దక్కన్ గ్యారేజ్.. అన్ని రకాల ‘అడాప్టెడ్’ వాహనాల తయారీకి చిరునామా. కాళ్ల్లులేనివారి డ్రైవింగ్ కలను నిజం చేసే వేదిక. ఎలాంటి వాహనాన్ని అయినా.. దివ్యాంగులకు అనువుగా మలిచే కార్ఖానా. ఆర్టీఏ నుంచి అనుమతి పొందిన ఏకైక సంస్థ కూడా ఇదే. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ ఆధారంగానే అధికారులు దివ్యాంగుల కార్లకు లైసెన్స్ జారీ చేస్తారు. ఈ గ్యారేజ్ హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉంది.
అది 1975. అప్పటికి మహ్మద్ నవాజ్ ఖాన్ దక్కన్ గ్యారేజీని ప్రారంభించి ఇరవైనాలుగేండ్లు అవుతున్నది. తనకు హమీద్ ఉల్లా అనే దివ్యాంగ స్నేహితుడు ఉండేవాడు. అతనికి డ్రైవింగ్ చేయాలని ఆశ. ఆ విషయాన్ని మిత్రుడు నవాజ్ ఖాన్‌తో చెప్పుకొని బాధపడేవాడు. వైకల్యాన్ని తలుచుకొని ఆవేదన చెందేవాడు. మిత్రుడి పరిస్థితికి చలించిపోయిన నవాజ్ ఖాన్, తనవంతుగా ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. హమీద్‌కు అనుగుణంగా వాహనాన్ని రీమోడల్ చేయడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. అంతిమంగా, మోపెడ్‌ను కొంత మార్చి.. త్రీ
వీలర్‌గా రూపొందించాడు. దాన్ని స్నేహితుడికి బహుమతిగా ఇచ్చాడు. అప్పటి కార్మిక మంత్రి అంజయ్యసాబ్ సమక్షంలోనే దోస్తు చేతికి బండి తాళాలు అందించాడు నవాజ్‌ఖాన్. కాళ్లు లేని వ్యక్తి మూడు చక్రాల వాహనం నడపటం చూసి అంతా ముక్కున వేలేసుకొన్నారు. అప్పటి నుంచీ నవాజ్ ఖాన్ దివ్యాంగుల కోసం వాహనాలను రీమోడలింగ్ చేయడం మొదలెట్టాడు. ఊతకర్ర సాయంతో ఆశగా దక్కన్ గ్యారేజీకి వచ్చేవారి సంఖ్య పెరిగింది.
తండ్రి ఆశయం కోసం
తండ్రి ఏర్పాటు చేసిన దక్కన్ గ్యారేజీని అంతే అంకితభావంతో నడుపుతున్నాడు తనయుడు మహ్మద్ షాజోర్ ఖాన్. వాహనాలను రీమోడలింగ్ చేయాలంటే కేంద్ర, రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. ఏఆర్ఏఐ (ఆటోమొటివ్ రిసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం ఉంటేనే వాహనాల రూపురేఖలు మార్చాలి. ఆ సర్టిఫికెట్ ఆధారంగానే ఆర్టీఏ అధికారులు అంగీకారం తెలుపుతారు. దక్కన్ గ్యారేజీకి ఆ అరుదైన అనుమతి లభించింది. ఈ రోజుల్లో దివ్యాంగులు కూడా కార్లను డ్రైవ్ చేస్తున్నారంటే అదంతా.. దక్కన్ గ్యారేజీ తయారు చేసే అడాప్టెడ్ వాహనాలతోనే సాధ్యం అవుతున్నది. దివ్యాంగుల పరిమితిని అర్థం చేసుకొని క్లచ్, బ్రేకులు, ఎక్స్‌లేటర్ అమర్చుతారు. సీటింగ్‌లో కూడా మార్పులు చేస్తారు. మామూలు కార్లే కాదు.. బీఎండబ్ల్యూ, బెంజ్ తదితర వాహనాలనూ రీమోడలింగ్ చేస్తారు. దక్కన్ గ్యారేజీ సుమారు 15 మందికి ఉపాధిని కల్పిస్తున్నది. తెలుగు రాష్ర్టాల్లో ఏ దివ్యాంగుడు వాహనం కొనుగోలు చేయాలన్నా ఇక్కడికి రావాల్సిందే. దక్కన్ గ్యారేజ్‌ను ఫోన్ః 040-48504054లో సంప్రదించవచ్చు.
సేవలోనే సంతృప్తి
ఇతర రాష్ట్రాల నుంచి కూడా రీమోడలింగ్ ఆర్డర్స్ వస్తుంటాయి. ఇటీవల బైక్ అంబులెన్స్‌ను రూపొందించాం. నగరాల్లో చాలా వరకూ ఇరుకిరుకు బస్తీలే. ఆ గల్లీల్లోకి సులువుగా వెళ్లి పేషెంట్‌ను తీసుకొచ్చేలా బైక్ అంబులెన్స్‌ను డిజైన్ చేశాం. అందులో ఆక్సిజన్‌తో పాటు అన్ని రకాల అత్యవసర ఎక్విప్మెంట్ ఉంటుంది. వికలాంగులు, రోగుల సేవలో భాగమైనందుకు చాల
సంతృప్తిగా ఉంది.