e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home బతుకమ్మ కిన్నెర కళకు నిదర్శనం..

కిన్నెర కళకు నిదర్శనం..

దర్శనం మొగిలయ్య.. తెల్ల చొక్కా, పెద్దజుట్టు, పంచెకట్టు, కోరమీసం, భుజం మీద ‘మెట్ల కిన్నెర’తో అత్యంత సాధారణంగా కనిపించే అరుదైన కళాకారుడు. తన పూర్వీకులనుండి వారసత్వంగా వస్తున్న అద్భుత కళకు చిట్టచివరి వారసుడు. ఆయన వాడే ‘పన్నెండు మెట్ల కిన్నెర’ ఓ అరుదైన వాద్యం. ఆయన కథ బడి పిల్లలకు ఓ పాఠ్యాంశం.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాల మండలం అవుసలికుంట.. దర్శనం మొగిలయ్య స్వస్థలం. పూర్వీకులు ‘మెట్ల కిన్నెర’ వాయిస్తూ కథలు చెప్పేవారు. వారినుంచే ఆ కళను వారసత్వంగా స్వీకరించాడు. పల్లె ఒడినే సంగీతపు బడిగా మలుచుకొని రాగాలు పలికిస్తున్నాడు. ‘కిన్నెర’ పాటలతో ప్రతి ఒక్కరినీ తన్మయత్వంలో ముంచెత్తుతున్నాడు. తరాల తెలంగాణ జీవన విధానాన్ని, చారిత్రక గాథల్ని ఒడిసిపట్టి, పాటల రూపంలో కిన్నెర మెట్లద్వారా ప్రచారం చేస్తున్నాడు. వాద్యాన్నే ఇంటిపేరుగా మార్చుకొని ‘కిన్నెర మొగిలయ్య’గా స్థిరపడ్డాడు.

- Advertisement -

మొగిలయ్య వాడే ‘పన్నెండు మెట్ల కిన్నెర’ అత్యంత అరుదైంది. వెదురు కర్ర, గుండ్రటి సొరకాయలు, తేనె, మైనం, తీగలు, ఎద్దు కొమ్ములు, అద్దాలు ఉపయోగించి ఈ వాద్యాన్ని తయారు చేశారు మొగిలయ్య పూర్వీకులు. ఆయన తాతల కాలంలో ‘ఏడు మెట్ల కిన్నెర’ ఉండేది. తండ్రి ‘పది మెట్ల కిన్నెర’ను తయారు చేశాడు. పదకొండు మెట్ల వరకూ చేయగలమని, అంతకంటే ఎక్కువ అసాధ్యమనీ ఆయన చెప్పేవాడట. ఎనిమిదేండ్ల వయసులో ‘మెట్ల కిన్నెర’ వాద్యంపై సాధన మొదలు పెట్టిన మొగిలయ్య, 18 ఏండ్ల ప్రాయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మొట్టమొదటిసారి ‘పన్నెండు మెట్ల కిన్నెర’ను తయారుచేశాడు. మూడు వేర్వేరు సైజు గుమ్మడి బుర్రలతో మెట్ల సంఖ్యను పెంచి తంత్రులు బిగించాడు.

వీనుల విందుగా వీరగాథలు
మొగిలయ్య చదువుకున్నది తక్కువే అయినా విషయ పరిజ్ఞానం మాత్రం సముద్రమంత. వందలాది చారిత్రక కథలు, వీరగాథలు ఆయనకు కంఠోపాఠం. పండగ సాయన్న కథలు, వనపర్తి, గద్వాల, రాంగోపాల్‌ పేట సంస్థానాల చరిత్రలు, దొరతనానికి వ్యతిరేకంగా నిలబడిన బైండ్లోళ్ల కుర్మయ్య కథలను గుక్కతిప్పుకోకుండా చెప్పగలడు. పొద్దున్న గౌడ్‌ సాబ్‌ పోసే కల్లునుండి సాయంత్రం సంతలో అమ్మే గాజుల వరకూ ప్రతి సన్నివేశాన్నీ పాటగా మార్చేస్తాడు. తన హావభావాలు, ముఖ కవళికలతో ఆ గాథలను మరింత రక్తి కట్టిస్తాడు. నాటి ఘటనలు కండ్లముందే కదలాడిన అనుభూతిని కలిగిస్తాడు. జాతరలు, సంతలు, గ్రామదేవతల పండుగల్లో మెట్ల కిన్నెరను వాయిస్తూ మొగిలయ్య పాడే రాగయుక్తమైన పాటలకు ఫిదా కానివారుండరు.

ప్రభుత్వ ప్రోత్సాహం
తెలంగాణ ఏర్పాటు తర్వాత మొగిలయ్య ప్రతిభను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రథమ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ‘ఉత్తమ కళాకారుని’గా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా సన్మానం అందుకొన్నాడు మొగిలయ్య. అంతేకాకుండా ‘పన్నెండు మెట్ల కిన్నెర’ ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసేలా ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది సర్కారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, మొగిలయ్య జీవితంపై డాక్యుమెంటరీని రూపొందించింది. వారసత్వ కళను నమ్మున్న మొగిలయ్యకు ప్రత్యేక పింఛన్‌ అందిస్తున్నది. ఆశ్రిత కులాల సాహిత్యం దాదాపుగా అంతరించిపోతున్న తరుణంలో ఇలాంటి కళాకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.

మెట్ల కిన్నెర ఆరో ప్రాణం
వారసత్వంగా వచ్చిన ఈ కళే నా ఆరో ప్రాణం. కిన్నెర పాటలే నా జీవనాధారం. నా పాటలకు ప్రేక్షకులు కొట్టే చప్పట్లు, ఇచ్చే అభినందనలు తప్ప మరేమీ ఆశించను. పొట్టకూటికోసం మట్టి పనిచేసినా, అడ్డా కూలీగా మారినా ఏ రోజూ కిన్నెరను పక్కన పెట్టలేదు. అరవై ఏండ్లనుండి ‘కిన్నెర’ పాటలు పాడుతూ బతుకుతున్న. నా కళను ఎన్నడూ అమ్ముకోలేదు. దాన్ని నమ్ముకొనే నా బతుకుబండిని నెట్టుకొస్తున్నా.

  • దర్శనం మొగిలయ్య, కిన్నెర కళాకారుడు అరవింద్‌ ఆర్య
    7997 270 270
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana