e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Home కథలు ఉత్తమ నటుడు

ఉత్తమ నటుడు

ఉత్తమ నటుడు

భూమిని కబ్జా చేయడానికి సముద్రం సునామీని వెంటేసుకొచ్చినట్టుంది. ఆకాశాన్ని బద్ధలుకొట్టి భూమిని నీటితో నింపేయాలని వర్షం ప్రయత్నిస్తున్నట్లుంది.
అక్కడ రైల్వే స్టేషన్‌ ఒంటరిగా ఉంది. దీన వదనంతో ఉంది. చెప్పలేని.. చెప్పుకోలేని దిగులు గుబులు గుండెల్లో దాచుకున్నట్టుంది. చీకటి ఆకాశం.. రైలు పట్టాలు స్టేషన్‌ పెట్టుకున్న రెండు కన్నీటి చారికల్లా మెరుపు వెలుగులో మెరుస్తున్నాయ్‌. బిక్కుబిక్కుమంటున్న ఆ రైల్వేస్టేషన్‌ బెంచీమీద మరింత బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఒద్దికగా కూర్చునుంది ఓ అమ్మాయి!

 1. అమ్మాయి‘ప్చ్‌.. ఇంకా నా రాజు రాడేంటి..?’
  ..ఈ మాట వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నిసార్లు అనుకొని ఉంటాను? సెల్‌ ఆన్‌ చేయగా 11:59 పన్నెండుగా మారిపోయింది. అంటే.. ఐదు గంటల నిరీక్షణ.. ఐనా, రాలేదు. అబ్బ.. తను వస్తే ఎంత బావుండు. ఈ వర్షం.. ఈ రాత్రి.. ఈ చలి.. ఓ లెక్కా! కాదు. అస్సలు కాదు. ప్చ్‌.. నా రాజు ఇంకా రాడేమిటి? ఈ రైలూ రాదేమిటి? అమ్మో.. నా రాజు రాకముందే రైలొస్తే ఏం చేయను? ఊహూఁ.. నా రాజు లేని రైలెందుకు? నేనెందుకు? రైలు వస్తే రానీ.. పోతే పోనీ.. తెచ్చిన బ్యాగ్‌ తడిమాను. నోట్ల కట్టలు వానకు నానక బిరుసుగానే ఉన్నాయి. డబ్బు దర్పం డబ్బుదే కదా! ఆ పక్కనే ఇంకో బ్యాగ్‌.. ఐదు కేజీల బంగారం.. అనుకుంటుండగా ఓ అమ్మాయి పెద్ద కడుపుతో, వర్షంలో జారి పడతానని కూడా భయం లేకుండా పరుగున వచ్చి నా ముందు నిలబడింది. చెప్పొద్దూ.. అప్పుడు నాకు భయం కలిగింది. డబ్బు, బంగారం గురించి కాదు. నన్నెక్కడ చూసేస్తుందోనన్న భయం.. అందుకే, చున్నీని వర్షానికి కప్పుకున్నట్టు ముఖాన్ని కనబడకుండా కవర్‌ చేసుకున్నాను.
  “అక్కా.. మా ఆయన కనిపించాడా..?” ఆశగా అడిగిందా పిల్ల.
  పిచ్చిది. అమాయకంగా ఉంది. ఆమే నాకు తెలీదు. వాళ్లాయన నాకెలా తెలుస్తాడు? నేను.. నాక్కాబోయే ఆయనకోసం చూస్తుంటే.. మధ్యలో వాళ్లాయన సంగతి నాకెందుకు?.. అందుకే నేనేం మాట్లాడలేదు.
  “అయ్యో.. చూళ్లేదా? వీడిబాబు ఎక్కడున్నాడో ఏమో.. ఎతకని సోటు లేదనుకో” అనుకుంటూ ఎత్తుగా ఉన్న పొట్టను నిమురుకుంటూ, గెంతుకుంటూ పోయింది.
  పిచ్చిది.. మోసపోయి ఉంటుంది. లేదా మోసపోయి పిచ్చిదైనా అయి ఉంటుంది. అసలు ఒకందుకు నన్ను నేను మెచ్చుకోవాలి. నాకు ఎంత రాజు కావాలనుకున్నా.. రాజులేని లోకం వద్దనుకున్నా.. ఇలా పిచ్చిగా మోసపోను. నవ్వొచ్చింది.
  ‘నేను నిజంగా మోసపోవడం లేదుకదా!’ ఒక్కక్షణం ఆ ఆలోచన.. ఛ ఛ.. అలాంటి ఆలోచనలే రాకూడదు. ఆ నిజాయితీ.. ఆ మాట తీరు.. అబ్బ.. సూపర్‌.. నిజాయితీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ నా రాజు..!
  చీకటి ఆకాశంలోంచి.. కుండపోత ముసురులోంచి.. ఆలోచనలు రాజు చుట్టూ ముసురుకుంటున్నాయి. అసలు వర్షంలోనే కదా
  రాజు పరిచయం.

ఆ రోజు వర్షం..!
ఆ వర్షంలో ఐస్‌క్రీం తింటూ.. చున్నీ నెత్తిన కప్పుకుంటూ నడుస్తున్న నేను.. పర్స్‌ తీసి నోట్లు లెక్కపెట్టుకుంటున్న ఒకతన్ని ఢీకొట్టేశా. అతను కింద పడిపోయాడు. చేతిలోని పర్సు.. లెక్క పెడుతున్న నోట్లు.. వర్షపు నీటిలో పడి పడవల్లా పరుగులు తీస్తుంటే.. చెప్పొద్దూ.. అతను ఎంత ఆత్రంగా ఆ నోట్లని అందుకున్నాడు. అంతే ఆత్రంగా బట్టలకు నోట్లని తుడుచుకొని.. ఊదుకొని.. అబ్బ.. ఆ ముఖంలో ఎంత కంగారు.. ఆ కంగారులో ఎంత భయం.. ఆ భయంలో ఎంత అమాయకత్వం.. ఎంత.. అబ్బ..! ఇంక నేను ఇంతకన్నా చెప్పలేను. చెప్పాలంటే.. అతనిమీద చెప్పలేనంత జాలేసింది. అతను నావైపు నిస్సహాయంగా చూస్తుండిపోయాడు.
..పాపం. నాకూ పాపం అనిపించింది. అంతే! అప్రయత్నంగా నా చేతిని అతనికి అందించాను. కొండంత పెన్నిధి దొరికినంత సంబురపడి పోయాడతను. అతను నన్ను చూశాడు. నేను అతన్ని

చూశాను. ఆ చూపులో ఏదో అయస్కాంత శక్తి ఉంది. అది నన్ను తనవైపు లాక్కుంటున్నది.
“థాంక్స్‌” అన్నాడతను.
“సారీ” అన్నాన్నేను.
మళ్లీ ఒకరిని ఒకరం చూసుకున్నాం.
“థాంక్సెందుకు?” అన్నాన్నేను.
“సారీ ఎందుకు ” అన్నాడతను.
మళ్లీ ఒకరినొకరం అలాగే చూస్తుండిపోయాం. అదో అయస్కాంతం.
“మన మధ్య సారీలేంటి?” అన్నాడతను.
“అదే నేనూ అంటున్నాను. మనకీ మనకీ థ్యాంక్సులేంటి?” అని.. అలా అంటుంటేనే ఎందుకో సిగ్గనిపించింది.
మళ్లీ ఒకరినొకరం చూసుకున్నాం. అయస్కాంతం! నన్ను చూసి నవ్వాడు. మెరుపు వెలుగులో అది గమనించాను.
ఉరుముకు.. అతని దగ్గరకు జరిగి అతన్నే చూస్తూ నేనూ నవ్వాను. అప్రయత్నంగా అతనికి దగ్గరైన నన్ను నేను చూసుకొని సిగ్గుతో మళ్లీ నవ్వొచ్చింది.
ఆపైన.. ఇద్దరం నవ్వుకున్నాం.
విడిపోతూనే.. ‘మళ్లీ ఎప్పుడు కలుద్దాం..’ అన్నట్టున్నాయతని చూపులు.
అన్నట్టు.. నా చూపులూ అలాగే ఉన్నాయేమో ఆ క్షణాన.. నాకైతే తెలీదు. కానీ, ఇంకొంచెంసేపు అతనలాగే ఉంటే బావుండేదని మాత్రం అనిపించింది.
ఎందుకో ఆ రాత్రి.. నిద్రకు దూరం అయ్యాను.
అతన్నుంచి దూరం జరగాలంటే.. ఆలోచనలు సైతం వీలు కావడం లేదు.
అతన్ని మొదటిసారి చూశాక ఇన్ని ఆలోచనలు కలిగాయి.
అతన్ని చూడాలని.. మళ్లీ అక్కడికి వస్తాడేమోనని మరుసటి రోజు వెళ్లాను.
అరె.. ఆశ్చర్యం.. అతనూ వచ్చాడు. ఈసారతను పలకరింపుగా నవ్వాడు. నేనూ నవ్వాను. అంతలో.. తుమ్మాడు.
‘అయ్యయ్యో.. వర్షంలో నిన్న తడవడం వల్ల జలుబు చేసింది పాపం’ అనుకున్నాను.
అతను “కాఫీ..” అన్నాడు తుమ్ముతూనే.
ఏం అయస్కాంతమో ఏమో.. అతని వెనకాలే వెళ్లి, అతను కూర్చున్న టేబుల్‌ ముందు కూర్చున్నాను.
కాఫీ వచ్చింది. అబ్బ.. ఎంత బావుంది. నా జీవితంలో ఎప్పుడూ ఇంత మంచి కాఫీ తాగలేదు. అమృతంలా ఉంది.
అలా.. ఇద్దరం నడుస్తున్నాం. అతను ఏదో మాట్లాడుతున్నాడు. అతని మాటల్లో అయస్కాంతం ఉంది. నేను దానికి గంగిరెద్దులా తలూపుతున్నాను. నన్ను మంత్రముగ్ధని చేశాడు. అతను ఏం చేసినా.. ఏం చెప్పినా వినాలనిపిస్తున్నది. అతను అవునన్నది నేను కాదనలేని స్థితికొచ్చాను. అవును. అతను ఏది చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవును అతనే నాకు సర్వస్వం. నిప్పుల్లో దూకమన్నా దూకుతాను. విషమిచ్చి..
‘ఇద్దరం కలిసి చద్దాం..’ అన్నా నేను. రెడీ..!
ఐనా, నా రాజు అలా ఎందుకంటాడు? అనడు. అతనికి నేనే సర్వస్వం. నేను లేకపోతే అతను బ్రతుకలేడు. కాదుకాదు. అతనికి బ్రతుకే లేదు. అతను నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నాడు. అతని రాజ్యానికి నన్ను సామ్రాజ్ఞిని చేస్తానన్నాడు. చేస్తాడు కూడా..! డబ్బులేంది ఈ రోజుల్లో ఏదీ జరగదు కదా. ఏదో బిజినెస్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తయారు చేసుకున్నాడు. నన్ను ‘ఎండీ’ని చేస్తానన్నాడు.
అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఒక్క డబ్బు తప్ప! పిచ్చి నా రాజు. ఆ రోజు నేనే ఢీకొట్టి ఉండకపోతే.. ఏమై పోయేవాడో.. నాకు నవ్వొచ్చింది. ఈ వరస సంఘటనల తర్వాత.. నేను గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మా ఊరెళ్లాను. అమ్మ ఎందుకో టెన్షన్‌ పడుతున్నది. నాన్న ఊళ్లోలేరు. అమ్మ దగ్గరకు చేరాను.
“ఈ సంవత్సరం చదువు పూర్తి చేసెయ్‌.. నాన్నగారు నీకు ఓ సంబంధం ఖాయం చేశారు. అబ్బాయి బుద్ధిమంతుడు. అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓనర్‌. కోట్ల డాలర్ల టర్నోవరట!” అన్నది.
నాకు నవ్వొచ్చింది. “డాలర్లను కోట్లల్లో చెప్పరే.. పిచ్చి అమ్మ”
నేను నవ్వాననో ఏమో.. “నువ్వింకేం మాట్లాడకు. ఎదురు చెప్పకుండా నాన్న చెప్పింది చెయ్‌. ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నారు. ఐదు కోట్లకే వాళ్లు ఒప్పేసుకున్నారట. బంగారం లాంటి సంబంధం. వదులుకోకూడదని మీ నాన్న పట్టుదల. ఈ సంబంధం ఖాయం చేసిందగ్గర్నుంచీ మీ నాన్నగారు గాల్లో తేలిపోతున్నారంటే నమ్ము..” ఇలా అమ్మ నన్ను ఊదరగొట్టేసింది.
రేపు ఆదివారం అని బ్యాంక్‌నుండి ఈ రోజే రెండు కోట్ల రూపాయలు డ్రా చేసి, ఏదో అర్జంటు పని మీద ఊరెళ్లారట.
అమ్మ అన్నీ చెప్పేస్తున్నది. చెప్పేసుకొని తేలికపడి నిద్రపోతున్నది. నాకేమో నిద్ర రావడం లేదు. నా రాజు ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌కి సరిపడా డబ్బు.. రెండు కోట్ల రూపాయలు బీరువాలో ఉన్నాయి. బీరువా తాళాలు నా తలదిండు కింద ఉన్నాయి. దిండుకింద తాళాలు నా తలకు గుచ్చుకుంటున్నాయి. ఠక్కున ఓ ఆలోచన.. నాన్నగారికి మూడు కోట్ల రూపాయలు ఆదా చేస్తే.. ఇండియాలోనే ఇండస్ట్రీ పెట్టి గెస్ట్‌గా నాన్నని పిలిస్తే.. సర్‌ప్రయిజ్‌.. తల్చుకుంటేనే యమా థ్రిల్‌గా ఉంది. ఆ రాత్రి నాన్న రాలేదు. అమ్మ నిద్ర పోతున్నది. ఏదో ఒకటి చేయాలి.
అమ్మంటే నాకు ప్రాణం. నేనంటే నాన్నకు ప్రాణం. నాన్నంటే నాకు భయం.
ఆలోచనలు నా బుర్రను వేడెక్కించేస్తున్నాయి. ఇంకా ఆలోచించి అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ‘ఆలస్యం.. అమృతం.. విషం..’. అవును. సరైన సమయంలో సరైన నిర్ణయం తెలివిగల వాళ్ల లక్షణం. గాఢంగా నిట్టూర్చి దృఢంగా నిర్ణయించుకున్నాను..
..చారెడు నీళ్లు మొహాన కొట్టినట్టు
వర్షపు తెర. ఎవరో వస్తున్నారు. అమ్మో.. చున్నీతో ముఖం కనిపించకుండా కప్పుకున్నాను. అతను గమనించి, లైటు వెలుగులో.. వర్షపు ధారలో చూశాడు. నేను ముఖం తిప్పుకున్నాను. ఎందుకలా చూస్తూ వెళ్లాడో ఆ స్టేషన్‌ మాస్టర్‌. రైలు రాలేదు. రాజూ రాలేదు. ఈ వర్షంలో నా రాజు ఎక్కడున్నాడో..

 1. అబ్బాయి..
  ‘అబ్బ.. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో.. ఇప్పుడే రావాలా..?’ అనుకున్నాను. ఇంత వర్షం ఇంకొకటి వచ్చినా నాకు లెక్కకాదు. కానీ, వర్షంలో తడిచొస్తే.. తనూరుకోదు. కోపం వచ్చేస్తుంది. అరిచేస్తుంది. అస్సలూరుకోదు. ఎలా? టైం ఎంతవుతుందో..
  పన్నెండున్నరయినా అయి ఉంటుంది.
  ‘ఛ.. వెదవ వర్షం..’ అనుకొని వెంటనే నాలుక్కరుచుకొని..
  ‘అమ్మో.. ఈ వర్షం వల్లే కదా.. ఇప్పుడు డబ్బుల వర్షం కురవబోతున్నది’

అప్పుడూ ఇలాగే వర్షం.. ఓ చోట.. ఒకతను తడిసి ముద్దయి ఉన్నాడు. అతని ప్యాంట్‌ బ్యాక్‌ సీట్‌ జేబులో ‘పర్స్‌’ నేనున్నానంటూ ఎత్తుగా కవ్విస్తూ కనిపిస్తున్నది. అంతే.. ఇక ఆలస్యం లేకుండా అద్భుతమైన నా చేతివాటాన్ని ప్రదర్శించా. అతని జేబులోని పర్స్‌ నా చేతిలో ఉంది. పర్స్‌తో పారిపోవాల్సింది నేనైతే.. అతను పరుగున కారెక్కాడు. కారు రివర్స్‌ చేసుకొని సర్రున నా మీద వర్షపు నీళ్లు చిమ్ముతూ తుర్రుమన్నాడు. అప్పుడు నాకు కోపం రాలేదు. ఎందుకొస్తుంది? అతను నా మీద చిమ్మింది నీళ్లు కాదు. డబ్బులు కదా.. అనుకుంటూ నడుస్తుంటే.. పర్స్‌లోని నోట్లు లెక్కపెట్టుకుంటుంటే.. సడెన్‌గా నన్నెవరో గుద్దేశారు. కిందపడ్డా. చేతిలోని పర్స్‌.. లెక్కపెడుతున్న నోట్లు.. వర్షపు నీటిలో పడి చేజారిపోతోంటే.. ఆ నోట్లని ఒడిసి పట్టుకొని, తుడిచి ఉఫ్‌ఉఫ్‌న గాలి ఊదాను. ఈలోగా ఎంత కంగారు.. ఎంత భయం.. అసలెంత టెన్షన్‌.. అప్పుడుగానీ గుద్దిన వాళ్లని చూడలేదు. అబ్బ.. అమ్మాయి.. అందమైన అమ్మాయి.. మెరుపుతీగలాంటి అమ్మాయి.. నన్నే చూస్తోన్న అమ్మాయి.. పడిపోయి నిస్సహాయంగా ఉన్న నన్ను చూసి జాలిపడిందో ఏమో.. అప్రయత్నంగా చేయి అందించింది. ఆ అందాన్నీ.. ఆ చేతినీ చూశాను. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేశాను. ఆ అందాల చేతిని వదులుకోకూడదని అనిపించింది. ఇక ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు అని చేయి అందుకున్నాను.
“థ్యాంక్స్‌” అన్నాను. తను “సారీ” అంది. ఆకాశం ఉరిమిన ఉరుముకు నాకు మరింత దగ్గరయింది. ఇద్దరం నవ్వుకున్నాం.
మొదటిచూపు అంటారే.. ఆ చూపే ఆమెను కట్టి పడేసినట్టు అర్థమయింది. తను మళ్లీ మరుసటిరోజు అక్కడికి వస్తుందని వెళ్లాను. ఆశ్చర్యం. వచ్చింది. నవ్వింది. నాకు జలుబు చేసి తుమ్ములొచ్చాయి. దానికీ.. “ఇంకెప్పుడూ వర్షంలో తడవద్దు. తడిస్తే నా మీద ఒట్టు” అంది సీరియస్‌గా. తను అంత ‘రియాక్ట్‌’ అవుతుందని ఊహించలేదు.
‘ఏంటీ పిల్ల’ అనుకున్నాను. ఇంకా అలా మాట్లాడుతూనే మనీ మేటర్సే కాకుండా మెనీ మేటర్సే చెప్పేసింది. ఇక అప్పటినుండి నా డ్రామా మొదలుపెట్టా. ఆమే శరణ్యం అన్నట్టు. ఆమె లేనిది నేను లేనన్నట్టు. మాటలతో కాకుండా నా చర్యలవల్ల చెప్పకుండా చెప్పాను. అప్పటికి వారం క్రితం నా చేతివాటానికి బలైంది ఓ బ్రీఫ్‌కేస్‌. అందులో డబ్బుతోపాటు ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిపోర్ట్స్‌ కూడా ఉన్నాయి. దాన్ని తెలివిగా మార్చి, నా ప్రపోజల్‌గా ఏమార్చాను. అనుకున్నవి అనుకున్నట్టు కుదిరితే నా ప్రేమదేవతని ‘ఎండీ’ని చేస్తానన్నాను. అందుకు డబ్బు కావాలనీ.. అదే లేదనీ.. దాన్నే ఇన్‌డైరెక్ట్‌గా అనుమానం పిసరంతయినా కలగకుండా చెప్పాను. దానికి కళ్లార్పి చిత్రంగా తిప్పింది.
ఆ సైగ భాషకు అర్థం.. ‘మై హునా.. ఆ మేటర్‌ నాకొదిలెయ్‌’ అన్నట్టుంది.
‘హమ్మయ్య..’ అనుకున్నాను. ఆ తర్వాత మళ్లీ కలిసినప్పుడు తనకు అమెరికా సంబంధాలు చూస్తున్నారనీ, తండ్రిని ఎదిరించే ధైర్యం తనకు లేదని చెప్పుకొని ఏడ్చింది. ఓదార్చాను.
“ఏం చేస్తాం.. నిన్ను ‘ఎండీ’ని చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చే ఛాన్స్‌ మిస్సయింది” అన్నాను.
ఆ మాట బాగా పని చేసింది అనడానికి ఆమె కళ్ల మెరుపే సాక్ష్యం. లోపల్లోపల రక్తం ఎగిరెగిరి పడుతున్నది. దాన్ని బలవంతంగా అణచుకొని నేచురల్‌గా ఉండటం కోసం చాలా కష్టపడాల్సొచ్చింది. ఐడియా చెప్పింది. నన్ను నమ్మేసింది. హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఈ రాత్రి డబ్బు.. బంగారంతో వచ్చేస్తున్నట్టు మెసేజ్‌ పెట్టింది. అసలు నేనెవరు? నా వెనుకా ముందు ఏమిటి? నా మంచీ చెడ్డా ఏమిటి? నమ్మేసి వచ్చేసి మోసపోతున్నది.

..సీసాల చప్పుళ్లకి ఆలోచనల్లోంచి
బైటపడ్డాను.
“ఒరేయ్‌.. నువ్వీ దెబ్బతో కోటీశ్వరుడివి అయిపోతున్నావ్‌. ఉత్త మందు పార్టీతోనే సరిపెట్టడం అన్యాయం రా.. అమ్మాయి లేకుండా..” అన్నాడొకడు.
“అవున్రా.. అస్సలస్సలు బాలేదు..” రెండోవాడన్నాడు.
“బాలేదంటే బాలేదు..” మూడోవాడు.
“మరి బావుండాలంటే ఏం చేయాలో అది చెయ్‌.. బావుంటుంది! ఏరా..?” నాలుగోవాడి తాళం.
నలుగురూ నాలుగు మాటలన్నారు. పీకల్దాకా తాగారు. తిన్నారు. త్రేన్చారు.
“సారీరా.. నా టెన్షన్‌ నాది. మీకెలా చెప్పాలో తెలీడం లేదు” అన్నాన్నేను.
“ఇందులో చెప్పాడానికేముంది..
ఎరేంజ్‌ చేసెయ్‌”
“ఎలా రా..? ఈ టైం అప్పుడు?”
“మనసుండాల్రా..”
“ఆపైన డబ్బులుండాలి”
“రెండూ నీ దగ్గరున్నాయ్‌..”
“అప్పుడింకెందుకాలస్యం..?”
సమాధానం చెప్పలేక పోతున్నాను.
“అక్కడ.. అమ్మాయి రైల్వే స్టేషన్‌కి వచ్చి ఉంటుంది కదా..?”
“రాకుండా ఎలా ఉంటుంది..?”
“మరింకేం రా.. దాన్ని తెచ్చేసుకుందాం..”
“అన్యాయం రా..” అన్నానో.. లేదో..
“ఆహా.. నువ్వు చేస్తున్నది మహాన్యాయం” అన్నాడు వాడు.
నేను తలదించుకున్నాను.
“తల దించుకోకురా.. తలా పంచుకుందాం..”
“ప్చ్‌.. వద్దు.. అసలుకే మోసం వస్తుంది” అన్నాన్నేను.
“ఇంకేం చెప్పొద్దు..” నలుగురూ అన్నారు.
“కుదరదు..” గట్టిగా అరిచాను.
ఆ మెరుపు వర్షంలో పిడుగులా ఉరిమానేమో.. కొంచెం తగ్గారు. అంతే.. అక్కడున్న ఓ బాటిల్‌ ఎత్తి దించకుండా తాగేసి.. అప్పటికే సర్దుకున్న బ్యాగుతో బయల్దేరాను.
ఆ నలుగురూ అలా అచేతనంగా చూస్తుండిపోయారు, నేను వెనక్కి తిరిగి చూసేసరికి!

 1. స్టేషన్‌ మాస్టర్‌..
  హాఁ.. వర్షం వదిలేలా లేదు. రాత్రి ఒంటి గంటయింది. బండి లేటు. అయినా, ఈ బండికి ఈ స్టేషన్లో పెద్దగా ఎవరూ ఎక్కరు. దిగరు. పైగా.. వర్షం. ఐనా.. స్టేషన్‌లో ఎవరైనా ఉన్నారేమోనని బైటికొచ్చి చూశాను. అంతవర్షంలోనూ ప్లాట్‌ఫాం చివరన ఎవరో ఉన్నారు.
  “మా ఆయన కనిపించాడా..? ఆడు రాత్తుర్లప్పుడే తిరుగుతాడయ్యా.. ఆన్నప్పుడే పట్టుకోవాల” బైటికి వెళ్తున్న నాకు ఎదురొస్తూ అంది కడుపుతో ఉన్న యువతి. ముద్దయిన బట్టలు పిండి, దాంతో తల తుడుచుకుంటున్నది.
  ఓ నిట్టూర్పు విడిచి, గొడుగు తీసుకొని ప్లాట్‌ఫాం వైపు నడిచాను. నేను ఆమెను సమీపిస్తున్న కొద్దీ తన ముఖం కనపడకుండా చున్నీతో కప్పుకుంటున్నది. ‘ఎందుకు?’ అనుమానం వచ్చింది. బలపడింది కూడా.
  ‘ప్చ్‌.. ఏంటో ఈ కాలం పిల్లలు..’ అనుకుంటూ స్టేషన్‌వైపు కదిలాను. నా గదికి రాగానే.. ఒకతను లోపలికొచ్చాడు. మందు వాసన గుప్పుమంది. కడుపుతో ఉన్న యువతి అతన్ని చూసి.. సంతోషంతో దగ్గరికెళ్లింది. అతను షాకై కంగారు పడ్డాడు.
  “ఒక హ్యాపీ గుడ్‌న్యూస్‌..” అతనెదురుగా నిలబడి అందామె.
  అతను మళ్లీ కంగారు పడ్డాడు.
  “మన బిడ్డ..” పొట్ట తడుముకుంటూ అందామె.
  అతను గుటకలు మింగడం, టెన్షన్‌ పడటం గమనించాను. తేరుకొని, గది బైటకు వచ్చి.. ప్లాట్‌ఫాం చివర చూశాడు. అమ్మాయి ఉంది. వెళ్లబోయి ఆగాడు. బ్యాగులోని టవల్‌ తీసి తల తుడుచుకున్నాడు. షర్ట్‌ మార్చుకున్నాడు. కడుపుతో ఉన్న యువతి అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. అతని షర్ట్‌ని పిండేసింది. అతను ఆమెనే చూస్తున్నాడు. ఇదంతా నేను గమనిస్తూనే ఉన్నాను. అతను ప్లాట్‌ఫాం మీద కూర్చున్న అమ్మాయి కోసం వచ్చాడు. అనుమానం లేదు. ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. అతను బైటికి వెళ్లబోయాడు.
  “బాబూ.. గొడుగు తెప్పించమంటారా..?” అడిగానతన్ని.
  తడిచివస్తే తిడుతుందని ఒక్క క్షణం ఆలోచించి “అలాగే సార్‌” అన్నాడు.
  “కాస్తాగండి..” పక్కనే ఉన్న గ్యాంగ్‌మెన్‌కి చెవిలో ఏదో చెప్పి పంపాను.
  ఇందాక నేను వేసుకొచ్చిన గొడుగు చీకట్లో పెట్టింది ఎవరికీ కనపడదని తెలుసు.
  “ఒక్క నిమిషం..” అని ఆ యువకుడ్ని పర్మిషన్‌ అడిగినట్టుగా అడిగి గొడుగు లేకుండానే బైటికి వెళ్లాను.
  స్టేషన్‌ గదిలో కడుపుతో ఉన్న యువతి.. ఆ యువకుడు ఇద్దరే ఉన్నారు.
  నేను బెంచీమీద తడిసి ముద్దయి వణుకుతున్న అమ్మాయిని సమీపించాను. నా రాక ఆమెను కంగారు పెట్టింది.
  “ఎక్కడికి వెళ్లాలమ్మా..?” గొంతులో మార్దవాన్ని రంగరించి ఆత్మీయంగా అడిగా.
  చెప్పడానికి తడబడింది. తెలిస్తే కదా..
  “అర్థమైందమ్మా..” అన్నాను.
  “ఆఁ.. అది..” తడబడి నన్నే చూస్తున్నది.
  “నెమ్మది పడు.. నీకు తండ్రిలాంటి వాణ్ణి..”
  ఆ అమ్మాయి ఠక్కున తలెత్తింది. అవునన్నట్టు రెండు కళ్లు మూసి తలాడించాను. ఆ అమ్మాయి నన్నే చూస్తున్నది. డౌటే లేదు. నేను చాలా సిన్సియర్‌గా.. స్థిరంగా ఉన్నాను.
  “నా కూతురిది సరిగ్గా నీ వయసే..” బాధ దిగమింగుకుంటున్నట్టు అని.. దీర్ఘంగా ఓ పేద్ద నిట్టూర్పు విడిచి, పూడుకుపోయిన గొంతుతో..
  “అవునమ్మా.. అల్లారు ముద్దుగా పెంచిన ఇరవయ్యేళ్ల నా పెంపకాన్ని కాదని వారం రోజుల క్రితం పరిచయమైన ఒకడ్ని నమ్మి.. నన్ను కాదని అతన్తో ఇప్పుడు రాబోయే రైల్లోనే వెళ్లిపోయింది. ఆ బండికి నేనే.. ఈ చేత్తోనే పచ్చలైటు చూపిస్తే.. బండిలోంచి చివరిసారి నాకు చేయి ఊపిందమ్మా.. నా కూతురు..” అంటూ దుఃఖాన్ని గొంతులో పలికించి ఏడ్చాను.
  “ప్చ్‌.. ప్చ్‌.. ప్చ్‌.. ” జాలిగా అంది.
  “ఇప్పుడనుకుంటే పోయింది తిరిగి వస్తుందా అమ్మ..? ”
  తల అడ్డంగా ఊపి.. “రాదు..” అంటూ నిట్టూర్చింది.
  “హాఁ ఒక్కగానొక్క కూతురు. తల్లిలేని పిల్ల. అల్లారుముద్దుగా పెంచాను. అయినా..” తల అడ్డంగా, భారంగా ఆడించి.. కళ్లొత్తుకున్నాను.
  “ఆ తర్వాత ఏమైంది?” అందా అమ్మాయి.
  ‘వెరీగుడ్‌.. ఆ క్యూరియాసిటీనే నాక్కావాలి’ అని మనసులో అనుకొని..
  “ఏమవుతుంది.. ఏదో ఒకటి అవుతుంది” అన్నాను నిర్లిప్తంగా.
  “అంటే..”
  సరిగ్గా సంవత్సరం క్రితం..
  తుళ్లుతూ.. గెంతుతూ తూనీగలా తిరిగేది. చక్కగా చదివేది. అలాంటిది.. ఏమయిందో ఏమో.. హఠాత్తుగా తనలో మార్పు గమనించాను. ఎవరి ఆకర్షణకో.. ప్రలోభానికో గురైంది. దానికి అందంగా ‘ప్రేమ’ అని పేరు పెట్టుకుంది. తల్లిలేని పిల్ల అని అన్నీ నేనై చూసినా తననుకుంటున్న ఆకర్షణ.. అదే.. దాని భాషలో ప్రేమ ముందు నా ప్రేమ వీగిపోయింది. నా ప్రేమ ఓడిపోయింది. వాడి ఆకర్షణే.. అదే.. వాడి ప్రేమే గెలిచింది” నేను చెప్తున్నదంతా అలాగే వింటూ ఉండిపోయిందా అమ్మాయి.
  “అవునమ్మా.. సరిగ్గా నెల తిరిగిందో లేదో.. అది తీసుకువెళ్లిన నగలూ.. డబ్బూ అయిపోయాయేమో.. లేక దానిమీద మోజు తీరిపోయిందో ఏమో.. వాడికింకా డబ్బు కావాల్సి వచ్చిందో ఏమో.. నా బంగారు తల్లిని ముంబై రెడ్‌లైట్‌ ఏరియాలో అమ్మేశాడు” భోరున ఏడ్చేశాను.
  ఆ అమ్మాయి షాకై నన్నే చూస్తున్నది. ఇంకా దుఃఖాన్ని పలికిస్తూ..
  “అప్పుడుగానీ.. నా పిచ్చితల్లి మోసపోయానని తెలుసుకోలేకపోయింది. ఇంకో అమ్మాయి సాయంతో అక్కడి నుండి బైటపడాలనే ప్రయత్నంలో దొరికిపోయి ఇంకా చిత్రహింసలను భరించింది. ఆ నరక కూపంలో మగ్గి చావడం కంటే బైటపడే ప్రయత్నంలో చావడమే మంచిదనుకొని ఇంకో ప్లాన్‌ వేశారు ఆ ఇద్దరూ. ఈసారి క్షేమంగానే బయట పడ్డారు. కానీ, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రయత్నంలో మళ్లీ మోసపోయారు..”
  “ఎలా..?” అందా అమ్మాయి.
  “హాఁ అమాయకులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారమ్మా.. రైల్లో ఎవరో పరిచయమై.. పరిస్థితి తెలుసుకొని, ఉద్యోగం ఇప్పిస్తానంటే వాడి వెంట వెళ్లారు. వీళ్లని ఓ చోట పెట్టి వాడూ.. వాడి ఫ్రెండ్స్‌ నిర్బంధించి రేప్‌ చేశారు. ఈ మధ్య టీవీల్లో.. పేపర్లలో సంచలనమయింది. ఈ న్యూసే.. ఈ మ్యాటరే.. అది నేను చూసుంటానని.. చదివి ఉంటానని.. నేను తలెత్తుకొని తిరగలేనని ట్యాంక్‌బండ్‌ మీది నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదికూడా నాకు తెలియక పోయేదే.. తనతోపాటు ఉన్న ఇంకో అమ్మాయి ద్వారా ఈ విషయాలు తెలిశాయి”.
  నేను చెప్పేది ఆ అమ్మాయి వింటూ ఉండిపోయింది. మళ్లీ అందుకున్నాను..
  “ఆ అమ్మాయి మరెవరో కాదమ్మా.. ఆ పాపానికి గర్భవతైన ఆ పిల్లే.. ఇందాక నీ దగ్గరకు వచ్చిన పిల్ల..” అలా విషయాన్ని వాస్తవానికి లింక్‌ చేసేశా. కళ్లు తుడుచుకున్నా.
  “బాబాయ్‌..” అంది.
  ఆ మాటకు అదిరిపడ్డాను. నా చెంపల మీదినుంచి కారుతున్న వర్షపు నీటిని ఆర్తిగా తుడిచింది. ఆ అమ్మాయి ఇంకా ఏదో అడగబోతుండగా.. నా గది దగ్గర గొడవ జరుగుతున్నది.
  ‘అమ్మో..’ అనుకొని అమ్మాయితో అటు కదిలాను. రెండు బ్యాగుల్నీ తీసుకొని నన్ను ఫాలో అయింది.
  స్టేషన్‌ గదినుంచి.. కడుపుతో ఉన్న యువతిని తోసేస్తూ తనవైపు దూసుకొస్తున్నాడా యువకుడు.
  “పట్టుకోండి.. నన్ను మోసం చేసి పారిపోతున్నాడు. వాడ్ని పట్టుకోండి” పడుతూ లేస్తూ అరుస్తున్నది ఆ యువతి.
  ఆ యువకుడు కంగారుగా ఉన్నాడు. భయంగానూ ఉన్నాడు. ఆ యువతి షాకులోనూ ఉన్నాడు. మేమున్న దగ్గరకొచ్చి, నన్ను కన్నెత్తి కూడా చూడకుండా నన్ను ఫాలో అవుతున్న అమ్మాయి భుజమ్మీద చెయ్యి వేసి.. అటు తిప్పి “పద” అని ముందుకు నడవబోయాడు.
  నేను ఆగాను. ఆ అమ్మాయి వెనుతిరిగి నన్ను చూసింది. నేనూ ఆమెను చూశాను. ఆ అమ్మాయి తలను బలవంతంగా తిప్పేసాడా యువకుడు. ఐనా.. ఆ అమ్మాయి మళ్లీ నావైపు చూసింది. ఈలోగా.. కడుపుతో ఉన్న యువతి అక్కడికి వచ్చింది.
  “అయ్యా.. ఎన్నాళ్లనుంచో ఎతుకుతున్నాను. ఆడ్ని పట్టుకోండి”
  “ఆ పిచ్చిదాన్ని పట్టించుకోవద్దు. పద” అంటూ రెండు బ్యాగుల్నీ అందుకోబోయాడు.
  ఆ అమ్మాయికి నేను చెప్పింది ఎక్కింది అనడానికి నిదర్శనంగా రెండు బ్యాగుల్నీ వెనక్కి లాక్కుంది. “ఫరవాలేదు.. నేను పట్టుకుంటాన్లే..” అన్నాడా యువకుడు.
  “ఫరవాలేదు.. నేనే పట్టుకుంటాను..” అందా అమ్మాయి.
  “అదేంటి..?”
  “అదంతే..” నొక్కి చెప్పింది.
  అర్థమయి రెండు బ్యాగుల్నీ బలవంతంగా లాక్కోబోయాడు. ఆ అమ్మాయి గట్టిగానే పట్టుకున్నది. అది చాలు నాకు. ఈలోగా.. మెరుపులా ఆమెనుండి బ్యాగుల్ని లాక్కొని పారిపోతున్నాడు. గొడుక్కి పంపించిన లక్ష్మణ్‌.. గొడుగుతో ఆ యువకుడికి అభిముఖంగా వస్తున్నాడు. నేను ఆలస్యం చేయలేదు.
  “లక్ష్మణ్‌.. వాణ్ణి పోనివ్వకు..” అని అరిచాను. లక్ష్మణ్‌ వర్షానికి వేసుకొస్తున్న గొడుగుని మడిచాడు. రెండు బ్యాగుల్తో పారిపోతున్న ఆ యువకుడ్ని చూశాడు. కొంచెం వంగి ఆ యువకుడి కాళ్లని మడిచిన గొడుగుతో బలంగా కొట్టాడు. చేతిలోని బ్యాగులు జారి ఆ యువకుడు కింద పడ్డాడు.
  “ఆ బ్యాగులు తెచ్చేయ్‌..” అరిచాను మళ్లీ..
  లక్ష్మణ్‌ బ్యాగులు అందుకున్నాడు. ఆ యువకుడు లేవలేకపోతున్నాడు. కాళ్లు కూడదీసుకుంటున్నాడు. ఆ యువకుడు లేచేలోపు గుండెలమీద ఎక్కి కూర్చుంది.. కడుపుతో ఉన్న యువతి. “నన్ను మోసం చేస్తావా..?” చెంపలు వాయిస్తున్నది.
  లక్ష్మణ్‌ అమ్మాయి బ్యాగుల్ని తెచ్చిచ్చాడు.
  “బాబాయ్‌..” అంటూ ఆ అమ్మాయి నా గుండెలమీద వాలిపోయి ఏడుస్తున్నది. తల నిమిరి భరోసాగా..
  “నేనున్నానమ్మా.. నేనున్నాగా…” అన్నాను.
  కృతజ్ఞతగా చూసిందా అమ్మాయి. నా ఆనందానికి అవధులు లేవు.
  నా ఈ విజయాన్ని నా భార్య అన్నపూర్ణకి చెప్పాలి. కాలేజీ రోజుల్నుంచీ ఇప్పటివరకూ ఏ నాటకానికీ ‘ఉత్తమ నటుడు’ బహుమతి రాలేదని కదా.. సందు దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తుంది. కానీ, ఈ జీవన్నాటకంలో ‘లేని’ కూతురి కథ అల్లి.. గుడ్డిగా ప్రేమను నమ్మిన అమ్మాయిని అది భ్రమ అని నమ్మేలా నటించిన నేను కాదా.. ఉత్తమ నటుడిని.
  (ప్రేమ.. వంచన.. సాంత్వన.. విశ్వజనీనం అని ముఖ్యపాత్రలకు పేర్లు పెట్టలేదు)

యన్నంరెడ్డి వెంకటరెడ్డి
యన్నంరెడ్డి వెంకటరెడ్డి పుట్టి, పెరిగింది ఖమ్మం జిల్లాలో. అక్కడే విద్యాభ్యాసం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ‘ఈటీవీ’, ‘జీ తెలుగు’ చానళ్లలో పనిచేశారు. వందకుపైగా కథలు రాశారు. రెండు వందలకు పైగా కవితలు, రెండు నవలలూ, అనేక వ్యాసాలను వెలువరించారు. 1985లో నిర్వహించిన ‘తెనాలి రసమయి అఖిల భారత స్థాయి తెలుగు కథానికల పోటీ’లో ద్వితీయ బహుమతి అందుకున్నారు. ‘ఆంధ్ర ప్రదేశ్‌’ మాసపత్రిక నిర్వహించిన కథల పోటీలో తృతీయ బహుమతిని గెలుపొందారు.

Advertisement
ఉత్తమ నటుడు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement