కవి సంగమం నుంచి కవిత్వ విమర్శ


Sun,June 28, 2015 12:08 AM

ఈనాటి కవిత పేరుతో కవిసంగమంలో ఎంపిక చేసుకున్న కవిత్వంపై ఎం.నారాయణశర్మ విశ్లేషణల పుస్తకం ఇది. ఇందులో 75 మంది కవుల కవిత్వం గురించి రాశారు. విభిన్న కవితా వస్తువుల మీద రాసిన కవిత్వంపై నారాయణశర్మ తనదైన శైలిలో సముచిత విశ్లేషణలు చేశారు. ఇందులో సీనియర్ కవుల నుంచి ఇప్పుడిప్పుడే కవిత్వంలో ఓనమాలు నేర్చుకుంటున్న కొత్తతరం కవుల దాకా అన్ని వర్గాలకు సంబంధించిన కవిత్వం ఈ పుస్తకంలో ఉంది. అట్లే, అస్తిత్వముఖంగా కనిపించే దళితవాదం, స్త్రీవాదం, బహుజనవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయ అస్తిత్వవాదం మొదలైన తాత్వికతలూ చర్చింపబడ్డాయి. ముందుమాటలో సీతారాం చెప్పినట్లు శర్మ ఇచ్చిన సంక్షిప్త వివరణ సమంజస నిర్వచనాలు. ఆయాచోట్ల చేసిన అనుశీలనలు కవితలపట్ల మనకు ఒక విస్తృత అవగాహన కలుగుతుంది. కవిసంగమం మొదలుపెట్టిన ఈ కవిత్వ ప్రస్తానం పేస్‌బుక్‌కే పరిమితం కాకుండా ఇలా పుస్తకంగా మారటం ఫేస్‌బుక్ అకౌంట్ లేని ఎంతోమంది వర్ధమాన కవులకు ఉపయోగకరంగా ఉంటుంది. సోషల్ మాధ్యమాల్లో కవి సంగమం తెచ్చిన విప్లవానికి ఇదొక పొడగింపు. జయహో కవిత్వం అనడంతోనే ఊరుకోకుండా విశ్లేషణాత్మక కృషి చేయడం మంచి ప్రయత్నం. నారాయణశర్మ ప్రయత్నం అభినందనీయం. ముందుమాట సీతారాం.

ఈనాటి కవిత (కవిత్వ విమర్శ), ఎం.నారాయణశర్మ, కవిసంగమం బుక్స్, పేజీలు: 259, వెల: రూ. 120/- , ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు.రచయిత చిరునామాః ఎం. నారాయణశర్మ, ఇం.నెం.2-2-1105/5/10. ప్లాట్ నెం.16, నీలాద్రి అపార్ట్‌మెంట్స్, తిలక్‌నగర్, న్యూ నల్లకుంట, హైదరాబాద్ - 500044. మొబైల్: 91977260385


జ్ఞాపకాల అలుగు దుంకుతంది!


ఊరికి ఆదెరువు చెరువు. చెరువు నిండితేనే రైతు కడుపు పండుతుంది. తెలంగాణలో శతాబ్దాలుగా చెరువులతో రైతులకు విడదీయరాని అనుబంధం ఉంది. తెలంగాణ సాధించుకున్న ఈ సంధర్భంలో చెరువుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ వనపట్ల సుబ్బయ్య ఊర చెరువు పేరుతో ధీర్ఘ కవిత్వం వెలురించారు. కాకతీయులు ఎంతో ముందుచూపుతో గొలుసు కట్టు చెరువులను ఆనాడే నిర్మించారు. కాకతీయ రెడ్డి రాజుల నుండి నిజాం రాజుల వరకు గొలుసు కట్టు చెరువుల ద్వారా సాగు చేశారు. ఒకనాడు తెలంగాణ అంతా చెరువుల సముద్రమే అంటే అతిశయోక్తి కాదు. ఈ నేలపై సమస్త జీవరాశులు, పశుపక్ష్యాదులు, అడవులు, వ్యవసాయంతో కళకళలాడింది. అయితే, ఆంధ్రప్రదేశ్ పాలనలో చెరువుల విధ్వంసం మొదలైంది. సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్నింట్లో వివక్ష కొనసాగించినట్లుగానే చెరువులను, దానిపై ఆధారపడ్డ జీవితాలనే కాదు, మొత్తం తెలంగాణ జీవన విధ్వంసానికే కారణమయ్యారు. అయితే, స్వరాష్ట్రం సాధించాక పునర్నిర్మాణంలో భాగంగా మిషన్ కాకతీయ పేరుతో ప్రభుత్వం చెరువుల్లో జలసిరులు నింపేందుకు బృహత్తరమైన కార్యానికి పూనుకుంది. ఇట్లాంటి తరుణంలో తెలంగాణ సహజ ప్రవృత్తినీ, వర్తమాన స్థితినీ, భవితనూ ఆవిష్కరించేలా మనదైన జీవన సౌందర్య గీతికగా వనపట్ల సుబ్బయ్య దీర్ఘ కవిత్వాన్ని వెలువరించారు. సుబ్బయ్య కవిత్వం చదువుతుంటే, చెరువుతో ఉన్న అనుబంధం మది లోతుల్లో దొంతరలుగా జ్ఞాపకాల అలుగు దుంకినట్లుగా అనిపిస్తుంది. ప్రతి ఇంటా ఉండదగ్గ పుస్తకం ఇది. ముందుమాటలు రాసింది- తన్నీరు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, చింతలపల్లి భాస్కరరావులు.


ఊర చెరువు (దీర్ఘ కవిత్వం), వనపట్ల సుబ్బయ్య, పేజీలు: 71, వెల: రూ. 100/- ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు. కవి చిరునామాః యం.సుబ్బయ్య (వనపట్ల), భార్గవి హేయిర్ ైస్టెల్స్, నల్లవెల్లి రోడ్, బస్టాండ్ పక్కన, నాగర్ కర్నూల్ - 509209, మహబూబ్‌నగర్, తెలంగాణ. మొబైల్: 94927 65358.

852
Tags

More News

VIRAL NEWS

Featured Articles