e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు గుప్పెడు గంధం

గుప్పెడు గంధం

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.

ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచిన జగన్నాథం మంచం పక్కన స్టూల్‌ మీదున్న భగవద్గీతను తీసుకొని, తనకిష్టమైన నాలుగో అధ్యాయాన్ని చదివాడు. ఈ డబ్భు ఐదేండ్ల వయస్సులో కూడా క్రమం తప్పకుండా ఏదో ఒక అధ్యాయాన్ని చదవడం ఆయన ఏనాడూ మరువలేదు. ఒక్కొక్కప్పుడు తనకు జీవితమంటేనే విరక్తి కలుగుతుంటుంది. కానీ, గీతలోని ఇరవై రెండో శ్లోకంలో
భగవాన్‌ చెప్పినట్లుగా..
‘తనకు లభించిన దానితోనే తృప్తి పడేవాడు శంకా రహితుడు, మాత్సర్యం లేనివాడు. కార్యం సిద్ధించినా, సిద్ధించక పోయినా సమాన బుద్ధి గలవాడు ఏ కర్మలు చేసినా, బంధనాలలో చిక్కుకోడు’ అనే ఉవాచ తనను ముందుకు నడిపిస్తున్నది.

- Advertisement -

గది తలుపు తీసుకొని వరండాలోకి వచ్చి, పచార్లు చేయసాగాడు. అప్పటికీ ఎవరూ నిద్ర లేవలేదు. బయట గేటు.. శబ్దంతో తెరుచుకున్నది. పేపర్‌ పిల్లవాడు దినపత్రికను వరండాలోకి విసిరేసి వెళ్లిపోయాడు. జగన్నాథం ఆ పేపరును తెచ్చుకొని, బెంచిమీద కూర్చొని తిరగేయసాగాడు. ఒకటి, రెండు పేజీలు తిరగేసిన జగన్నాథం కండ్లు ఒక దగ్గర మిలమిలా మెరుస్తూ ఆగిపోయాయి. ఆ ప్రకటన ఒకటికి రెండుసార్లు చదివాడు. అది తన మస్తిష్కంలో ఏవో తీయని ఉద్విగ్నభరితమైన ప్రకంపనలు రేపుతున్నది.

“హుజూరాబాద్‌ హైస్కూల్లో 1965-66లో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేసిన విద్యార్థి సోదరీ, సోదరులారా.. మనమంతా మన స్కూలులో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబోతున్నాం. దయచేసి మీరంతా ఎక్కడ ఉన్నా, ఎన్ని పనులున్నా, మీమీ కుటుంబాలతో వచ్చి, నాటి మధుర స్మృతులను పంచుకోవాలని, మీ అనుభవాలు చెప్పుకోవాలనీ ఆశిస్తున్నాం.”

  • మీ రాకకోసం ఎదురు చూసే.. రాజశేఖరం
    ఆ ప్రకటన చూసిన వెంటనే.. “ఒరే రాజశేఖరం! ఎలా ఉన్నావురా!” అంటూ
    పేపర్‌ను గుండెలకు హత్తుకొన్నాడు జగన్నాథం. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో కోరికలు తన్నుకొస్తుంటే, తన మనసు గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తున్నది. ‘జగ్గు.. జగ్గు..’ అంటూ తనను ఆప్యాయంగా పిలిచే రాజశేఖరం కండ్లముందు కదిలాడు. నాటి మిత్రులంతా ఆనందబాష్పాల మధ్య మసక మసకగా కదలాడసాగారు.
    ‘విద్యార్థి దశలో మా పేర్లకు బదులుగా నిక్‌
    నేమ్‌లు పెట్టుకొని పిలుచుకొనే వాళ్లం. ఆ పేర్లు ఇప్పుడు గుర్తున్నాయో లేదో? అప్పటి మిత్రులందరూ అప్పటిలాగానే ఉంటారా? ఇంత సుదీర్ఘ జీవితంలో పిల్లలతో, ఉద్యోగాలతో ఎన్నో ఒడుదొడుకులు వారినికూడా

కుంగిపోయేలా చేసుంటాయి. శారీరకంగా మొహాల్లో వృద్ధాప్యపు ఛాయలు వచ్చే ఉంటాయి. వయోభారంతో చేతి కర్రలతో వస్తారేమో!’ పెదాలమీద చిరునవ్వు మెరుస్తుంటే గతం జగన్నాథాన్ని ఒకటో తరగతి నుండి స్కూల్‌ చదువు పూర్తి అయ్యేంత వరకూ లాక్కెళ్లింది. అప్పటి లంగోటి దోస్తులు అందరూ కలిసి స్కూల్‌ మైదానంలో ఆడిన సిర్ర గోనె, గోళీల ఆటలు. వాటి మధ్యలోనే కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, అంతలోనే కలసిపోవడాలు, ప్రేమాభిమానాలు.. అన్నీ అతణ్ని ఊరించి మరీ పిలుస్తున్నాయి. ఆరోజు పాత మిత్రులందరినీ కలుసుకొని బాల్యంలో గడిపిన తీపి జ్ఞాపకాలన్నిటినీ పంచుకోవాలనే ఆకాంక్షతో ప్రకటనలోని రోజుకోసం ఎదురు చూడటం ఆ క్షణం నుండే ప్రారంభమైంది. గదిలోకి వెళ్లి బ్రష్‌ చేసుకొని వచ్చేసరికి, టేబుల్‌మీద పాలగ్లాసు ఉంది. యాంత్రికంగా ఆలోచిస్తూ పాలు తాగాడు. ముప్పిరి గొల్పుతున్న ఆలోచనల నుండి ఇంకా తేరుకోలేక పోతున్నాడు. ఇన్ని రోజులుగా జవసత్వాలు ఉడిగి శుష్కించిన శరీరంలో నుండి ఏదో తెలియని అనుభూతి అమృతంలా ప్రవహిస్తున్నట్లు అనిపిస్తున్నది. బతుకులో ఎక్కవలసిన చిరు ఆశల నిచ్చెన మెట్లు ఆగిపోయాయని అనుకొన్నాడు. కానీ, అడుగుపొరల్లోని జ్ఞాపకాల మెట్లలోకి ఒకసారి తొంగిచూస్తే.. బాల్యం, యవ్వనం, ఉద్యోగం ఎన్నో దశలు గడిచిపోయాయి. దిగుతున్న మెట్టు మెట్టులో.. జగన్నాథం స్మృతిపథంలో ఒక్కో దశ తెరమీది బొమ్మల్లా కదులుతున్నాయి.

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగన్నాథం బాల్యమంతా తన సొంతూరు హుజూరాబాద్‌లోనే సాగింది. ఊరి పెద్దబడిలో తనతోపాటు చేరిన వారంతా ఆటపాటలతో చదువుసంధ్యలతో పన్నెండు ఏండ్లపాటు కలిసి చదువుకొన్నారు. ఆనాడు వీళ్లకు విద్యను బోధించిన ఉపాధ్యాయుల్లో కొందరే గుర్తున్నారు. యాభైమంది విద్యార్థులు, పదిమంది విద్యార్థినుల్లో కొంతమంది మాత్రమే లీలగా చెరిగిపోకుండా తన మనసులో మెదులుతూ ఉన్నారు. ఆ విద్యాసంవత్సరం వాళ్లంతా హెచ్‌ఎస్‌సీ పరీక్షలు రాసి, భారంగా బడిలో నుండి టీసీలు తీసుకొని, పంజరం నుంచి విముక్తి పొందిన పావురాల్లా స్వేచ్ఛగా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఎగిరిపోయారు. అలా వెళ్లిన ఆ విద్యార్థుల్లో చాలామంది పై చదువులు చదివి, పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వివిధ వ్యాపకాలతో గడిపేస్తున్నామంటూ అప్పుడప్పుడూ రాసుకొనే ఉత్తరాలద్వారా గాని, తరచుగా కలుసుకునే మిత్రులద్వారా గానీ.. ఒకరి విషయం ఇంకొకరి ద్వారా తెలుసుకొంటూనే ఉన్నారు.
గిర్రున తిరిగిన కాలం, అందరి విషయాలు అందరికీ తెలియనంత దూరంగా తీసుకు వెళ్లిపోయింది. జగన్నాథం మనసు పుట్టి పెరిగిన ఊరికి వెళ్లాలని మనసు ఆరాటపడేది. ఆవేదన చెందేది. ఎన్నోసార్లు వెళ్లాలని ప్రయత్నించినా కాలు కదలలేదు. దానికి బలమైన కారణం.. ఆనాడు తను అనుభవించిన పరిస్థితులు. ఊర్లో పొలం, ఇల్లు కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా, తన జానా బెత్తెడు ప్రభుత్వ జీతంతో, పిల్లల పైచదువులతో సంసారం గడవడం కష్టంగా అనిపించింది. ఊర్లో ఏమీ మిగలకుండా అమ్ము
కొన్నాడు. ఎప్పుడు ఊరికెళ్లా లని అనుకొన్నా.. ‘ఎవరి ఇంటికి వెళ్లాలి?’ అన్నది ప్రశ్న. ‘ఊరి వారికి ఏం సమాధానం చెప్పాలి?’ అనే బాధతో మనసు మెలితిరిగి పోయేది. అందుకే ఆ ఆలోచనలను పూర్తిగా మానుకొన్నాడు. ఆ ప్రకటన చూసిన తర్వాత, తప్పకుండా వెళ్లాలనే తపన ప్రారంభమైంది. కానీ, మనసు గిల్టీగా.. ‘వెళ్లొద్దు’ అంటూ మారాం చేస్తున్నది. ‘పశ్చాత్తాపం కోసమైనా ఊరికి వెళ్లాలి. ఇక ఎవరి ఇంటికీ వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లిన ఒకరోజు అయినా, నేను చదువుకొన్న స్కూల్‌లో మిత్రులందరితో గడిపే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వదులుకోకుండా.. తప్పకుండా వెళ్లాలి’ అనే నిర్ణయానికి వచ్చాడు.

ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తెల్లవారేసరికి తన మిత్రుల ముందు, తన బడిముందు ఉండబోతున్నందుకు మనసు దూదిపింజలా మారిపోయింది. ఊరు వెళ్లడానికి ముందు రాత్రి ఇస్త్రీ చేసి పెట్టుకొన్న డ్రెస్‌ వేసుకొని, ఉదయం నాలుగు గంటలకే బయలు దేరాడు.
“అయ్యా! ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు?” అంటూ అడిగాడు గేటు ముందున్న వాచ్‌మన్‌.
“నేను తిరిగి వచ్చేసరికి బాగా రాత్రి కావచ్చు. నువ్వు టీ తాగు” అంటూ అతడి చేతిలో పది రూపాయలు పెట్టి, గబగబా స్టేషన్‌ దారి పట్టాడు. కాజీపేట స్టేషన్‌లో దిగేసరికి ఎనిమిది అయింది. అక్కడ బస్సు ఎక్కితే హుజూరాబాద్‌ చేరుకొనేసరికి మరో గంట పట్టింది. బస్టాండ్‌లో అడుగుపెట్టిన జగన్నాథానికి తన ఊరు ఓ పట్నం లాగా, కొత్తగా కనిపించసాగింది. స్కూలుకు వెళ్లే దారి వెతుక్కొనే సరికి పది నిమిషాలు పట్టింది. ఊర్లోకి వెళ్లే పిల్లదారులన్నిటినీ మింగేసిన సిమెంటు రోడ్డు చుట్టూ తిప్పుతూ తనకు తెలిసిన స్కూల్‌కు దూరంగా నడిపించుకొని తీసుకెళ్లింది. అప్పటి బడిగోడల పైభాగాన పెళుసులు రాలిపోయి, కళావిహీనంగా కనిపిస్తున్నది. తన బిడ్డను చూసి, ఆప్యాయంగా అక్కున చేర్చుకోవడానికి తనను పిలుస్తున్నట్లు కనిపించింది. ఆతృతగా మరో రెండు అడుగులు ముందుకు వేశాడు. స్కూల్‌ మెయిన్‌ గేటుకు కొందరు ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం – వజ్రోత్సవ సమావేశం’ అని రాసి ఉన్న పెద్ద ఫ్లెక్సీని కడుతున్నారు. జగన్నాథాన్ని చూసి అక్కడున్న వారి మొహాల్లో సంతోషం విరబూసి పోతుంటే..

“ఒరేయ్‌! నువ్వు.. నువ్వు.. జగన్నాథం!” అంటూ ఒక్కసారిగా అన్నారు.
“అవును. నేనే రా! రాజశేఖర్‌” అంటూ రాజశేఖరాన్ని గట్టిగా కౌగిలించుకొన్నాడు జగన్నాథం.
“వీళ్లను గుర్తుపట్టావా? ఏదీ వీళ్ల పేర్లు చెప్పు చూద్దాం!” అంటూ.. రాజశేఖరం అక్కడున్న వాళ్లందరినీ చూపించాడు.
“వీడు.. వీడు.. ప్రకాష్‌! వీడు నారాయణరెడ్డి. వీళ్లు ముస్తాక్‌, రంగాచారి, భగవాన్‌, సదాశివ..” అంటూ అందర్నీ కష్టంగా పోల్చుకొంటూ చెప్పాడు. అందరూ పెద్దగా.. “హాయ్‌!” అంటూ అరుస్తూ జగన్నాథాన్ని గట్టిగా పట్టుకొన్నారు. ఆనందం పొంగిపొర్లుతున్న ఆత్మీయుల మధ్య మాటలు మూగబోయాయి జగన్నాథానికి. గేటుముందు నుండి ఒకరికొకరు ఆలింగనాలు చేసుకొంటూ స్కూల్‌ మెట్లు ఎక్కుతున్నారు. జగన్నాథం మెట్టు మెట్టునూ ముద్దాడుకొంటూ లోపలికి వెళ్లాడు.
వరండా మధ్యలో పెద్ద స్టేజీ ఏర్పాటు చేసి బంతిపూలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు.
“ఆ బంతిపూలు కడుతున్నది మన క్లాస్‌మేట్‌ కమల కుమారి కదూ.. మరి మామిడి తోరణాలు కడుతున్నావిడ?” అడిగాడు జగన్నాథం.
“ఆమేరా! మన స్కూలులో పాటలు బాగా పాడేవారు.. విజయలక్ష్మి, పక్కనే ఉన్నవారు భారతి” అంటూ చెప్పాడు రాజశేఖరం. ముగ్గు బుట్టలాంటి తెల్లటి వెంట్రుకలకు రంగు పులిమి, మాతో చదివిన విద్యార్థినులు కూడా ఎంత మారిపోయారు. తనతో చదువుకొన్నవారిలో నలభైమందికి పైగా ఆ సమావేశానికి వచ్చారు. కొందరైతే కుటుంబాలతోసహా హాజరయ్యారు. వాళ్లందరితో బడి మొత్తం సందడిగా మారింది. ఇండ్లలో జరుపుకొనే పెద్ద పండుగలాగా అనిపిస్తున్నది. ఇలాంటి సందడినుండి, పండుగనుండి తన కుటుంబం దూరమైపోయి ఎన్నేండ్లు అయిందోననుకొంటూ జగన్నాథం కండ్లలో కన్నీటి పొరలు కమ్ముకొన్నాయి.

“వచ్చిన మిత్రులంతా వారి కుటుంబాలతో వెళ్లి మన తరగతి గదిలో టిఫిన్‌ చేయండి. మరికొద్ది సేపట్లో సభ ప్రారంభం కాబోతున్నది” అంటూ రాజశేఖరం మైక్‌లో చెబుతున్నాడు.
టిఫిన్‌ ముగించుకొని అందరూ సభాస్థలికి వచ్చేసరికి, వేదికమీద నలుగురైదుగురు ఆసీనులై ఉన్నారు. పూర్వ విద్యార్థులంతా వరండాలో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. జగన్నాథం పక్కనే కూర్చున్న ప్రకాష్‌..
“అదిగో ఆయనే రా.. మనకు హిందీ చెప్పిన వెంకట్రామయ్య సార్‌!” అని చెప్పాడు.
“ఆయన పక్కన కూర్చున్న వారు?” అంటూ ఆసక్తిగా అడిగాడు జగన్నాథం.
“మనకు హాకీ, ఫుట్‌బాల్‌ కోచింగ్‌ ఇచ్చిన రాఘవులు సార్‌ రా! ఆ పక్క అతను రాజన్న సార్‌!”.. గుర్తుపట్టలేదా? అన్నంత ఆశ్చర్యంగా చెప్పాడు నారాయణరెడ్డి.
“ఓ.. ఓ.. జ్ఞాపకం వచ్చింది! గుర్తుపట్టాను. అందరు ఉపాధ్యాయులూ కాలం చేసి వెళ్లిపోగా, వీళ్లు ముగ్గురు మిగిలారన్నమాట!” అప్రయత్నంగా బాధగా అనేసి, అక్కడినుండే సార్లకు నమస్కారం చేశాడు జగన్నాథం. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. జ్యోతి ప్రజ్వలనతో సభ ప్రారంభమైంది. వేదికమీద రాజశేఖరం వ్యాఖ్యానం ప్రారంభించాడు. విద్యార్థి దశనుండే రాజశేఖర్‌కు సభల్లో మాట్లాడటం, వేదికలపై వణుకు బెణుకు లేకుండా వ్యాఖ్యానాలు చేయడం అలవాటు.
“మిత్రులారా! మనమందరం ఈ బడిలో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేసుకొని నేటికి అరవై వసంతాలు. నేడు వజ్రోత్సవం జరుపుకొంటున్న ఈ శుభతరుణంలో ముందుగా స్వర్గస్తులైన మన తోటి విద్యార్థులకు శ్రద్ధాంజలి కార్యక్రమం ఉంటుంది. తదుపరి మన మిత్రులు వారి జ్ఞాపకాలు, అనుభవాలు, ఇన్నేండ్ల బతుకు ప్రయాణంలో సాధించిన విజయాలు, పిల్లల అభివృద్ధి గురించి అందరితో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని చెప్పాడు.

ఆ తర్వాత తమ బ్యాచ్‌కు చెందిన విద్యార్థుల్లో కీర్తిశేషులైన పదిమంది మిత్రుల ఫొటోలను ముద్రించిన ఒక ఫ్లెక్సీని వేదికకు కుడివైపున కట్టారు. ఆ ఫ్లెక్సీ ఎదుట చుట్టూ ప్రమిదలతో ఉన్న ఎత్తయిన దీపపు చిమ్మెను పెట్టారు. వారందరి ఆత్మశాంతి కోసం ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ఒక్కరొక్కరుగా వెళ్లి ఆ చెమ్మెలోని ఒక దీపాన్ని వెలిగించి, పూలు చల్లి, కలశంలోని గంధాన్ని మునివేళ్లకు అంటించుకొని, నివాళిగా ఫొటోలమీద చిలుకరించి, తిరిగి వచ్చి యథాస్థానాల్లో కూర్చోసాగారు.
ఈ కార్యక్రమానికి సమాంతరంగా నివాళులు అర్పించిన మిత్రులు వేదికమీదకు వెళ్లి, తమ స్కూల్‌ జ్ఞాపకాలు, అనుభవాలతోపాటు ఈనాటి వాళ్ల ఉనికి గురించి చాలా గొప్పగా చెప్పడం ప్రారంభించారు. ప్రతి మాటా జగన్నాథం శ్రద్ధగా వింటున్నాడు. వచ్చిన మిత్రుల్లో చాలామంది తమ పిల్లలు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, పెద్ద చదువులు చదివి ప్రస్తుతం అమెరికాలో గ్రీన్‌కార్డు హోల్డర్లుగా ఉంటున్నారని చెప్పుకొంటున్నారు. ఇంకొందరు తమ అబ్బాయి ఫలానా జిల్లాకు కలెక్టర్‌గా, పోలీసు ఆఫీసరుగా చేస్తున్నారంటూ మొహాల్లో గర్వం తొణికిసలాడగా చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, చివరికి తమ పిల్లల చదువులు, హోదాలు, వాళ్లు సంపాదించిన ఆస్తులను గురించిన ప్రస్తావన మాత్రం తప్పకుండా తీసుకొస్తున్నారు. ఈ విషయంలో ఎవరూ తగ్గడం లేదు. ఆనాటి తోటి విద్యార్థుల ప్రగతి గురించిన విశేషాలు వింటున్న జగన్నాథం మనసు.. సముద్రంలోని అలల్లాగా, అల్లకల్లోలంగా మారింది. అప్పుడే స్టేజీపై నుండి..
“ఇప్పుడు మన జగన్నాథంను తన లైఫ్‌ జర్నీ గురించి చెప్పాలని కోరుకుంటున్నాను” అంటూ రాజశేఖరం వేదికపైకి ఆహ్వానించాడు.
తొట్రుపాటుతో వేదికనెక్కిన జగన్నాథం, అక్కడ ఆసీనులైన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి, మైకుముందు నిలబడ్డాడు. రాజశేఖరం మైక్‌ ఆన్‌ చేసి ఇచ్చాడు. రెండు నిమిషాలు మైకును పట్టుకొన్న జగన్నాథం.. స్వరం సవరించుకొని, ఉద్విగ్నభరితంగా తన గురించిన వివరాలు చెప్పడం ప్రారంభించాడు.

“సభకు నమస్కారం! ఈ స్కూల్‌ను విడిచి వెళ్లాక బి.ఎ. పూర్తి చేశాను. ఇరిగేషన్‌ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, చివరికి సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ పొందాను. నా జీవితం అప్పుడు, ఇప్పుడు సంతోషంగానే గడుస్తున్నది. మాకు ఇద్దరు మగపిల్లలు. బాల్యం నుండి కూడా నా పిల్లలు చదువులో బాగా ముందుండేవారు. పెద్దవాడు డాక్టర్‌, చిన్నవాడు సైంటిస్ట్‌గా మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణులయ్యారు. పెద్దబాబు అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్నాడు. చిన్నవాడు లండన్‌లో సెటిలయ్యాడు. నిజంగా నా కొడుకులు అక్కడ ఉంటున్నారన్న మాటేగానీ, రోజూ ఫోన్‌ చేస్తూ తమ తల్లితో, నాతో గంటలు గంటలు మాట్లాడుతుంటారు. వేళకు మందులు వేసుకోమంటూ ఎన్నో జాగ్రత్తలు చెబుతుంటారు. అన్నదమ్ములిద్దరూ పోటీ పడుతున్నట్లుగా ప్రతినెలా మా జాయింట్‌ అకౌంట్‌లో డబ్బులు వేస్తూనే ఉన్నారు. ఇప్పటి నా ఉన్నతికి కారణం మా పిల్లలనే భావిస్తాను. వారిని భగవంతుడు నాకిచ్చిన వరంగా తీసుకుంటాను. అన్నిటికన్నా ముఖ్యం.. దేవాలయం లాంటి మన బడికి సదా రుణపడి ఉంటాను”.. ఈ మాటలు అంటున్నప్పుడు జగన్నాథం కంఠం గద్గదికంగా మారింది. కండ్లలోనుండి కన్నీరు చిమ్ము కొస్తుంటే భావోద్వేగానికి లోనయ్యాడు.
పక్కనే ఉన్న రాజశేఖరం.. “కూల్‌ డౌన్‌.. కూల్‌ డౌన్‌” అంటూ చేతిలోని మైకు తీసుకొని, జగన్నాథాన్ని గట్టిగా గుండెలకు హత్తుకొన్నాడు. స్టేజీమీదే తన పక్కన కూర్చోబెట్టుకొన్నాడు.
మళ్లీ మైక్‌ అందుకొన్న రాజశేఖరం.. “మన పూర్వ విద్యార్థిని విజయలక్ష్మి గారిని ఒక పాట పాడాలని, అలాగే మిత్రుడు రంగాచారిని కూడా ఒక పాట పాడి వినిపించాలని అభ్యర్థిస్తున్నాం. ఇదే సమయంలో మీరు ఎక్కడి వారు అక్కడే కూర్చొని, మేము ఇచ్చిన బయోడేటా ఫారంలో, మీ అడ్రస్‌, ఫోన్‌ నంబర్స్‌తోపాటు ఈ కార్యక్రమంలో మీరు పొందిన అనుభూతులను రాసి ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను” అన్నాడు.

విజయలక్ష్మి, రంగాచారి పాటలు పాడిన తర్వాత..
“కాలాతీతం అయింది మిత్రులారా! గురువులకు సన్మాన కార్యక్రమం తర్వాత, మీరంతా భోజనాలకు వెళ్లాల్సిందిగా ప్రార్థన” అని చెప్పి, మిగతా పనుల్లో మునిగిపోయాడు రాజశేఖరం.
మిత్రులందరూ తమ జ్ఞాపకాలను, అనుభవాలను నింపిన ఫారాలను కవర్లో పెట్టి, ఒక్కొక్కరుగా రాజశేఖరానికి భద్రంగా అప్పగించి భోజనాలకు వెళ్తున్నారు. జగన్నాథం కూడా ఒక ఫారాన్ని తీసుకొని తాను చదువుకొన్న తరగతి గదిలోకి వెళ్లి రాయడం ప్రారంభించాడు. ఆ ఫారానికి రెండు పక్కలా రాసి, పదేపదే చదువుకొని కవర్లో పెట్టి తన జేబులో పెట్టుకొన్నాడు. భోజనాలు ముగించుకొన్న వాళ్లంతా రాజశేఖరం వద్ద సెలవు తీసుకొని ఇంటిదారి పడుతున్నారు. అప్పటికి సాయంత్రం ఆరయ్యింది. మరికొంత మంది విద్యార్థులు ప్రతి ఐదేండ్లకోసారి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ, అందుకు తగిన ఆర్థిక సాయం అందిస్తామని రాజశేఖరంతో చెప్పారు. ఇంతటితో ఈ ఆత్మీయ సమ్మేళనం ఆగిపోకుండా, తమ శేష జీవితమంతా ఈరోజు సభకు హాజరైన మిత్రులందరూ ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకొంటూ ఉండాలని మరీ మరీ చెబుతూ.. భారంగా వీడ్కోలు తీసుకొంటున్నారు. ప్రకాశ్‌, నారాయణ రెడ్డి తదితర మిత్రులతో కలిసి భోజనం చేసిన జగన్నాథం, ఒంటరిగా ఏదో పనిలో ఉన్న రాజశేఖరం దగ్గరకు వెళ్లాడు.
“రాజశేఖరం! ఇదిగోరా నా బయో డేటా. దీనిని గుండెల్లో దాచుకొని ప్రశాంతంగా చదువురా!” అంటూ వణుకుతున్న చేతులతో అందించాడు. ఆ కవర్‌ను తీసుకొన్న రాజశేఖరం, జబ్బకు ఉన్న బ్యాగులో దానిని భద్రంగా పెట్టుకొన్నాడు.

“ఈ ఉత్సవాన్ని ఎంతో కన్నుల పండుగలా జరిపించావురా! మేమంతా నీకు రుణపడి ఉంటాం. నన్ను మాత్రం మర్చిపోకురా!” అంటూ రాజశేఖరం చేతిని, తన చేతిలోకి తీసుకొని గట్టిగా కండ్లకద్దుకొన్నాడు జగన్నాథం.
ఆ వెంటనే.. “ఇక సెలవు.. వస్తాను రా!” అంటూ గేటువైపు గబగబా నడవసాగాడు. చిత్రంగా ప్రవర్తిస్తున్న జగన్నాథం తీరుపట్ల ఆశ్చర్యపోయిన రాజశేఖరం వెంటనే తేరుకొని..
“జగ్గు.. జగ్గూ..” అంటూ వెంబడించాడు. అయినా వెనక్కి తిరిగి చూడకుండా, అప్పటికే స్కూల్‌ మెయిన్‌ గేటు దాటి వెళ్లిపోయాడు జగన్నాథం.
రాజశేఖరం కార్యక్రమాలన్నీ ముగించుకొని, తన ఇల్లు చేరేసరికి రాత్రి పది అయింది. జగన్నాథం పోతూ పోతూ ఇచ్చిన కవర్లో ఏముందో చూడాలనే ఆతృత రాజశేఖరాన్ని నిలువనివ్వడం లేదు. జబ్బకున్న సంచీలోంచి కవర్‌ను తీసి, కుర్చీలో కూర్చుంటూ ఆ కవర్‌ను చించాడు.
‘జగన్నాథం చేతిరాతలో ఏమాత్రం మార్పు రాలేదు. అక్షరాలు గుండ్రంగా, అందంగా, చదువుకున్నప్పటి లాగానే ఉన్నాయి’ అనుకొంటూ గబగబా ఆ ఫారాన్ని చదవసాగాడు.

“ఒరే.. రాజశేఖరం! నువ్వు ఇవ్వాళ జరిపించిన ఆత్మీయ సమ్మేళనంలో నిండుగా, స్నేహంతో విరజిమ్మిన గుప్పెడు గంధాన్ని, నిస్సారమైపోయిన నా మనసునిండా పూసుకొని వెళ్తున్నానురా! తులసివనంలా ఎదిగిన మిత్రుల కుటుంబాల్లోని సంతోషాలను చూశాను. కానీ.. కానీ.. గంజాయి వనంలా పెరిగిన నా కుటుంబం గురించి చెప్పుకోలేక పోయాను. మీ సహచరుడిగా, మీ సానుభూతి పొందకూడదనే ఒకే ఒక అభిప్రాయంతో, నిజాలు చెప్పవలసిన చోట ఆత్మవంచనతో, అపరాధ భావంతో అబద్ధాల కథ అందంగా అల్లి చెప్పాను. నన్ను క్షమిస్తావు కదరా! నా పిల్లలు నేను చెప్పుకొన్నట్లుగా అభివృద్ధిలోకి రాలేదు రా. పేడలో పురుగుల్లాగా తయారయ్యారు.
నేను ఎంత ప్రయత్నించినా ఇద్దరు కొడుకులు ఇంటర్మీడియట్‌ కూడా దాటలేకపోయారు. ప్రస్తుతం ఒకడు ఆటో నడుపుతున్నాడు. మరొకడు ప్రయివేటు దవాఖానలో వార్డ్‌ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయినా వాళ్ల బతుకులు వాళ్లు బతుకుతున్నారని సంతోషించాను. కానీ, మద్యానికి బానిసలయ్యారు. తల్లిదండ్రులంటే లెక్క చేయకుండా ఎదిరించేవాళ్లు.
నాకు వచ్చే పింఛన్‌ మొత్తం లాక్కొనేవాళ్లు. చేతిలో పైసాలేక మేమిద్దరం పస్తులు పడుకొన్న రోజులు ఎన్నో. అయినా తల్లిగా తల్లడిల్లిపోతూ.. వాళ్లకు తోడు చూసి పెళ్లిళ్లు చేయమని నా భార్య నన్ను వేడుకొనేది రా. అమాయకులైన మరో ఇద్దరు అమ్మాయిల జీవితాలను ఈ భ్రష్టులకు కట్టబెట్టి, వాళ్లకు అన్యాయం చేయకూడదని నిశ్చయించుకొన్నాను. నా మౌనానికి కారణం తెలియని నా భార్య కుమిలి కుమిలి ఏడ్చేది రా.

కొడుకులు చేస్తున్న అఘాయిత్యాలను తట్టుకోలేని ఆమె.. ఒకనాటి అర్ధరాత్రి నా చేతిని గుండెలకు హత్తుకొని ఒకే ఒకమాట అర్థిస్తూ చెప్పిందిరా.. ఆ పిచ్చిది ఏమందో తెలుసా! ‘ఏమండీ నేను లేని ఇంట్లో మీరు ఒక్కరుగా ఉండలేరు. నేను దాటిపోయిన తర్వాత మీరు ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్లండి. మీరు ఇక్కడే ఉంటే మనశ్శాంతి లేకుండా చేస్తారు. దయచేసి వెళ్లండి.. వెళ్లండి” అంటూ రాత్రంతా ఏడుస్తూ, ఆయాసపడుతూ, తెల్లవారుజామున కన్నుమూసింది.
ఆమె చెప్పినట్లుగానే నా కొడుకులకు తెలియని ప్రాంతంలోని ఓ వృద్ధాశ్రమంలో చేరి, ఒంటరిగా ఉంటున్నా. ప్రస్తుతం నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.
మిత్రమా! ఈ చరమాంకంలో మీ జ్ఞాపకాలు తప్ప ఇంకా నాకేం మిగిలాయి చెప్పు. నాకు మిగిలిన ఒకే ఒక్క కోరికను తీర్చే బాధ్యతను నీకే అప్పగిస్తున్నానురా! నా మరణాంతరం మన బడిలో జరిపించే మన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో నా ఫొటోకు కూడా మీరంతా ఒక నిమిషం మౌనం పాటించి, ఒక్క దీపం ముట్టించి, గుప్పెడు గంధం చల్లి నాకు శ్రద్ధాంజలి ఘటించాలి రా!
ఆశ్రమంలో నీ పేరు, నీ ఫోన్‌ నంబరు కూడా ఇచ్చానురా! నేను రాలిపోయిన రోజున నీకే ఫోన్‌ వస్తుంది. ఈ జన్మకు నాకీ సంతోషం చాలు రా.. రాజశేఖరం! తిరిగి ఆశ్రమానికే వెళ్తున్నాను.. సెలవు”
బరువెక్కిన గుండెతో ఉత్తరం చదివిన రాజశేఖరం కండ్లనుండి ధారగా వస్తున్న కన్నీళ్లతో తన చేతిలోని ఉత్తరం తడిసి ముద్దయింది.

..ఈ మాటలు అంటున్నప్పుడు జగన్నాథం కంఠం గద్గదికంగా మారింది. కండ్లలోనుండి కన్నీరు చిమ్ము కొస్తుంటే భావోద్వేగానికి లోనయ్యాడు. పక్కనే ఉన్న రాజశేఖరం.. “కూల్‌ డౌన్‌.. కూల్‌ డౌన్‌” అంటూ చేతిలోని మైకు తీసుకొని, జగన్నాథాన్ని గట్టిగా గుండెలకు హత్తుకొన్నాడు. స్టేజీమీదే తన పక్కన కూర్చోబెట్టుకొన్నాడు.

రావుల పుల్లాచారి
రావుల పుల్లాచారి స్వస్థలం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌. తల్లిదండ్రులు ఈశ్వరమ్మ – రావుల దశరథం. 10 మే 1950న జన్మించిన పుల్లాచారి, బీకాం తర్వాత నీటి పారుదల శాఖలో ఉద్యోగంలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి 2008లో సూపరిండెంట్‌గా పదవీ విరమణ పొందారు. అంతకు ముందునుండే సాహిత్యం వైపు అడుగులేశారు. కవిగా, కథకులుగా, నాటక రచయితగా ప్రత్యేకత చాటుకొన్నారు. ఇప్పటివరకూ ఇరవై నాటికలతోపాటు ‘బెత్తెడు జాగ’ కథా సంపుటి, ‘నాలోకి’ వ్యాస సంపుటి, ‘వాళ్లిద్దరు’ కవితా సంపుటి ప్రచురించారు. వీరి రచ్చబండ, మనస్సు చెక్కిన శిల్పం నాటికలను ‘అప్పాజోస్యుల విష్ణుంభొట్ల కందాళై ఫౌండేషన్‌’ వారు తమ ‘కథా నాటికలు’ పుస్తకంలో ప్రచురించారు. జంతువులే ప్రధాన పాత్రలుగా ఎంచుకొని కథలను రాస్తుంటారు. వీరి ‘రచ్చబండ’ నాటిక 2016లో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల్లో ప్రదర్శితమై, ఉత్తమ ద్వితీయ రచనగా నంది అవార్డునూ గెలుపొందింది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ‘ఉత్తమ
రచయిత’ అవార్డుతో సన్మానించింది. తమ్మల రంగస్థల సాహితీ పురస్కారం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ నుంచి ‘స్ఫూర్తి పురస్కారం’ అందుకొన్నారు.

రావుల పుల్లాచారి
9949208476

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana