అవును..చీకటంటే నాకు భయం:రవిబాబు


Sun,May 10, 2015 06:47 AM

Ravi-Babu

అల్లరి, అనసూయ, అమరావతి, అవును -లాంటి వినూత్న కథా చిత్రాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టించుకున్న రవిబాబు బతుకమ్మతో ప్రత్యేకంగా ముచ్చటించారు. దర్శకుడిగా నాకు ఎలాంటి లక్ష్యాలు లేవు. నన్ను బాగా ఎక్సైట్ చేసిన కథలతోనే సినిమాలు తీస్తున్నాను. స్క్రిప్ట్‌ను రూపొందిస్తున్న సమయంలోనే చిత్రానికి సంబంధించిన జయాపజయాలు నిర్ణయమవుతాయి. కాబట్టి, సినిమా పూర్తయ్యాక దాని ఫలితం గురించి ఆలోచించను అన్నాడు. చిత్రమేమిటంటే హర్రర్ సినిమాలతో తనదైన శైలిలో భయపెట్టే ఆయనకు చీకటంటే భయమట. ఇంకా చాలా విశేషాలు చెప్పారు, చదవండి...

మీ దృష్టిలో దర్శకత్వమంటే?


-కామిక్స్ బుక్స్‌లో బొమ్మలతోనే కథ చెబుతారు. కదిలే బొమ్మలతో అందంగా కథ చెప్పడమే దర్శకత్వమని నా అభిప్రాయం. ఐతే, దర్శకుడు చెప్పాలనుకునే కథకి సినీ నిర్మాణంలోని 24 విభాగాలు సహాయం చేస్తాయి. కాకపోతే ఈ క్రాఫ్ట్స్ మీద దర్శకుడికి ఏ మేరకు అవగాహన వుందనే అంశాన్ని బట్టి సినిమా నాణ్యత ఆధారపడి వుంటుంది. సినిమాటోగ్రఫీ తెలిసిన దర్శకుడు తన సినిమాని మరింత అందంగా చూపించగలుగుతాడు. సంగీత పరిజ్ఞానం వున్న దర్శకుడు చక్కటి స్వరాల్ని ఎంపిక చేసుకుంటాడు. ఇలా ఒక్కో విభాగంపై పట్టు కలిగి వుండటం దర్శకుడి సృజనాత్మకతకు మరింత పదును పెడుతుంది.

మీరెలా దర్శకుడయ్యారు?


-నేను దర్శకత్వాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి డేవిడ్ ఫించర్ అనే హాలీవుడ్ దర్శకుడు స్ఫూర్తినిచ్చాడు. ఆయన తీసిన 7 అనే చిత్రం నాపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. న్యూయార్క్‌లోని ఓ థియేటర్‌లో ఆ చిత్రాన్ని చూశాను. వారం రోజుల పాటు ఆ సినిమా తాలూకు హ్యాంగోవర్ నుంచి బయటపడలేకపోయాను. సినిమా అనేది అంతలా ప్రభావితం చేస్తుందా? అనిపించింది. ఆ క్షణమే దర్శకుడవ్వాలనే నిర్ణయానికి వచ్చాను. ఆయన శైలిలో నేను తీసిన చిత్రం అనసూయ. ఒకవేళ ఈ సినిమాను డేవిడ్ ఫించర్ చూసినైట్లెతే వీడేవడో నా శిష్యుడే అని తప్పకుండా అనుకుంటాడు!

వైవిధ్యం గురించి...


దర్శకుడు ఒకే పంథాకు పరిమితమై పోకూడదు. నా శైలిలోనే సినిమా తీస్తానని చెప్పడం మంచిది కాదు. హారర్, థ్రిల్లర్, లవ్, కామెడీ, ఫ్యామిలీ-ఇలా ఎలాంటి జెనర్ సినిమానైనా తెరకెక్కించగలిగే స్కిల్స్ కలిగివుండాలి. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను తీసుకుంటే ఆయన ఓ చేపకథతో జాస్‌లాంటి సినిమా తీశాడు. యానిమేషన్స్‌తో జురాసిక్ పార్క్ తీశాడు. షిండ్‌లర్స్ లిస్ట్ అని హిట్లర్ కథతో సినిమా తీశాడు. ఇలా వైవిధ్యమైన ఇతివృత్తాల్ని ఎంచుకున్నాడు కాబట్టే ఆయన ప్రపంచంలోనే మేటి దర్శకుడిగా పేరొందాడు.

