e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home బతుకమ్మ ఎందరో...మహానుభావులు!

ఎందరో…మహానుభావులు!

ఎందరో...మహానుభావులు!

ఓసీడీ బాధితుల సంఘం

పదే పదే చేతులు కడుక్కోవడం, ఘడియకోసారి శానిటైజ్‌ చేసుకోవడం.. కరోనా వల్ల అందరికీ అలవాటైంది గానీ, ఏ కారణమూ లేకుండానే ఇంటినీ ఒంటినీ  పదే పదే శుభ్రం చేసుకునేవారూ ఉంటారు. ఈ లక్షణాల్ని ‘అబ్‌సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఓసీడీ)’ బాధితుల్లో గమనిస్తుంటాం. చూసే వాళ్లకు నవ్వు తెప్పించినా.. సమస్యను ఎదుర్కొంటున్న వారి జీవితం మాత్రం ప్రతిక్షణం నరకమే.  ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదనే,  ఓ ఓసీడీ బాధితుడు తనలాంటి వారితో ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. ఆ వేదిక ద్వారా..బాధితులంతా  ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు.

పదే పదే అదే పని చేయడం అబెసెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ 

( ఓసీడీ) బాధితుల లక్షణం. అలా అని, ఆ పని కావాలనేం చేయరు. ఏ చిన్న పొరపాటూ ఉండొద్దనే వైఖరి అలవాటుగా మొదలై.. ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంటుంది. ‘మహానుభావుడు’ చిత్రంతో ఓసీడీకి గ్లామర్‌ వచ్చినా.. ఆ సినిమాలో చూపించినంత సాదాగా ఏం ఉండదు వీరి సమస్య. చుట్టూ ఉన్న వాళ్లకు అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బాధితులైతే మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి సమస్యతోనే చాలా కాలం సతమతమయ్యాడు హైదరాబాద్‌కు చెందిన 27 ఏండ్ల శరత్‌ కుమార్‌. ఆ మనో రుగ్మత నుంచి బయటపడిన శరత్‌.. తనలా వేరేవాళ్లూ ఓసీడీ ఉచ్చులోంచి బయటపడాలని సంకల్పించాడు. ఈ సమస్య ఉన్నవాళ్లకు  సాంత్వన అందించడానికి ‘హైదరాబాద్‌ ఓసీడీ గ్రూప్‌’ను ప్రారంభించాడు.

ఒకరికొకరు..

ఓసీడీ బాధితులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి, ఆరోగ్య పరమైన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకునేలా చేయడమే ఈ గ్రూప్‌ లక్ష్యం. దీని వల్ల తనలాంటి సమస్యనే ఇతరులు కూడా ఫేస్‌ చేస్తున్నారనే భావన కుంగుబాటుకు గురికాకుండా కాపాడుతుంది. అందుకే, అందర్నీ సమీకరించి ‘హైదరాబాద్‌ ఓసీడీ గ్రూప్‌’ ప్రారంభించాడు. ఏడాదిలోగా 50 మందికి పైగా ఈ గ్రూపులో చేరారు. వీళ్లలో 17 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్నవాళ్లే! గ్రూప్‌లో ఎన్నో విషయాలు చర్చకు వస్తాయి.  వైద్యం గురించి, ధ్యానం గురించి, యోగా గురించి, మనసును నియంత్రించే పద్ధతుల గురించీ  మాట్లాడుకుంటారు. 

ఏం చేస్తారు?

ఈ గ్రూపు సభ్యులంతా వారానికి ఒకసారి గూగుల్‌ మీట్స్‌ ద్వారా కలుస్తారు. తాము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో, దాన్నుంచి ఎలా బయటపడ్డారో వివరిస్తారు. ఏ కథా  ఒకేలా ఉండదు. వివిధ పరిస్థితులు, అనుభవాలు ఉంటాయి. ఇవి ఇతర ఓసీడీ బాధితులకు సహాయకరం అవుతాయి. ఈ హైదరాబాద్‌ ఓసీడీ గ్రూపు సభ్యులు గూగుల్‌ మీటప్స్‌ ద్వారానే కాకుండా వాట్సప్‌ గ్రూపు ద్వారా కూడా తమ సందేహాలను నివృత్తి చేసుకుంటుంటారు. 

భయాలను జయించి

ఓసీడీ ఉన్నవాళ్లలో చాలామందికి తమకా సమస్య ఉందనే తెలియదు. ఇంట్లో వాళ్లు కూడా ‘నీ అతి శుభ్రతతో చచ్చిపోతున్నాం..’ అని తిట్టుకుంటారే కానీ, వారి ఇబ్బందిని గుర్తించరు. దీంతో సమస్య తీవ్రత పెరుగుతుంది. అయితే, అతి శుభ్రత పాటించేవారంతా ఓసీడీ బాధితులు కానవసరం లేదు. అందుకే పరీక్ష చేయించుకోవడం మంచిది. ఓసీడీ ఉందని తేలినా ఆందోళన అవసరం లేదు. మందులతో ఈ సమస్యను కంట్రోల్‌ చేయవచ్చు. కొన్నిసార్లు సైకలాజికల్‌ థెరపీ అవసరం అవుతుంది. సైకాలజీలో చాలా థెరపీలున్నాయి. అయితే, ఇప్పుడు ఓసీడీకి ‘ఎక్స్‌పోజర్‌ థెరపీ’ కూడా అవసరమని అంటున్నారు నిపుణులు. మనకు తెలియని విషయాలకు ఎక్స్‌పోజ్‌ అయి, అవగాహన పెంచుకుంటే భయాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ గ్రూప్‌ ద్వారా చక్కని ‘ఎక్స్‌పోజర్‌ థెరపీ’ లభిస్తున్నది. అందుకే, గ్రూప్‌ సభ్యుల్లో చాలామందికి ఓసీడీపై అనుమానాలు, భయాలు తొలగిపోయి, చికిత్సకు మొగ్గుచూపుతున్నారు. తమ సమస్య నుంచి పూర్తిగా బయటపడుతున్నారు. రోగం కన్నా దానివల్ల కలిగే భయమే ఎక్కువగా బాధిస్తుంది. ఇలాంటి  ఆందోళనల నుంచి బయటపడేసే నెచ్చెలిగా హైదరాబాద్‌ ఓసీడీ గ్రూప్‌ సహకరిస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎందరో...మహానుభావులు!

ట్రెండింగ్‌

Advertisement