e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 24, 2021
Home బతుకమ్మ ఇప్పటికీ.. పాత ఆచారాలే!

ఇప్పటికీ.. పాత ఆచారాలే!

చంద్రుని మీద పాదం మోపాం. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా క్షణాల్లో
4జీ వేగంతో సమాచార మార్పిడి జరుగుతున్నది. అయినా, ఈ రోజుల్లోనూ పాతరాతి
యుగం నాటి పద్ధతులు, ఆచారాలు పాటించేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి జీవనశైలి మనకో చరిత్ర పాఠం.

ములుగు జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతం ప్రాచీన సమాధులకు నిలయం. ఈ సమాధులు నాటి మనిషి ఉనికిని తెలియజేస్తాయి. మానవ జాతుల పరిణామ క్రమాన్ని వివరిస్తాయి. ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో దామరవాయితో పాటు జగ్గారం, గంగారాం, రంగాపురం, బిరెల్లి, భూపతిపురం, అంకుపల్లి, మంగపేట మండలంలోని మల్లూరు గుట్ట, కొమురారం, చెట్టుపల్లి, మాణిక్యారం, కాంచనపల్లి, గలభ, దొంగతోగు, గుండాల తదితర ప్రాంతాల్లో ఈ రకమైన సమాధులు వేల సంఖ్యలో ఉన్నాయి. సమాధుల నిర్మాణంలో నాటి మానవులు అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. సుమారు నాలుగు మీటర్ల పొడవు, మూడు మీటర్ల వెడల్పుతో కరకుగా చెక్కిన ఇసుక రాళ్లతో వీటిని నిర్మించారు. సమాధి చుట్టూ నాలుగు పెద్దపెద్ద బండలను పెట్టి, వాటికి పైకప్పుగా మరో పెద్ద బండను ఉంచారు. ప్రతి సమాధిలోను ఒక చిన్న నీటి తొట్టి లాంటి రాతి కట్టడాన్ని నిర్మించారు. సమాధి చివర మూలలో నాలుగు అడుగుల ఖాళీ స్థలం వదిలారు. చుట్టూ బండలను పేర్చి ప్రహరీ నిర్మించారు. వేల సంవత్సరాలలో.. ఎన్ని భూకంపాలు వచ్చినా ఇవి చెక్కుచెదరలేదు. ఇకముందూ చెదరవుకూడా.

- Advertisement -

అలనాటి వారసత్వం
గిరిజన గ్రామాల్లోకి శరవేగంగా ప్రపంచీకరణ దూసుకొస్తున్న సమయంలోనూ.. ఆదిమ కాలం నాటి ఆచారాలు , సంప్రదాయాలు ఈ ప్రాంతంలో మనుగడ సాగిస్తున్నాయి. ఇక్కడ నివాసం ఉండే కోయలు, గుత్తి కోయల సమాధులు పాత రాతియుగం సమాధుల నమూనాలోనే ఉంటున్నాయి. నేటికీ సమాధి శిలా స్తంభాలను పాతిస్తారు. సమాజంలో దివంగతుల పేరు ప్రతిష్ఠలను బట్టి సమాధి పరిమాణం ఉంటుంది. కొన్ని గిరిజన జాతులవారు అయితే, పార్థివదేహాలను పూడ్చిన ప్రదేశంలో ఒక కొయ్యస్తంభం పూడ్చిపెడతారు. ఎన్ని తగాదాలున్నా, ఆ తెగకు చెందినవాళ్లంతా అంత్యక్రియల్లో పాల్గొంటారు. సమష్టిగానే సమాధి నిర్మాణం చేపడతారు. అంత్యక్రియల అనంతరం ఇప్పసారా, మాంసంతో గ్రామస్తులకు విందు ఇస్తారు. పెద్దలను స్మరిస్తూ వేడుక నిర్వహిస్తారు. దీన్ని ‘పెద్ద గుప్తాయి పండుగ’ అంటారు.

పండుగరోజు మేక మాంసం వండుతారు. పెద్దల సమాధులవద్దకు గ్రామమంతా తరలి వెళ్తుంది. అనంతరం వయోధికులను సగౌరవంగా కూర్చోబెట్టి, చనిపోయిన తమ పెద్దలుగా వారిని భావించుకుంటారు. వారికి ఇప్పసారా పోసి, మాంసం వడ్డిస్తారు. ‘మా ప్రాంతంలో వేలాది సంవత్సరాల నుంచీ ఎన్నో ఆచార వ్యవహారాలు వారసత్వంగా వస్తున్నాయి. మూల వాసుల సమాధులను రాక్షస గుహలుగా వ్యవహరించడం వల్ల చరిత్ర వక్రీకరణకు గురవుతున్నది. పూర్వీకుల స్మారకాలుగా వాటిని భావించాలి గౌరవించాలి’ అంటారు స్థానికుడైన సంతోష్‌ ఇస్రం. స్థానికుల ఆచారాలు పాతరాతి యుగం నాటి వ్యవహారాలు, వృత్తి ప్రవృత్తులను, సాంఘిక కట్టుబాట్లను, జీవన విధానాన్ని తెలుసుకోవడానికి మనకో అవకాశం కల్పిస్తాయి. కాబట్టి వాటిని రక్షించుకోవడం మనందరి కర్తవ్యం. చరిత్రను కాపాడుకోలేకపోతే చరిత్ర మనల్ని క్షమించదు.

-అరవింద్‌ ఆర్య ,7997 270 270

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana