e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home బతుకమ్మ ఆగం జేసిండురో!

ఆగం జేసిండురో!

ఆగం జేసిండురో!

ఆయన పాట.. ‘రాములో రాములా.. నన్నాగం జేసిందిరో’ అంటూ తెలుగు తెరపై సరికొత్త రికార్డును సృష్టించింది. సినిమాలోనే కాదు.. నిజంగానే ఎన్నో యువ హృదయాలను ఆగం జేసింది. ఆయన కలం.. ‘నీలపురి గాజుల ఓ నీలవేణి నిలుసుంటే కిష్ణవేణి’ అంటూ కుర్రకారుతో చిందులేయించింది. ఇలాంటి ఎన్నో సూపర్‌ హిట్‌ పాటలతో చిత్రసీమలో ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు
గీత రచయిత కాసర్ల శ్యామ్‌.

కాసర్ల శ్యామ్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా హన్మకొండ. తల్లిదండ్రులు మాధవి, మధుసూదనరావు. తండ్రి రంగస్థల నటుడు. టీవీ సీరియల్స్‌లో, సినిమాల్లో నటించారు. ఇంట్లో కళలూ సాహిత్యంపై చర్చలు జరిగేవి. అలా, బాల్యం నుంచే సాహిత్యంపై అభిలాష పెంచుకున్నారు శ్యామ్‌. సినిమాల్లోకి రాకముందు వేలాది జానపద గీతాలు రాసి పాడారు. ఆల్బమ్స్‌గానూ తెచ్చారు. 50 ప్రైవేట్‌ ఆల్బమ్స్‌కు సాహిత్యాన్ని అందించారు. ఇందులో ‘గల్‌గల్‌ గజ్జెలు’, ‘మస్తుగుంది పోరి’ వంటి హిట్స్‌ ఉన్నాయి.

- Advertisement -

‘చంటిగాడు’తో తొలి అడుగు
2003లో వచ్చిన ‘చంటిగాడు’ చిత్రంతో గీత రచయితగా సినీరంగంలోకి అడుగుపెట్టారు శ్యామ్‌. ‘కోకోకో.. కొక్కొరొకో.. ఇది నిప్పుకోడి పెట్టరో.. దీని తిప్పసార పట్టరో..’ అంటూ తొలిపాటతోనే యూత్‌కి దగ్గరయ్యారు. ఇదే సినిమాకు ‘సిగ్గులొలికే సీతాలు.. నా చెంతకు చేరవమ్మా’ పాటనూ అందించారు. ఇందులో ‘ఇద్దరమొకటై హద్దులు దాటి.. ముద్దుల జాతర చేద్దామే’ అనే పంక్తుల ద్వారా యువ హృదయాలకు వయసు గుసగుసల్ని తెలియజెప్పారు. అదే ఏడాది ‘ఉషాకిరణాలు’ సినిమాలో ‘తూరుపు కొండల్లో సూరీడు దిగ్గున లేసిండు.. ఏడు గుర్రాలెక్కి మబ్బుల్లో ఊరేగుతున్నాడు’ అంటూ మేలుకొలుపు గీతాన్ని రాశారు. ఈ పాటలో ‘మూసుకున్న కళ్లు తెరిసి.. చూపు చూపు కత్తులు దూసి..’ అంటారు శ్యామ్‌. ఇది నిద్రలో ఉన్న జనానికి పాడే సుప్రభాతం కాదు.. నిద్రిస్తున్న ఆలోచనలను, ఆశయాలను తట్టిలేపడానికి ఎంచుకున్న చైతన్య గీతం. ‘ప్రేమికులు’(2005) చిత్రంలో
‘లవ్వేరా జోరు.. లవ్వే హుషారు.. ఈ లవ్వేరా ఫ్యూచరు’ అంటూ ఓ హుషారు గీతాన్ని ఆవిష్కరించారు.

ఉర్రూతలూపిన కిష్ణవేణి..
శ్యామ్‌కు సినీ గీతరచయితగా ప్రత్యేకమైన గుర్తింపునిచ్చింది ‘మహాత్మ’(2009) చిత్రం. ఇందులోని ‘నీలపురిగాజుల ఓ నీలవేణి నిలుసుంటే కిష్ణవేణి’ పాట యువతరాన్ని ఉర్రూతలూగించింది. పూర్తిగా జానపద శృతిలో సాగే ఈ గీతం, బహుళ జనాదరణను పొందింది. ఇందులోని ‘నీ చూపుల్లో ఉంది మత్తు సూది.. నా గుండెల్లో గుచ్చుతున్నాది’ అనే పంక్తిలోని పదాల సొబగు ఎంతో బాగుంది. ‘బస్‌స్టాప్‌'(2012)లోని ‘కలలకే కనులొచ్చిన క్షణమిది.. ఎదురయే తొలిప్రేమకు అడుగిది’ పాటతో, కుర్రకారుకు ప్రేమపాఠాన్ని నేర్పారు. ‘మా అబ్బాయి ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌'(2012) చిత్రంలోనూ మరో ప్రేమ గీతాన్ని అందించారు. ‘నిన్నే నీకు చూపేది.. నీలో ఆశే రేపేది.. నిన్ను నన్ను కలిపేది ప్రేమ’ అంటూ ప్రేమ విలువను, ప్రేమలోని చలువను తెలుపుతూ వినసొంపుగా పాట రాశారు కాసర్ల శ్యామ్‌.

ప్రేమ పాటలు.. చైతన్య గీతాలు..
‘ప్రేమ కథా చిత్రమ్‌'(2013) సినిమాకోసం ‘కొత్తగున్నా.. హాయే నువ్వా! మత్తుగున్నా.. మాయే నువ్వా’ అనే వైవిధ్యమైన ప్రేమగీతాన్ని రాశారు. ‘రియల్‌ స్టార్‌'(2014) చిత్రంలో
‘కండల్లో కరుకుదనం.. చూపుల్లో చురుకుదనం.. నడిచొచ్చే అగ్నిపర్వతం’ అంటూ నిజమైన కథానాయకుడి ఠీవిని కండ్లకు కట్టారు. ‘నిలువెత్తు మంచితనం.. నిలువెల్లా మంచుగుణం’ తదితర వాక్యాలతో నాయకుడి ఉన్నత వ్యక్తిత్వానికి అక్షర రూపం ఇచ్చారు. ‘రాజా ది గ్రేట్‌'(2017) కోసం మరో హిట్‌ సాంగ్‌ను అందించారు శ్యామ్‌. ‘రాజా రాజా రాజా.. ది గ్రేట్‌ రా.. నువు తళా తళా టుతౌజన్‌ నోట్‌ రా’ అంటూ టైటిల్‌ సాంగ్‌ రాసి, చిత్రానికి గొప్ప బలాన్నిచ్చారు. ఇదే సినిమా కోసం రాసిన ‘ఎన్నియల్లో.. ఎన్నియల్లో ’ పాట కూడా సంచలనమే. ఆ తర్వాత ‘మెంటల్‌’ (2016) సినిమాలో ‘చీకటి చీల్చగ.. సూటిగ దూకిన వెచ్చటి వెలుతురు నువ్వేరో..’ అంటూ ఓ చైతన్య గీతాన్ని రాశారు.

యువ హృదయాలు..
తెలుగు సినీతెరపై కాసర్ల శ్యామ్‌ పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది.. ‘అలవైకుంఠపురములో’ (2019) సినిమా. ఇందులోని ‘రాములో.. రాములా! నన్నాగం జేసిందిరో.. రాములో.. రాములా! నా పాణం తీసిందిరో’ పాట.. నిజంగానే యువత హృదయాలను ఆగం జేసింది. తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా పీఠం వేసుకొని కూర్చుంది. ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినిపించాలనే స్వరం, పదం.. ఈ పాట సొంతం. రాములా, ఆగంజేసిండే, ఐతాందే వంటి అనేక పదబంధాలు, తెలంగాణ యాసలోని కమ్మదనాలే. అలాగే ‘లై’ (2017) సినిమాలోనూ తెలంగాణ యాసకు పట్టం గడుతూ పాట రాశారు. ‘బొమ్మోలే ఉన్నదిర పోరీ.. బాంభాట్‌ గుందిరా నారీ..’ అంటూ యువతరాన్ని ఊగించారు.

ట్రెండ్‌కు తగ్గట్లుగా..
ఇప్పటి ట్రెండ్‌కు తగిన పాటల్ని రాస్తూ, ప్రేక్షకులతోపాటు దర్శక, నిర్మాతల మెప్పు పొందుతున్నారు శ్యామ్‌. పూర్తి ఆంగ్ల పదాల ప్రయోగంతో పాటను కదం తొక్కిస్తే ఎలా ఉంటుందో ‘జక్కన్న’(2016)తో నిరూపించారు. ఇందులో ‘యు ఆర్‌ మై డార్లింగో.. లింగో లింగో లింగ్‌’ అనే సూపర్‌ హిట్‌ సాంగ్‌ను అందించారు. ‘నీది నాది ఒకే కథ’(2018) సినిమాలో ‘ఏందిరా ఈ జనాల గోల? ఇల్లే సెంట్రల్‌ జైలా?’ అనే పాట రాశారు. తనదైన శైలిలో, ఏ పనీ లేకుండా తిరిగే యువకుడి అంతరంగాన్ని ఈ పాట ద్వారా వివరించారు. ‘జిందగీలో సెటిలవ్వాల? కంపల్సరీ అది రూలా?’ అంటూ స్వేచ్ఛగా తిరిగే కుర్ర వయసుతనాన్ని తెలిపారు. ఇంకా.. వెంకీమామ, బంతిపూల జానకి, సవారి, సుప్రీమ్‌ లాంటి హిట్‌ సినిమాలకు పాటలను అందించారు.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆగం జేసిండురో!
ఆగం జేసిండురో!
ఆగం జేసిండురో!

ట్రెండింగ్‌

Advertisement