e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 23, 2021
Advertisement
Home కథలు తక్కెడ

తక్కెడ

తక్కెడ

సమయం.. సాయంత్రం ఆరు గంటలు.“టమాట.. బెండకాయ.. వంకాయ.. ఏవైనా కిలో నలభై.. అగ్గువ.. అగ్గువ.. రావాలె.. రావాలె”దర్గా సంతలో.. కూరగాయలు అమ్మే నర్సమ్మ, గట్టిగా అరుస్తూ పిలుస్తున్నది.కరోనా రాకుండా కట్టుకున్న మాస్కు.. మూతి కిందికి జారింది.“టమాటలు రెండు కేజీలు తీసుకుంటా.. ముప్పై రూపాయలకిస్తవా?” ఒకామె బేరమాడింది.“గిట్టదమ్మా.. నాకే ముప్పై ఐదు చొప్పున పడ్డది. రోజంతా కష్టపడితే ఐదు రూపాయలు దొర్కకపోతే ఎట్టా బతికేది..? ఓ అమ్మా.. బోణీ బేరం నువ్వే.. అడిగి ఉత్తగనే పోతున్నవ్‌”నర్సమ్మ పిలుస్తున్నా ఆ మనిషి ఆగకుండా పోయింది.‘బోణీ బేరమే ఇట్లయింది. ఇంక ఇయ్యాళ్ల తెల్లారినట్టే..’ మనసులోనే గులిగింది.
హైదరాబాద్‌ శివారులోని దర్గా, మణికొండలాంటి కాలనీల్లో వారంలో రోజుకో చోట సంత జరుగుతుంది. కూరగాయలు అమ్మేటోళ్లు, ఇనుప మూకుళ్లు అమ్మే సిక్కులోళ్లు, మాంసం దుకాణాలు, పాత బట్టలు, మిఠాయిల దుకాణాలు.. ఇలా రకరకాల బేరగాళ్లు అక్కడికి వస్తారు.

రోడ్డుకు అటుపక్క ఇటుపక్క.. ఎక్కడ జాగా దొరికితే అక్కడ కూర్చొని అమ్ముతారు. ఆ సంతకు దగ్గర్లోనే మోర్‌, డీమార్టు లాంటి సూపర్‌ మార్కెట్లు ఉన్నాయి. ఐతే అవి పైసలున్నోళ్లకే. కూలీనాలీ చేసి బతికే జనాలు ఇలాంటి సంతలోనే వారానికి సరిపోయే సామాన్లు కొనుక్కుంటరు.
నర్సమ్మను అక్కడ పల్చగా ఉన్న జనం కంటే.. ఆకాశంలో గుంపులుగా ఉన్న మబ్బులే చాలా భయపెడుతున్నాయి. ‘ఎప్పుడు వాన పడుతదో’ అనే భయంతో నిమిషానికోసారి ఆకాశం వైపు భయం భయంగా చూస్తున్నది. కూరగాయలు అమ్మేటోళ్లకు వర్షాకాలం అంటే పెద్ద గండమే! ఎప్పుడు కురుస్తదో తెలియని వానకు భయపడి జనాలు సంతకు రారు. వానకు తడిస్తే కూరగాయలు పాడైపోతయి. పాలకూర, మెంతికూర లాంటి ఆకుకూరలు ఉట్టిగనే పాశిపోతయి.
“వట్టి చేపలు.. పాకెట్‌ పది రూపాయలు” అని అరుస్తూనే “ఓ నర్సక్కా.. వందకు చిల్లర ఉంటే ఇయ్యవా?” అంటూ పిలిచింది పక్కనే కూర్చున్న ఎల్లమ్మ.

వాళ్లు పక్కపక్కనే ఉన్నా గట్టిగా అరిస్తే కానీ వినపడదు. అమ్మకందార్ల కేకలతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది.కరోనా మొదలైనంక జనాలు సంతకు రావడం తగ్గింది. అసలు పట్నంలనే జనం తగ్గారు. చాలామంది ఊళ్లకు పోయిండ్రు. కరోనా వచ్చినంక సంతలే కాదు, అసలు పట్నం మొత్తమే ఏదో కళ తప్పినట్టు అయింది.నర్సమ్మ భర్త అప్పులు ఎక్కువై ఆత్మహత్య చేసుకొని పదేండ్లు దాటింది. ఆ రోజు నుంచి ఒక్కతే ఇద్దరు ఆడపిల్లలను సాకుతూ.. ప్రతీక్షణం బతుకుతోని కొట్లాడుతనే ఉంది. పెద్ద బిడ్డ గురుకుల హాస్టళ్ల ఇంటర్‌ చదువుతున్నది. చిన్నబిడ్డ సర్కారు స్కూళ్లో పదో తరగతి.‘బిడ్డలను బాగా సదివియ్యాలె’ అనేది నర్సమ్మ కోరిక. దానికోసమే కంటికి నిద్ర లేకుండా కష్టపడుతున్నది.ఇంతలనే నర్సమ్మ నడుముకు దోపుకున్న చెయ్యి సంచిల సెల్లు రింగ్‌ అయ్యింది. ‘ఎవరా’ అని చూసింది. ‘చిట్టీల శంకర్‌..’ అతని పేరు చూడగానే ఉలిక్కి పడ్డది. అతని దగ్గర యాభై వేలు డైలీ ఫైనాన్స్‌ తీసుకుంది. దాని కింద రోజూ ఐదొందల చొప్పున వంద రోజులు వసూలు చేసుకుంటడు. వడ్డీ కింద ముందుగాలనే.. పది వేలు కట్‌ చేసుకుంటడు. ఇచ్చింది నలభై వేలు ఐతే.. కట్టేది యాభైవేలు. ఒక్కరోజు ఇయ్యకపోయినా ఆగమాగం చేస్తడు. శంకర్‌.. మళ్ల ఫోన్‌ చేస్తనే ఉన్నడు. ఫోన్‌ రింగ్‌ అయితనే ఉంది. పొద్దున జరిగిన గొడవ గుర్తుకొచ్చి నర్సమ్మ కండ్లలో నీళ్లు తిరిగినయి.

ఒకపక్క కరోనా.. ఇంకోపక్క వాన ముసురు. సంతల కూరగాయలు కొనేటోళ్లు తగ్గిపోయారు. వారం రోజులనుంచి ఐదొందలుకూడా బేరం కావట్లే. వచ్చిన పైసలు ఆటో కిరాయిలకే సరిపోతున్నయి. రోజూ పొద్దుగూకంగనే ఎక్కడ సంత ఐతే అక్కడికి వస్తున్నడు శంకర్‌. బేరాలు కానిదే చిట్టీ ఎక్కడికెళ్లి కడతది.రెండ్రోజులు ‘రేపు ఇస్త.. మాపు ఇస్త’ అని వాయిదా వేసింది.“చేతగాని దానివి ఎందుకు ఫైనాన్స్‌ తీసుకున్నవ్‌..” అంటూ అమ్మనా బూతులు తిట్టుకుంట పోయిండు. నిన్న మణికొండ సంతలకూడా ఐదొందలు కాలేదు. ఇగ శంకర్‌ వస్తే.. పెద్ద గొడవ ఐతదని భయపడతనే ఉంది. అంతలోనే పేద్ద వాన.. గబగబ కూరగాయలు మూట గట్టుకొని ఒక ఆటో కిరాయికి మాట్లాడుకొని ఇంటికి పోయింది. ‘హమ్మయ్య.. ఒక్కనాడన్నా శంకర్‌ గాని గండం తప్పింది’ అని అనుకుంది. కానీ, తెల్లవారక ముందే ఇంటిదగ్గరకొచ్చి లొల్లి చేయబట్టిండు.“రాత్రి బాగా వాన కురిసింది.. వంద రూపాయలు కూడా బేరం కాలేదు. అందుకనే ఇంటికొచ్చిన. నీకు ఫోన్‌ చేద్దామంటే ఫోన్‌ ఛార్జింగ్‌ ఐపోయింది. నీకు తెల్వనిది ఏముంది. ఇయ్యాల దర్గా సంత కద. అక్కడ ఎంత లేదన్న మూడు వేల దాకా గిరాకీ ఐతది. మొత్తం నీకే ముట్ట చెబుత..” అని బతిమాలుకుంది.


ఐనా శంకర్‌ వచ్చింది డబ్బుల కోసం కాదని వాని మాటలనుబట్టి అర్థమైంది.
“చేతగానోళ్లు ఎందుకు చేస్తరమ్మా బేరాలు.. నీకు చేతకాకపోతే నీ బిడ్డతోని చేయి బేరాలు. పిల్ల వయసుమీద ఉంది కదా.. మంచి గిరాకీలు వస్తయి” అని వెకిలిగా మాట్లాడిండు.
తననెన్ని మాటలన్నా భరించింది. కానీ, బిడ్డను అనేసరికి తట్టుకోలేకపోయింది.
“దొంగ లమ్డీ కొడుకా.. ఏం మాట్లాడుతున్నవ్‌ రా!” అని చెప్పు తీసుకుని నాలుగు బాదింది. ఆ గొడవకు చుట్టుపక్కల జనం పోగైండ్రు.
“నా దగ్గర అప్పు తీసుకున్నది. ఇయ్యమంటే నన్నే కొడ్తంది..” అని దొంగ ఏడ్పులు ఏడ్శిండు శంకర్‌.
“నీ బొందల పైసల్‌.. పొద్దుగాల దర్గా సంతకాడికి రాపో.. నీ మొఖాన పడేత్త” అని అందరి ముందట ఈడ్చి కొట్టినట్టు చెప్పింది.
“పొద్దుగాల పైసల్‌ ఇయ్యకపోవాలె.. నీ సంగతి చెప్త” అనుకుంట చినిగిపోయన అంగీ, పాయింటు సర్దుకుంట అక్కన్నుంచి పోయిండు.
ఒక్క నర్సమ్మదే కాదు.. చిన్న చిన్న బేరాలు చేసే అందరిదీ అదే కథ. ఈ డైలీ ఫైనాన్స్‌ నడిపేటోళ్లు జలగల్లాగ రక్తం తాగుతరు.
డబ్బులు ఇయ్యకపోతే అన్ని రకాలుగా దోచుకుంటరు.

తేళ్లు పాకినట్లు జరజరా పాకుతున్నయి ఆకాశంలో మబ్బులు. శంకర్‌ మళ్ల ఫోన్‌ చేసిండు. చాలా సేపట్నుంచి చేస్తున్నడు. ఇక తప్పక లిఫ్ట్‌ చేసింది.
“ఏం సంగతి నర్సమ్మ.. వచ్చినవా లేదా..?”
“ఇస్తా అన్న కద.. తొమ్మిదింటి కల్లా రా..” అని ఫోన్‌ కట్‌ చేసింది.
“పాలకూర ఎంత? కొత్తి మీర ఎంత?” అంటూ మూతికి కట్టుకున్న మాస్కు లోపలనుంచే వట్టిగ అడిగిపోతున్నరు జనం. చాలామంది కొంచెం సేపు సంత అంత తిరిగి వస్తరు. అదొక ఆనందం. చిట్టీల శంకర్‌కు మూడువేలు ఇయ్యాలెనన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా గుండె గుభిల్లుమంటున్నది. ఒక పక్క
‘ఎక్కడ వాన వచ్చి కూరగాయలు పాడైతయో’ అనే భయంల ఉన్న నర్సమ్మకు.. జనాలు గీసి గీసి బేరమాడటం చూసి కోపం వస్తున్నది.
ఓ పెద్దమనిషి వచ్చిండు. మొఖానికి ఖరీదైన మాస్కు వేసుకున్నడు. అతనితోపాటు ఇద్దరు మనుషులు కూడా వచ్చిండ్రు. వాళ్ల చేతుల్ల పెద్ద పెద్ద సంచులున్నయ్‌. చూడబోతే ఎక్కువ కూరగాయలు కొనేటట్టు ఉన్నరని ఆశపడ్డది నర్సమ్మ.
“ఏమ్మా .. టమాట, వంకాయలు, బెండకాయలు పది కేజీల చొప్పున కావాలె. ఎంత తగ్గిస్తవు” అని అడిగిండు.
ఒక్కసారిగా నర్సమ్మకు పానం లేచి వచ్చింది.
“సార్‌.. మాములుగా ఐతే నలభై చొప్పున అమ్ముత. పది కేజీలు అంటున్నరు కద. నాకు పడ్డ ధర ముప్పై ఐదు చొప్పున ఇస్త. తీసుకోండ్రి సార్‌” బతిమాలినట్లే అడిగింది.
నర్సమ్మ మాట తీరు చూస్తే.. ‘బేరం లాగితే ఇంకా తగ్గేట్లుంది’ అని అర్థమైంది.
“కిలో ముప్పై చొప్పున ఇస్తవా..” అని బేరానికి దిగిండు.
“పడదు సారూ.. నాకు పడ్డదే మూప్పై ఐదు” తేల్చి చెప్పింది నర్సమ్మ.
“ఔ సారూ.. ఇంతగనం కొంటున్నరు.. ఏమన్న ధావతు గిట్ల ఉన్నదా?” మాటల్లో పెడితే మనసు కరుగుతుందని ఆశపడి మళ్లీ అడిగింది.
“ఔనమ్మా.. రేపు మా మనవడి బర్త్‌ డే ఉన్నది. పెద్ద దావత్‌ ఇస్తున్నం”
“లక్ష రూపాయలు పెట్టి దావత్‌ చేస్తరు కద సారు. మా దగ్గర ఐదు రూపాయల కోసం గీసిగీసి బేరమాడుతున్నరా. మేం కూడా బతుకాలే కద సారూ..”
నర్సమ్మ మాటలకు అహం దెబ్బతిన్నది ఆ పెద్దమనిషికి. పైగా కూరగాయలు అమ్మే ఆడమనిషి తనను ప్రశ్నించడం అవమానంలా అనిపించింది.
“ఏమ్మా.. ఇస్తే ఇయ్యి.. లేకుంటే లేదు” అని కోపంగా వెళ్లిపోయాడు.
అయినా, ఆ పెద్దమనిషి వెనకాల బతిమాలుకుంటూ వెళ్లింది నర్సమ్మ.

“సారూ.. ఏమనుకోకుర్రి. నా పిల్లల మీద ఒట్టు. నాకు పడ్డదే కేజీ ముప్పై ఐదు రూపాయలు. ఆ చొప్పున ఇస్త.. తీసుకోర్రి”నర్సమ్మ బేరానికి దిగినట్లు అనిపించగానే..“కిలో ఇరవై చొప్పున ఇస్తవా?” ఇంకా తగ్గించాడు.“అదేంది సారూ.. ఇప్పుడే ముప్పైకి అడిగిండ్రు కదా!” బిత్తరపోయినట్టు అడిగింది.“మరి అప్పుడే ఇస్తే ముప్పై రూపాయలు ఇచ్చేటోడ్ని. అవసరం నీది. ఇరవైకి ఇవ్వు..?” వెకిలిగా నవ్వాడు ఆ పెద్దమనిషి.ఏమీ మాట్లాడకుండా వెనక్కి వచ్చి కూర్చుంది నర్సమ్మ. ఇలాంటి బేరాలు నర్సమ్మకు కొత్తేం కాదు. కూరగాయలు జోకేటప్పుడే కాదు.. కూరగాయలు బేరం చేసే జనాల మధ్యకూడా అక్కెరని బట్టి బతుకు తక్కెడ అటూ ఇటూ మొగ్గు చూపుతుంది.ఇంతలనే మోటర్‌ సైకిల్‌ మీద శంకర్‌ రానే వచ్చిండు. యమదూతను చూసినట్లు ఉలిక్కి పడ్డది. ఏం మాట్లాడకుండ వచ్చి మౌనంగా నిలబడ్డడు. గుర్రుమంటూ గుడ్లు మిటకరిస్తుండు. నర్సమ్మ పైసల డబ్బాలోకి చూసింది. నాలుగైదు పాత పది రూపాయల నోట్లు, రెండు యాభై రూపాయల నోట్లు ఎక్కిరించినట్లు చూసినయ్‌.“రెండువేల నోట్లకు చిల్లరకోసం మనిషిని పంపిన.. మిగిలిన దగ్గర వసూలు చేసుకొని ఒక పావు గంట తర్వాత రాపో..” అని చెప్పింది.

కాసేపు కిందామీదకి చూసిండు.నువ్వు ఇయ్యాల డబ్బులు ఇయ్యకపోవాలె.. నీ సంగతి చెప్తా..” అని ఇంకో దిక్కు పోయిండు.పక్కనే వట్టిచాపలు అమ్మే ఎల్లమ్మను బదులు అడిగింది.
“నా బేరం ఎంతదక్కా.. తిప్పితిప్పి కొడితే ఐదు వందలు కావు.. నాకాడ ఉంటే ఇయ్యనా అక్క” బాధ పడుతూ చెప్పింది ఎల్లమ్మ.సరిగ్గా అప్పుడే.. ‘తటిళ్‌’మంటూ ఒక్కసారిగా ఆకాశంలో మెరుపు. ఆ వెంటనే గుండెలు దద్దరిల్లేలా ఒక్కసారిగా ఉరుము. ఉలిక్కిపడింది నర్సమ్మ. చూస్తుండగానే చెరువు కట్ట తెగినట్లు.. కుంభవృష్టి మొదలైంది. ఊహించని ఆ వానకు ‘పులిని చూసిన మేకల్లా’ జనం తలోదిక్కు ఉరుకుతున్నరు. ఐదే ఐదు నిమిషాల్లో.. అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. సంత అంతా నీటి మడుగులాగా కనిపిస్తున్నది. గిరాకీ ఆశలు వదిలేసుకొని చాలామంది బేరగాళ్లు అక్కడినుంచి మూటాముల్లె సర్దుకొని ఆటోలల్ల ఇంటిబాట పట్టిండ్రు.“నర్సక్కా.. చూడబోతే వాన ఇంకా పెరిగేలా ఉంది. నేను పోతున్న. నువ్వుకూడా ఆటో తీసుకొని పో..” అంటూ ఎల్లమ్మ కూడా గబగబా పోయింది. నర్సమ్మకు ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. అప్పటి దాకా ఉన్న ‘దింపుడు కల్లం ఆశ’ కూడా కొట్టుకుపోయింది. కండ్ల ముందట టమాటలు, బెండకాయలు, వంకాయలు తడిసిపోతున్నయ్‌. పాలకూర, మెంతికూర కట్టలు నీళ్లమీద సుడి తిరుగుతున్నయ్‌. డబ్బులే నీళ్లలో కొట్టుకొని పోతున్నట్టు అనిపించింది. వాననీటికి పోటీగా నర్సమ్మ కండ్లల్ల నీరు కారబట్టింది. వానల అట్లనే కూలబడిపోయింది.

వాన జోరు పెరిగింది.. చూస్తుండగనే సంత ఖాళీ ఐపోయింది. దూరంగా అక్కడొకరు ఇక్కడొకరు తడువకుండ చెట్ల కిందా, రేకుల కిందా దాక్కున్నరు. ఇంత వానల కూడా కదలకుంట రాయిలాగా కూర్చున్న నర్సమ్మ వైపు విచిత్రంగా చూస్తున్నరు. కుండకు చిల్లులు పడ్డట్టు కురుస్తనే ఉన్నది వాన. గబగబ లేచిపోయి దూరంగా ఉన్న ఇటుక పెళ్లలు తెచ్చి, నీళ్లు లోపలికి రాకుండా అడ్డంగా పెట్టింది. బోరున కురుస్తున్న అంతపెద్ద వానను కూడా లెక్కచేయలేదు నర్సమ్మ.
“టమాట, బెండకాయ.. పాలకూర.. అగ్గువ.. అగ్గువ.. రావాలె.. రావాలె..” అని తడుచుకుంటూనే అరుస్తున్నది.నర్సమ్మ మాటలు వాన సప్పుడికి వినపడటం లేదు. అసలు ఆ చుట్టు పక్కల జనం కూడా లేరు. అయినా ఒంట్లోని శక్తి మొత్తం కూడదీసుకొని పిలుస్తనే ఉంది. కరెంటుకూడా పోయింది. అంతా చీకటి. ఆ సంత మొత్తంలో ఒక్క దుకాణం లేదు. ఆకాశం నిండా మబ్బులు. పైన జోరు వాన. కింద వరదలాగా కొట్టుకొస్తున్న నీళ్లు. ఇవేవీ భయపెట్టలేదు నర్సమ్మను. ఆ నీళ్లలో తడుచుకుంటూనే జనాల్ని పిలుస్తున్నది. దూరంగా ఉన్న ఒకలిద్దరికి నర్సమ్మ ఏం జేస్తుందో అర్థం కావడం లేదు. కొంపదీసి ‘పిచ్చిగిట్ల లేసిందా’ అనుకున్నరు.

సమయం ఎనిమిదిన్నర దాటింది. వాన కురుస్తూనే ఉన్నది. చలికి గజగజా వణుకుతున్నది నర్సమ్మ. అయినా భయపడటం లేదు. కదులకుండా అలాగే కూర్చొని ఇంకొంత గొంతు పెంచి..
“బెండకాయలు, వంకాయలు, టమాటలు” అని అరుస్తూనే ఉంది.
దాదాపు గంటసేపు కురిసిన వాన మెల్లగా ఆగిపోయింది. నర్సమ్మ మాత్రం ఆగలేదు. పిలుస్తూనే ఉంది. సంతలో కూరగాయల వాళ్లంతా ఎప్పుడో వెళ్లిపోయారు. ఒక్క నర్సమ్మ తప్ప. అసలు ‘వాన వచ్చిందా? పోయిందా?’ అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. అప్పటిదాకా ఎక్కడ దాక్కున్నరో కానీ, ఒక్కొక్కరే మెల్లగా బయటకి వచ్చారు జనం.
“ఏందమ్మా.. నీకేమన్న పిచ్చి పట్టిందా. అంత వానలోనూ విగ్రహం మాదిరి కూర్చున్నావు. నీ దగ్గర గొడుగు ఉంది కదా. కనీసం అదన్నా పట్టుకోవచ్చు కదా..” గంట కింద నర్సమ్మతో కూరగాయల బేరం చేసిన పెద్దమనిషి అడిగాడు.
‘తక్కువకి ఇస్తరా’ అని అడుగుతూ అడుగుతూ.. ఎవరి దగ్గరా కొనలేకపోయాడు. ఈ లోపు కురిసిన వానకు చిక్కుకొనిపోయాడు. ఇప్పుడు నర్సమ్మ దగ్గర తప్ప ఇంకో మార్గం లేదు.
“టమాటలు, బెండకాయలు, వంకాయలు.. ఏం కావాలె సారూ..” ఆయన్ని ఇంతకు ముందు చూడనట్టే అడిగింది నర్సమ్మ.
“నువ్వు చెప్పిన ధరకే.. కిలో ముప్పైఐదు చొప్పున పది కేజీలు ఇవ్వమ్మా..” నవ్వలేక నవ్వుతూ అడిగాడు ఆ పెద్దమనిషి.
“టమాట కేజీ వంద. టమాటే కాదు.. ఏదైనా కేజీ వంద..” ఆజ్ఞాపిస్తున్నట్లు చెప్పింది.
నర్సమ్మ చెప్పిన ధర విని ఉలిక్కిపడ్డాడు ఆ పెద్దమనిషి.
“ఇంతకు ముందే ముప్పైఐదు అన్నావు కదమ్మా”
“అప్పుడే కొనుక్కోక పోయినవ్‌ సారు.. అప్పుడు తక్కెడ నీవైపు మొగ్గుంది. ఇప్పుడు తక్కెడ నావైపు మొగ్గుంది. కొంటే కొను.. లేకుంటే పక్కకు జరుగు.. ఆ.. టమాట, వంకాయ.. కిలో వంద రావాలె.. రావాలె..”
కరెంటు షాక్‌ కొట్టినట్టు అయిపోయింది ఆ పెద్దమనిషికి. మొఖంలో నెత్తురు చుక్కలేదు. బేరమాడేందుకు మరో దుకాణం లేదు. ఇంకో మాట మాట్లాడకుండా మొత్తం మూడువేలు ఇచ్చి కూరగాయలను సంచీల్లో నింపుకొన్నాడు. అతనితో వచ్చిన కూలీలు నర్సమ్మవైపు చూసి చిన్నగా నవ్వుకుంటూ.. సంచులు మోసుకుంటూ పోయారు.
అతడిచ్చిన ఆరు ఐదొందల నోట్లు తడిచిన తన చేతులకు వెచ్చగా తాకాయి. ఇంకొందరు కూడా నర్సమ్మ చెప్పిన ధరకే కిలో, అరకిలో కొనుక్కొని పోయిండ్రు. ఇప్పుడు నర్సమ్మ చేతిలో సరిగ్గా నాలుగు వేలు ఉన్నయి.సెల్‌ఫోన్‌ తీసుకుని చిట్టీల శంకర్‌కు ఫోన్‌ చేసింది.
“అరేయ్‌ శంకరీ.. ఎక్కడున్నవ్‌ రా..?” నర్సమ్మ పిలుపు అక్కడ ఉరుములా
ప్రతిధ్వనించింది.

‘చందు తులసి’ కలం
పేరుతో చిరపరిచితులైన పి.చంద్ర శేఖర్‌, విస్తృతంగా కథలు రాస్తున్న వర్ధమాన తెలంగాణ కథకుల్లో ఒకరు. తెలంగాణ సంస్కృతి, రైతులు, వ్యవసాయ మహిళల జీవితాలను ప్రధానంగా చిత్రిస్తూ కథలను అల్లుతున్నారు. పూర్వ నల్లగొండ ప్రస్తుత సూర్యాపేట జిల్లాలోని బండమీది చందుపట్ల వీరి స్వగ్రామం. వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. 2015లో వచ్చిన తొలికథ ‘ఊరవతల ఊడలమర్రి’, వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. కథా సాహితితో పాటు.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన ‘మూడుతరాల తెలంగాణ కథ’ సంకలనానికి ఈ కథ ఎంపికైంది. ఆ తర్వాత ‘నమస్తే తెలంగాణ బతుకమ్మ’ సంచికలో వచ్చిన ‘పాలపిట్టల పాట’ కథ, నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ యువ కథా సంకలనానికి ఎంపికైంది. 22 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ‘బతుకమ్మ పుట్టింది’ కథ ‘గుర్రాల లక్ష్మీ ప్రసాద్‌ అవార్డు’ గెలుచుకున్నది. వీటితోపాటు ‘నీళ్ల బిందె’, ‘బుక్కెడు బువ్వ’, ‘తల్లి గారిల్లు’ కథలు పలు కథా సంకలనాలకు ఎంపికయ్యాయి. పలు పత్రికల్లో కథా సమీక్షలు జరిపారు. ‘సారంగ’ వెబ్‌ పత్రికలో ‘రేపటి కథ’ శీర్షికన అనేకమంది యువకథకుల పరిచయాలు నిర్వహిస్తున్నారు. తుపాకీ రాముడు, హృదయాంజలి సినిమాలకు రచయితగా కూడా పనిచేశారు పి.చంద్ర శేఖర్‌

-పి. చంద్ర శేఖర్ ,9985583022

ఇవీ కూడా చదవండి…

డబుల్‌ డెక్కర్‌ బస్సులకు అశోక్‌ లేలాండ్‌ టెండర్‌

మేమంతా టీఆర్‌ఎస్‌ వెంటే..తువగడ్డ తండా గిరిజనులు

ఎయిర్‌క్రాఫ్ట్ టాయిలెట్‌లో 3 కేజీల బంగారం

గల్ఫ్‌ నుంచి తిరిగొచ్చిన ఇద్దరికి యూకే స్ట్రెయిన్

బాసరలో నారా బ్రాహ్మణి పూజలు

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్రం యూటర్న్‌

బెంగాల్‌లో బీజేపీకి ఇంటి పోరు

Advertisement
తక్కెడ

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement