e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home బతుకమ్మ ఆమె పాట.. అతని నోట!

ఆమె పాట.. అతని నోట!

‘కలలు కల్లలయ్యాక కంటియేరు పొంగిందా.. అలల దారిమారాక తీరమలసిపోయిందా.. ఆలయాన దీపం ఆరిందా.. ఆకసాన్ని చీకటి కమ్మిందా..’ మహిళ హృదయాన్ని ఆవిష్కరించే ఈ పాట, ఇటీవలే ఓ చిత్రానికి టీజర్‌గా విడుదలైంది. ఆడ గొంతుకలోనిఆ జీర గుండెల్ని పిండేసింది. ఈ పాటను పాడింది మాత్రం ఓ యువకుడు. పేరు సాయి శాన్విద్‌ కిరణ్‌కుమార్‌. పాటలోని పదాలు.. అతని జీవిత కథనూ చెబుతాయి. తన ప్రతి సినిమాలోనూ ఎంతోకొంత కొత్తదనాన్ని చూపేందుకు తహతహలాడుతుంటాడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ రఘు కుంచె. తన తదుపరి చిత్రం ‘బ్యాచ్‌’ కోసం వైజాగ్‌కు చెందిన సాయి శాన్విద్‌కు ‘నేపథ్య గాయని’గా తొలి అవకాశం ఇచ్చాడు. అవును, మీరు చదివింది నిజమే. ఓ అబ్బాయి అమ్మాయిలా పాడటం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ప్రయోగమే.

స్వరమే శాపమై
సాయి శాన్విద్‌ కిరణ్‌కుమార్‌ది విశాఖపట్నం. నలుగురు సంతానంలో చివరివాడు. టీనేజ్‌లో ఉండగానే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఇంటర్‌ వరకు చదివి ఆపేశాడు. సొంతూళ్లోనే అక్కలు, అన్నతో కలిసి ఉండేవాడు. అనుకోకుండా, సొంతవారి నుంచి వెలివేతకు గురయ్యాడు. కారణం అతని గొంతుక. తను బాల్యం నుంచీ అమ్మాయిలా మాట్లాడేవాడు. కొంత వయసొచ్చాక, స్వరం మారుతుందని అనుకున్నారు. కానీ, అలాంటిదేమీ జరగలేదు. ఆడ గొంతు కారణంగా ఇంటా బయటా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆకతాయిల మాటలు కుంగదీసినా.. పరిస్థితులను తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాడు సాయి. పాటల్లోనే ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఆడ గొంతుతో అద్భుతంగా పాడుతున్నా.. ఆ ప్రతిభను ఎవరూ గుర్తించలేదు. స్కూల్లో టీచర్లు మాత్రం బహుమతులతో ప్రోత్సహించారు. తల్లిదండ్రులు చనిపోయాక, మళ్లీ పాడటం ప్రారంభించాడు సాయి. ఆ వీడియోలు ఫేస్‌బుక్‌, వాట్సప్‌లలో షేర్‌ చేస్తుండటంతో వద్దని వారించింది కుటుంబం. అయినా వినకుండా ప్రోగ్రామ్స్‌కు వెళ్లేవాడు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారు. తనగొంతే తనకు శాపం కావడం బాధనిపించింది. ఆత్మీయులను వదులుకోలేక, లక్ష్యాన్ని విడిచిపెట్టలేక.. సతమతమయ్యాడు. ఓ దశలో, ఆత్మహత్య ప్రయత్నాలూ చేశాడు.

- Advertisement -

దేవుడిచ్చిన వరం కూడా
తన జీవితానికి ఓ లక్ష్యాన్ని వెతుక్కుంటూ రైలెక్కి హైదరాబాద్‌ బాటపట్టాడు సాయి. జానెడు నీడ కోసం ఎంతో తపించాడు. నిమ్స్‌ దవాఖాన వెయిటింగ్‌ హాల్‌లో ఉంటూ.. ఎవరైనా పెడితే నాలుగు ముద్దలు తింటూ మూడు నెలలు కాలం వెళ్లదీశాడు. చివరికి ధైర్యం చేసి, బేగంపేట్‌లో హౌస్‌ కీపింగ్‌ పనికి కుదిరాడు. వచ్చిన డబ్బుతో హాస్టల్‌ ఫీజు కట్టేవాడు. ఈవెంట్‌ ఆర్గనైజర్లను ఒప్పించి కార్యక్రమాల్లో పాటలు పాడేవాడు. షార్ట్‌ఫిల్మ్‌లలో హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించాడు. అలా పది షార్ట్‌ఫిల్మ్‌లకు పనిచేశాడు. రెండు సినిమాలకూ స్వరం ఇచ్చాడు. ఈ యువ గాయకుడిని రఘు కుంచె చాలా ప్రోత్సహించారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రఘు.. సాయి పాడిన టీజర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశాడు. వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. అలా తన గొంతు శాపం కాదని.. తనకు అదే వరమన్న నమ్మకం కలిగింది. క్రమంగా సినిమాల్లో, సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి. ఏ గొంతు అసహజంగా ఉందని వెలివేశారో, అదే గొంతుతోనే తెలుగు రాష్ర్టాల్లో గుర్తింపును తెచ్చుకున్నాడు సాయి.

సంగీతం నేర్చుకుంటున్నా..
ఇన్నాళ్లూ సినిమా పాటలు వింటూ సాధన చేసేవాడిని, పాడేవాడిని. ఇప్పుడు, నేనే సొంతంగా పాడుతున్నా కాబట్టి, సంగీత పరిజ్ఞానం తప్పనిసరి. ఈమధ్యే సరిగమలు నేర్చుకుంటున్నా. హైదరాబాద్‌కు వచ్చాక ఎంతోమంది నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. ఇక్కడ హేళనలకు తావులేదు. సొంతవాడిలా ఆదరిస్తున్నారు. మా హాస్టల్‌లో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కవితలు, కథలూ రాస్తుంటాను. తీరిక సమయాల్లో బొమ్మలు గీస్తుంటా. భవిష్యత్‌లో మంచి గాయకుడిగా స్థిరపడాలన్నదే నా కోరిక.
-డప్పు రవి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement