e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home బతుకమ్మ కరకరలాడే కథలు!

కరకరలాడే కథలు!

ప్రస్తుతం ప్రతి అంశంలోనూ క్లుప్తత చోటు చేసుకుంటున్నది. కథలు, కవితల విషయంలో ఈ మార్పు బాగా కనిపిస్తున్నది. ఈ పరిణామం అవసరం కూడా. ఉరుకుల పరుగుల జీవితాలు, సమయాభావం.. దీనికి కారణాలు కావచ్చు. అందుకే మినీ కథలు, కాలం దాటని కథలు, కార్డు కథలు, నానో కథలు, చిట్టి కథలు అంటూ నేడు ఎన్నోరకాలు వస్తున్నాయి. ఇది దృష్టిలో పెట్టుకునే ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు అరవై పొట్టి కథలతో ఓ సంపుటి వెలువరించారు. ‘పకోడి పొట్లం’ అంటూ పేరులోనే నవ్యత సాధించారు. పేరుకు తగ్గట్టే ఇందులోని అధిక శాతం కథలు తాజాగా, కరకరలాడుతూ పకోడీల్లాగే ఆకట్టుకున్నాయి. ‘సస్పెన్స్‌’, ‘మిల్క్‌ బాయ్‌- పేపర్‌ బాయ్‌’, ‘కట్నం కావాలి’, ‘హోర్డింగ్‌’, ‘రికవరీ’, ‘కార్‌ క్లీనర్‌’, ‘పకోడి పొట్లం’ తదితర కథలన్నీ మంచి ముగింపుతో అలరించాయి. ఈ కథల లక్ష్యాన్ని తెలియజెప్పాయి. దాదాపు ఇవన్నీ సగటు మనిషి మనస్తత్వానికి అద్దం పట్టడం గమనార్హం. నాటి రాజుల కథయినా, నేటి సామాన్యుల కథయినా రచయిత నేలవిడిచి సాము చేయకపోవడం గొప్ప విషయం. కథలు వాస్తవికతకు దూరంగా ఉండకపోవడం మరో సుగుణం. పిన్నాపెద్దా తేడా లేకుండా, అందరినీ అలరించే కథలివి.

పకోడి పొట్లం (కార్డు కథలు)
రచయిత: ఆర్‌.సి.కృష్ణస్వామి రాజు
పేజీలు: 111; వెల: రూ 100/-
ప్రతులకు: 93936 62821,
మెయిల్‌: rcksrajulic@gmail.com

- Advertisement -

-చంద్ర ప్రతాప్‌, 80081 43507

కాకతీయుల చరిత్ర
తెలుగు ప్రజలను భౌగోళికంగా ఏకం చేసిన రాజవంశం కాకతీయులు. రుద్రదేవుడు, గణపతి
దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ఈ వంశంలో ప్రసిద్ధి చెందిన పాలకులు. వీరిలో రుద్రమదేవి ఆణిపూస, ధ్రువతార. చరిత్రలో పురుషులే చక్రవర్తులుగా చక్రం తిప్పుతూ, ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అనుకునే కాలంలోనే తెలుగునాడును సమర్థంగా పాలించిన వీరనారి. సరిగ్గా ఈ అంశాన్నే ప్రధానంగా చేసుకుని ‘రుద్రమదేవి’ నాటకాన్ని రచించారు రచయిత. గణపతిదేవుడు తన కుమార్తె రుద్రమదేవిని కుమార రుద్రదేవుడిగా పెంచడం నుంచి, దేవగిరి యాదవరాజు మహాదేవుణ్ని ఓడించడం, చివరికి త్రిపురాంతక యుద్ధంలో కాయస్థ అంబదేవుడి కుటిలత్వంతో మరణించే వరకూ ఆద్యంతమూ చక్కటి శిల్పంతో రక్తికట్టించారు. ఇందులోనే మరో నాటకం.. ‘మాచలదేవి’. చివరి కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడి భోగపత్ని మాచలదేవి జీవిత చిత్రణతో సాగిన ఈ నాటకం అప్పటి సమాజంలో కళావంతులు అంటే, భోగినులు మాత్రమే కాదు సమస్త గాంధర్వ విద్యలను నేర్చుకున్న విదుషీమణులని ఈ నాటకం ద్వారా చాటిచెప్పారు.

రుద్రమదేవి, మాచలదేవి
రచయిత: ఎస్‌.ఎమ్‌.ప్రాణ్‌రావు
పేజీలు: 80; వెల: రూ. 80,
ప్రతులకు: నవోదయ బుక్‌ హౌస్‌, కాచిగూడ
ఫోన్‌: 92474 71361, 90004 13413

వర్తమాన సమాజ ప్రతిబింబాలు
తన చుట్టూ ఉన్న సమాజాన్ని అధ్యయనం చేసి, అది అలా ప్రవర్తించడానికి మూలమైన ప్రత్యక్ష పరోక్ష కారణాలను ప్రభావవంతంగా అక్షరీకరించే కథకుల్లో పెద్దింటి అశోక్‌ కుమార్‌ ఒకరు. వ్యవసాయంలోని సాధక బాధకాలను రెండే రెండు పాత్రలతో, చదివేవారి గుండెల్లో దాగున్న ఆర్ద్రత పెల్లుబికేలా రాసిన ‘గుండెలో వాన’ను తన కథా సంకలనానికి శీర్షికగా ఎంచుకోవడం ఔచిత్యంతో కూడింది. ఆయుర్వేదం అంటే ప్రజలు నమ్మరన్న కారణంతో, మంత్రించి మందులు ఇచ్చి యథాశక్తిగా సేవ చేయాలనుకున్న రెండు తరాల వైద్యులకు ఎదురైన చేదు ఫలితాన్ని వివరించే కథ ‘నింద’తో ప్రారంభమై.. 20వ కథ ‘ఆట’ వరకు ఈ సంకలనం పాఠకులను విరామం లేకుండా చదివిస్తుంది. అద్దె గర్భం తల్లులకు ఎదురయ్యే చేదు అనుభవాలు, సరోగసీ వికృత పోకడలపై ఆలోచింప చేసే కథ ‘ఈ పాప(ం) ఎవరిది’. ‘తిండి కోసం కూలీనాలి చేయొచ్చు, కానీ నీళ్ల కోసం ఏం జేస్తం?’ అనే ప్రశ్నను రేకెత్తిస్తూ, నీటి కరవులో పిల్లల దూప తీర్చడానికి ఓ తల్లి పడే కష్టం నేపథ్యంలో సాగుతుంది ‘బిందెడు నీళ్లు’ కథ. జలగండం అంటే నీళ్లలో పడి మరణిస్తామన్న భయం ఒక్కటే కాదు, పారిశ్రామికీకరణ కారణంగా బోర్లు వేయడం ఆర్థిక భారం కావడమూ, కాలుష్యం వల్ల కొత్త రోగాలు వచ్చి చనిపోవడమూ ‘జలగండ’మేనంటూ ఇదే పేరుతో ఉన్న కథలో తన భావాన్ని వ్యక్తపరుస్తారు రచయిత. అంతేకాదు, ‘ముందు ముందు ఇంకా ఏ రూపంలో జలగండం దాపురిస్తుందో?’ అని ఇందులోని పాత్ర ద్వారా ప్రశ్న వేయిస్తారు. ఈ కథ ఎంతో ఆలోచనాత్మకంగా సాగుతుంది. తెలంగాణ పలుకుబడులకు, జన జీవనానికి పెద్దపీట వేస్తూ పాత్రల స్వభావ చిత్రణ, సన్నివేశ కల్పన, కథల ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపును సమర్థంగా నిర్వహిస్తూ కూర్చిన కథల సంకలనమే ‘గుండెలో వాన’. వర్తమాన సమాజానికి ప్రతిబింబంగా నిలిచే ‘గుండెలో వాన’ సంపుటి ప్రతి ఒక్కరూ చదవదగింది.

గుండెలో వాన (కతలు)
రచయిత: పెద్దింటి అశోక్‌ కుమార్‌
పేజీలు: 224, వెల: రూ. 200
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు,
అమెజాన్‌లోనూ లభిస్తుంది.

-హర్షవర్ధన్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement