చెట్టు నేస్తం


Sun,November 1, 2015 01:37 AM

katha-kavitha


ఈ గట్టు దగ్గర నా నేస్తం
రోజూ పొద్దున్నే తన ముఖంలో
నా నవ్వును చూపించేది.
రాలిపోతున్న నా ఆకులను పువ్వులను
తన అలల చేతులపై ఎత్తుకుని జోలపాడేది.

తన అలల పిల్లలంతా
నా మొదల్లతో తడి ముచ్చటలాడేవి
అప్పటి పదన గుర్తులే
పొడిబారిన ఇప్పటి నా వాకిల్లయ్యాయి

తను స్తబ్దంగా ఉన్నప్పుడు
నా కొమ్మల చేతులతో పలకరిస్తే
నేనిచ్చిన చిరుగాలి స్నేహానికి ప్రతిగా
చల్లని సంగతులెన్నో చెప్పేది.

నలుదిసలా విస్తరించిన మానవజీవనం
తన అస్తిత్వాన్ని ధ్వంసం చేసేటప్పుడు
కలికాలపు వాతావరణపు కోరలు
తనను విషపు కాటు వేసినప్పుడు

నీరింకిన తన గుండెను
నా ముందు విశాలపరిచింది
పగుళ్ళ పలుకులతో పెదవులు విప్పి
ఈ చోటుకు సెలవు చెప్పింది.

కరువు దాడికి తాళలేక
అవని గర్భాన తలదాచుకుంది
మునివేళ్ళను గునపాలుగా చేసి
తనకిప్పుడు జీవం పోయగలరా
మీలో ఎవరన్నా..
3 కొత్త అనిల్ కుమార్,
93955 53393

బాయి గిర్కమీద ఊరవిశ్క


తన వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను, కళ్లముందు జరిగిన సంఘటనలను, లలితమైన హృదయస్పందనలకు కవిత్వ రూపమిస్తూ బూర్ల వేంకటేశ్వర్లు తీసుకువచ్చిన కవితా సంపుటి బాయి గిర్క మీద ఊర విశ్క. ఆయన కవితల్లో వాక్యాల పేర్పూ అద్భుతంగా ఉంటుంది. ఒకదాన్ని మించి ఒకటి నిగూడమైన అర్థాన్నిచ్చే పదాల కూర్పు ఆయన కవితల ప్రత్యేకత. బూర్ల కవితల్లో ఎక్కువభాగం తెలంగాణ భాషే రాజ్యమేలుతుంది. అందుకే ఆ అమ్మభాషలోని మాధుర్యం ప్రతి కవితలోనూ కనిపిస్తుంటది. ఇవ్వన్నీ కూడా తెలంగాణ మీద ఆయనకున్న మమకారాన్ని వెల్లడిస్తాయి. తెలంగాణ పోరాటంతో పాటు ఇక్కడి మట్టి పరిమళాలు, సంప్రదాయపు గురుతులు, పల్లెపట్టుల అందాలు అన్నీ కూడా వేంకటేశ్వర్లు కవితల్లో మనకు కనిపిస్తాయి. అక్కచెర్వు, పెద్ద బద్రవ్వ, పూల సింగిడి, నాగుంబాము, లడీల పోరు, కట్టెల రాజయ్య, కైత్వసవారి, పన్నెండు మెట్ల కిన్నరుడు, చిత్తారి ఎన్నీల, జులుస్, బర్రె ఇట్లా కేవలం కవితల్లోనే కాదు శీర్షికల్లోనూ తెలంగాణను అందంగా అక్షరీకరించారు. నిటారుగ నిల్చున్న ముద్ద గౌరమ్మ / తెలంగాణ నిండు ముత్తైదువ అంటూ పూలసింగిడి కవితలో పూలతో బతుకమ్మను అలంకరించే తీరును వర్ణిస్తారాయన. మక్కకంకి మీద మంచు నీటి చుక్క / దర్వాజకు రెండు దిక్కుల వరి గొలుక / బాయి గిరుకమీద ఊరవిశ్క / వాకిట్లో కోడిపిల్ల ఆత్మీయ పలకరింపు అంటూ పునాదిరాళ్లు అనే కవితలో పల్లె అందాల్ని ఆవిష్కరించారు. ఇట్లా ఈ సంపుటిలోని మొత్తం 55 కవితలన్నీ వేటికవే ప్రత్యేకం.
- మధుకర్

బాయి గిర్క మీద ఊరవిశ్క, కవి: బూర్ల వేంకటేశ్వర్లు, వెల: రూ.100/-, ప్రచురణ: సాహితీ సోపతి, కరీంనగర్, ప్రతులకు: బి.సంతోష, ఇం.నెం.-2-10-1524/10, ప్లాట్ నెం: 403, వెంకటేశ్వర టవర్స్,జ్యోతినగర్, కరీంనగర్, తెలంగాణ, మొబైల్: 9491598940

నిశిత పరిశోధనలకు నిలువుటద్దం ఆలోకనం


పేరును సార్థకం చేసుకొనే వారు చాలా అరుదుగా ఉంటారు. ఎంత కష్టమైనా సరే వారు తమదైన విలక్షణ పంథాను వదలరు. ఒక సీనియర్ పరిశోధకురాలుగా రావి ప్రేమలత సరిగ్గా ఈ కోవలోకే వస్తారు. రచయిత్రిగా ఎప్పటికప్పుడు తాను ఎంత ప్రసిద్ధులో ఎంచుకున్న అంశాలను తులనాత్మకంగా, విస్తృతంగా పరిశోధించడంలోనూ అంతే శ్రమిస్తారు. ఇదంతా ఒక ఎత్తయితే, వారి ఆత్మీయదృష్టి ఒక్కటీ మరోఎత్తు. అందుకే, ఆమె రచనల్లో ఒక ఆత్మగల్ల మనిషిని దర్శిస్తున్న అనుభూతిని పొందుతాం. తాజాగా విడుదలైన ఆలోకనం కూడా తన నిశిత పరిశోధనలకు నిలువుటద్దం. సృజనాత్మక ప్రతిపాదనలకు, కొత్త చారిత్రక విశేషాలకు నెలవు. ఈ పుస్తకం నిజానికి వ్యాస సంకలనమే అయినా ఆయా విషయాల వివరణలో రచయిత్రి పాటించిన కథాత్మక శైలి పాఠకులను వదలకుండా ఆసాంతం చదివిస్తుంది.

మొత్తం పదహారు వ్యాసాల్లో ప్రతీ ఒక్కటీ ఒక ఆణిముత్యమే. శీర్షికను చూస్తేనే తెలిసిపోతుంది అధ్యయనాంశం ఎంత సంక్లిష్టమో. కానీ, సత్యావిష్కరణకు రచయిత్రి పడిన శ్రమ, తాపత్రయం అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి. చేసే పనిపట్ల ప్రేమ లేకపోతే ఇంత గొప్ప ఫలితం ఎంతటి వారికైనా దాదాపు అసాధ్యం. జానపదుల నోళ్లలో నానిన, సారస్వత గ్రంథాలలో లిఖితరూపంలో నిక్షిప్తమైన పలు చారిత్రకాంశాలపై రచయిత్రి విస్తృత విశ్లేషణే జరిపారు. చాలావరకు పరిశోధనాంశాలు జానపద మౌఖిక సాహిత్యంపైన ఆధారపడినవి. కాగా, మరికొన్ని సున్నితమైనవే కాక వివాదాస్పదమైనవి కూడా. మొత్తంగా పుస్తకం సాహిత్యపు విలువను, ప్రామాణికతను సంతరించుకుంది.

తెలుగు జానపద సాహిత్యం-పురాగాథలు శీర్షికన 1980లోనే విశిష్ట పరిశోధనను అందించిన రావి ప్రేమలత తర్వాతి కాలంలో జానపద విజ్ఞానం పరిశీలన (1990), తెలుగు స్త్రీల చిత్రలిపి (1991), జానపద విజ్ఙానంలో స్త్రీ (1996) వంటి రచనలతో తనదైన పరిశోధనాత్మక ప్రత్యేకతను చాటుకొని, 2002లో వ్యాస లతిక విడుదల చేశారు. ఇక, 2006 నుంచి 2014 దాకా వివిధ పత్రికల్లో ప్రచురితమైన సాహిత్య వ్యాసాలను, కొన్ని సాహితీ సదస్సులలో సమర్పించిన పరిశోధనా పత్రాలను కలిపి ఈ సంకలనంలో ఆమె పొందుపరిచారు. ఇందులోని మొత్తం 16 వ్యాసాల్లో 9 జానపద రంగానికి చెందినవి కావడం విశేషం. మిగిలినవి ఇతర సాహిత్య రంగాలకు, భాషకు చెందినవి.

అయితే, రచయిత్రి ఏ విషయాన్ని తీసుకున్నా పైపైన తేల్చి వేయకుండా, చాలా లోతుల్లోకి చొచ్చుకొనిపోయి ఎన్నో నూతన విషయాలను, ఎంతో ప్రతిభావంతంగా ప్రతిపాదించారు అని జానపద విజ్ఞానవేత్త, కవి, విమర్శకులు తంగిరాల వెంకట సుబ్బారావు తన ముందుమాట (లోచూపు)లో అన్న సంగతి అక్షరసత్యం. రచయిత్రి చేసిన కొన్ని సూత్రీకరణలను చరిత్రకారులు సైతం జీర్ణించుకోవాల్సిందే. ముఖ్యంగా నాయకురాలు నాగమ్మ పోరాటం, జీవిత విశేషాలు, మహిళా శివశరణుల కాయక తత్త్వంలో వెల్లడైన చారిత్రక సత్యాలు, మృగ్యమైపోతున్న మానవ సంబంధాలు, సంరక్షించుకోవాల్సిన జానపద కళాసంపద వంటి విషయాలు చదువరులను బాగా ఆకట్టుకుంటై.

పల్నాటి చరిత్రలో మన నాగమ్మ (పుట్టిల్లు తెలంగాణ కనుక)కు జరిగిన అన్యాయానికి తెలంగాణ పౌరుషం గల బిడ్డలు నిజంగానే ఒంటికాలిపై లేస్తారు. కాగా, శ్రీ కృష్ణదేవరాయల హయాంలో కొనసాగిన రాజనీతిని, ప్రజాపాలనా విధానాలను, సామాజిక పరిస్థితులను ఉత్కంఠగా చదువుతాం. ఇక, రచయిత్రి ప్రపంచీకరణ విధ్వంస చిత్రణలోని విశ్లేషణకైతే మన హృదయాలు ద్రవిస్తయి.

సందర్భానుసారంగా చెప్పిన కొన్ని పౌరాణిక కథలు, చార్రితక విశేషాలు పాఠకులలో చాలా ఆసక్తిని కలిగిస్తయి. అవసరాన్ని బట్టి ఉటంకించిన పలు జానపద గేయాలు, పద్యాలు, పాటలు, వాటి ఆధారంగా రచయిత్రి చేసిన విశ్లేషణలు పుస్తకానికి మంచి బలం చేకూర్చాయి. ప్రపంచీకరణ ముందుకంటే కూడా పల్లెల్లో పేదరికం ఉండేది. కానీ, ఆత్మహత్యలు లేవు (ప్రపంచీకరణ నేపథ్యంలో జానపద కళాసంపద, పే: 136), సమాజంలో ప్రతి వ్యక్తీ తనకు అవసరమైన వాటిని మాత్రమే సంపాదించుకోవాలి. కానీ, ఆస్తిని కూడబెట్టకూడదనేది లక్కమ్మ ఆశయం (మహిళా శివశరణుల కాయక తత్తం, పే: 188) వంటి కఠిన చారిత్రక సత్యాలు అందరినీ ఆలోచింపజేస్తయి. ఆ దిశగా మరింత లోతైన పరిశోధన ఆవశ్యకతను తెలియజేస్తాయి.
- దోర్బల

ఆలోకనం, సాహిత్య విమర్శ వ్యాసాలు, రచన: రావి ప్రేమలత, పేజీలు: 196, వెల: రూ. 100/- ప్రతులకు: రచయిత్రి చిరునామ: 2-2-1105/10, తిలక్‌నగర్, హైదరాబాద్-44.

తనబ్బి


బతుకు పాట (అభ్యుదయ గీతాలు), మోటపలుకుల రమేష్, ప్రచురణ: తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం, వరంగల్, వెల: 100/-, ప్రతులకు: నవచేతన విజ్ఞాన సమితి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.

కథ 2014 (1990-2014), సంపాదకులు: వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్, ప్రచురణ: కథా సాహితి, వెల: 65/-, ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

కవిత్వం వింతభాష (కవితా సంపుటి), రఘవర్మ, (డా॥ తుమ్మనపల్లి లక్ష్మినారాయణ) ప్రతులకు: ఇం.నెం: 3-1-264, పురానిపేట్, గాజుల పోచమ్మ వీధి, జగిత్యాల - 505327. మొబైల్: 9030334500

అడవిరాజు ఆదర్శం (చిన్న పిల్లల కథలు), కన్నెగంటి అనసూయ, శ్రీరవి పవన్ పబ్లికేషన్స్, వెల:120/-, ప్రతులకు: రచయిత్రి ఇం.నెం: 406, వింధ్య -4, కూకట్‌పల్లి వై జంక్షన్, జయభారతి గార్డెన్స్, హైదరాబాద్ - 500018. మొబైల్: 9246541249

1413
Tags

More News

VIRAL NEWS

Featured Articles