e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home బతుకమ్మ ఖాకీ కోటలో హరిత వనం

ఖాకీ కోటలో హరిత వనం

ఒకప్పుడు రాళ్లు, రప్పలతో నిస్తేజంగా కనిపించేదా ప్రాంతం. ఇప్పుడు వేలాది చెట్లతో చిట్టడవిని తలపిస్తున్నది. 20 ఎకరాల్లో వినూత్న రీతిలో పెంచిన మొక్కలతో వసంతం కోసం తరలి వచ్చిన వనదేవతలా దర్శనమిస్తున్నది. ‘హరిత హారంతోనే మనిషి మనుగడ సాధ్యం’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి పోలీస్‌ శిక్షణ కేంద్రాన్ని నందనవనంగా తీర్చిదిద్దారు.

కరీంనగర్‌ పట్టణ శివారులో ఉంటుంది కమిషనరేట్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ (సీపీటీసీ). వివిధ విభాగాలకు ఎంపికైన పోలీసులకు ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు. 32 ఎకరాల ప్రాంగణంలో12 ఎకరాలు శిక్షణ కేంద్రానికి వినియోగిస్తున్నారు. మిగిలిన 20 ఎకరాల్లో ఏవో పిచ్చిమొక్కలు మినహా అంతా రాళ్లు, రప్పలే ఉండేవి. గతంలో పనిచేసిన వారంతా ఈ స్థలాన్ని పనికిరాని భూమిగానే చూశారు. హరితహారంలో భాగంగా మొక్కలు పెంచాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపును కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి స్ఫూర్తిగా తీసుకొన్నారు. అనువైన స్థలం కోసం అన్వేషించారు. సీపీటీసీలోని 20 ఎకరాల ఖాకీ ఇలాఖాను నందనవనంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఆ దిశగా వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని శాఖల సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. మొక్కల పెరుగుదలకు అంత అనువుగాని ఈ నేలల్లో మియావాకి పద్ధతిలో మొక్కలు నాటాలని నిర్ణయించారు.

- Advertisement -

ముందుగా రెండడుగుల మేర నల్లమట్టిని తొలగించి, మొక్కలు పెరగడానికి అనువైన మట్టితో నింపారు. యాదాద్రి మోడల్‌ తరహాలో చిట్టడవుల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు-1 కింద ఎకరం స్థలంలోనే పదివేల మొక్కలు నాటారు. వాటిని జాగ్రత్తగా సంరక్షించారు. ప్రాజెక్టు-2లో భాగంగా 12,500 మొక్కలు నాటారు. రెండేండ్లలోనే ఆ మొక్కలు చిట్టడవిని మరిపించేలా ఎదిగాయి. పచ్చదనం విస్తరించింది. పక్షుల కిలకిలరావాలు వినిపించాయి. దీంతో మరింత ఉత్సాహంగా హరిత యజ్ఞానికి పూనుకొన్నారు సీపీ. మొత్తంగా 20 ఎకరాల్లో 200 రకాలతో 78 వేల మొక్కలు నాటారు. మియావాకి పద్ధతిలో పెంచడానికి ఓ శాస్త్రీయ కారణం ఉంది. ఇతర మొక్కలతో పోలిస్తే ఈ పద్ధతిలో మొక్కల పెరుగుదల పదింతలు ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఈ పద్ధతిని ఎంచుకోవడాని ముందు, లోతైన అధ్యయనం చేశారు.

వనం నుంచి ధనం
ఒకవైపు మొక్కలు పెంచుతూనే, చూపరులను ఆకట్టుకొనేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. రాళ్లను తొలిచి, అందంగా మలిచి రాక్‌గార్డెన్‌గా మార్చారు. సందర్శకుల కోసం రాళ్లతో గద్దెలు ఏర్పాటు చేశారు. ఇంకోచోట చెట్ల మొదళ్లతో కుర్చీలు వేయించారు. సెలయేటి మీదుగా నడిచేందుకు కర్రలతో వంతెన నిర్మించారు. గత స్మృతులను గుర్తుకుతెచ్చేలా చేదబావిని ఏర్పాటు చేశారు. ఈ నందనవనంలో తిరుగుతున్నంత సేపూ అడవిలో ఉన్న అనుభూతి కలిగేలా అక్కడక్కడా వన్యమృగాల బొమ్మలను, పక్షుల రూపాలను ప్రతిష్ఠించారు. రాక్‌గార్డెన్‌తోపాటు నవగ్రహ వనం, రాశి వనం, నక్షత్ర వనం, సీతాకోకచిలుకల గార్డెన్‌, మూలికా వనం, చేపల కొలను ఏర్పాటు చేశారు. ఈ వనాన్ని ఆదాయ వనరుగానూ తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్తులో వనం నుంచి ధనం వచ్చేలా ఆర్థిక ప్రణాళిక రచించారు. వెయ్యి కొబ్బరి చెట్లు, 600 టేకు చెట్లతోపాటు అల్లనేరేడు, చింత, మామిడి, సపోట, బొప్పాయి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు.

వాకింగ్‌ ట్రాక్‌
సందర్శకుల కోసం రాశి వనంలో రెండున్నర కిలోమీటర్ల వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మించారు. గులకరాళ్లు, రంపపు పొట్టు, మధ్యమధ్యలో నీటి తొట్లు ఏర్పాటు చేసి ఆక్యుపంక్చర్‌ ట్రాక్‌ను సిద్ధం చేశారు. ఈ ట్రాక్‌లో నడవడం వల్ల రక్తప్రసరణ మెరుగవ్వడంతోపాటు మోకాళ్ల నొప్పులు కూడా తగ్గుతాయి. మరోవైపు భూగర్భ జలాలను పెంచే లక్ష్యంతో వర్షం నీటిని ఒడిసి పట్టేలా 16 ఇంకుడు గుంతలు నిర్మించారు. మొక్కల సంరక్షణలో నీరు దుర్వినియోగం కాకుండా డ్రిప్‌ పద్ధతిని పాటిస్తున్నారు. అంతేకాదు, 50 నుంచి 75 గజాల స్థలంలో మియావాకి పద్ధతిలో మొక్కలు ఎలా పెంచుకోవాలో ప్రజలకు వివరించడానికి మోడల్‌ ప్లాంటేషన్స్‌ కూడా పెట్టారు. గోశాల నుంచి రెండు ఆవులను తీసుకువచ్చారు. ప్రస్తుతం వాటి సంఖ్య ఏడుకు చేరింది. గోమూత్రాన్ని జీవామృతంగా మార్చి, మొక్కలకు వినియోగిస్తున్నారు. పోలీసులు ఈ సుందర వనాన్ని తీర్చిదిద్దిన తీరు అందరి ప్రశంసలూ అందుకుంటున్నది.

సీఎం స్ఫూర్తితో..
‘శిక్షణ కేంద్రంలో మొక్కలు పెంచాలన్న ఆలోచనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారే నాకు స్పూర్తి. భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని ఆయన చెబుతుంటారు. హరితహారంలో భాగంగా రాష్ట్రమంతా మొక్కలు పెంచడానికి సీఎం గారు పడుతున్న తపన, చూపుతున్న శ్రద్ధ నన్ను బాగా ఆకర్షించింది. కరీంనగర్‌ జిల్లాలో 0.5 శాతం అడవులు మాత్రమే ఉన్నాయి. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని సీపీటీసీని ఎన్నుకొన్నాం. మియావాకి పద్ధతిని బాగా స్టడీ చేశాను. వివిధ విభాగాల అధికారుల సాయంతోపాటు శాస్త్రవేత్తల సలహాలతో అద్భుత వన సంపదను కేవలం రెండేండ్లలోనే సృష్టించాం. మొక్కలు పెంచాలని తపన పడేవారికి సీపీటీసీ ఒక శిక్షణ కేంద్రంగా నిలువాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. మా వనాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరికీ మొక్కలు నాటాలన్న ఆలోచన కచ్చితంగా వస్తుందని భావిస్తున్నాం. ఎన్నో పక్షులు సీపీటీసీ ఆవరణను ఆవాసంగా మార్చుకున్నాయి. వీక్షకులకు ఆనందాన్ని పంచుతున్నాయి. సంకల్పం ఉంటే ఏదైనా చేయవచ్చని చెప్పడానికి ఈ వనమే ఒక నిదర్శం. మా హరిత యజ్ఞానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసు బృందానికి కృతజ్ఞతలు.

కె.ప్రకాశ్‌రావు, కరీంనగర్‌ ,బాలకిషన్‌రావు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana