e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు ఈద్‌ కా చాంద్‌

ఈద్‌ కా చాంద్‌

ఈద్‌ కా చాంద్‌

“అమ్మీ.. ఛోటీ ఆగయి”
రోట్లో గోరింటాకు నూరుతున్న పనిని ఆపి అమ్మకూడా గుమ్మం తలుపువైపు చూసింది.
ఇంట్లో ఒక సెకనుకు ముందున్న స్థితికి భిన్నంగా, ఏదో ఒక కొత్త ఉత్సాహం వచ్చిన వారిలా ఇంట్లో వాళ్లంతా హాల్‌లోకి వచ్చేశారు. రాబోతున్న అథితికి స్వాగతం చెప్పడానికి!
ఆ పాప మొదటి అడుగు ఇంట్లోకి పెట్టగానే అందరూ ఒక్కసారే ముక్తకంఠంతో “హ్యాపీ బర్త్‌డే టూ యూ” అని చెప్పేశారు.
పాపం చిన్నపిల్ల.. తట్టుకోలేని సంతోషం! అందరిలోకి కరిగి, ఒదిగి పోయింది.
“అదేరా.. ‘ఈద్‌ కా చాంద్‌’ పడమరన ఎలా కనిపిస్తాడో? తారతమ్య భేదాలు లేకుండా అందరికోసం ఎలా వస్తాడో? ఛోటీకూడా అంతే, తప్పక వస్తుంది. ఈ వీధి అంతటా వీచే చల్లని గాలి తెమ్మెర అది”
“అంతొద్దులే! మరీ పైపైకి ఎత్తేస్తున్నావ్‌ దాన్ని”
“కుళ్లిన వాసనేదో వస్తోంది ఇంట్లో, కాస్త బైటికెల్లరా?”
“అమ్మీ! దాని ముందు నన్నంత చులకనగా తీసి పడేయకు”..
అనన్య గోరింటాకు సాకుతో ఆ ఇంటికి వచ్చింది. తన రాకను ఇంతలా స్వాగతించారని ఉబ్బి తబ్బిబ్బై పోయింది.
ఈ ఇంట్లో తనకు ప్రతి యేడూ జరిగే సత్కారం. తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌ పొద్దున్నే జరిపించేశారు. తాతయ్య, నానమ్మ, పిన్నమ్మలు, బాబాయిలు ఎంతగా ఆదరించారనీ..
“అబ్బ.. నువ్వంటే నాకెంతో ఈర్ష్య. ఒకేరోజు రెండు పుట్టినరోజు వేడుకలు నీకేనా” అన్నాడు ఖలీల్‌.
“అరేయ్‌.. అక్కను అలా అనవచ్చునా? తప్పు గదూ!” అని అందరూ కోప్పడ్డారు. ఎందుకంటే, ఆ రెండు కుటుంబాలకూ తను ఒక్కతే ఆడపిల్ల.
***
పరంధామయ్య.. పొద్దుటి కాఫీ, ఫలహారాలయ్యాక ఇంటిముందు పందిరికింద ఉన్న ఈజీ చైర్లో కూర్చొని, ఆలోచనల్లో మునిగిపోయాడు.
ఇది అతనికి మామూలే. ‘మా రెండు కుటుంబాల మధ్య స్థితిని ఏమైనా నివారించగలనా?’ అని ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. కానీ, దాన్ని ‘ఎలా మొదలెట్టాలి?’ అనే దగ్గరే ఆగి పోతుంటాడు. దీర్ఘాలోచనల్లో పరిష్కారం దొరక్క పోయినా నుదుటి చర్మం మీద ఇష్టమొచ్చినట్లు పిచ్చిగీతలు పెట్టేసుకుంటాడు. అవి పెద్ద తరహాకు నిషానీలుగా మిగిలి వున్నాయి. ఈరోజు తన మనవరాలి పుట్టినరోజు.
‘వాళ్లందరూ మా ఇంటికి రాకుండా ఉంటే..’ ఈ ఆలోచన రావడమే ఆయనకు మింగుడు పడటం లేదు. తానైతే.. రమ్మనమని ఆహ్వానం పంపాడు.
“తాతయ్యా!” అని గట్టిగా అరుస్తూ పరంధామయ్య ఆలోచనలను డిస్ట్రబ్‌ చేస్తూ, బైటినుంచి వస్తున్న మనవరాలు తన చేతులకు పెట్టించుకొన్న గోరింటాకు డిజైన్‌ను తన ముందు ప్రదర్శనకు పెట్టింది.
వాటిని చూడగానే, “బాగుంది.. బాగుంది” అన్నాడు పరంధామయ్య.
అనన్య తన పెద్ద కొడుకు కూతురు. ఇవాళ ఆ పాప పుట్టినరోజు. ఈ యేడాదే పదో తరగతి పాసైంది. ఎప్పుడు వెళ్లిందో ఏమో అక్కడికి.
పుట్టిన రోజనే కాదు. ఏ పండుగోచ్చినా, పబ్బమొచ్చినా ఆ ఇంటినుంచే ముస్తాబై రావడం తనకు అలవాటు.
ఆ విషయం తెలిసినా “ఎక్కడినుంచి ఈ ముస్తాబు?” అని అడిగాడు.
“అబ్బా.. తెలియనట్టే ఆరాలు. పీరు తాతయ్య వాళ్ల ఇంటినుంచే” అని చెవిలో గట్టిగా అరిచి ఇంట్లోకి వెళ్లింది అనన్య.
పీరు సాహెబు.. తనకు చాలా ఇష్టమైన పేరు. తన బాల్య స్నేహితుడు. వాళ్లిద్దరూ కలిసి పెరిగిన వాళ్లు. ఒకరికి తెలియని రహస్యాలు వేరొకరి దగ్గర దాగి లేవు. అంతటి ప్రాణమిత్రులు. పీరు సాహెబ్‌కు తాత, ముత్తాతల నుండి సంక్రమించిన ఆస్తి పిల్లల చదువులకు కర్పూరంలా హరించుకుపోయింది. రెక్కల కష్టానికి తోడు ఓ నాలుగు ఎకరాల భూమి మాత్రం మిగిలింది. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. తన మాట వినే, ముగ్గురు సంతానం తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకొన్నాడు. ఆ ఊళ్లోని ముస్లిం కుటుంబాల్లో ఈ పని చేసిన మొదటివాడు.. పీరు సాహెబ్‌.
తనతో పోటీ పడి మరీ పిల్లల్ని బాగా చదివించాడు. ముగ్గురి పెండ్లిళ్లూ చేశాడు.
ఊరివాళ్లంతా, “మీవి రెండు కుటుంబాలు కావు.. ఒకటే కుటుంబం” అంటుండేవారు. కానీ, ఎవరిదో దిష్టి తగిలింది. చెడు చూపు, చెడు ఆలోచనలు ఆ రెండు కుటుంబాలకూ చుట్టుకున్నాయి. ఏనాడూ తగువు పడలేదు. ఒకరినొకరు ఎదురుపడి మాటా, మాటా అనుకున్నదీ లేదు. అయినా, రెండు కుటుంబాలూ దూరమవుతున్నాయనే బాధను మాత్రం అనుభవిస్తున్నారు.
పరంధామయ్య పెద్ద కొడుకు బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొన్నాడు. అప్పటి నుంచే పెడసరంగా మాట్లాడటం, ముస్లిం సమాజాన్ని ద్వేషించడం నేర్చుకున్నాడు. ఈ విషయం పరంధామయ్యకు చాలాకాలం తర్వాత తెలిసింది.
“రాజకీయాలను కుటుంబాల్లోకి తేవద్దురా..” అనేవాడు కొడుకుతో. ఆ మాటలను కొడుకు చెవిన పెట్టలేదు.
దేశంలో ఎక్కడో, ఏదో మూల చిన్నచిన్న సంఘటనలు జరిగినప్పుడల్లా పక్కనున్న తన వాళ్లనే అనుమానంగా చూసేవాడు.
“ఏదో ఇన్సిడెంట్‌ జరిగితే అందరినీ దోషులు అనడం తప్పు..” అని చిన్నపిల్లల్లా వాదులాట పెట్టుకునేవాళ్లు తండ్రీ కొడుకులు.
“ప్రతి సంఘటనకూ మేమే శీలపరీక్ష నిర్ధారణ సర్టిఫికెట్‌ను చేత పట్టుకొని నిలబడటం అవమానంగా ఉంది” అని పీరు సాహెబ్‌ పిల్లలు బాధపడేవారు. బొక్కెనకు తాడుకు మధ్య బాయి గిలక రాపిడి ఆర్తరావం లాగ ఉండేవి ఆ స్వరాలు.
‘నిజమే కదూ!’ అనుకునేవాడు పరంధామయ్య.

కొడుకు మాత్రం తన పిల్లలను పీరు సాహెబ్‌ ఇంటివైపు వెళ్లకుండా కట్టడి చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.
ఆ ప్రయత్నానికి తండ్రి అడ్డు పడుతూనే వచ్చాడు. అందుకే, వారిని ఆపలేకపోయాడు. కానీ, ఇది ఎంతకాలం నిలుస్తుందో చూడాలి. ఏదేమైనా, ఓ రెండు మంచి లౌకిక కుటుంబాలు కనుమరుగై పోవడం ప్రారంభమైంది. ఈ విషయంపై కొడుకుతో అనేకసార్లు వాదించాడు కూడా.
“ఏ రాజైనా ఏ దేశం మీదైనా దండెత్తినప్పుడు సైన్యంతోనే వస్తాడు. ప్రజలను, పిల్లలను, కుటుంబాలను వెంట పెట్టుకొని దండెత్తి రాడు. దేశాన్ని జయించిన తర్వాత తన ప్రజల్ని తరలించడు. తన పాలనలోనే ప్రజలను ఆకట్టుకొంటూ విస్తరిస్తాడు. మొగలాయిలు కానీ, ఆంగ్లేయులు కానీ, చేసిందిదే. ఇందులో ఒకరు శత్రువులుగా, మరొకరు మిత్రులుగా ఎలా వుంటారు?”
“బ్రిటిష్‌వాళ్లు దేశాన్ని పాలించిన కాలమంతా దేశాన్ని పిప్పిచేసి, సంపదనంతా తరలించుకొని పోయారు. ముస్లింలు అలా కాదే! ఇక్కడే పుట్టి, ఇక్కడే కడతేరి పోయారు. దానికి దాఖలాలు కోకొల్లలు. అయినా, ఎవరిమీద శత్రుత్వం కలిగి వుండాలి? సంపదను కొల్లగొట్టుకొని పోయి దేశాన్ని పిప్పిగా చేసిన వాడిమీదనా? లేక ఇక్కడే పుట్టి ఇక్కడే కడతేరి పోయిన వాళ్లమీదనా? కష్టనష్టాలు, సుఖదుఃఖాలు పంచుకునే వాళ్లతోనా శత్రుత్వం? మన ప్రజలతోనేనా మన వైరం?”
“రాజుల సహజ లక్షణం రాజ్యాలు స్థాపించిన మేర తమ ఆలోచనల్ని, విశ్వాసాల్ని వ్యాపింపజేయడం. అందులో భాగమే ఇక్కడి ముస్లింలు, క్రిస్టియన్లు. వీళ్లు పరాయి దేశపు ప్రజలు కారు, ఇక్కడివారే! కడజాతి వారనీ, అంటరాని వారనీ ఇక్కడి సంస్కృతిలో హేళనకు, అవమానాలకు గురైన అణగారిన ప్రజలు, హీన ప్రజలే.. అసలైన మూలవాసులు. ఇక్కడి బహుజనులు”
“అప్పుడెప్పుడో జరిగిన దాన్ని కులమార్పిడి అంటావేమిటి? అప్పటి ఆత్మగౌరవ పరివర్తన తప్పెలా అవుతుంది?”
“నిరక్షరాస్యులు సరే! చదుకున్నవారూ ఈ ఆలోచనలను కలిగి ఉండటం.. రానున్న కాలంలో పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది”
ఇలా సాగేది.. కొడుకుతో పరంధామయ్య సంభాషణ. అనేకసార్లు చెప్పి చూసినా, కొడుకులో మాత్రం మార్పు రాలేదు.


- Advertisement -

అనన్య వాళ్ల నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఆయనకోసమే ఎదురుచూస్తూ కూర్చున్నది. రోజూ వచ్చే సమయానికంటే ఈరోజు ముందే వస్తాడని తనకు గట్టి నమ్మకం. గోరింటాకు పెట్టుకున్న రెండు చేతులూ శుభ్రంగా కడుక్కుంది. తెల్లటి ఒంటిఛాయపై ఎర్రటిరంగు గోరింటాకుతో చేతులు మెరిసి పోతున్నాయి. తనను ముద్దు పెట్టుకొనే నెపంతో, గోరింటతో పండిన రెండు చేతులనూ ముద్దు పెట్టుకోవడం నాన్నకు అలవాటు. ఈరోజూ అదే చేస్తాడని రెండు చేతులనూ కనిపించకుండా చున్నీ చాటునో, వీపు వెనకాలో దాచే ప్రయత్నాన్ని రిహార్సల్‌ చేస్తున్నది అనన్య. ఇదంతా గమనిస్తున్న అమ్మ..
“ఏమిటే.. రెండు చేతులనూ ఓణీలో చుట్టేస్తున్నావెందుకు?” అడిగింది.
దానికి అనన్య నవ్వి ఊరుకుంది. ‘ఏమీ లేదు లే’ అని మనసులోని మాట అమ్మతో చెప్పకుండా దాటేసింది.
ఇంట్లో అందరూ ఉన్నారు. ఇల్లంతా సందడి, సందడిగా ఉంది. అనన్య కొత్తబట్టలు తొడుక్కుంది. నాన్న రాగానే కేక్‌ కటింగ్‌. నాన్న దగ్గర గిఫ్ట్‌ అందుకోవాలని ఒకటే ఉబలాటం. ఈసారి పీరూ తాతవాళ్ల ఇంటినుంచి ఎవరూ రాలేదు. అదే వెలితిగా కనిపిస్తున్నది.
ఆ లోపం ఉన్నట్టు అందరి మనసుల్లోనూ ఏదో ఓ మూల ఉండే ఉంటుంది.
పరంధామయ్య ఇంట్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. మాటిమాటికీ “అందరూ వచ్చినట్లేనా..?!” అని జ్ఞాపకం చేస్తునట్టు కేకేస్తున్నాడు.
ఇంతలో ఇంటిముందు స్కూటర్‌ హారన్‌ మోగింది. చిన్న కొడుకు తుర్రున వెళ్లి గేటు తెరిచాడు. నాన్న స్కూటర్‌ దిగాక, హెల్మెట్‌ అందుకొని.. “నాన్న వచ్చాడోచ్‌..” అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు.
నాన్నకూడా నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తూ వస్తూనే, “పాపేది?” అని భార్యవైపు చూస్తూ అడిగాడు.
“కాస్త ఫ్రెష్‌ అవండి. పాప వస్తుంది లెండి” అందావిడ.
తుండుతో ముఖం, చేతులు తుడుచుకుంటూ ఉండగా, తన బిడ్డ ఎదురుగా వచ్చి నిల్చున్నది. ఆమెను కొత్తపిల్లను చూసినట్టు కిందినుంచీ పైదాక చూసి..
“నువ్వు మారవ్‌ లే!” అన్నాడు కోపంగా.
“అందుకే, నీ పుట్టినరోజు వచ్చిందంటే అయిష్టత నాకు. ఎంతగా విడమర్చి చెప్పినా చెవిన పెట్టట్లేదు. చిన్నపిల్ల కదా, వింటుందని విడిచి పెడుతుంటే రానురానూ మొండికేస్తున్నావ్‌. అయినా, ఇంట్లో ఉన్న పెద్దలకే ఇంగితం లేదు. నిన్ను కట్టడి చేయడం వృథా ప్రయాస..” అంటూ రుసరుస లాడాడు. తన అయిష్టతను ప్రదర్శిస్తూ నిలుచున్నాడు.
తండ్రి కోపాన్ని చూసిన అనన్య అయోమయంగా దిక్కులు చూస్తూ నిల్చుంది. తండ్రి కోపాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది.
అప్పుడే మనవడు ఖలీల్‌ను వెంట పెట్టుకొని, పీరూ సాహెబ్‌ భార్య ఇంట్లోకి వచ్చింది. ఆమె వెనకే ఇద్దరు కోడళ్లూ వచ్చారు. అది చూసిన ఇంట్లోని వాళ్లందరూ నవ్వు ముఖాలతో ఎదురెళ్లారు.
“అత్తయ్యా.. రండి, రండి” అని సాదరంగా ఆహ్వానించింది అనన్య వాళ్ల అమ్మ.
అనన్య వాళ్ల నానమ్మ.. దాదీ (పీరూ సాహెబ్‌ భార్య)ను గాఢంగా పెనవేసుకుంది.
‘అలాయ్‌ బలాయ్‌’ తీసుకుంటూ, కొన్ని నిమిషాలు అలానే కౌగిలింతల్లో ఉండిపోయారిద్దరు మిత్రులు. వాళ్ల దేహాలు ఏం మాట్లాడుకున్నాయో! వాళ్లకే తెలియాలి. తమ జీవితాల్లోని సంతోషాలు, దుఃఖాలు పెనవేసుకుంటున్నట్లు ఉన్నదా దృశ్యం.
అది చూసిన కొడుకు వేరే గదిలోకి వెళ్లిపోయాడు. మిత్రులిద్దరూ కబుర్లలో లీనమయ్యారు.
ఆ మాటకొస్తే ఇంట్లో వాళ్లంతా కబుర్లలోనే మునిగిపోయారు. దీంతో ఇంటి వాతావరణమంతా ఒక్కసారిగా సందడిగా మారిపోయింది.
ఇంటికి వచ్చిన పీర్‌ సాహెబ్‌ ఇంటిల్లిపాదినీ చూసి, సంతోషపడి పోయారు పరంధామయ్య.
“ఏమమ్మా.. మీ ఆయనలు లేరా ఇంట్లో?” అంటూ పీరు సాహెబ్‌ కోడళ్లను పలకరించాడు.
వాళ్లు ఏదో అన్నారు. కానీ, పరంధామయ్య వినిపించుకునే స్థితిలో లేడు. ఏవో పనులు కల్పించుకొని ఇంట్లో అటూ ఇటు తిరుగుతున్నాడు.
“అవునూ.. మీ ఆయనకు బాగో లేదని విన్న. నేనూ, మా ఆయన, మా కూతురు ఇంటికి వెళ్లి నిన్నే వచ్చాం. అందుకే చూడ్డానికి రాలేక పోయాం” అని సంజాయిషీ ఇస్తున్నారొకరు.
“ఇప్పుడెట్లున్నరు?”
“ఏముందీ.. వయసు పెరిగే కొద్దీ రోగాలు చుట్టుముడుతున్నయ్‌. బి.పి, షుగర్‌ కూడా ఉన్నాయి. ఈమధ్య కంట్రోల్‌ కావట్లేదు. దవాఖానల చుట్టూ తిరగడానికే సరిపోతున్నది”
“పలకరించడానికి రావాలె.. మీ బావా, నేనూ కలిసి వస్తాం”
“రజియాకు బిడ్డ పుట్టిందట గదా! మనవరాలు మంచిగున్నదా? పురిటింట్లో బాగా పనులుంటయ్‌. బాగా బిజీగా ఉండి ఉంటావ్‌! బారసాల ఎప్పుడొచ్చింది? కాస్త ముందుగాల చెప్పు..”
.. ఇలా ఒక్కొక్కరి నోటివెంట ఒక్కో ప్రశ్న. ఎప్పటినుంచి మిగిలిపోయి, పోగుబడి ఉన్నాయో! ఒకొక్కటీ నెమరు వేసుకుంటున్నారు.
వాళ్లు రావడంతో ఇంట్లో వాతావరణం కాస్త నెమ్మదించింది. పుట్టినరోజు వేడుకకోసం ముందుగానే ఇల్లంతా అలకరించారు.
చుట్టుపక్కల వాళ్లూ ఒకొక్కరుగా రాసాగారు.
అనన్య ముఖం కడుక్కొని మరోసారి ముస్తాబై వచ్చింది. క్రమక్రమంగా ఇంటి వాతావరణమంతా అనన్య పుట్టినరోజు వేడుకలోకి మారింది.
ఆహూతులతోపాటు ఇద్దరు నానమ్మల చప్పట్ల మధ్య కేక్‌ కట్‌ చేసింది అనన్య. తమ్మునితోపాటు ఖలీల్‌నూ తోడుగా పక్కనే నిలబెట్టుకుంది.
అనన్య చేతులకున్న గోరింటాకు మెరుపుతోపాటు ఇంటి అలంకరణ లైట్ల కాంతితో ఇప్పుడు ఆ ఇల్లు అలజడి కలలోంచి తెరుకున్నట్టుగా ఉంది.
వ్యక్తిగతంగా ఎవరూ, ఎవరినీ ఎదురుపడి మాటా, మాటా అనుకున్నది లేదు. ఇంట్లో ఉన్న ఆ ఒక్కడిలోనే ప్రేరేపిత ద్వేషం వెళ్లూనుకుంటూ వస్తున్నది. ముస్లింల వేషధారణ మీద, ఆహారపు అలవాట్ల మీద, జీవన విధానం మీద.. మనసులో పేరుకు పోయిన ద్వేషం, గూడు బద్దలు కొట్టుకొని రాజ్యం ఏలుతున్నది.
అనన్య తన తండ్రి అయిష్టత నుంచి తేరుకుంది. తన మనసులో తండ్రి గీసిన సరిహద్దు రేఖలమీద ‘దాది’ (నానమ్మ) రాక.. వెన్న పూస్తూ బిడ్డను ఓదార్చే ప్రయత్నం చేసింది. బిడ్డకు ఆ ఆప్యాయతలు ఒకదిక్కు, తండ్రి ద్వేషం మరో దిక్కు. పరంధామయ్య తాతయ్య స్వానుభవపు మంచితనం ఇంకో దిక్కు. అనన్యను ట్రయాంగిల్‌ కూడలిలో నిలబెట్టాయి.


చుట్టుపక్కల వాళ్లు వెళ్లిపోయారు. ఇంట్లో వాళ్లే మిగిలారు. వాతావరణం గుంభనంగా ఉంది. రోజులాగే అయితే, టీవీ పెట్టుకొని చూస్తుండేవాళ్లు. ఇప్పుడు అలా ఏం లేదు. ఆ వాతావరణం నుంచి బయట పడేందుకు అనన్య తల్లి టేబుల్‌మీద వున్న గిఫ్ట్‌ ప్యాక్స్‌వైపు దృష్టి మరల్చింది. ఎవరేం తెచ్చారోనని చూడటం మొదలుపెట్టింది. భర్తకూడా తోడొచ్చాడు. గ్రీన్‌ రేపర్లో చుట్టిన చతురస్రాకారపు గిఫ్ట్‌ ప్యాకెట్‌మీద ఆయన దృష్టి పడ్డది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది.
‘ఏముంది ఇందులో..” అని మనసులో అనుకుంటూనే విప్పదీశాడు. లోపల ఉన్న గిఫ్ట్‌ను చూసి, ఆయన నోటెంట మాట రాలేదు. నిర్ఘాంత పోయి చేతిలో ఉన్న దానివైపే చూస్తున్నాడు.
అప్రయత్నంగానే.. “నాన్నగారూ.. ఇటు రండి” అని పిలిచాడు.
పరంధామయ్య వెంటనే వచ్చాడు. చేతిలోని పుస్తకాన్ని తండ్రికి అందించాడు కొడుకు.
ఆకుపచ్చ రంగు అట్టతో బంగారు వర్ణపు అక్షరాలతో ఉంది ఆ పుస్తకం. చూసి వెంటనే
“ఖురాన్‌” అని చదివాడు పరంధామయ్య.
“తెలుగులోనే ఉంది. ఇది చదువలేవా?” అంటూ కొడుకును ప్రశ్నించాడు. కొడుకు నోరు మెదపక పోవడంతో మళ్లీ ఆయనే..
“ఇది గిఫ్ట్‌గా ఇచ్చారా? చదువు.. తప్పేముంది! వాళ్లను ఎప్పుడూ ఆడి పోసుకుంటుంటావు గదా! చదువు ఈ పుస్తకాన్ని. ఇది వాళ్ల జీవన విధానం. మనకు భగవద్గీత ఎలానో, వాళ్లకు ఖురాన్‌ అంతే! మంచి పని చేశారు. తెలుగులోనే ఉంది. చదివి అర్థం చేసుకో.. లొసుగులేమైనా దొరికితే అవి ఉదాహరణగా చూపి మరీ తిట్టొచ్చు. అలా కూడా ఉపకరిస్తుంది. దేనిపైనా గుడ్డిగా ద్వేషం పెంచుకోవద్దు. అరబ్బీనుంచి తెలుగులోకి అనువాదం చేయించి మరీ అచ్చు వేయించారు. ఏ పుస్తకమైనా అది చేయాల్సిన పని తప్పక చేస్తుంది. చదువు తప్పేం కాదు..” అంటూ ఆ పుస్తకాన్ని కొడుకు చేతుల్లో పెట్టి వరండాలోకి వెళ్లిపోయాడు పరంధామయ్య.


సాయంత్రం అప్పుడప్పుడే చీకటి పడుతున్నది. పడమర దిక్కున చీకటి జాడ ఇంకా కనిపించడం లేదు. ఎర్రటి సూర్యుడు నడిచి వెళ్లిన బాటలాంటి అడుగుల ఛాయ మాత్రం ఇంకా కనిపిస్తూనే ఉంది. పీరు సాహెబ్‌ పిల్లలు.. పరంధామయ్య ఇంటిముందు నిల్చొని ఉన్నారు.
ఇద్దరూ కూడ బలుకున్నట్లే ఒక్కసారిగా “అన్నా..” అని పిలిచారు. ఆ పిలుపు విన్న పరంధామయ్య కొడుకు ఇంట్లోంచి బయటికి వచ్చాడు.“అన్నా.. ఇవాళ ‘ఈద్‌ కా చాంద్‌’.. నీతో కలిసి చూద్దామని వచ్చాం”కాసేపు ముగ్గురి మధ్యా మాటల్లేవు. ఇద్దరినీ సందిట్లోకి తీసుకున్నాడు పరంధామయ్య
కొడుకు.

హనీఫ్‌
హనీఫ్‌ స్వస్థలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి. సయ్యద్‌ భిక్కన్‌ సాహెబ్‌, ఇమాంబీ దంపతులకు 1962 ఫిబ్రవరి 2న జన్మించారు. బీఏ పూర్తి చేసిన హనీఫ్‌, 1990 వరకు వివిధ పత్రికల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సింగరేణి కాలరీస్‌లో 26 ఏండ్లపాటు ఈపీ ఆపరేటర్‌గా విధులు నిర్వహించారు. కార్మిక సంఘాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించారు. 2016లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. 1980 నుంచి కవిత్వం, 2000 నుంచి కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పటివరకు 25 కథలు రాశారు. ‘ఇక ఊరునిద్రపోదు’, ‘ముఖౌటా’ పేరుతో కవితా సంపుటాలు, ‘పడమటి నీడ’ కథల పుస్తకాన్నీ వెలువరించారు. పలువురి కవితలను ‘దూదిపూల దుఃఖం’ పేరుతో, తన సంపాదకత్వంలో పుస్తకంగా తీసుకొచ్చారు.

-హనీఫ్‌, 9247580946

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈద్‌ కా చాంద్‌
ఈద్‌ కా చాంద్‌
ఈద్‌ కా చాంద్‌

ట్రెండింగ్‌

Advertisement