e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home బతుకమ్మ అవమానాలే..నా సోపానాలు!

అవమానాలే..నా సోపానాలు!

బడికెళ్తున్నప్పుడు ‘నీకు చదువెందుకురా?’ అని అవమానించారు.పైచదువుల కోసం పొలిమేర దాటి వెళ్తుంటే ‘పొలానికి పోక.. ఇంకా చదువెందుకురా?’ అని అవహేళన చేశారు.ఉద్యోగం వదిలేసి పరిశోధనల బాటపడితే.. ‘వీడి హెచ్చులు కాకపోతే, ఏం పొడుస్తాడు’ అని విమర్శించారు. అమెరికా వెళ్లి పాశ్చాత్యులతో ‘శభాష్‌’ అనిపించుకున్నా,ఇక్కడివారి సూటిపోటి మాటలు మాత్రం ఆగలేదు.నవ్విన నాపచేను పండింది. తనను గేలి చేసిన వారి ముందు గెలిచి నిలిచారు గోలి మోహన్‌. ఉత్తమ సైంటిస్ట్‌గా అవార్డులు అందుకున్నారు. అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సభ్యుడయ్యారు. పురిటి గడ్డపై సగర్వంగా కాలుమోపారు. అన్నదాతలకు అండగా, అన్నార్థులకు భరోసాగా నిలుస్తున్నారు. తన కూతురి పేరిట ‘ఆద్య గోలి’ ఫౌండేషన్‌ నెలకొల్పి సమాజ సేవ చేస్తున్నగోలి మోహన్‌ ‘బతుకమ్మ’తో పంచుకున్న జీవిత అనుభవాలు ఆయన మాటల్లోనే..

బూట్ల చప్పుడు, తుపాకుల మోతలు, తలదాచుకునే అన్నలు, వెతికి పట్టుకోవడానికి వచ్చే పోలీసులు.. నా బాల్యంలో మా ఊళ్లో పరిస్థితి ఇలా ఉండేది. ఎవరికి ఎప్పుడు నూకలు చెల్లుతాయో అని భయంభయంగా ఉండేది. మా ఊరి పేరు నూకలమర్రి. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో ఉంది. తల్లిదండ్రులు నారాయణ, మల్లమ్మ. మేం నలుగురు అన్నదమ్ములం. నా చిన్నప్పుడు ఊర్లో ఏడో తరగతి వరకే ఉండేది. అమ్మానాన్నలకు మమ్మల్ని పోషించడమే కష్టంగా ఉండేది. ఊరికి దూరంగా గుట్టల మధ్య ఉన్న కొద్దిపాటి భూమిలో.. కండలు కరగదీస్తూ సాగు చేసేవాడు నాన్న. చదువుకోకపోతే నేనూ అదే రాళ్లలో మిగిలిపోవాల్సి వస్తుందని అనిపించింది. బాగా చదవాలన్న పంతంతో వేములవాడకు వెళ్లి ఎనిమిదో తరగతిలో చేరాను. బీసీ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి పూర్తి చేశాను.

- Advertisement -

దళంలో చేర్చుకునేవారే..
పై చదువులు చదవాలన్నది నా ఆశయం. నన్ను ఎలాగైనా దళంలోకి తీసుకోవాలన్నది అన్నల ఆలోచన. అప్పట్లో రెబల్‌గా ఉండేవాణ్ని. నేను పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌ అవుతానని భావించారు వాళ్లు. కానీ, వీటిన్నిటికీ దూరంగా.. కరీంనగర్‌ వెళ్లి ఇంటర్‌లో చేరాను. అక్కడే డిగ్రీ చేశాను. కాకతీయ యూనివర్సిటీలో పీజీ, ఉస్మానియాలో పీహెచ్‌డీ చేశాను. బీఎడ్‌ కూడా పూర్తయింది. డీఎస్సీ రాసి టీచర్‌ ఉద్యోగం తెచ్చుకున్నా. కాటారం మండలంలో పోస్టింగ్‌ వచ్చింది. కానీ, నా లక్ష్యానికి ఉద్యోగం అడ్డుగా తోచింది. ఎవరెన్ని మాటలన్నా పట్టించుకోకుండా టీచర్‌ కొలువుకు రాజీనామా చేశాను. కెమిస్ట్రీలో పీహెచ్‌డీతో నాకు నెలకు రూ.3,200 సీఎస్‌ఐఆర్‌ ఫెలోషిప్‌ వచ్చేది. ‘సింథసిస్‌ ఆఫ్‌ యాంటీ మైక్రోబియల్‌ యాక్టివిటీ ఆఫ్‌ ఐసాక్సజోల్‌ డెరివేటివ్స్‌’ నా పరిశోధనాంశం. మరోవైపు ఫార్మా కంపెనీలో కెమిస్ట్‌గా పనిచేసిన అనుభవం నా ఆలోచనలను సానబెట్టింది. ఔషధాల తయారీ కంపెనీ పెట్టవచ్చన్న నమ్మకం కలిగింది.

టాప్‌ -20లో ఒకడిగా
2007లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పేపర్‌ ప్రజంటేషన్‌ ఇచ్చాను. సదస్సుకు హాజరైన అమెరికన్‌ శాస్త్రవేత్తలకు నా ఆలోచనలు నచ్చాయి. ఆరునెలలపాటు విజిటింగ్‌ సైంటిస్ట్‌గా అమెరికాకు రమ్మని ఆహ్వానించారు. డల్లాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ సౌత్‌ వెస్టర్న్‌ మెడికల్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌గా చేరాను. సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమెస్ట్రీలో పరిశోధన చేశాను. మరోవైపు డ్రగ్‌ ఇంజెక్ట్‌ చేయడం ద్వారా క్యాన్సర్‌ కణాలను నాశనం చేయవచ్చనే నా ప్రతిపాదనను మా యూనివర్సిటీ తరఫున నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐఏహెచ్‌)కు పంపాను. దానికి 20 మిలియన్‌ డాలర్ల గ్రాంట్‌ వచ్చింది. రెండున్నరేండ్ల పరిశోధన అది. అయితే, ఆరునెలల్లో పరిశోధన ముగుస్తుందనగా నేను ఇండియాకు వచ్చేస్తానన్నాను. కానీ, యూనివర్సిటీ పెద్దలు ఊరుకోలేదు సరికదా, నాకు తెలియకుండా దరఖాస్తు చేసి గ్రీన్‌కార్డ్‌ వచ్చేలా చేశారు. అలా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ 2010లో నాకు ‘వరల్డ్‌ బెస్ట్‌ కెమిస్ట్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డును ఇచ్చింది. ‘కెమికల్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ న్యూస్‌ జర్నల్‌’ కవర్‌ పేజీపై నా ఫొటో ముద్రించింది. వరల్డ్‌ టాప్‌- 20 సైంటిస్ట్‌లలో ఒకరిగా నిలిచాను.

‘మెరువాక్స్‌’తో ప్రయాణం
యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో ఉన్నప్పుడే ఫార్మా బిజినెస్‌ చేయాలని బలంగా ఉండేది. నా ఆసక్తిని గుర్తించిన యూనివర్సిటీ పాలకవర్గం నాకోసమే ప్రత్యేకంగా ఓ ల్యాబ్‌ కేటాయించారు. దానికి సమీపంలో మెరువాక్స్‌ ఫార్మా పేరుతో పరిశోధన సంస్థను ఏర్పాటు చేశాను. కొన్నాళ్లకు దాన్నే డెవలప్‌మెంట్‌ కంపెనీగా తీర్చిదిద్దాను. నా బృందంతో కలిసి ప్రముఖ ఫార్మా, బయోటెక్నాలజీ కంపెనీలకు హెచ్‌ఐవీ, హైపర్‌ టెన్షన్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మెడిసిన్ల తయారీకి అవసరమయ్యే ముడిసరుకుతోపాటు అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సర్వీసులు అందించే స్థాయికి చేరుకున్నా. ఈ ఏడాది చివరినాటికి దక్షిణాఫ్రికాలో ఫార్మా సంస్థను నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను పేటెంట్‌ తీసుకున్న బ్రెయిన్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఔషధాల పరిశోధనలు రెండో దశలో ఉన్నాయి. హ్యూమన్‌ ట్రయల్స్‌ తర్వాత ఔషధాలు విడుదల చేసే ఆలోచన ఉంది. మా సంస్థకు యూఎస్‌, యూకే, ఇటలీ, దక్షిణాఫ్రికా సహా 72 దేశాల్లో కస్టమర్‌ కంపెనీలున్నాయి. నేను ఏ దేశానికి వెళ్లినా అక్కడి భౌగోళిక పరిస్థితులు, వనరులు, ప్రభుత్వాల పనితీరు, ఉద్యోగాల సృష్టి.. ఇలా ప్రతి అంశాన్నీ గమనిస్తాను. నిపుణులతో చర్చిస్తుంటాను. అదే పద్ధతిని తెలంగాణలో అమలు చేస్తే ఎలా ఉంటుందన్నదీ ఆలోచిస్తాను. అంతర్జాతీయ సంస్థలు మన రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేలా ప్రోత్సహిస్తాను. తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషికి నావంతు సహకారం ఉండాలనేది నా ఆకాంక్ష.

అండగా ‘ఆద్య ఫౌండేషన్‌’
పురిటి గడ్డ రుణం తీర్చుకోలేకపోతే ఎన్ని సాధించినా వ్యర్థమే. పేద విద్యార్థుల చదువులకు, మహిళల విజయానికి, రైతుల వికాసానికి తోడ్పడాలనే ఉద్దేశంతో 2014లో నా కూతురి పేరిట ‘ఆద్య ఫౌండేషన్‌’ నెలకొల్పాను. సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. వేములవాడ, కోనరావుపేట, మేడిపల్లిలలో మెగా జాబ్‌ మేళాలు నిర్వహించి, 45 కంపెనీల్లో దాదాపు 500 మందికి ఉపాధి దొరికేలా చేశాను. కొవిడ్‌ ప్రభావం తగ్గాక యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించి, మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తాను. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు మా ఫౌండేషన్‌ తరఫున ఆర్థిక సహకారం అందిస్తున్నాం. స్టార్టప్‌లకు ఫండింగ్‌ చేస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలుగువారు గల్ఫ్‌లో కన్నుమూస్తే, వారి మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకురావడంలో చట్టపరమైన సాయం అందిస్తున్నాం. మా ఫౌండేషన్‌ తరఫున అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేస్తున్నాం. మరోవైపు, ఆధునిక పంటలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో వేములవాడ చుట్టుపక్కల గ్రామాల రైతులకు సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ప్రయోగాత్మకంగా క్వినోవా సాగు చేయించాం. దీన్ని విస్తరించే యోచన ఉన్నది. ప్రత్యేకించి మా ప్రాంతంలో ముంపు బాధితుల కోసం పరిశ్రమ ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. 2014 ఆగస్టు 13న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి డల్లాస్‌ అభివృద్ధి నమూనాను వివరించాను. ఆ సంద ర్భంగా ‘వేములవాడలో పుట్టిన బంగారం. ఎంత తవ్వుకుంటే అంత దొరికే సంపద ఈయన’ అని సీఎం గారు నన్ను ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేను. ప్రస్తుతం నేను ‘టీఆర్‌ఎస్‌- యూఎస్‌ అడ్వయిజరీ బోర్డు’ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాను.

నా విజయానికి కారణం.. నేను ఎదుర్కొన్న అవమానాలే. నన్ను ఎంతగా విమర్శిస్తే, అంత పట్టుదల పెరిగేది. ఎనిమిదో తరగతి చదువుకోవానికి వేములవాడకు వెళ్తుంటే కొందరు అడ్డుకున్నంత పనిచేశారు. పైచదువులకు వెళ్లినకొద్దీ అవమానాలు పెరిగాయి. టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు, తమ్ముళ్లను విదేశాలకు పంపినప్పుడు.. ఇలాంటి మాటలే ఎదురయ్యాయి. నేను అమెరికాకు వెళ్లేటప్పుడూ నిష్ఠూరాలాడారు. అమెరికాలో స్థిరపడిన తర్వాత కూడా ఆ నోళ్లకు తాళం పడలేదు. ఆ మాటలే నాలో కసి పెంచాయి. వాళ్లందరికీ ఇప్పుడు ధన్యవాదాలు చెబుతున్నా!

ఉద్యమంలో భాగస్వామ్యం
నేను ఊరు దాటి వెళ్లి చదువుకోవడానికి అంబేడ్కర్‌ మాటలు కారణమైతే, నా ఎదుగుదలకు కేసీఆర్‌ గారి ఆలోచన ఉపయోగ పడింది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు సహ విద్యార్థులతో కలిసి కేసీఆర్‌ గారిని కలుస్తుండేవాణ్ని. లక్ష్యం అన్నది మనసులో బలంగా ఉంటే, తప్పక నెరవేరుతుందని తరచూ చెప్పేవారు. ఆయనతో ఉన్న అనుబంధం కారణంగా, మలిదశ ఉద్యమంలో పాల్గొన్నా. తెలంగాణ ప్రజలు అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న సవాళ్లు, నీళ్లు, నిధులు, నియామకాల్లో జరిగిన ద్రోహాన్ని పేర్కొంటూ 40 నిమిషాల నిడివితో డాక్యుమెంటరీ రూపొందించాం. దీనికి నేనే దర్శకత్వం వహించాను. 2014 ఏప్రిల్‌ 30న జంతరమంతర్‌ దగ్గర దీన్ని ఆవిష్కరించాం. పార్లమెంట్‌ లోపల, బయట 500 డీవీడీలు పంచాం. అనేకమంది రాజకీయనాయకులను కలిసి సమస్యను వివరించాం. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, సుష్మా స్వరాజ్‌ సహా సీనియర్‌ నేతలు ఈ డాక్యుమెంటరీని చూసాక.. ‘ఇంత జరుగుతున్నదా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అప్పటి ప్రభుత్వం నాపై ఓ తప్పుడు కేసు కూడా పెట్టింది. ఆ కేసు కోసం మూడేండ్లు అమెరికా నుంచి రావాల్సి వచ్చింది. రాష్ట్రం వచ్చాక, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూశాక.. మేం పడిన శ్రమ వృథా కాలేదన్న సంతృప్తి ఉంది.

సైంటిస్టుగా హ్యాపీ..
సైంటిస్టుగా మంచి గుర్తింపును పొందాను. అమెరికా వెళ్లిన ఏడాదిలోనే ‘బెస్ట్‌ ప్రాసెస్‌ డెవలప్‌మెంట్‌ సైంటిస్టు’ అవార్డును అందుకున్నా. ఏ ఔషధాన్ని అయినా విడుదలకు ముందు పరీక్షించే యూఎస్‌ఏ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ బృందంలో ఒకడినయ్యాను. యూఎస్‌ఏ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) గ్రాంట్‌ రివ్యూ కమిటీ మెంబర్‌గా, అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ బోర్డ్‌, అమెరికన్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ బోర్డ్‌, ఇంటర్నేషనల్‌ సైన్స్‌ రివ్యూ కమిటీ బోర్డ్‌ సభ్యుడిగా సేవలు అందిస్తున్నాను.

సి.ఈశ్వర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana