e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు ఈవారం కథ.. కొత్త వెలుగు

ఈవారం కథ.. కొత్త వెలుగు

గ్గున లేచి కూర్చున్నాడు శ్రీకాంత్‌. ఒళ్లంతా చెమటలు పట్టాయి. చుట్టూ చీకటిగా ఉంది. కాసేపు తాను ఎక్కడున్నాడో అర్థం కాలేదు. ‘నేను చనిపోయానా? ఇది నరకమా? నరకలోకం ఇంత చీకటిగా ఉంటుందా? అయినా నేను నరకానికి వచ్చేంత పాపాలేం చేశాను?’ ఇలా ఒకదాని వెనక ఒకటి ప్రశ్నల్లాంటి భయాలు శ్రీకాంత్‌ బుర్రలో తిరిగాయి.“మీనాన్న మనం చెప్పింది ఏదీ వినడు! ఇన్వర్టర్‌ పెట్టుకొనుంటే కనీసం రెండు ఫ్యాన్లు, రెండు లైట్లయినా పనిచేసేవి” భార్య శ్రావణి మాటలు వినిపించాయి.“సరేలేమ్మా.. ఇప్పుడంటే కరోనా అని డోర్లేసుకొని ఉంటున్నాం. మామూలుగా అయితే కరెంటు పోతే డోర్‌, విండోస్‌ కూడా తెరిచేవాళ్లం కదా!” కూతురు పావని మాటలూ వినిపించాయి.‘హమ్మయ్యా! బతికే ఉన్నా. కరెంటు పోయి గదంతా చీకటిగా ఉంది’ అనుకోవడంతో కాస్త ధైర్యం వచ్చింది శ్రీకాంత్‌కు.తలుపు దగ్గరకు పోయాడు.. తెరుద్దామని. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం గుర్తొచ్చి ఆ ప్రయత్నం మానుకొన్నాడు. వెనక్కి వచ్చి బెడ్‌పైన కూర్చున్నాడు. ఊపిరి ఆడనట్టుగా అనిపిస్తే మూతికున్న మాస్కు తీసి పక్కన పెట్టాడు. సెల్‌ఫోన్‌లో టైమ్‌ చూశాడు. మూడు గంటలు. మామూలుగా ఈ వేళలో కరెంటు పోదు. పోయినా నిమిషంలోపే వచ్చేస్తుంది. ‘ఎక్కడ ఏం తేడా జరిగిందో’ అనుకొన్నాడు.‘శ్రావణి మాట విని ఇన్వర్టర్‌ పెట్టుకొనుంటే బాగుండేది. ఇప్పుడు ఈ ఇబ్బంది ఉండేది కాదు. అయినా, ఇలాంటి రోజులు వస్తాయని మనం కలగన్నామా! నాయన అనేవాడు.. ‘కాలం ఎప్పుడూ ఇట్లే ఉంటుందని అనుకోవద్దు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిందంటే నువ్వనుకున్నవన్నీ తలకిందులై పోతాయి. అన్నిటికీ సిద్ధంగా ఉండాల’ అని.. కాలం ఇంతగా తలకిందులైపోయే సమయం వస్తుందని నాయన కూడా ఊహించి ఉండడు’ అని అనుకొన్నాడు. “ఆన్‌లైన్‌ క్లాసుందమ్మా! ల్యాప్‌టాప్‌లో చార్జింగ్‌ అయిపోయింది”.. మెల్లగా వినిపించాయి పావని మాటలు.

“నువ్వు కూడా మీ నాన్నలాగే.. ముందు జాగ్రత్తే ఉండదు కదా! కరెంటున్నప్పుడే ఫుల్‌చార్జింగ్‌ పెట్టుకొనుంటే ఏమి?” కూతురిపై కోప్పడింది శ్రావణి.తలుపులన్నీ వేసేసినా.. వాళ్ల మాటలు మెల్లగా శ్రీకాంత్‌ చెవుల్లో దూరుతున్నాయి. ‘నిజంగా నేను ముందుజాగ్రత్తలేని మనిషినా?’ తనలో తానే ప్రశ్నించుకొన్నాడు.నలభై ఏండ్లకే నగరంలో సొంత ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టి కూడా పదేండ్లు దాటింది. తన వయసు వాళ్లలో సొంత సంపాదనతో ఇల్లు కట్టుకున్న వారు చాలా తక్కువ. చదువు అయిపోగానే మంచి కంపెనీలో ఉద్యోగం రావడం, పెద్దగా బాధ్యతలేవీ లేకపోవడంతో.. ఖర్చులు తగ్గించుకొని, పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టాడు. పునాదులు వేయడానికి గుంతలు తవ్వినప్పటి నుంచీ దగ్గరుండి అన్నీ చూసుకొన్నాడు. మళ్లీ మళ్లీ కట్టేది కాదని, అన్నీ నాణ్యమైనవే వాడాడు. గృహప్రవేశం రోజు వచ్చిన బంధువులు, స్నేహితులు ఎంత ఆశ్చర్యపోయారని.. ఇంత శ్రద్ధగా, ముందు జాగ్రత్తగా ఇల్లు కట్టడం ఎవ్వరికీ సాధ్యంకాదన్నారు. ఆ మాటలు విని శ్రావణి ఎంతో మురిసిపోయింది. ‘తన భార్య ఎప్పుడూ తనను ఎదురించి మాట్లాడదు. విమర్శించదు. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతోంది?’ అనుకొన్నాడు శ్రీకాంత్‌.

- Advertisement -

శ్రీకాంత్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చి రెండురోజులైంది. పరీక్ష చేసిన వైద్యులు వైరస్‌ తక్కువ స్థాయిలో ఉన్నదని, హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడితే చాలని చెప్పారు. సరేనన్నాడు శ్రీకాంత్‌. వైద్యాధికారి, సిబ్బంది, మున్సిపాలిటీ వాళ్లు వచ్చి, ఇంటిని పరిశీలించారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇంట్లోని ఒకగదిని శ్రీకాంత్‌కు కేటాయించారు. ఇల్లంతా శానిటైజ్‌ చేశారు. శ్రీకాంత్‌ ఉండాల్సిన బెడ్‌రూమ్‌ను మరింత శుభ్రం చేశారు. మందుల కిట్‌ ఇచ్చి, రోజుకోసారైనా డాక్టర్‌ ఫోన్‌ చేసి మాట్లాడతారని ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు, కరోనా వచ్చిన వ్యక్తి పాటించాల్సిన జాగ్రత్తలన్నిటినీ వివరించి వెళ్లిపోయారు. రెండు రోజుల నుంచీ శ్రీకాంత్‌ గదికే పరిమితమయ్యాడు. కుటుంబ సభ్యుల్లో ఒకరు పొద్దున్నే టిఫిన్‌ తెచ్చి తలుపు అవతల పెట్టి, డోర్‌ను తట్టి వెళ్లిపోతారు. శబ్దం వచ్చిన రెండు నిమిషాలకు తలుపు తెరిచి, ఆహారాన్ని లోపలికి తీసుకొంటాడు. మధ్యాహ్నమూ అంతే! సాయంకాలం టీ ఇచ్చే సమయంలోనూ ఇదే పద్ధతి. ఎవ్వరినీ ఎవ్వరూ చూసే పరిస్థితిలేదు. ఏదైనా పనిబడి బయటూరెళ్లి ఒక్కరోజు ఉండాల్సి వస్తేనే చాలా ఇబ్బంది పడిపోయేవాడు. ఒక్కరోజు కూడా భార్యను, కూతురిని చూడకుండా ఉండలేనని అనుకొనేవాడు. ‘ఎప్పుడెప్పుడు ఇంటికెళ్దామా’ అని మనసు కొట్టుకొనేది. ఇప్పుడు..? రెండు రోజులైంది. ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ భార్యను, కూతురిని చూసే యోగం లేదు. వాళ్లతో కలిసి భోంచేసే అవకాశం లేదు. పొద్దున, సాయంకాలం బాల్కనీలో కూర్చొని కాఫీ, టీ తాగే పరిస్థితి లేదు.


ఫోన్లలో మాట్లాడుకోవచ్చు. ఒకే ఇంట్లో ఉండి గోడకు అటొకరు ఇటొకరు ఆనుకొని ఫోన్లో మాట్లాడటం అంటే ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది శ్రీకాంత్‌కు. అలా అని తలుపు తీసి హాల్లోకి పోయే ధైర్యం లేదు. తన ద్వారా భార్య, కూతురికీ వస్తే? తాను తట్టుకోగలడు. కానీ, వాళ్లిద్దరూ తట్టుకోలేరని భయపడుతున్నాడు.తనకు కరోనా ఎలా సోకింది? అనేది ఇప్పటికీ శ్రీకాంత్‌కు అంతుచిక్కని ప్రశ్నే. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. అయినా ఎలా సోకిందో అర్థం కావడం లేదు. ఆ కాలనీలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరికైనా కరోనా సోకింది. ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడినా కరోనా విషయాలే. కంటికి కనిపించని సూక్ష్మజీవి.. అందరి గుండెల్లో కొలువై భయపెడుతున్నది.

“ఇంట్లో కూరగాయలు అయిపోయినయ్‌. ఎన్నాళ్లు తింటాం ఈ పప్పుకూరలు. డాక్టర్లేమో ‘మంచి ఆహారం తీసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి’ అని చెబుతున్నారు. మంచి ఆహారం తయారు చేసుకోవాలంటే దానికి దినుసులు కావద్దా? ఎవరొస్తారు మనింటికి? కరోనా కదా.. అందరూ భయపడుతా ఉన్నారు”.. కూతురితో మాట్లాడుతున్నది శ్రావణి. కానీ, ఆ మాటలన్నీ తనను దెప్పిపొడిచేవేనని అర్థమయింది శ్రీకాంత్‌కు. శ్రావణిలో ఎందుకంత అసహనం.. ఇప్పుడంటే తాను ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఇంట్లో ఏం కావాలన్నా వెంటనే వెళ్లి తెచ్చేవాడు. కరోనా కేసులు పెరుగుతాయని తెలియగానే మూడు నెలలకు సరిపడా సరుకులు తెచ్చాడు. అవన్నీ అయిపోయాయి. కరోనా ఉధృతి పెరిగిందే కానీ తగ్గలేదు. తన తప్పేమిటో అర్థమయింది శ్రీకాంత్‌కు.


‘మార్కెట్టుకు వెళ్లి కూరగాయలు, సరుకులు తెచ్చుకొనేలా శ్రావణికి అలవాటు చేసుంటే, ఇప్పుడీ సమస్య ఉండేది కాదేమో! బాగా చూసుకొంటున్నాననే భ్రమలో తనను పంజరంలోని చిలకలా తయారు చేశానేమో! ఏదైనా అవసరం అయితే వెంటనే బయటకు పోయేదారి లేదు. ఇంటికి వచ్చే మనిషి లేడు. కంటికి కనిపించని కరోనా.. మనుషులను శారీరకంగానే కాదు, మానసికంగానూ హింసపెడుతున్నది’ అనుకొన్నాడు. ఇంతలో కరెంటు రావడంతో గదిలో ఫ్యాను తిరగడం మొదలుపెట్టింది. లైటు వెలిగింది. మామూలుగా శ్రీకాంత్‌కు లైటు ఉంటే నిద్ర రాదు. చీకటిగా ఉంటేనే నిద్రపోతాడు. ఇప్పుడు లైటు వెలగకపోతే ఒంటరితనం ఫీలింగ్‌ ఎక్కువ అనిపిస్తుందని.. 24 గంటలూ లైటు వేసే ఉంచుకొంటున్నాడు. ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకొన్నాడు. రెండు రోజులకే చాలా మారిపోయాడు. ముఖంలో దిగులు స్పష్టంగా కనిపిస్తా ఉంది. వయసు పైబడ్డ వాడిలా ఉన్నాడు. ధైర్యంగా ఉండేదానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. ఎక్కడో భయం చిన్నగా మొదలై మొత్తాన్ని ఆక్రమించేస్తున్నది.శ్రీకాంత్‌కు మిత్రుడు సురేష్‌ గుర్తొచ్చాడు. అతనికీ కరోనా వచ్చిందని తెలిసింది. నిన్ననే ప్రైవేటు కొవిడ్‌ సెంటర్‌లో చేరాడట. అతను చాలా ధనవంతుడు. ఎంతో పలుకుబడి ఉన్నవాడు. అటువంటి వాడికి కూడా కరోనా వచ్చింది. ఎలా ఉన్నాడో ఒకసారి పలకరిస్తే బాగుండుననిపించింది. వెంటనే చేతిలోకి ఫోన్‌ తీసుకున్నాడు.

కుర్చీలో కూర్చుని కిటికీలోంచి చూస్తున్నాడు సురేష్‌. నీలాకాశాన్ని నింపుకొన్న నదిపై సూర్యకిరణాలు పడుతుంటే అలలు మెరుపుల్లా కదులుతున్నాయి. నదిలో టూరిజం వాళ్ల బోట్లు రెండూ నీటిని చీల్చుకొంటూ పర్యాటకులతో చక్కర్లు కొడుతున్నాయి. ఒడ్డున పచ్చని చెట్లు కాపలా కంచెలా ఉన్నాయి. ఆకతాయి ఎవడో రాయి విసిరినట్టున్నాడు.. చెట్టుపైన గుంపుగా విశ్రాంతి తీసుకొంటున్న పక్షులు ఒక్కసారిగా పైకి లేచాయి. నది వంతెనపై వాహనాలు అటూ ఇటు వేగంగా సాగుతున్నాయి. ఫుట్‌పాత్‌ మీద మనుషులు నడుస్తూ.. నది అందాలను కండ్లతో జుర్రుకొంటున్నారు. కిటికీలోంచి పక్షి ఒకటి టకీమని లోనికి దూరింది.


ఉలికిపాటుగా తల విదిలించాడు సురేష్‌. అప్పటి వరకూ మనసు చూపించే దృశ్యాలన్నీ మాయమై.. కండ్లకెదురుగా పెద్ద గోడ స్పష్టంగా కనిపించింది. ఆ గోడకున్న అద్దాల్లో ఏవో అస్పష్టపు నీడలు. కరోనా పాజిటివ్‌ రావడంతో నిన్నటి నుంచీ ఆ గదిలోనే ఉన్నాడు. ప్రైవేటు హాస్పిటల్‌ నిర్వహిస్తున్న కొవిడ్‌-19 సెంటర్‌ అది. మూడంతస్తుల భవనం. కుర్చీలోంచి లేచి కిటికీ వద్దకు వెళ్లి తల బయటకు పెట్టి చూశాడు. కనిపించేంత దూరమూ గోడలు తప్ప మరేమీ లేవు. కుర్చీని దగ్గరకు లాక్కొని, దానిపైకి ఎక్కి చూశాడు. ఎటు చూసినా గోడలు గోడలు గోడలు.. మనిషి జాడ కనిపించలేదు. పక్షి అరుపూ వినిపించలేదు. వెలుగు తప్ప.. వేడి సూర్య కిరణమూ లేదు.“ఛ..” అంటూ తల విదిలిస్తూ వచ్చి బెడ్‌పైన కూర్చున్నాడు. చేతులు వెనక్కి పెట్టి, వెనక్కి వాలి కండ్లు మూసుకొన్నాడు. జ్ఞాపకాల మెదడు తుట్టె కదిలింది. ఏవేవో గుర్తొస్తున్నాయి.


నగరంలో నాలుగు భవనాలు, పది ఫ్లాట్‌లు, పది ఇండ్ల స్థలాలు.. వేర్వేరు చోట్ల యాభై ఎకరాల పొలాలు ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటిగా సురేష్‌ కండ్ల ముందుకు వచ్చి పోతున్నాయి.సురేష్‌.. నగరంలో పేరుమోసిన బిల్డర్‌. ప్రస్తుతం చికిత్సకోసం ఉన్న ఆ భవనంతోపాటు చుట్టుపక్కల చాలా భవనాలు, అపార్ట్‌మెంట్లు తను కట్టించినవే. ధనదాహం ఎప్పుడు మొదలైందో తెలీదు కానీ, ఇంకా ఇంకా అంటూ.. బ్యాంకు బీరువాలో నోట్లకట్టలు పేర్చినట్టు, నగరంలో నిర్మాణాలు చేశాడు. సంపాదనే ధ్యేయంగా ఎన్ని రకాల మోసాలు చేశాడో, ఎవరెవరిని ఏమార్చాడో తనకు మాత్రమే తెలుసు. చాలా సందర్భాల్లో తాము మోసపోయామనే విషయం కూడా ఎదుటివారికి తెలీదు. అంత తెలివిగా ఏమార్చాడు. ఎంత కూడబెట్టాడో తనకు, భార్య అరుణకు తప్ప మూడోకంటికి తెలీదు.ఫోన్‌ రింగయింది.. చూస్తే బాల్యమిత్రుడు శ్రీకాంత్‌. సురేష్‌ పెదాలపై చిరునవ్వు. ఆపదలో ఆదుకొనే మనిషి ఎదురైన ఆనందం. ఫోన్‌ లిఫ్ట్‌ చేసి.. “హలో!” అన్నాడు. గొంతులో సన్నటి వణుకు. బహుశా భయం కావచ్చు.
“ఎలా ఉన్నావ్‌.. గొంతు తేడాగా ఉందే!”
“ఏం లేదు.. మామూలుగానే ఉన్నా” సర్దుకొంటూ మాట్లాడాడు.
“కరోనా అంట కదా? నాక్కూడా”
“ఓ.. ఔనా! ఎక్కడున్నావు?”
“ఇంట్లోనే.. నువ్వు పూర్ణా ప్యాలెస్‌లో ఉన్నావట కదా!”
“అవును..” అంటూనే ఒక్కపెట్టున వెక్కిళ్లు పెట్టి ఏడ్చేశాడు సురేష్‌.
“ఏమయిందిరా? సూరి ఏమయింది..” కంగారుగా అడిగాడు శ్రీకాంత్‌.
ఇద్దరూ బాల్యమిత్రులు కావడంతో ఒకరినొకరు ‘ఒరే’ అనే పిల్చుకొనేవారు. సురేష్‌ను ‘సూరి’ అని పిలిచేవాడు. ఏళ్లు గడిచేకొద్దీ.. దారులు వేరై సురేష్‌ పెద్ద ఆస్తిపరుడయ్యాక ఆ పిలుపులు పోయాయి. సురేష్‌ దీనిని ఎప్పుడో గమనించాడు. నిజానికి అతనికికూడా ‘ఒరే’ అని పిలిపించుకోవడం ఇష్టంలేదు. ఇప్పుడు ఆ ఒరే మిత్రుడి ముందే గట్టుతెగిన చెరువు అయిపోయాడు.
దాదాపు నిమిషంపాటు అటువైపు నుంచి శ్రీకాంత్‌ ఏమీ మాట్లాడలేదు. అప్పటికి సురేష్‌ కాస్త తేరుకొన్నాడు.


“సారీ రా..” అన్నాడు కండ్లు తుడుచుకొంటూ. అటూ ఇటు చూశాడు.. తను ఏడ్చింది ఎవరైనా చూశారేమోనని. అది నాలుగ్గోడల గది. తను తప్ప ఎవ్వరూ లేరనే విషయం గుర్తొచ్చింది.
“ఎందుకు ఏడ్చావు. కరోనా వచ్చినందుకు భయపడ్డావా?” అడిగాడు శ్రీకాంత్‌. అప్పటి వరకూ శ్రీకాంత్‌ను కొంచెంగా వెంటాడుతున్న భయం మిత్రుడి ఏడుపుతో పూర్తిగా పోయింది.
“కరోనాకు భయపడని వారు ఎవరు?” ఎదురు ప్రశ్న వేశాడు సురేష్‌.
“భయమెందుకురా? ఎంతమంది కోలుకోలేదు? చనిపోయినవాళ్లు తక్కువ. నీకేం, ఆరోగ్యంగా ఉన్నావు. రోజూ ఎక్సర్‌సైజ్‌ చేస్తావు. ఆరోగ్య సమస్యల్లేవు. మంచి వైద్యం, ఆహారం తీసుకొంటున్నావు. ఏం కాదులే! భయపడొద్దు” ధైర్యం చెప్పాడు శ్రీకాంత్‌.
“నేను భయపడింది అందుకు కాదురా.. నిన్న విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది కదా! నిన్ననే నేను ఇక్కడికి వచ్చా. టీవీలో ఆ మంటలు చూసి భయమేసింది. ఈ ప్యాలెస్‌ కూడా మంటల్లో చిక్కుకుంటే?” అంటూ ఆపేశాడు. గొంతునుంచి మాటలు పెగల్లేదు.
“ఎందుకు అంత భయపడతావు. ఏమవుతుంది.. మహా అయితే ప్రాణం పోతుంది అంతే! ఏడుతరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి సంపాదించావు. ఎందుకు బాధ, భయం. మనమైనా ఇంకెంత కాలం బతుకుతాం”
“నీకు తెలీదురా.. అరుణ పిచ్చిదై పోయింది”
“పిచ్చిదా!” ఆశ్చర్యంగా అటువైపు నుంచి గట్టిగా అరిచినట్టు అన్నాడు శ్రీకాంత్‌.
“పిచ్చి అంటే పిచ్చి అని కాదు.. వారం నుంచి ఇంట్లో ఉండే బంగారు నగలన్నీ వేసుకొని తిరుగుతా ఉంది. ఎందుకే అంటే వినదు. ‘కరోనా వచ్చి సచ్చిపోతే మళ్ల పెట్టుకోలేము కదా!’ అంటుంది. ఎవరికైనా ఈ విషయం చెప్పుకోవాలన్నా సిగ్గుగా ఉంది. డాక్టర్‌కు చూపించాలన్నా అవమానంగా అనిపిస్తా ఉంది”
“ఆ నగలు కొనిండేది వేసుకొనేదానికే కదా.. వేసుకోనీలే!”
“దేనికైనా సమయం సందర్భం ఉంటాయి. ఇంట్లో ఇప్పుడు ఒంటినిండా నగలు వేసుకోని తిరిగే కాలమా ఇది?”
“అరుణకు కాదురా పిచ్చి.. నీకు. ఇన్నాళ్లు నీతో అనలేదు కానీ, ఎందుకురా నీకు డబ్బంటే అంత పిచ్చి. ఇప్పుడేం చేసుకుంటావు ఉండే ఆస్తి అంతా! ఎత్తుకొని పోతావా?”
“అదేరా ఇప్పుడు నా భయం. అక్కడ ఫైర్‌ యాక్సిడెంట్‌ చూడగానే చాలా భయం వేసింది. నేను చనిపోతే.. నా ఆస్తుల వివరాలన్నీ అరుణకు మాత్రమే తెలుసు. పిల్లలకు ఎవ్వరికీ చెప్పలా! ఇప్పుడు తనేమో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తా ఉంది. పిల్లలు ఇంకా సెటిల్‌ కాలా.. అవన్నీ గుర్తొచ్చి విపరీతమైన భయం వేసింది”
“పిల్లలను ఏ రోజైనా వాళ్ల కాళ్లతో వాళ్లను నడవనిచ్చావా? వాళ్ల గురించి ఇప్పుడు దిగులు పడితే ఎలా? భయముంటే హోం ఐసొలేషన్‌లో ఉండు.. గోడలు మాత్రమే అడ్డం. ఒకేచోట ఉన్నామనే ఫీలింగ్‌ ఉంటుంది”
“ఇంట్లో వాళ్లకు అంటుకుంటే.. అందరం ఏమైనా అయిపోతే?”
“ఏమయితాదిరా! ఈ లోకం.. మనం ఈ లోకంలోకి రాకముందూ ఉంది. మనం విడిచిపోయాక కూడా ఉంటుంది. ఎప్పుడూ తీసుకొనే బుద్ధే కానీ ఇచ్చే బుద్ధి లేదురా నీకు.. అందుకే అంత భయం”
మాట్లాడుతున్నది ఫోన్‌లోనే అయినా..
‘అవును’ అన్నట్టుగా తలూపాడు సురేష్‌. తిరిగి శ్రీకాంత్‌ మాట్లాడాడు.
“మన కండ్లముందే ఈ మూడు నెలల్లో మన మిత్రులు, బంధువులు ఎంతమంది చనిపోలా? మరణాన్ని నెత్తిన పెట్టుకొని పుట్టినోళ్లం. అది ఎప్పుడు మనలను నేలలోకి తొక్కేస్తుందో తెలీదు. జీవితంలో అన్నీ అనుభవించావు. ఎందుకురా మరణమంటే భయం. ఇప్పటికైనా ఉండేదాంట్లో ఎవరికైనా సాయం చేయరా”
సురేష్‌ ఏమీ మాట్లాడలేదు. మిత్రుడు చెప్పేది మౌనంగా వింటున్నాడు. భయం ఏ ద్వారాలు తెరుచుకొని ఎప్పుడు తన గుండెలో మెల్లగా తిష్ట వేసిందో కొంచెం కొంచెమే అర్థమవుతున్నది.
“నీకుండే డబ్బుకు.. ఒక వందమంది పేద పిల్లలను చదివించొచ్చు. వంద కుటుంబాలకు ఉపాధి కల్పించొచ్చు. మారుమూల పల్లెలకు రోడ్లు వేయించొచ్చు. ఆసుపత్రులు, స్కూళ్లు కట్టించొచ్చు. అనుకోవాలే కానీ.. ఎన్నో చేయొచ్చు. ఇచ్చేది అలవాటు చేసుకుంటే, ఉండేది పోతుందనే భయమూ ఉండదు. ‘మనం చనిపోతే ఎలా?’ అనే దిగులూ ఉండదు” అన్నాడు శ్రీకాంత్‌.
అప్పటికి కాస్త తేరుకొన్నాడు సురేష్‌.
“ఆలోచిస్తారా.. ఏదైనా చేయాల. బంగారు గిన్నెలో తింటే ఒక్కడి ఆకలే తీరుతుంది. అదే బంగారు గిన్నెను అమ్మేసి తింటే కనీసం పదివేలమంది ఆకలి తీరుతుంది. సరే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? శ్రావణి, పాప ఎలా ఉన్నారు?” మాట్లాడుతూ వెళ్లి కిటికీ ఎదురుగా నిల్చున్నాడు. ఎదురుగా గోడపైన నీలిరంగు బుల్లిపిట్ట ఒకటి వచ్చి వాలింది. దాన్ని చూస్తే సురేష్‌కు ఎందుకో ఆత్మీయున్ని చూసినంత ఆనందమేసింది.
“అందరం బాగున్నాం.. డాక్టర్‌ మెడిసిన్‌ ఇచ్చారు. వాడుతున్నా”
“నువ్వుకూడా ఇక్కడికి వచ్చెయ్‌రా. ఇద్దరం నా రూములోనే ఉందాం” మిత్రుడిని ఆహ్వానించాడు సురేశ్‌.
“లేదులేరా.. అక్కడ డబ్బు మరీ ఎక్కువ. ఇంట్లోనే ఉంటా. జాగ్రత్తగా ఉంటే చాలు”
“డబ్బు నేను పెట్టుకుంటాలే! వచ్చెయ్‌.. ఇద్దరం మాటలు చెప్పుకొంటూ, పేకాడుకొంటూ కాలేజ్‌ డేస్‌లా హ్యాపీగా కరోనా డేస్‌ గడిపేద్దాం”
“సారీ సురేష్‌.. నేను ఇంట్లోనే ఉంటా. ఎవ్వరు ఖర్చుపెట్టినా డబ్బు డబ్బే కదా! నాకు కరోనా మైల్డ్‌గానే అటాక్‌ అయింది. భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్‌. నువ్వు జాగ్రత్త.. దిగులేమీ పెట్టుకోవద్దు. నేను చెప్పింది అలోచించు.. ఉంటా” అని ఫోన్‌ పెట్టేశాడు శ్రీకాంత్‌.
కాసేపు ఫోన్‌నే చూస్తూ ఉండిపోయాడు సురేష్‌. ఇక్కడ పది రోజులకు కనీసం పది లక్షలైనా ఖర్చవుతుంది. అది తనదృష్టిలో చిన్నమొత్తం. ఇంట్లో ఉండి పదివేల రూపాయల మందులతో బాగైపోయేదానికి పది లక్షలు ఖర్చు చేయడమంటే దుబారానే కదా? ఈ అదనపు డబ్బంతా ఎవరికి చేరుతుంది? ఈ డబ్బు చేరే వాళ్లంతా తనలాంటి ఆశపోతులే అయి ఉంటారనుకొన్నాడు సురేష్‌.
ఫోన్‌ మోగింది. సర్వీస్‌ బాయ్‌. కాఫీ ఫ్లాస్క్‌ బయట పెట్టానని చెప్పాడు. సురేష్‌ వెళ్లి బయటున్న ఫ్లాస్క్‌ను తెచ్చి టేబుల్‌మీద పెట్టాడు. గాజు గ్లాసులో కాఫీ ఒంపుకొని, చక్కెర కొద్దిగా వేసుకొని రెండు సిప్పులు తాగాడు. పేరుకే కాఫీ. అందులో ఏమీ లేదు. ఘుమఘుమలాడే కాఫీ పెట్టే వంట
మనిషి శివమ్మ గుర్తొచ్చింది సురేష్‌కు.
శివమ్మ వంటలు అద్భుతంగా చేస్తుంది. ఇంటి పనులన్నీ చాలా శ్రద్ధగా చేస్తుంది. ఆమెకు కూడా కరోనా వచ్చి నాలుగురోజులైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. దానికి ముందు పదిరోజులుగా భర్తకు ఆరోగ్యం బాగలేదని, పనికి రాలేదు. భర్తను ఆసుపత్రికి తీసుకుపోయి చూపించడం, మందుల కోసం తిరగడంలో ఆమెకూ కరోనా వచ్చింది. పనికి రావడం లేదనే కోపంతో, శివమ్మకు కరోనా వచ్చిందని తెలిసినా ఫోన్‌ చేసి మాట్లాడలేదు సురేష్‌ దంపతులు. ఆమెపట్ల నిర్లక్ష్యాన్ని తలచుకొంటే చిన్నతనంగా అనిపించింది. ‘ఒకసారి మాట్లాడాలి’ అనుకొంటూ ఫోన్‌ తీసుకున్నాడు.

బెడ్‌పై పద్మాసనం వేసుకొని కూర్చుని ఉంది శివమ్మ. ఆమె ముఖానికి మాస్క్‌ ఉంది. చేతులకు గ్లవ్స్‌ ఉన్నాయి. గదిలో పది బెడ్లున్నాయి. అన్నిటిలో కరోనా పేషెంట్లున్నారు. ఇద్దరు మాత్రం పడుకొని నిద్రపోతున్నారు. మిగిలిన వారంతా పక్కనుండే వాళ్లతో పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. తమ బతుకుల్లోని కష్టనష్టాలను పంచుకొంటున్నారు. అందరి ముఖాల్లో భయం ఉన్నా, నలుగురికి నయమైంది.. తమకూ నయమవుతుందనే ధైర్యమూ కనిపిస్తున్నది.
ఆ గదిలో పదిమందికి కలిపి ఒకే బాత్‌రూమ్‌ ఉంది. ఒక్కటే టాయ్‌లెట్‌ ఉంది. రాత్రి పదిగంటలు దాటితే నీళ్లుండవు. తాగే నీళ్లు కూడా పొద్దున్నే కేవలం రెండు లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. రోజంతా ఆ రెండులీటర్ల నీళ్లే. రాత్రి 8 గంటలకు భోజనం ఇచ్చేసి, ఆసుపత్రి మెయిన్‌గేటు తాళం వేసుకొని వెళ్లిపోతారు. డ్యూటీ డాక్టరుండడు. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అనిపించినా వచ్చి చూసేవాళ్లుండరు. ఈ విషయాలన్నీ మాట్లాడుకొంటూ ఉన్నారంతా. కొందరిలో అసహనం ఎక్కువై ప్రభుత్వాన్ని, వైద్యులను, అధికారులను, ప్రజాప్రతినిధులను తిడుతున్నారు.
“ఏదోలే! టయానికింత పెడతాండారు. పడుకొనేదానికి మంచముండాది. కప్పుకొనేదానికి దుప్పటుండాది. ఒగరా ఇద్దరా.. వేలమంది కదా! అందరికీ చూడాలంటే అయితాదా? మన ఇండ్లల్లో నలుగురుంటేనే మనం సమాళించుకోలేమే.. ఇంతమందికి అన్నీ సక్రమంగా చేయాలంటే అయితాదా?” అంది శివమ్మ.
అప్పుడే శివమ్మ ఫోన్‌ రింగయింది. అది ఎప్పటిదో కీప్యాడ్‌ ఫోన్‌. డిస్‌ప్లే కూడా సరిగా ఉండదు. ఆన్‌ బటన్‌ నొక్కి చెవి దగ్గర పెట్టుకొని..
“హలో” అన్నది.
“బాగుండావా శివమ్మా..” అటువైపు నుంచి సురేష్‌. అతని గొంతులో అభిమానం.
గొంతును ఒక్క క్షణంలో పోల్చుకొన్నది..
ఆశ్చర్యంగా “బాగుండాను సార్‌. మీరెలా ఉండారు?” అని అడిగింది.
“నీకు కరోనా వచ్చి నాలుగురోజులైనా పలకరించలేదు. సారీ శివమ్మా..”
“అయ్యో.. ఏముందిలే సార్‌. ఇప్పడు మాట్లాడినారు.. అదే పదివేలు. అయినా కరోనాదేముండాదిలే సార్‌. పెద్ద జొరం అంతే! పద్దినాలు ఆస్పత్రిలో ఉండి ఇంటికి పొయ్యేదే కదా!” అంది శివమ్మ చాలా తేలిగ్గా.
“నీకేం భయం వేయలేదా శివమ్మా..”
“ఎందుకు సార్‌ భయం. మాకేమన్నా మీ మాదిర్తో మేడలు మిద్దెలు ఉండాయా? నగా నట్రా ఉండాయా? కట్టపడుకుంటాం. తింటాం.. ఈ భూమ్మీద నూకలు ఎన్నిరోజులు రాసిపెట్టింటే అన్ని రోజులుంటాం. తీరిపోయిన్నాడు మట్టిలో కలిసిపోతాం. దానికెందుకు సార్‌ భయం” ఎదురు ప్రశ్న వేసింది శివమ్మ.
అటువైపు నుంచి సురేష్‌ మాట్లాడలేదు.
“ఏం సార్‌.. మీరెలా ఉండారు? మేడమ్‌ బాగుందా? పిల్లలు బాగుండారా?”
“మేం బాగున్నాం. ఏమైనా సాయం కావాలంటే చెప్పు. ఇంటికి మీ పాపను పంపించు”
“ఏమొద్దులే సార్‌.. ముందు మేడమ్‌కు చూపించండి. డబ్బు అవసరమై పాపను మొన్న పంపిన్నా మీ ఇంటికాడికి.. మేడమ్‌ ఒళ్లంతా నగలు దిగేసుకోని అమ్మోరు మాదిర్తో ఇళ్లంతా తిరగతా ఉన్నిందంట! మా పాప చూసి భయపడి, గడపకాన్నింటి ఇట్లే వచ్చేసింది”
“మీక్కూడా తెలిసిపోయిందా? నాక్కూడా కరోనా వచ్చింది శివమ్మా! నీ అంత ధైర్యం లేదు నాకు” అన్నాడు సురేష్‌ నిజాయితీగా.
“మీకు ధైర్యం ఉండదు సార్‌.. మీరేమనుకోనంటే ఒగమాట చెప్తా.. మీకు లేంది మాకుండేది అదే! కట్టపడుకుంటాం.. ఎవరినీ మోసం చేసి సంపాదించాలనుకోం.. ఉన్నంతలో ఎవరైనా అడిగితే సాయం చేస్తాం. ఉంటే కడుపు నిండా తింటాం. లేదంటే కడుపు నిండా నీళ్లు తాగైనా పడుకొంటాం. ఏదైనా ఒగటే! అందుకే మాకు ధైర్యం ఎక్కువ” అంది శివమ్మ.
“నాకు మాత్రం ఈ రోజు పొద్దున దాకా చాలా భయంగా ఉన్నింది శివమ్మా! అసలు రేపటి సూర్యోదయాన్ని చూస్తానో చూడనో అనుకొన్నా. ఇంతకుముందే మా ఫ్రెండ్‌ శ్రీకాంత్‌ ఫోన్‌ చేశాడు. వాడితో మాట్లాడాక కాస్త ధైర్యం వచ్చింది. ఇప్పుడు నీతో మాట్లాడాక ధైర్యం ఇంకా పెరిగింది. ఖచ్చితంగా రేపటి సూర్యోదయాన్ని చూస్తాను” ఉద్విగ్నంగా అన్నాడు సురేష్‌.
“పొద్దు పుట్టకముందే నిద్ర లేచి బయటొస్తే సూర్యోదయాన్ని ఎందుకు చూడం సార్‌?” అంటూ అమాయకంగా ప్రశ్నించింది శివమ్మ.
“నిజమే శివమ్మా! ఇన్నాళ్లూ నిద్రపోయాను. ఇప్పుడైనా సూర్యోదయం కోసం అందరితోపాటు పొద్దున్నే నిద్రలేస్తా” అన్నాడు సురేష్‌.
ఎంత ఎక్కువ పనిచేసినా ఏ రోజూ జీతానికి మించి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వని విషయం గుర్తొచ్చి..
“మీలాంటోళ్లు మేలుకొంటే లోకం బాగుపడుతాది.. ఆరోగ్యం జాగ్రత్త సార్‌..” అంది శివమ్మ.
అప్పటివరకూ ఉన్న మబ్బులు పక్కకు పోయినట్టున్నాయి. సూర్యకిరణాలు అటువైపు గోడకున్న అద్దాలపైన పడి, కిటికీలోంచి గదిలోకి ఏటవాలుగా ప్రసరిస్తున్నాయి. సురేష్‌ మనసుతో పాటు గదంతా కొత్త వెలుగు పరచుకొన్నది.

సుంకోజి దేవేంద్రాచారి
సుంకోజి దేవేంద్రాచారి స్వస్థలం చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం గుడ్రెడ్డిగారిపల్లె. తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, రెడ్డెప్పాచారి. 22 జూలై 1974న జన్మించారు. వృత్తిరీత్యా జర్నలిస్టు. ప్రవృత్తి సాహితీవ్యాసంగం. వీరి మొదటి కథ ‘బంగారు పంజరం’, 1997లో ‘వార్త’ దినపత్రికలో ప్రచురితమైంది. ఇప్పటి వరకూ 100కుపైగా కథలు, 100కుపైగా కవితలు, ఏడు నవలలు రాశారు. ‘అన్నంగుడ్డ’, ‘దృశ్యాలు మూడు.. ఒక ఆవిష్కరణ’, ‘ఒక మేఘం కథ’ పేరుతో కథా సంపుటాలు, ‘నీరు నేల మనిషి’, ‘రెక్కాడినంతకాలం’ పేరుతో నవలలు, గ్రామీణ క్రీడలపై రాసిన కథనాలతో ‘మనమంచి ఆటలు’ పుస్తకాన్ని వెలువరించారు. వీరి సాహిత్య సేవకుగానూ భారతీయ భాషా పరిషత్‌ (కలకత్తా), పెద్దిభొట్ల సుబ్బరామయ్య స్ఫూర్తి పురస్కారం, డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు సాహితీపురస్కారం, రంగినేని ఎల్లమ్మ సాహితీ పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు అందుకొన్నారు. తానా, ఆటా, నాటా, పులికంటి సాహితీ సత్కృతి తదితర సంస్థలు, పలు పత్రికలు నిర్వహించిన 20కిపైగా పోటీల్లో బహుమతులు అందుకొన్నారు. వీరి నవలలపై పలు యూనివర్సిటీల విద్యార్థులు పీహెచ్‌డీ చేస్తున్నారు.

  • సుంకోజి దేవేంద్రాచారి ,9949118082
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana