e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home బతుకమ్మ కాలర్‌ ఎగరేస్తున్నాయ్‌!

కాలర్‌ ఎగరేస్తున్నాయ్‌!

ఆఫీసు అయిపోగానే బైక్‌పై ఇంటికెళ్తున్నాడు రాజేశ్‌.హఠాత్తుగా రెండు వీధికుక్కలు మొరుగుతూ రోడ్డుపైకి వచ్చాయి. తప్పించే సమయం లేకపోవడంతో, ఓ కుక్కను ఢీకొట్టాడు. అది అక్కడికక్కడే చనిపోయింది, రాజేశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇలాంటి ప్రమాదాల్లో మనుషులతో పాటు, కుక్కలనూ కాపాడేందుకు హైదరాబాద్‌కు చెందిన ‘కాలర్‌ అప్‌’ సంస్థ తనదైన పరిష్కారంతో ముందుకొచ్చింది.

దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో వీధికుక్కల వల్ల జరుగుతున్నవే అధికం. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం.. 2015 నుంచి 2019 మధ్యకాలంలో ఏడాదికి ఐదు లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఏటా లక్షా 50 వేలమంది చనిపోయారు. నాలుగు లక్షల మంది తీవ్ర గాయాలపాలు అయ్యారు. ఇందులో, ఎక్కువ శాతం ప్రమాదాలకు కారణం.. వీధి కుక్కలు, ఇతర జంతువులే. ఈ తరహా రక్త తర్పణాలను నివారించడానికి హైదరాబాద్‌కు చెందిన చైతన్య గుండ్లూరి ‘ప్లానెట్‌ గార్డియన్‌ ఫౌండేషన్‌’ అనే ఎన్జీఓను స్థాపించాడు. ‘కాలర్‌ అప్‌’ పేరిట వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నాడు. మనిషిని బతికించడం, జంతువును కాపాడటం.. రెండూ తనకు ముఖ్యమేనని అంటున్నాడు.

- Advertisement -

10 రాష్ర్టాలు.. 4వేల కుక్కలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం పది రాష్ర్టాల్లో ‘కాలర్‌ అప్‌’ సంస్థ వీధి కుక్కలకు కాలర్స్‌ తొడుగుతున్నది. అంతే కాదు, ఆహారం పెట్టి బాగోగులు చూస్తున్నారు కాలర్‌ అప్‌ ప్రతినిధులు. వీధుల్లో తిరిగే ఆవులు, ఎద్దులకూ ‘రిఫ్లెక్టివ్‌ కాలర్‌’ వేస్తున్నారు. ఈ కాలర్స్‌ వాటర్‌ ప్రూఫ్‌, ఫంగస్‌ ప్రూఫ్‌ కూడా. నీటిలో తడవవు, అంటువ్యాధులకు కారణం కావు. ఆర్మీ అధికారులకు కూడా ఈ ప్రయోగం బాగా నచ్చింది. లద్దాక్‌లో మూగజీవాలను కాపాడేందుకు మూడు వందలకుపైగా కాలర్స్‌ తీసుకెళ్లారు. కాలర్స్‌కు, కుక్కల ఆహారానికి ఇప్పటి వరకు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశాడు చైతన్య. అన్నీ తన సొంత నిధులే. ట్రావెలర్‌ కూడా అయిన చైతన్య తన యాత్రలలో.. రాత్రిళ్లు జరిగే రోడ్డు ప్రమాదాల్లో మనుషులతోపాటు, కుక్కలు చనిపోతున్నాయన్న విషయాన్ని గుర్తించాడు. ఆ సమయంలోనే తన ప్రాణ స్నేహితుడు కుక్కను తప్పించబోయి ప్రమాదవశాత్తు మరణించడం చైతన్యను బాగా కదిలించివేసింది. దీంతో ‘ప్లానెట్‌ గార్డియన్‌ ఫౌండేషన్‌’ ద్వారా ‘కాలర్‌అప్‌’ పేరిట కుక్కలకు, ఇతర మూగ జీవాలకు కాలర్స్‌ తొడుగుతున్నాడు.

కష్టమైన పనే!
కాలర్‌ అప్‌కు దేశవ్యాప్తంగా 300 మంది సభ్యులున్నారు. వీరు వీధి కుక్కలను మచ్చిక చేసుకోవడానికి ఎంతో శ్రమిస్తారు. కొన్నిసార్లు కాట్లకు గురవుతారు. ఒక్కో శునకాన్ని మచ్చిక చేసుకోవడానికి సగటున 20 నిమిషాలు పడుతుందట. ఒక్కోదాన్ని ఒక్కోలా దారికి తెస్తారు. ప్రేమగా ఆహారం పెట్టి, నేర్పుగా కాలర్‌ తొడుగుతారు. వీరు చేస్తున్న మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తున్నది. ప్రభుత్వం ద్వారా గ్రామీణ మహిళలకు కుట్టుమిషన్లు, కాలర్‌ మెటీరియల్‌ అందించి.. కుట్టినందుకు కొంత డబ్బును కూడా అందిస్తున్నారు. అయితే, ఓ మంచి ఉద్దేశంతో వీధి జంతువులకు తొడుగుతున్న ఈ కాలర్లను కొందరు దొంగిలిస్తున్నారు కూడా. వాటిని తమ పెంపుడు కుక్కలకు, ఇతర జంతువులకు వాడేస్తున్నారు. ఈ అవరోధాన్ని అధిగమించడానికి, కాలర్‌ అప్‌ సభ్యులు తమ లక్ష్యం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏ రద్దీ ప్రాంతంలో అయినా, వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తుంటే.. 6302188346కు కాల్‌ చేయవచ్చు. ఆ ఫోన్‌కాల్‌ విలువ కొన్నిసార్లు మనిషి ప్రాణమూ, జంతువు జీవమూ కావచ్చు.

కుక్కలకు ‘రిఫ్లెక్ట్టివ్‌ కాలర్‌’

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వీధికుక్కలు, జంతువుల కారణంగా జరిగే ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌కు చెందిన జంతు ప్రేమికుడు చైతన్య, అతని మిత్ర బృందం ‘కాలర్‌ అప్‌’ పేరిట వీధి కుక్కల మెడలో రిఫ్లెక్టివ్‌ కాలర్లను తగిలిస్తున్నారు. దీనివల్ల రోడ్డుపై కుక్కలు పడుకున్నా, రోడ్డు దాటుతున్నా, రోడ్డుపై వస్తున్నా బైక్‌ హెడ్‌లైట్‌ వెలుతురుకు వాటి మెడపై ఉన్న కాలర్‌ ధగధగా మెరుస్తుంది. దీంతో, వాహనదారుడు జాగ్రత్తపడుతాడు. ఫలితంగా, ప్రమాదాన్ని తప్పించే అవకాశం ఉంటుంది. రిఫ్లెక్టివ్‌ కాలర్‌ ప్రయోగం తర్వాత, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ జరిగే ప్రమాదాలు గణనీయంగా నియంత్రణలోకి వచ్చినట్టు ‘కాలర్‌ అప్‌’ సభ్యులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలోని మదనపల్లెకు కూడా ఓ స్వచ్ఛంద సేవకుడు స్థానిక హైవేపై దాదాపు 80 కుక్కలకు రిఫ్లెక్టివ్‌ కాలర్‌ కట్టాడు. అక్కడ కూడా ప్రమాదాలు సున్నాకు చేరుకున్నాయి.

-డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement