అవకాశాలు ఎట్లొస్తయో తెల్వదు. క్రిష్ణానగర్‌లో కనిపిస్తే ఎవరైనా పిలుస్తరేమో అనుకునేటోన్ని. ఎవరో ఒకరు పిలిచి, సినిమాలో అవకాశమిస్తం అని ఆడిషన్స్‌కు పిలిచిండ్రు. ‘మంచిగ చేస్తున్నవ్‌. ఫోన్‌ చేస్తం’ అన్నరు. వెయిట్‌ చేసిన. ఎంతకూ ఫోన్‌ రాలేదు.

కొత్త తొవ్వ చూపించిన
అది 2007. ఈ తిరుగుడేంది? ఈ కథేంది? ఎవరి దగ్గరకో అవకాశాల కోసం వెళ్లడం, పడిగాపులు కాయడం ఎందుకు? నాకు నేనుగా అవకాశాలు సృష్టించుకోలేనా?’ అనిపించింది. రెండునెలలు ఆలోచించిన. అప్పట్ల ‘అగ్గి దేవుడు మల్లన్న’, ‘పరశరాముడు’, ‘గొల్ల కేతమ్మ’ వంటి కథలు, పాటల క్యాసెట్ల ట్రెండ్‌ నడుస్తున్నది. సీడీల్లోనే వేరే ఇంకేదైనా ట్రై చేయాలె అనుకున్నా. మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తులను కథా వస్తువుగా తీసుకొని రూరల్‌ కంటెంట్‌ ఇవ్వాలని డిసైడయిన. అప్పటికి ఈ సబ్జెక్టును ఎవరూ టచ్‌ చేయలేదు. మన చుట్టూ జరిగే సంఘటనలు, సన్నివేశాలనే చూపిస్తే మన భాష బతుకుతది. మనకూ మంచి పేరొస్తది అని వరుసగా 10 షార్ట్‌ ఫిల్మ్‌లు తీసిన. జనాలకు కొత్తగా అనిపించింది. ‘మనల్ని మనం చూసుకున్నట్లే ఉంది’ అనే అనుభూతి కలిగించిన. అప్పటిదాంక పెండ్లీల ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్న ఎంతోమందికి కొత్తతొవ్వ చూపించిన.

సదన్న కామెడీ చానెల్‌
సీడీల హవా కొనసాగుతుండంగనే యూట్యూబ్‌ వచ్చింది. డాక్యుమెంటరీలు ఉన్నయిగానీ షార్ట్‌ఫిల్మ్‌లు లేవు. యూట్యూబ్‌ ద్వారా గ్రామీణ ప్రతిభావంతులకు ఒక తొవ్వ చూపెట్టాలనుకున్న. 2013లో కోడెం సంతోషన్న పరిచయం అయ్యిండు. ‘సదన్న కామెడీ’ చానెల్‌ ద్వారా ‘గుట్టల్లో గుసగుస’తో తొలి అడుగు వేసిన. మామూలు ఆదరణ కాదది. ఇంతకంటే ఏంగావాలె నాకు? అయితే సర్కారు నౌకరీ ఉండుట్ల నటనకే పూర్తి సమయం ఇవ్వలేకపోయిన. ఇప్పటివరకు 150 దాకా విలేజ్‌ కామెడీ షార్ట్‌ఫిలిమ్స్‌ చేసిన. దాంట్లో 80 దాకా నా చానెల్లో తీసినవే .

ప్రతి దేశంలో అభిమానులు
సీడీలో మొదాలు ‘కండల కొండన్న.. ఏతులెక్కువ’ షార్ట్‌ఫిల్మ్‌ తీసిన. ప్రేక్షకులు నన్ను ఎక్కడికో తీసుకపోయిండ్రు. తర్వాత ‘బుర్రు బుజ్జన్న’, ‘కొండన్న పోశి’, ‘డాక్టర్‌ కొండన్న’, ‘దయ్యం బువ్వదిన్నది’ వంటివి తీసిన. నా ఫస్ట్‌ సీడీనే విదేశాలకు వెళ్లింది. చానా ఫోన్‌కాల్స్‌ వచ్చినయి. ‘అన్నా మన భాషను, సంస్కృతిని బతికిస్తున్నవే’ అని ఎంతోమంది మెచ్చుకున్నరు. ఇప్పుడు ప్రతీదేశంలో నాకంటూ అభిమానులున్నరు. ‘ఊకే ఈ వీడియోల పిచ్చేంది నీకు? సర్కారు నౌకరీ ఉండనే ఉండె. అది చేసుకుంట నిమ్మళంగ ఉండక ఎందుకీ తిప్పలు నీకు?’ అని మా ఇంటోళ్లు అందురు. పది లక్షలు అప్పు కావచ్చు. సంపాదించుకోవాలంటే తిరిగి సంపాదించుకోగలను. కానీ నేను పైసలు సంపాదించుకోనీకె కళా రంగంలోకి రాలేదు. నాకు అదో పిస. జనానందమే సదానందం అనే కాన్సెప్ట్‌తో వచ్చినోణ్ని. అంత ఈజీగా ఎట్లా ఇడిసిపెట్టేస్తా?

నా తపనను గుర్తించి గిడుగు రామమూర్తి పంతులు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు భాష నేర్పిన నా ఊరికి ఈ పురస్కారం అంకితం. ఇక నా విద్యార్థులకు చెప్పేదొక్కటే. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ ఉంటది. దాన్ని సరైన సమయంలో వినియోగించుకోవాలె. స్టూడెంట్స్‌ నా నటనను చూసి ముచ్చట పడుతుంటరు. ‘సార్‌.. మస్త్‌ చేసిర్రు’ అంటుంటరు. ఇప్పుడు డిజిటల్‌ మీడియా పుంజుకుంది. అవకాశాలు కూడా చాలానే ఉన్నయి. కానీ డబ్బుల కోసమే అన్నట్లు తీయొద్దు. భాషను బతికించాలె, మన కల్చర్‌ని బతికించాలె. నా వరకైతే, వ్యూయర్‌షిప్‌ కోసం కాకుండా జనామోదం కోసమే చేస్తా అనే నమ్మకం కలిగించిన. ఇగ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నయి. ఇన్నొద్దులు వేచిచూసిన. కానీ ఇప్పుడు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలె. త్వరలో ఒక సినిమాలో ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నా. ఇక సదన్న సినిమాల్లో కనిపిస్తడని గర్వంగా చెప్తున్నా.

ఇక సినిమాలల్ల కనిపిస్తా
నా తపనను గుర్తించి గిడుగు రామమూర్తి పంతులు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు భాష నేర్పిన నా ఊరికి ఈ పురస్కారం అంకితం. ఇక నా విద్యార్థులకు చెప్పేదొక్కటే. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్‌ ఉంటది. దాన్ని సరైన సమయంలో వినియోగించుకోవాలె. స్టూడెంట్స్‌ నా నటనను చూసి ముచ్చట పడుతుంటరు. ‘సార్‌.. మస్త్‌ చేసిర్రు’ అంటుంటరు. ఇప్పుడు డిజిటల్‌ మీడియా పుంజుకుంది. అవకాశాలు కూడా చాలానే ఉన్నయి. కానీ డబ్బుల కోసమే అన్నట్లు తీయొద్దు. భాషను బతికించాలె, మన కల్చర్‌ని బతికించాలె. నా వరకైతే, వ్యూయర్‌షిప్‌ కోసం కాకుండా జనామోదం కోసమే చేస్తా అనే నమ్మకం కలిగించిన. ఇగ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నయి. ఇన్నొద్దులు వేచిచూసిన. కానీ ఇప్పుడు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలె. త్వరలో ఒక సినిమాలో ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్‌ చేయబోతున్నా. ఇక సదన్న సినిమాల్లో కనిపిస్తడని గర్వంగా చెప్తున్నా.

దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement