జపాన్ లాంటి దేశాల్లో ఆయుః ప్రమాణం కాస్త ఎక్కువే అన్న విషయం తెలిసిందే! వారి జన్యువులు, ఆహారపు అలవాట్లు, జీవనశైలి దీనికి కారణం. కానీ, ‘ఒకే దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇలాంటి తేడా ఉండే అవకాశం ఉందా?’ అనే అనుమానం వచ్చింది అమెరికన్ పరిశోధకులకు. అంతేకాదు, ఒక చోటు నుంచి మరో చోటుకు మారడం కూడా ఆయుర్దాయం మీద ప్రభావం చూపుతుందా అన్నదీ తెలుసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం, ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం వయోధికుల వివరాలు సేకరించారు. వారిలో 15 ఏండ్ల పాటు స్థిరంగా ఉన్నవారి ఆయుః ప్రమాణాన్ని, మరో చోటుకు వలస వెళ్లి స్థిరపడినవారితో పోల్చి చూశారు. ఆశ్చర్యంగా, కొన్ని ప్రాంతాలకు వలస వెళ్లినవారు మరింత కాలం జీవించినట్టు గమనించారు. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా… ఆయా ప్రాంతాల్లోని కాలుష్యం, వైద్య సదుపాయాలు, ఆరోగ్యం పట్ల అవగాహన లాంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు.