తల్లి లేని బిడ్డల పరిస్థితిని ముందే ఊహించిన పెద్దలు మాతృమూర్తి అంకితభావానికి పట్టం కడుతూ ‘ఇంటికి అవ్వ.. కొలతకు తవ్వ’ అనే సామెత చెప్పారు. ఇంట్లో తల్లి లేకపోతే బిడ్డల పరిస్థితి అగమ్యగోచరమే. సమయానికి ‘తిన్నవా బిడ్డా/తింటవా బిడ్డా’ అని అడిగే దిక్కు ఉండదు. వండి పెట్టేవారుకూడా ఉండకపోవచ్చు. తల్లి అప్యాయతకు, అనురాగానికి దూరమైన బిడ్డలలో మంచిచెడులను బేరీజు వేసే వివేచనా తక్కువేనంటారు. ఒకరకంగా తల్లి లేని ఇల్లు కష్టాల కొలిమే. బిడ్డలు బుద్ధిగల వారైతే మంచిమార్గంలో ఉంటారు.. లేకపోతే చెడుదార్లో పయనిస్తారు. అందుకే ‘పిచ్చిదో, బికారిదో కన్నతల్లి ఉండాలి’ అనీ అంటారు. ఇక ధాన్యం కొలతల్లోనూ కచ్చితంగా తవ్వలాంటి వస్తువేదో ఒకటి ఉండాలి. లేకపోతే ధాన్యం లెక్కకు రాదు. అందాజు వేసిన దానికి, కచ్చితంగా కొలిచిన ధాన్యానికి తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ‘ఇంటికి అవ్వ-కొలతకు తవ్వ’ సామెతను జానపదులు వాడుతున్నారు.