e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home బతుకమ్మ గమ్మునుండవోయ్‌!

గమ్మునుండవోయ్‌!

కొవిడ్‌ పుణ్యమాని అందరూ న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లు తీసుకునే పనిలోపడ్డారు. అయితే, నిత్యం ట్యాబ్లెట్లూ, టానిక్‌లూ వాడుతుంటే బోర్‌ కొడుతుంది కదా! అందుకే, కొత్తగా పోషకాలతో కూడిన గమ్మీలను (బబుల్‌గమ్స్‌ లాంటివి) మార్కెట్లోకి తీసుకొస్తున్నారు ఔషధ వ్యాపారవేత్తలు. ప్రస్తుతం ఈ వెల్‌నెస్‌ గమ్మీస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ట్యాబ్లెట్లు అంటే మొహం మొత్తినవాళ్లకు ఇవి బాగా నచ్చుతున్నాయి.

మనిషికి విటమిన్స్‌, మినరల్స్‌ పూర్తిస్థాయిలో అందాలంటే సప్లిమెంట్స్‌ తప్పనిసరి. ఆ జాబితాలో కంటికి, నోటికి ఇంపుగా ఉండే గమ్మీలు కొత్తగా చేరాయి. వీటిలో వీగన్‌, షుగర్‌ ఫ్రీ, గ్లూటెన్‌ ఫ్రీ, గెలాటిన్‌ ఫ్రీ గమ్మీలూ ఉన్నాయి. గమ్మీల ద్వారా మహిళల్లో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు నెలసరి నొప్పిని, నిద్రలేమిని పోగొట్టేందుకు కొన్ని కంపెనీలు పూనుకున్నాయి. వీటి వాడటం చాలా సులభం. గోళీల్లా ఇబ్బందిపడుతూ మింగాల్సిన పనే లేదు. టానిక్‌లా చేదుగానూ ఉండదు. బబుల్‌గమ్‌లా నోట్లో వేసుకుని చప్పరిస్తే చాలు. మెత్తమెత్తగా కమ్మకమ్మగా కరిగిపోతాయి, రక్తంలో కలిసిపోతాయి.

- Advertisement -

మహిళల కోసమే..
నగరాల్లోని మహిళల్లో పోషకాల లోపం ఎక్కువగా ఉంటున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి వాళ్లకోసమే గమ్మీస్‌ బిజినెస్‌ మొదలుపెట్టారు అనన్యా కేజ్రివాల్‌ అగర్వాల్‌. ‘న్యూమీ’ పేరుతో కంపెనీని ప్రారంభించి, మహిళలకు అవసరమయ్యే విటమిన్‌ గమ్మీలను విక్రయిస్తున్నారు అనన్య. “మా ఉత్పత్తులు మహిళలకు పోషకాలను అందిస్తాయి. రెండేండ్లు భారతీయ, జర్మనీ నిపుణులతో కలిసి పరిశోధన చేశాం. ఫలితాలు సంతృప్తికరంగా వచ్చాకే, గమ్మీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాం” అంటారు అనన్య. మహిళలు తరచూ ఎదుర్కొంటున్న ఐదు ప్రధాన సమస్యలకు తన వంతు పరిష్కారంగా గమ్మీలను తీసుకొచ్చిందీ బ్రాండ్‌. రోగనిరోధక శక్తి, జుట్టు రాలిపోవడం, చర్మ సమస్యలు, నిద్రలేమి, యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్‌ కోసం ఔషధ గుణాలున్న గమ్మీస్‌ను పరిచయం చేసింది. వాటిలో విటమిన్‌-సి, విటమిన్‌-ఇ, హ్యాల్యురోనిక్‌ యాసిడ్‌, కుర్క్యుమిన్‌ మొదలైన పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి.

నెలసరి అసౌకర్యం దూరం..
మహిళలకు నెలసరి సమయంలో రకరకాల అసౌకర్యాలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. వీటిని దూరం చేసేందుకు ముందుకొచ్చింది పవర్‌ గమ్మీస్‌. ఈ కంపెనీ ‘ది టైమ్‌ ఆఫ్‌ ది మంత్‌’ అనే కాన్సెప్ట్‌తో నెలసరిలో ఉన్న మహిళల కోసం ప్రత్యేక గమ్మీలను తయారు చేస్తున్నది. శరీర కణాలకు మరమ్మతు చేయడంతో పాటు ఐరన్‌ లోపాన్ని తగ్గించే విటమిన్‌-సి, పీఎంఎస్‌ లక్షణాలను దూరం చేసే విటమిన్‌-బి6, యాంగ్జయిటీ, ఇన్‌సోమ్నియా నుంచి విముక్తి కలిగించే మెగ్నీషియం సల్ఫేట్‌, కడుపు నొప్పిని తగ్గించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే సిట్రస్‌ బయోఫ్లేవనాయిడ్స్‌తో గమ్మీస్‌ని తయారు చేస్తున్నది పవర్‌ గమ్మీస్‌ కంపెనీ. రేపటి వైద్యమంతా వీటి చుట్టే తిరుగుతుందేమో!

కిడ్స్‌ గమ్మీలు..
పిల్లలు టానిక్‌లు, ట్యాబ్లెట్లు అంటే ఆమడ దూరం పారిపోతుంటారు. కానీ గమ్మీలను ఇట్టే ఇష్టపడతారు. అందుకే పీడియాట్రిక్‌ గమ్మీ బ్రాండ్‌ ‘న్యూట్రీబేర్స్‌’ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టారు వినయ్‌ అంబాలీ. “ఒక తండ్రిగా నేను నా పిల్లల గురించి ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఐడియానే ఇది. నాలాగే మిగతా తల్లిదండ్రులూ తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని ఆశిస్తారు. అందుకే మా బ్రాండ్‌ నుంచి మల్టీ విటమిన్‌, క్యాల్షియం గమ్మీలు తీసుకొచ్చాం. పాలను ఇష్టపడని పిల్లలకు క్యాల్షియం గమ్మీస్‌ బాగా ఉపకరిస్తాయి” అని చెబుతున్నాడు ‘గమ్మీ కింగ్‌’ వినయ్‌ అంబాలీ.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana