e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home బతుకమ్మ కాకతీయ ఠీవి..ఓరుగల్లు మెట్ల బావి

కాకతీయ ఠీవి..ఓరుగల్లు మెట్ల బావి

కాకతీయ ఠీవి..ఓరుగల్లు మెట్ల బావి

ప్రజలు సుభిక్షంగా ఉన్నప్పుడే,  రాజ్యం సురాజ్యమవుతుందని కాకతీయ పాలకులు భావించారు. అందుకే  ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారం అయిన సమాజంలో..  సాగునీటి కోసం వేల సంఖ్యలో చెరువులు తవ్వించారు. రాజధాని నగరమైన ఓరుగల్లులో తాగునీటి వసతి కోసం మెట్ల బావులను నిర్మించారు.  ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడేలా నిర్మించిన ఈ మెట్ల బావులు, ఒకప్పుడు నిత్యం నిండుకుండల్లా తొణికిసలాడేవి. ప్రజల అవసరాలనూ తీర్చాయి. ప్రస్తుతం కాకతీయుల నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. 

తీవ్ర కరువులోనూ..

గతంలో తీవ్రమైన కరువు వచ్చినా ఈ బావి ఎండి పోలేదనీ, ఈ బావి నుంచే చుట్టుపక్కల ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేశారని స్థానిక వృద్ధులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో తాగునీటి కోసం వాడిన ఈ మెట్లబావి, ఆ తర్వాతి కాలంలో పొలాలకు నీళ్లందించే మోటబావిగా మారింది. ఇప్పటికీ బావి పైభాగంలో మోటదారులు, మోట స్తంభాల ఆనవాళ్లు కనపడుతున్నాయి. 

వరంగల్‌ నగరంలోని శివనగర్‌ ప్రాంతంలో చారిత్రక మెట్లబావి ఉన్నది.  పరిసర  ప్రాంతాల్లో నివసించేవారంతా ‘మెట్ల బావి’ అనే కాకుండా పెద్ద కోనేరు, పద్నాలుగు మోటల బావి, దిగుడు బావి, స్నానాల బావి, అంతస్తుల బావి, చంద్రకళ బావి, మిల్లుల బావి (గతంలో ఈ ప్రాంతంలో రైస్‌ మిల్లులు, గోదాములు ఉండేవి).. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నిర్మాణ శైలిని బట్టి దీన్ని కాకతీయులు నిర్మించినట్లు  పరిశోధకులు గుర్తించారు. కాకతీయుల మలి రాజధానియైన వరంగల్‌లోని కోట పరిసర ప్రాంతాల్లో 150 నుంచి 200 బావులున్నాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

అద్భుత శిల్పాలంకరణ

చతురస్రాకారంలో రెండు అంతస్తులుగా ఉన్న ఈ బావి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. బావికి దక్షిణం నుంచి 1.8 మీటర్ల వెడల్పుతో ఉన్న మార్గం గుండా కిందికి పది మెట్లు దిగితే మొదటి అంతస్తు వస్తుంది. ఇక్కడ మెట్లకు ఇరువైపులా ఉన్న ద్వారాల్లో దేని నుంచైనా 7.95 మీటర్లు ముందుకు వెళ్తే బావి కనిపిస్తుంది. 1.84 మీటర్ల ఎత్తుతో తూర్పు-

పశ్చిమ దిశలో 14 స్తంభాలు, ఉత్తర- దక్షిణ దిశలో 20 స్తంభాలు ఉండి, పైఅంతస్తును మోస్తున్నాయి. అలాగే మొదటి అంతస్తు చుట్టూ 2.5 మీటర్ల వెడల్పుతో ఒకవైపు స్తంభాలుంటే మరోవైపు గోడ ఉంది. ఈ మొత్తం కట్టడం పైభాగాన 14 మీటర్ల వెడల్పు కలిగి ఉంటే, మొదటి అంతస్తుకు వెళ్లాక 18 మీటర్ల వెడల్పు ఉంటుంది. అలాగే అక్కడి నుంచి మరో 20 మెట్లు కిందికి వెళ్తే రెండో అంతస్తు. అక్కడ నాలుగు స్తంభాలతో చిన్నపాటి మంటపం నిర్మించారు. మొదటి అంతస్తులోని గోడకు నర్తకీమణుల శిల్పాలున్న నల్లరాతి ఫలకం, మరోచోట 11 శిల్పాలున్న రాతి ఫలకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

శిల్పాలు.. శాసనాలు..

మెట్లబావి మొదటి అంతస్తులో పడమర వైపున ఉన్న మంటపం స్తంభాల్లో ఒకదానిపై తెలుగులో ఒక లఘుశాసనం, దక్షిణం వైపున ఉన్న స్తంభం మీద హిందీలో మరో లఘుశాసనం ఉన్నాయి. తెలుగు శాసనంలో ‘మిరాసి’ అనే పదంఉంది. కాకతీయుల అనంతరం కుతుబ్‌ షాహీల పాలనలో ‘మిరాసీదారుల’ వ్యవస్థ ఏర్పడింది. ఒక మిరాసీదారుని ‘నీరు పొలానికి’ సాగునీటిని అందించిన బావి ఇది. నీరుపొలం అంటే తరిపొలం. రెండో లఘు శాసనంలో దేవనాగరి లిపిలో ‘మూలదాసజీ’ అన్న పేరు కనిపిస్తున్నది. ఈ రెండు శాసనాలు ఈ మెట్లబావి గురించిన వివరాలు తెలుసుకోవడానికి దొరికిన ఆధారాలు.  బావిలో పలుచోట్ల ఉన్న  శిథిల శిల్పాలు కూడా అలనాటి గాథలను వినిపిస్తాయి. కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల మధ్యకాలంలో నిర్మితమైన దేవాలయాలకు చెందిన అపూర్వ శిల్పాల శకలాలవి. బావి నిర్మాణంలో.. ఒకచోట ద్వారస్తంభం, మరోచోట అష్టకోణ యంత్రాల రాతిబిళ్లలు, ఇంకొకచోట మకర తోరణాలతో శివుడి అనుచరగణాలు, మదనికల శిల్పాలు ఉపయోగించారు. కాకతీయుల కాలంలో పురుడు పోసుకున్న అనేక కట్టడాలు ఢిల్లీ సుల్తానుల దాడిలో తీవ్రంగా ధ్వంసమయ్యాయి. నిజాం రాజులు తమ పాలనలో ప్రత్యేకించి పురావస్తు శాఖను ఏర్పాటు చేసి, అనేక కట్టడాలకు మరమ్మతులు చేయించారని పురావస్తు శాఖ నివేదికల ద్వారా తెలుస్తున్నది. ఈ బావిలోనూ అక్కడక్కడా మరమ్మత్తులు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ చర్యలు..

గతంలో నిరాదరణకు గురైన వరంగల్‌ మెట్లబావిని తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించింది. 2017లో రూ.10 లక్షలతో బావికి మరమ్మతులు చేపట్టింది. ఇందులో భాగంగా బావిలో పూడిక తీయడంతోపాటు చుట్టూ ప్రహరీ నిర్మించారు. పరిసరాల్లో విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రధాన రహదారి నుండి బావి వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.

-అరవింద్‌ ఆర్య 997 270 270 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కాకతీయ ఠీవి..ఓరుగల్లు మెట్ల బావి

ట్రెండింగ్‌

Advertisement