మీ గురించి మీరేమనుకుంటారు?


సినీరంగంలో నేను పెద్ద విజయాల్ని సాధించలేదని భావిస్తాను. ఇప్పటికీ ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. నేను యావరేజ్ ఇంటిలిజెంట్‌ని. అందుకే బాలీవుడ్ చిత్రాల వైపు వెళ్లలేదు. తెలుగులో గొప్ప సినిమా తీశాననే నమ్మకం కుదిరాక బాలీవుడ్ గురించి ఆలోచిస్తా. నేను తీసిన కొన్ని చిత్రాల్ని బాలీవుడ్‌లో డైరెక్ట్ చేయమని అడిగినా వద్దనుకున్నాను.

మీరు భయపడే సందర్భాలు..


-మంచి ప్రశ్నే. నేను హారర్ సినిమాలు తీస్తాను. కానీ వాస్తవానికి నాకు చీకటంటే చాలా భయం. ఇంట్లో ఎవరూ లేకపోతే ఒంటరిగా వుండలేను. అందరు వచ్చేదాకా కార్లో బయట తిరుగుతుంటాను. ఒకవేళ పొరపాటున రాత్రి ఒంటరిగా పడుకోవాల్సి వస్త్తే ... నా బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి, లైట్స్, టీవీ ఆన్ చేసి పడుకుంటాను. నాలోని భయాన్ని అధిగమించడానికే హారర్ సినిమాలు తీస్తున్నానేమో అనిపిస్తుంది.

మీరు నాస్తికులా, ఆస్తికులా?


-దేవుడితో నాకు అలౌకికమైన అనుబంధముంది. నా దృష్టిలో దేవుడికి ఇగో వుండదు. మనం మంచి పనులు చేస్తే సత్కరించడం, చెడు పనులు చేస్తే శిక్షించడం లాంటి పనులు దేవుడు చేయడు. నేను సెలెక్టివ్‌గా దేవాలయాలకు వెళతాను. తిరుపతి, చిలుకూరు దేవాలయాల్ని ఏడాదికొకసారి సందర్శిస్తుంటాను.

పునర్జన్మలని నమ్ముతారా?


-నమ్ముతాను. ఈ విశ్వంలోని ఘటనలన్నీ ఓ చక్ర భ్రమణంలో జరుగుతుంటాయి. ఈ సృష్టిలో ప్రతిదీ రీసైకిల్ అవుతుంది. అలాగే జన్మ, పునర్జన్మ కూడా వుంటుందని నా విశ్వాసం. పునర్జన్మలకు సంబంధించిన మెనీ లైవ్స్ మెనీ మాస్టర్స్ పుస్తకాన్ని చదివాను. అమరావతి సినిమా తీసేటప్పుడు హిప్నాసిస్ కాన్సెప్ట్‌పై చాలా పరిశోధన చేశాను.

ఫెయిల్యూర్స్‌ని ఎలా స్వీకరిస్తారు?


తప్పదు. నేను ఎంతో శ్రమకోర్చి తీసిన మనసారా, లడ్డూబాబు చిత్రాలు పరాజయం పొందడంతో కొంత నిరుత్సాహానికి గురయ్యాను. మనసారా చిత్రంలో విజువల్ బ్యూటీ వుంటుంది. పాటలు కూడా ఓ థీమ్ ప్రకారం వుంటాయి. కథ చాలా కొత్తది. అయినా ఆ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు. తెలుగు చిత్రసీమలో ఓ సరికొత్త ప్రయోగంగా లడ్డూబాబును తీశాను. అదీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది.

మన ప్రేక్షకుల నాడి పట్టుకున్నారా?


కష్టం. అయితే, కామెడీ చేసే జిమ్‌క్యారీ సీరియస్ క్యారెక్టర్స్ చేసినా హాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారు. వారి ఆలోచనా విధానం ఓపెన్‌గా వుంటుంది. తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ వేరుగా వుంటాయి. ఇక్కడ కమెడియన్ ఓ విషాద పాత్రను చేస్తే ఏ మాత్రం అంగీకరించరు. ఒక్క ఎన్టీఆర్‌ను మాత్రమే తెలుగుప్రేక్షకులు ఎలాంటి పాత్రలోనైనా ఒప్పుకున్నారు.

2061
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles