e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు ఈవారం కథ : నియ్యతి గల్లోడు

ఈవారం కథ : నియ్యతి గల్లోడు

చాలా ఏండ్ల తరువాత బతుకమ్మ పండక్కని పిల్లల్ని తీసుకొని ఫణిగిరి వెళ్లాం. రేపు సద్దుల బతుకమ్మ అనగా ఆ మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత ఇంటి వెనుకనున్న పశువుల కొట్టంలో నులక మంచాలు వాల్చుకొని, ముచ్చట్లు చెప్పుకొంటున్నాం. ఇంతలో..
లింగంపల్లివాళ్ల సందునుండి “చిలుక పస్తీ చెప్తాం.. చిలుక పస్తీ చెప్తాం..” అంటూ ఓ కేక వినిపించింది.
ఆ కేక వింటూనే.. “రేయ్‌! మీరంతా చిలుక పస్తీ చూయించుకొంటార్రా?” అంటూ మా పెద్ద బావమరిది, పిల్లలందరినీ ఊరించాడు.
“ఆ.. చూపించుకొంటాం.. చూపించుకొంటాం” అంటూ పిల్లలంతా హుషారుగా అన్నారు.
పక్కనే ఎడ్లగాట్లో ఆవుదూడలకు నీళ్లు తాపుతున్న చిన్న జీతగాని దిక్కు చూస్తూ..
“వారీ ముత్తులూ! జర చిలక పస్తోన్నిటు పిల్వరా!” అంటూ ఉరికించాడు.
“ఓ చిల్క పస్తీ.. చిల్క పస్తీ..” అనుకుంట వాడు బైటకు పరిగెత్తాడు.
అప్పటికే చిలుక జోస్యం మనిషి లింగంపల్లి వాళ్ల సందు తిరిగి, చిన్న కోయిలదాకా వెళ్లిపోయాడు. అయినా వదిలిపెట్టకుండా వెళ్లిన ముత్తులు, చిలుక పస్తీవాణ్ని పట్టుకొని, వెనుక సందుగుండా పశువుల కొట్టంలోకి తీసుకొచ్చాడు.
ఆ చిలుక జోస్యమతను ఐదు ఐదున్నర అడుగుల ఎత్తున, చామనఛాయతో, బక్కపల్చగా ఉన్నాడు. నూనెపెట్టి మధ్య పాపిటలో దువ్విన గిరజాల జుట్టు నల్లగా మెరుస్తున్నది. పేటంచు ‘కోరా’ పంచమీద తెల్లటి సిల్క్‌ లాల్చీ తొడుక్కొన్నాడు. పాన్లు తింటాడేమో.. పండ్లన్నీ గార పట్టి ఉన్నాయి. ఎడమ భుజానికున్న గుడ్డసంచీ మోకాళ్లను తాకుతున్నది. కుడిచేత పట్టుకొన్న నలుచదరపు చెక్కపెట్టె పంజరంలో ఉన్న రామచిలుక.. ఉలుకు పలుకూ లేకుండా తన మానాన తను కూర్చొని ఉంది. అతణ్నోసారి కిందకి, మీదకి ఎగాదిగా పరికించి చూసిన మా నడిపి బావమరిది..
“నీ పేరేందివయా?” అంటూ అడిగాడు.
“పాండయ్య..” చేతిలోని పంజరాన్ని కింద పెడుతూ బదులిచ్చాడతను.
“పస్తీ ఏస్తే ఎంత?”.. ప్రతి చిన్న విషయాన్ని కూడా ముందు డబ్బుల లెక్కతో మొదలుపెట్టే మా చిన్న బావమరిది యథాప్రకారం తన పంథాలో అడిగాడు.
“పది రూపాయలు”.. కొట్టంలో ఉన్న వాళ్లందరినీ కండ్లతోనే లెక్క వేసుకొంటూ చెప్పాడు పాండయ్య.
“అందరూ గల్సి పదముగ్గురు. అబ్బో! శానా పైసలయ్యేటట్టుంది. పస్తీ వద్దు.. పాడొద్దులే పో” అన్నాడు మా చిన్న బావమరిది.
కొంతసేపు పాదులాట తర్వాత మా నడిపి బావమరిది కలుగజేసుకొని..
“సర్లే! పైసల్‌ నేనిస్తలే..” ఎందుకో నా దిక్కు అదోమాదిరిగా చూస్తూ అన్నాడు.
‘హమ్మయ్య! మంచి గిరాకీ పోద్దేమో అనుకున్న’ అన్నట్టు శ్వాస తీసుకొన్న పాండయ్య తన సంచిని కిందపెట్టి, దాన్లోనుండి ఓ పాత ఫ్లెక్సీ పట్టాను తీసి, దాన్ని సరిగ్గా కొట్టంలోని ‘అటుకు’ కింద పరిచి, దానిమీద పంజరాన్ని ఉంచాడు.
పట్టా మీద సర్దుకొని కూర్చున్న పాండయ్య సంచిలోనుండి చతురస్రాకారంలో ఉన్న ఓ పది పదిహేను కవర్లకట్టను బయటకు తీసి, వాటిని పంజరం ముందు అడ్డంగా పర్చాడు.
అట్లా ఐదు నిమిషాలపాటు తన సరంజామానంతా ఒక క్రమపద్ధతిలో సర్దిపెట్టుకొన్న పాండయ్య, ఆఖరికి “ఇక రాండ్రి” అన్నాడు జనాంతికంగా.
అందుకోసమే ఎదురు చూస్తున్న పిల్లలంతా ఒక్కసారిగా లేచి, ఒకరినొకరు తోసుకొంటూ.. “నేను, నేను” అంటూ ముందుకు రాసాగారు.
“ఆగండాగండి! ముందల నేను చూయించుకొని, మంచిగ చెప్తుండనుకొంటె.. అప్పుడు మీరంతా ఒకలెమ్మటొకలు చూపించుకొందురు గాని” అంటూ మా చిన్న బావమరిది వాళ్లమధ్య ఓ రాజీ ఫార్ములాను ప్రతిపాదించాడు.
ఇక దాంతో పిల్లలంతా ‘సరే’ అన్నట్టు సర్దుక్కూర్చున్నారు.
ఒప్పందం ప్రకారం అందరికన్నా ముందుగా మా చిన్న బావమరిది పాండయ్య ముందు కూర్చున్నాడు.
“ముందల కారట్లమీద పదినోటు పెట్టి, మీ పేరు చెప్పుండ్రి” అన్నాడు పాండయ్య.
“అందరైనంక లెక్కజూసి పైసలన్నీ ఒక్కసారే ఇస్తం గాని, నువ్వైతే ముందల కారట్‌ తీయించు” ఎప్పటి మాదిరిగానే గంపగుత్త లెక్కకు దిగాడు మా చిన్న బావమరిది.
“ఎవల్ల పైసలు వాళ్లు కారట్లమీద పెట్టి కూసోంది చిలుక కారట్‌ తియ్యది!” మా చిన్న బావమరిది ముఖంలోకి అసహనంగా చూస్తూ అన్నాడు పాండయ్య.
“ఆఁ నీ మాటలు గానీ, ఎందుకు తియ్యది? మంచిగనే తీస్తది గాని ఒదులు చిలుకను” పాండయ్య దిక్కు వెటకారంగా జూస్తూ అన్నాడు మా చిన్న బావమరిది.
పాదులాట తరువాత.. “చెప్తే నమ్మాల!” అంటూ పంజరం తలుపు లేపాడు పాండయ్య. మెల్లగా బయటకొచ్చిన చిలుక, కవర్లమీద కాసేపు అటూ ఇటూ తిరుగులాడి కవర్ను తియ్యకుండానే తిరిగి లోపలికెళ్లి కూర్చుంది.
అది చూసిన మా చిన్న బావమరిది..
“అబ్బో! ట్రైనింగ్‌ బాగానే ఇచ్చినవే!” అంటూ జేబులో నుండి పది రూపాయల నోటుతీసి కవర్లమీద పెట్టి తన పేరు చెప్పాడు.
పాండయ్య వెంటనే కుడిచేతి పిడికిట్లో ఆ నోటును పట్టుకొని నుదురుకు తాకించుకొని, దేవుళ్లను తల్చుకొని పంజరం రెక్క పైకిలేపి..
“ఓ చిలుకమ్మా! నిమ్మలంగ బైటికొచ్చి సంజీవరావు పటేల్‌ పేరుమీద కారట్‌ తీసిపో..” ఇందాకటి శైలికి భిన్నంగా అదోరకమైన స్నేహపూరిత యాసతో చిలుకను స్వాగతించాడు.
పంజరంలో నుండి వయ్యారంగా బయటికొచ్చిన చిలుక కవర్ల ముందు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిల్చుని, ఆ తరువాత తలవంచి ఓ కవర్ను బైటికిలాగి తిరిగి పంజరంలోకి వెళ్లి కూర్చుంది.
అప్పటిదాకా ‘చిలుక ఎలా బైటికొస్తుందో? ఏ కవర్ను తీస్తుందో?’ అన్న కుతూహలంతో ఎదురుచూసిన పిల్లలంతా చిలుక కవర్ను తీసి, లోపలికెళ్లిపోగానే సంతోషంతో తప్పట్లు చరుస్తూ కేరింతలు కొట్టసాగారు.
వాళ్ల కేరింతలను అడ్డుకొంటూ.. “మీరంతా ఇట్ల గోలజేస్తే చిలుక బెదిరిపొయ్యి మీ వొంతచ్చినప్పుడు కారట్‌ తియ్యది” అంటూ వాళ్ల ఉత్సాహపు పొంగుమీద హెచ్చరిక నీళ్లు చిలుకరించాడు పాండయ్య.
దాంతో పాపం.. పిల్లలంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు.
చిలుక బైటకు తీసిన కవర్ను చేతిలోకి తీసుకొన్న పాండయ్య, కండ్లు మూసుకొని ఏదో స్మరించుకొంటూ కవర్లోని కార్డ్‌ను బైటికి తీశాడు.
అది సీతా, రామ, లక్ష్మణ సమేత ఆంజనేయుడి బొమ్మలున్న కార్డ్‌. ఆ బొమ్మలకింద దేవనాగరి లిపిలో ఎర్రటిరంగులో ఏదో రాసి ఉంది. దాన్ని తనలోతను ఒకసారి చదువుకొన్న పాండయ్య, సంజీవరావు ముఖంలోకి చూస్తూ..
“నీ ఇష్టదైవం రాములవారు. ఆయినెప్పుడూ మిమ్ముల్ని సల్లంగా జూస్తుంటడు. పైసల ముచ్చట్ల మాత్రం నువ్వు బవు పిసినారోనివి..” అంటూ ఇంకేదో చెప్పబోతుండగానే పిల్లలంతా అడ్డుపడి..
“నిజం.. నిజం..” అంటూ గోలగోలగా అరుస్తూ తప్పట్లు కొట్టసాగారు.
“మీరిట్ల జేస్తే నేను లేసిపోత” పాండయ్య మాటలతో అసలే ఉడుక్కుంటున్న సంజీవరావు పిల్లల్ని బెదిరిస్తూ వాళ్ల నోర్లు మూయించాడు.
మళ్లీ ఉత్సాహంగా గొంతువిప్పిన పాండయ్య..
“నువ్వు పుట్టినూరు ఇడ్సిపెట్టి పట్నంల పడ్డదాన్క దెంకపోయినవ్‌గాదు?” అన్నాడు.
పిల్లలు వెంటనే “నిజం.. నిజం..” అంటూ మళ్లీ ఉత్సాహంతో కేకలేశారు.
వాళ్ల మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా..
“నువ్వు ఎనభై ఏండ్ల పైన్నే బత్కుతవ్‌. పట్నంల ఇల్లు గడ్తవ్‌” అంటూ చెప్పుకొచ్చాడు పాండయ్య.
ఆ మాటలు వింటూనే.. “ఆఁ కిరాయి ఇంటికే రికానా లేదుగాని పట్నంల ఇల్లు గడ్తాను? ఏం జెప్పినవ్‌ లే ఊకో!” అంటూ పాండయ్య మూతిమీద పొడిచినంత పన్జేశాడు సంజీవరావు.
“నేనేం జెయ్యాల పటేలా? చిలుక దీసిందే నేను జెప్తున్న!” నీలాంటోళ్లను బొచ్చెడు మందిని జూస్కుంట వస్తున్న అన్నట్లు సంజీవరావు ముఖంలోకి చూస్తూ అన్నాడు పాండయ్య.
“సర్లే చెప్పు” లోపల ఆనందంగా ఉన్నా, పైకి గంభీరంగా అన్నాడు సంజీవరావు.
“మీ అమ్మ, నాయిన్లు నిన్ను బాగ సదివిచ్చి అమీన్‌సాబ్‌ను చేయిచ్చాల్నని బాగ ఖాయిష్‌ బడ్డరు. కానీ, ఏం లాభం? నువ్వు వాళ్లనుకున్నట్టు సద్వలేదు” మరోసారి తన మాటల అమ్ములపొదిలోని మరో అస్ర్తాన్ని సంజీవరావు మనసు మీదికి సంధించి వదిలాడు చిలుక జోస్యం పాండయ్య.
ఆ మాటలు వింటూనే.. “ఇది మాత్రం పక్కామాట. అమ్మనాయినోల్లు బడికి పొయ్యి బుద్ధిగ సద్వుకో కొడకా.. అంటే వీడు పొయినట్టే పొయ్యి, అట్నుంచటే బాయికాడికి బొయ్యి కూసునేది” మా పెద్దొదిన తమ్మునిమీద గారాబాన్ని కురిపిస్తూ ఆనందంగా అన్నది.
పాండయ్య చెప్పే ప్రతి మాట వెనుకా మనసును ఆకట్టుకొనే ఒక సూత్రం దాగుంటుందన్న అవగాహన లేని అక్కడివాళ్లంతా ఏదో ఒక వ్యాఖ్యానాన్ని జోడిస్తూ అతనికి పరోక్షంగా సహకరించసాగారు.
అట్లా మరికొంతసేపు ఏవేవో చెప్పిన పాండయ్య.. ‘ఇంగ ఇంతే!’ అన్నట్టు కార్డును కింద పెట్టేసి “ఇంకొకలు రాండ్రి!” అన్నాడు.
అతని మాటలు వినడంతోనే తొండికి దిగిన సంజీవరావు..
“నువ్వు చెప్పిందేదీ నాకు కలువలేదు. మల్లోసారి చిలుకతోటి కారట్‌ తీయిచ్చి చెప్తేనే మిగిల్నోల్లకు పస్తీ జూయిస్త. లేకుంటె పెట్టె సంకన బెట్టుకొని వచ్చిన తొవ్వ బట్టుకొని ఎన్కకు తిరిగి సూడకుంట బో..” కరాఖండిగా అన్నాడు.
“నా చిలుక తప్పుడు కారట్‌ తియ్యది. అది తీసిన కారట్ల ఉన్నదే నేను జెప్పినగాదు!” బతిమాలుతున్నట్టుగా అన్నాడు పాండయ్య.
‘మొండివాడు రాజుకన్నా బలవంతుడు’ అన్నట్టు సంజీవరావు, పాండయ్య మాట పెడచెవిన పెట్టాడు. ఇక గత్యంతరం లేని పాండయ్య..
“ఇగోండ్రి! ఈ పదినోటు మల్ల కారట్లమీద పెట్టుండ్రి!” అంటూ ఇందాకటి నోటును తిరిగి సంజీవరావు చేతికిచ్చాడు. నోటును వెంటనే కవర్లమీద పెట్టి సర్దుక్కూర్చున్నాడు సంజీవరావు.
పాండయ్య మళ్లీ చిలుకను వదిలాడు. నెమ్మదిగా బయటికొచ్చిన చిలుక ఎప్పటి మాదిరిగానే కవర్లమీద కొద్దిసేపు అటూ, ఇటూ తిరుగాడి చటుక్కున ఓ కవర్ను బైటికి లాగి, తిరిగి పంజరంలోకి వెళ్లిపోయింది. చిత్రంగా మళ్లీ ఇందాకటి కార్డే వచ్చింది.
దాన్ని చూపించిన పాండయ్య..
“చూసిండ్రా పటేలా? నా చిలుక నియ్యతి తప్పదని ముందల్నే చెప్పిన్నా? లేదా?” అంటూ దాన్ని మళ్లీ కవర్లబొత్తిలో కలిపేసి..
“ఇంకోలు రాండ్రి!” అన్నాడు.
మళ్లీ అడ్డం తిరిగిన సంజీవరావు “అంటే.. నాకు నియ్యతి లేదన్నట్టా? నాకు నీ పస్తీ నచ్చలేదు. ముచ్చెంగం మూడోపాలి తియ్యాల్సిందే” అంటూ హఠం పట్టు పట్టాడు.
అప్పటికే అతని జిత్తులమారి తనాన్ని అర్థం చేసుకొన్న పాండయ్య.. ‘వీడితోని పంచాయితీ ఎందుకులే’ అనుకొని ఆ పది నోటును తిరిగి కవర్లమీద పెట్టించాడు. తిరిగి సంజీవరావు పేరు చెప్పి, పంజరం మూత తీశాడు పాండయ్య. చిలుక మెల్లగా బయటకొచ్చి కవర్లమీద తచ్చాడ సాగింది. ఇంతలో.. మేమెవ్వరం ఊహించలేని ఘటన జరిగిపోయింది.
కొట్టంలోని అటుకుమీద ఎప్పటి నుండి మాటుపెట్టుకొని కూర్చుందో తెలియదుగాని, మూడోసారి చిలుక బయటకు రాగానే చడీచప్పుడూ లేకుండా నేరుగా చిలుకమీదనే దూకి, దాన్ని నోట కర్చుకొని పక్కనే ఉన్న గోడదూకి గట్టు సూరయ్యోళ్ల పాతగోడల్లో మాయమై పోయింది పిల్లి.
రెప్పపాటులో జరిగిపోయిన ఆ సంఘటనకు మేమంతా దిగ్భ్రాంతికి లోనయ్యాం.
మరుక్షణంలోనే తేరుకొన్న పాండయ్య.. “ఓ దేవుడో నా చిలుక, నా చిలుక” అని కేకలు వేస్తూ గుండెలు బాదుకొంటూ పిల్లి వెనుక పడ్డాడు.
ఇంకెక్కడి పిల్లి? చిలుకతోసహా ఎప్పుడో మాయమైపోయింది. కొంతసేపటికి గసపోసుకొంటూ వెనుదిరిగి వచ్చిన పాండయ్య, ఖాళీగా ఉన్న పంజరాన్ని చూసి..
“నా నోటికాడి కూడు పిల్లెత్కపోయింది. ఇక రేపట్నుంచి నా పెండ్లం, పిల్లలను ఎట్ల బత్కిచ్చుకోవాల?” అంటూ బావురుమన్నాడు.
అంత మనిషి చిన్నపిల్లవాడి మాదిరిగా ఏడుస్తుండటంతో విన్న ఇరుగు, పొరుగు వాళ్లు గబగబా వచ్చి..
“ఏందేంది?” అంటూ ఆరా తీశారు.
“నా చిలుకను ఈల్ల పిల్లెత్కపోయింది. నా కంచం బోలైంది. నా చిలుకను నాకు తెచ్చన్న ఇయ్యాల, లేదంటే మూడు వేలు దండగ కట్టన్న ఇయ్యాల. ఎట్టనన్న జేసి మీరే నాకు నాయం జెయ్యాల” అంటూ వచ్చిన వాళ్లందరికీ పడిపడి దండాలు పెట్టసాగాడు.
ఇదంతా గమనించిన మా అత్తగారు.. ‘వ్యవహారం ఏదో అడ్డం తిరిగేటట్టుందే?’ అనుకొని వెంటనే రంగంలోకి దిగారు. పాండయ్య దిక్కు చూస్తూ..
“హ్హెఁ ఊకో.. నీ పిల్లిమీద, నీమీద ముత్తాలమ్మబడ. మాకేడ పిల్లిపాడువడింది? మంది పిల్లులొచ్చి మా కోల్లన్ని మింగి నీళ్లు తాగినయని మేమేడుస్తుంటే.. నువ్వేమో మా పిల్లి, మా పిల్లి అంట తోక గోసిన మేకలెక్క మొత్తుకొంటున్నవేంది?” అంటూ నష్టనివారణ చర్యకు దిగింది.
మా అత్తగారి వాళ్లకు పిల్లి ఉందో? లేదో నాకైతే నిజంగా తెలియదు. అయితే, పిల్లి ఎవరిదైనా పాపం! పేదవాడు రోజంతా సంపాయించిపెట్టే చిలుకను నష్టపోయాడు. కాబట్టి, పాండయ్యకు అంతో, ఇంతో ఇచ్చి పంపడం ధర్మం అనుకొన్నాను మనసులో.
“ఆ పిల్లి మాదికాదు. మేం పైసాగూడ ఇచ్చేది లేదు. యాడ ఫిర్యాదు జేస్కుంటవో జేస్కో పో” అంటూ మా పెద్ద బావమరిది భార్యతోపాటు సంజీవరావు ముందుకొచ్చి అన్నారు.
‘ఏం మాట్లాడ్తే.. ఏమంటరో? గాలికి బొయ్యే కంపను ముడ్డిగొట్టుకొన్నట్టు మనకెందుకొచ్చిన గోల? బుచ్చమ్మోల్లతోటి పెట్టుకొని ఈ సందున మనం నెగుల్తమా?’ అనుకొంటూ ఇరుగుపొరుగువాళ్లు గుసగుసలాడుకొంటూ ఎవరికి వాళ్లు మెల్లగా జారుకొన్నారు.
పాపం దుఃఖంతో బిక్క చచ్చిపోయిన పాండయ్య గాటిమీద ముడ్చుక్కూర్చున్నాడు.
‘తప్పదు ఇక ఏదో ఒకటి చెయ్యాల్సిందే’ అనుకొన్న నేను, పాండయ్య దిక్కు చూస్తూ..
“పోయిన చిలుకను తీసుకురాలేం. మా వాళ్లేమో పిల్లి మాదికాదు. మేమెంద్కు పైసలిస్తం? అంటున్నరు. కాబట్టి ఓ పనిచెయ్యి” అన్నాను.
“ఏందో చెప్పుండ్రి!” నీళ్లలో కొట్టుకుపోయేవాడికి చొప్పకట్ట దొరికినట్టు నా దిక్కు చేతులు జోడిస్తూ అన్నాడు పాండయ్య.
“నేనో వెయ్యి రూపాలిస్తాగాని, తీసుకుపోయి ఇంకో చిలుకను కొనుక్కో” అన్నాను.
“అయ్యా! ఇద్దె నేర్చిన చిలుకను కొనాల్నంటే మూడు వేలకు తక్కువ గాదు. నా పెండ్లాం, పిల్లలమీద ఒట్టు. చిలుకల్ని పట్టి ఇద్దెలు నేర్పెటోళ్లు ఏరే ఉంటరు. మేం వాళ్లకాడ కొంటం” అంటూ పాండయ్య తన ఇబ్బందుల చిట్టా నా ముందు పరవసాగాడు.
‘సర్లే పోనివ్వు’ అనుకొంటూ ఇంకో ఐదొందలు కలిపి, పదిహేనొందలు అతని చేతికిచ్చాను.
వాటిని కండ్లకద్దుకొని జేబులో పెట్టుకొన్న పాండయ్య, నాకు పదేపదే దండాలు పెడుతూ ఖాళీ పంజరాన్ని తీసుకొని ఉసూరుమంటూ వెళ్లిపోయాడు. ఆఖరికి పిల్లల చిలుక జోస్యం కోరిక తీరకుండానే చిలుక మాయమైపోయింది.
పాండయ్య అటు వెళ్లాడో లేదో అతని భవిష్యత్తును చూసి జాలి పడినట్టుగా ఒక్కసారిగా ఫెళఫెళమంటూ ఉరుములు, మెరుపులతో గాలివాన అందుకొంది.
హోరుగాలికి పున్నాగపూలు రాలిపడినంత వేగంగా ఇరవై నాలుగు పున్నములు గిర్రున తిరిగిపోయాయి.
ఓరోజు నేను ఆఫీస్‌నుండి వచ్చానో లేదో మా చిన్నాన్న కొడుకు ఫోన్‌ చేశాడు.
“నాన్న చనిపోయాడు!” అని చెప్పాడు.
నేను వెంటనే నాకూ, నా భార్యకు ఆన్‌లైన్‌లో తత్కాల్‌ టిక్కెట్స్‌ బుక్‌ చేశాను. తెల్లవారి ఏడు గంటలకల్లా బోడుప్పల్‌లోని చిన్నాన్న వాళ్ల ఇంటికి చేరాం. ఇంటికి పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఔటర్‌ రింగ్‌రోడ్డును ఆనుకొని కొత్తగా వెలుస్తున్న కాలనీల మధ్యనున్న ఓ శ్మశానవాటికలో చిన్నాన్నకు దహన సంస్కారాలు నిర్వహించాం.
పదో రోజున చిన్నకర్మ. బూడిద ఎత్తి పోయించిన తరువాత తంతులన్నీ పూర్తి చేసిన అయ్యవారు..
“చనిపోయినాయనకు ఇష్టమైన పదార్థాలన్నీ తెచ్చి పిండాలు పెట్టినంక, పాలోల్లంతా దండాలు పెట్టి పక్కకు తప్పుకోండ్రి” అన్నాడు.
అతను చెప్పినట్టే చేసిన మేమంతా ఎక్కడ కాస్త నీడ కనిపిస్తే అక్కడికెళ్లి నిలబడి, కాకులకోసం ఎదురు చూడసాగాం. గంట, రెండు గంటలపాటు ఎదురుచూసినా మచ్చుక్కూడా ఒక్క కాకి కనబడితే ఒట్టు. అవి కనబడక మేమేడుస్తుంటే మధ్యమధ్యలో పిండాలమీదికి కుక్కలు, పందులు దూసుకొస్తుంటే, వాటిని తరమలేక చచ్చిపోయాం.
చూసీ చూసీ విసుగొచ్చిన అయ్యవారు.. “ఈ హైద్రాబాద్‌ కాకులన్నీ తూడ్చిపెట్టుకొని పోయాయి. ఒకవేళ ఒకటీ, అరా ఉన్నా ఈ ఇండ్ల మధ్యకొచ్చి పిండాలు ముట్టడానికి ధైర్యం చెయ్యడం లేదు. ఇంతసేపు మీ తృప్తికోసం నేనూ ఎదురు చూశాను. కానీ, ఇక లాభం లేదు. ఆ పిండాలను తీసుకుపోయి, దూరంగా ఎక్కడన్నా నీళ్లుంటే అందులో కలిపి రాండి” అంటూ మొహమాటం లేకుండా చెప్పాడు.
‘ఇప్పుడు నీళ్లను వెతుక్కొంటూ ఎంతదూరం పోవాలో?’ అనుకోసాగాం.
ఇంతలో.. ఇద్దరు వ్యక్తులు రాజ్‌దూత్‌ బండిమీద వస్తూ కనిపించారు. వాళ్లను చూడ్డంతోనే.. “హమ్మయ్యా! రెండు గంటల్నుండి కాకులకోసం ఎదురుచూస్తున్న మన కష్టాలు తీరిపొయ్యాయిలే!” గట్టిగా ఊపిరి తీసుకొంటూ అన్నాడు అయ్యవారు.

శిరంశెట్టి కాంతారావు
శిరంశెట్టి కాంతారావు స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. పిచ్చమ్మ-అనంతయ్య దంపతులకు 25 జూలై 1958న జన్మించారు. బి.ఎ. పూర్తయ్యాక ఎల్‌.ఎల్‌.బి చదివారు. ఖమ్మం జిల్లా పాల్వంచలోని ఎన్‌.ఎం.డి.సి. సంస్థకు చెందిన ఎస్‌.ఐ.ఐ.ఎల్‌ యూనిట్‌లో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా పనిచేసి, 2018లో ఉద్యోగ విరమణ పొందారు. సాహిత్యాభిలాషతో 2003నుండి కథలు రాయడం మొదలుపెట్టారు. వీరు రాసిన 300లకు పైగా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటిలోని 60కి పైగా కథలు, వివిధ సాహితీ సంస్థలనుండి పురస్కారాలు అందుకొన్నాయి. ‘కంచిమేకలు’, ‘మట్టితాళ్ల వల’, ‘ఊతకర్రలు’, ‘చొరబాటు’, ‘మా ఫణిగిరి గుట్టకథలు’, జంగ్‌ (హిందీ) పేరుతో కథా సంపుటాలను వెలువరించారు. ‘ఆకుపచ్చ విధ్వంసం’, ‘వ్యూహం’, ‘పూలకుండీలు’, ‘వాళ్లు గెలవాలి’, ‘పరంపర’ నవలలు రాశారు. ప్రతి నవలా ఏదో ఒక పురస్కారాన్ని అందుకొన్నది. తెలంగాణ సాహిత్య అకాడమీ మొట్టమొదటిసారిగా నిర్వహించిన నవలల పోటీలో వీరి ‘పరంపర’ నవలకు ‘ఉత్తమ నవల’ బహుమతి దక్కింది. తాను రాసిన మరికొన్ని వ్యాసాలతోపాటు యాత్రా కథనాలను సంకలనంగా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కాంతారావు.

- Advertisement -

-శిరంశెట్టి కాంతారావు, 98498 90322

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana