‘ఇంట్లో స్విమ్మింగ్‌పూల్’ ఒకప్పుడు సిరిగలవారికి మాత్రమే చెల్లేది. సరిగ్గా ప్లాన్ చేసుకోవాలే గానీ, ఇండోర్ పూల్ నిర్మించుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదంటున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. భారీ స్థాయిలో కాకపోయినా, ఆటవిడుపు కోసం చిన్న సరోవరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్వహణ కోసం కొంత సమయం కేటాయించాలి.
స్విమ్మింగ్‌పూల్ కోసం భారీ స్థలం కేటాయించాల్సిన అవసరం లేదు. ఇంటి కాంపౌండ్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లోనే ఒక గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చేయవచ్చు. రకరకాల వాల్డిజైన్స్తో పూల్రూమ్ను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి వాతావరణంలోనైనా హాయిగా ఈత కొట్టొచ్చు. బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు.. అలల కొలను పక్కన కొంత సమయాన్ని ఆనందంగా గడుపవచ్చు. అయితే, బయటి వాతావరణాన్ని బట్టి నీటి ఉష్ణోగ్రత మార్చుకునే వెసులుబాటు ఉండాలి.
రూఫ్‌టాప్ పూల్: చాలామంది ఓపెన్ పూల్‌ను ఇష్టపడతారు. అలాంటివాళ్లు ఇంటి మిద్దెపై స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అప్పుడైతే, పూల్‌ను విశాలంగా నిర్మించుకోవచ్చు. ఈత కొలను చుట్టూ మొక్కలు పెంచుకోవచ్చు. ప్రతి రోజూ అరగంట ఈత కొడితే.. ఇతర వ్యాయామాల అవసరమే ఉండదు. స్విమ్మింగ్‌పూల్‌లోని నీళ్లను ఆతర్వాత… మొక్కలకు, దుస్తులు ఉతకడానికి, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
ఎక్కడైనా ఓకే: మనసుంటే మార్గం ఉంటుంది. పూల్ కట్టుకోవాలని అనుకున్నప్పుడు, స్థలం దొరక్కుండా పోదు. ఉదా హరణకు ఇంటి గదుల్లో, డాబా మీద కుదరనప్పుడు, మెట్ల కింద స్థలంలో అయినా చిన్నగా ఏర్పాటు చేసుకోవచ్చు. అవకాశం ఉంటే సెల్లార్లో కట్టుకోవచ్చు. ఇలా అయితే, స్థలం కూడా వృథాకాదు. నిపుణుల సలహా మేరకు పూల్‌లోని నీటిని మార్చడం, శుభ్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. లేదంటే, ఇబ్బందే.
రకరకాల ఆకారాలు
స్విమ్మింగ్‌పూల్ అనగానే అది దీర్ఘచతురస్రాకారంలోనే ఉండక్కర్లేదు.
నచ్చినట్టు నిర్మించుకోవచ్చు.
ఇంట్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి డిజైన్ ఖరారు చేసుకోవచ్చు. వృత్తాకారం,
దీర్ఘవృత్తం, రాంబస్ ఆకృతి.. ఇలా నచ్చినట్టుగా కట్టుకోవచ్చు. స్విమ్మింగ్‌పూల్ ఇంటికి కొత్త అందం తెస్తుందనడంలో సందేహం లేదు. లైటింగ్, కలరింగ్ ఎఫెక్ట్ కూడా ఇవ్వగలిగితే, ఇంటి పట్టునే మానస సరోవరాన్ని దర్శించుకోవచ్చు. అయితే, పూల్ లోతు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. పిల్లలుంటే మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి.