తన పాటల పదనిసలతో సినీ ప్రియులను పరవశింపజేస్తారు. తన పదాల మధురిమలతో మనసుల్ని మత్తెక్కిస్తారు.సినీగీతాల పూదోటలో సాహితీ పరిమళాల్ని వెదజల్లుతారు. ఆయనే.. అలుపెరుగని అక్షరమై ముందుకు సాగుతున్న యువ సినీ గేయ రచయిత లక్ష్మణ్ గంగా. న్యాయవాదిగా అన్యాయాన్ని ఎదిరించడం కోసం మాటను బాటగా చేసుకొన్నారు. కవిగా సామాజిక చైతన్యాన్ని సాధించడం కోసం పాటను ఆయుధంగా ఎంచుకొన్నారు. తెలంగాణ సినిమా కవులు
అనన్యమైన భావ గాంభీర్యం, కవితా సౌందర్యం.. లక్ష్మణ్ గంగా పాటల సొంతం. తన స్వస్థలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల సమీపంలోని కోల్వాయి. తల్లిదండ్రులు స్వర్ణలత, జక్కుల బొందయ్య. ఏడో తరగతి నుంచే పాటలు రాసేవారు, పాడేవారు. అప్పుడే, సినిమా పాటలకు ప్రాణంపోయాలన్న సంకల్పం మొలకెత్తింది. జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, డిగ్రీ చదివారు. హైదరాబాద్‌లో ఎల్ఎల్బీ చేసి, తెలుగు విశ్వ విద్యాలయంలో ‘జానపద కళలు’ ప్రత్యేక అంశంగా ఎంఏ పట్టా పొందారు.
సందేశాలిస్తూ..
విద్యార్థి దశ నుంచే సినిమా అవకాశాలకోసం ప్రయత్నించారు. కృషి ఫలించి 2012లో ‘మన ఊరి సాక్షిగా’ చిత్రంలో మొదటి అవకాశం దక్కింది, ‘సమయం లేదు సమరంలోన ముందుకే నువు సాగు.. సరదా వదిలి గమనంలోన దూసుకు నువు వెళ్లు’ అనే పాటతో చిత్ర సీమలోకి ప్రవేశించారు. మొదటి గేయంతోనే ఉత్తమ సందేశాన్నిస్తూ అందరినీ ఉత్తేజపరిచారు. ఆగిపోని నడకతో గమించమని, అలపు లేని పయనంతో దూసుకెళ్లమని.. ఈ పాట ప్రబోధిస్తుంది. అతని పాటలానే కలం కూడా శరవేగంగా దూసుకెళ్లింది. ఎన్నో అవకాశాలను చేజిక్కించుకొంది. 2013లో ‘యాంబిషన్.. నీ ప్రేమకోసం’ చిత్రంలోనూ ‘సాహసమే ఊపిరై నీవే సాగిపోవా.. మౌనముగా పయనమై తీరం చేరుకోవా’ అంటూ ప్రబోధాత్మక గీతాన్ని అందించారు. ‘జడివాన వస్తున్నా కదలదుగా శిఖరం’ అన్న వాక్యంలో, ఎన్ని సమస్యలు ఎదురైనా ధైర్యంతో ఉండాలని తెలియజెప్పారు.
ప్రేమ పాటల్లోనూ..
సున్నితమైన భావాలను పలికిస్తూ ప్రేమపాటలు రాయడంలో లక్ష్మణ్ గంగాకు తిరుగులేదు. 2014లో వచ్చిన ‘మళ్లీ రాదోయ్ లైఫ్’ సినిమాలోని పాటలూ తనే రాశారు. ముఖ్యంగా ‘మళ్లీ రాదోయ్ లైఫ్.. చేయి చేయి కలుపు, నీదో నాదో గెలుపు పదవోయ్’ అంటూ సాగే టైటిల్ సాంగ్ద్వారా యువతకు చక్కని సందేశాన్నిచ్చారు. ‘ఏదైనా సాధించాలనే తపన ఉంటే, నమ్మకం, పట్టుదలకూడా తోడైతే
ఈ ప్రపంచానికే నువ్వు నాయకుడవవుతావు’ అంటారీ పాటలో. 2018లో వచ్చిన ‘అంతా మన మంచికే’ చిత్రం కోసం ‘మెరుపు గీసిన బొమ్మలా.. చినుకు రాసిన లేఖలా’ అనే ప్రేమ
గీతాన్ని అందించారు. ఇందులో ‘చినుకు రాసిన లేఖ’ అనే అభివ్యక్తి పాట మొత్తానికే వన్నె తెచ్చింది. ఇలాంటి కొంగొత్త ప్రయోగాలు తన పాటల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. ‘నీలి నీలి నీ కళ్లు చూస్తే మబ్బల్లే కమ్మెనే మనసంతా’ అనే పంక్తిలో ‘నీలి కళ్లు’, ‘మనసు మబ్బులా కమ్ముకోవడం’ వంటి పదబంధాలు పాటలోని
సాహితీ గరిమను మరింత పెంచాయి.
‘మూడు కోట్ల’ వీక్షణలతో..
లక్ష్మణ్ గంగాకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది ‘జరజాజ.. జాజ.. పెదవంచు రాసె లేఖ దూరాన్ని ఓపలేక’ పాట. విడుదలకు సిద్ధంగా ఉన్న ఓ సినిమాలోని ఈ పాట.. మూడు కోట్ల వీక్షణలతో యూట్యూబ్‌లో సందడి చేస్తున్నది. అంతేకాదు, ‘మయూరి ఆర్ట్స్’ నుంచి ‘బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు’ కూడా తెచ్చి పెట్టింది. ఇందులోని ‘తుమ్మెద బంధాలు కలిపెయ్యనా? మన్మథ బాణాలు వేసెయ్యవా?’ అనే పంక్తులు శృంగారభావ సౌందర్యానికి నిలువెత్తు ప్రతీకలు. వీటితోపాటు ‘సాగే నీ దారిలో’, ‘ఇది కథ కాదు’, ‘నా సీతామాలక్ష్మి’, ‘కొంచెం రన్ కొంచెం ఫన్’ మొదలైన సినిమాల్లో 100కు పైగా పాటలు రాశారు. దాదాపు 150కి పైగా ప్రైవేటు గీతాలు అందించారు. 2011లో నంది పురస్కారాన్ని, 2017లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖనుంచి ‘యువకవి’ పురస్కారాన్ని దక్కించు కొన్నారు లక్ష్మణ్ గంగా.
వృత్తికారులకు హారతి
2019లో విడుదలైన ‘చెడ్డీ గ్యాంగ్’ సినిమాకోసం ‘పూవుల ఒంపుల్ మెరిసేనోయ్.. ఉదయమందున కిరణమై’ అంటూ హుషారు గీతాన్ని అందించారు. 2020లో ‘కనలేదే నువ్వని’ సినిమాలో రాసిన టైటిల్ సాంగ్కూడా లక్ష్మణ్‌కు మంచిపేరు తెచ్చింది. అదే ఏడాది వచ్చిన ‘కళాకార్’ సినిమాకోసం ఓ అద్భుతమైన గీతాన్ని అందించారు. ‘వెండితెరల్లో.. ఓ.. వెండి తెరల్లో వెలవెలబోయి వెలుగుతున్నా ఓ కళాకార్’ అంటూ వృత్తి కళాకారుల జీవితాలకు హారతి పట్టారు. చేనేత, వడ్రంగి, కుమ్మరి, జాలరి, మేదరి మొదలైన వృత్తి కళాకారుల ప్రతిభను అక్షరీకరించారు.
తిరునగరి శరత్ చంద్ర
6309873682