e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home కథలు గంగిరెద్దు.. గానుగెద్దు

గంగిరెద్దు.. గానుగెద్దు

గంగిరెద్దు.. గానుగెద్దు

“.. ఇప్పుడు మీకోసం మంగ్లీ పాడిన సూపర్‌ హిట్‌ సాంగ్‌..!” ఎఫ్‌ఎం రేడియో..
“…డుడ్‌డ్‌డ్‌.. డుడ్‌డ్‌డ్‌డ్డు.. డుడ్‌డ్‌డ్‌.. వాడు నడిపే బండీ.. రాయల్‌ ఎన్‌ఫీల్డు..” అంటూ పాట మారు మోగుతంది.
“తమ్మీ.. ఆపురా బై!” సటుక్కున అన్నాన్నేను.
అప్పుడు.. మంగళి మహేష్‌ షాప్‌లో హెయిర్‌ కటింగ్‌ చేయించుకుంటున్న.
చేసే కటింగ్‌ ఆపి.. ‘ఎందుకు?’ అన్నట్లు చూసిండు.
“పాట బంజెయ్‌.. కటింగ్‌ కాదు!”
“ఓహో.. పాట అద్దంటున్నవా? ఈ పాట ఇంటుంటే హుషారొస్తదన్నా..! నిజంగ బుల్లెటెక్కినంత ఊపొస్తది”
ఆపడమెందుకన్నట్లు పరోక్షంగా కన్విన్స్‌ చేస్తున్నడు మహేష్‌.
కోపంగా ఒక చూపు చూసిన.. అంతే!
“ఆఁ! సరే సరే..” అని తలూపుకొంటూ ఎఫ్‌ఎం ఆపేసిండు.
బాగా గరం మీదున్న పెనం మీద నీళ్లు జల్లితే ఎట్లుంటది? అగో.. గట్ల తుకతుక ఉడుకుతంది నా మనసు.
దురదగొండి కొమ్మతోని వీపుల రాసినట్లు, యాసంగి కళ్లంల వరిగడ్డి దులుపుతున్నట్లు ‘సిటసిట’ మంటంది.
నా చెవులు మళ్లీ వినకూడని సప్పుడు విన్నట్లు నా ముఖమంతా చిట్లించుకొని చూస్తున్నా..
‘..డుడ్‌డ్‌డ్‌.. డుడ్‌డ్‌డ్‌డ్డు.. డుడ్‌డ్‌డ్‌..’
మళ్లీ బుల్లెట్టు సౌండ్‌.. ఈసారి నిజమైందే! మారాజు లెక్క ఫోజుపెట్టి పోతండు వాడు.
చేసే కటింగ్‌ ఆపి, గుడ్లప్పగించి చూస్తుండు మహేష్‌. నాకు కోపం పెరిగిపోతంది.
“అన్నా! ఏం బండి పో! ఏం బతుకు పో!” అనుకుంట స్టయిల్‌గా శాల్యూట్‌ కొడుతుండు.
“తమ్మీ! పోవాల్నారా..?”
నా గొంతులో కోపం వాడికి చుర్రుమని అంటినట్లుంది.
“రాజన్నా.. అది బుల్లెట్టే! కండ్లతోని సూత్తంటేనే కడుపు నిండిపోతందే..” ఆగమన్నట్లు సూచన అనిపించింది.
కూర్చున్న కుర్చీలకెళ్లి లేచిన.. సగం చేసిన కటింగ్‌తోనే!
గతుక్కుమన్నట్టు ముఖం పెట్టి..
“అన్నా.. ఇయ్యాల నీ మూడ్‌ మంచిగలేనట్లుంది. గింత కోపం ఎన్నడు రాలే నీకు..” అనుకుంట బతిలాడి కుర్చీల కూసుండబెట్టిండు.
జప్పన్నే కంటింగ్‌ అయిపోగొట్టిండు.
నిజమే! గింత కోపం నాకెందుకొస్తంది? అది కోపమా? అసహనమా? అవమానమా? చేతగాని తనమా..?


- Advertisement -

ఇంటికి పోయి తానం జేసినంక పాణం సల్లవడ్డది. కడుపునిండా అన్నం తిని, ఇగ బాయికాడికి పోదమని సైకిల్‌ ముట్టుకోబోయిన. కరెంట్‌ షాక్‌ కొట్టినట్లు దానికి దూరం జరిగిన. ‘హీరోహోండా సీడీ100’ నా బండి. కాలేజీకి పోయేటప్పుడు కొనుక్కున్న సైకిలేమో గది.. కైకిలికి పోయి సంపాదించిన పైసలతోని కొనుక్కున్న బైక్‌ ఇది.. బండంటే బండే! ఉన్నదా అంటే.. ఉన్నది.
‘డొక్కు బండి’ అనుకుంట ఊరుఊరంతా పేర్లవెట్టినా.. నాకు మాత్రం అది ‘సిల్‌’ బండి లెక్క.
వేరేవాళ్లు స్టార్టు చేస్తున్నారా.. అన్నట్లు సప్పుడు జెయ్యది. కిక్‌మీద కిక్కు కొట్టంగా.. అప్పుడు ‘యజమానే’ అని నిర్ధారించుకొని స్టార్ట్‌ అయితది.
బాయికాడికి బండి (బైక్‌) మీద పోతంటే ఇంట్లోళ్లు, బయటోళ్లు ఇసిత్రంగ చూస్తుంటరు నన్ను.
“నీ లెక్క బండిని చూసుకుంటే మూడు తరాలదాకా చెక్కు చెదరదిరా!” అంటూ నా దోస్తుగాళ్లు మజాక్‌ చేస్తరు.. దీన్ని చూసి.
మరి.. గట్లనే పెరిగిన నేను. నూకల బువ్వ తినుకుంట. శినిగిన అంగీ, లాగులతోని నడిపిచ్చిన శిన్నప్పుడు.. బతుకంతా!
బాయి కాడికిపోయి కరెంటు మోటరు ఆన్‌చేసి, మోదుగచెట్టు నీడల తువ్వాల పరుసుకొని ఒరిగిన. తల ఆకాశం వైపు పెట్టి ఆలోచిస్తున్న..
‘నవ్వెటోని ముందట బోర్లవడ్డట్టు’ గిట్లయిపాయె నా బతుకు.. ఎంత కొట్లాడితే ఏం లాభం! ఊగీ ఊగీ ఉయ్యాల ఉన్నచోటికచ్చి ఆగినట్టు.. ఇగ నా జన్మ గింతే!’
గతమంతా గిర్రున కండ్లళ్ల కదులుడు వెట్టింది.
***
నాకు శిన్నప్పటి సంది సదువంటే పిచ్చి. నాకు నేను శెప్పుకుంటే బాగుండదు గానీ, స్కూలంతా వెతికినా నా అసంటోడు ఇంకోడు లేకుండే..
మా నాయినకు సదువుమీద నమ్మకం లేదు. సదువు పేరుతో సోకులకు పోయి చేతికి రాకుండ యాడ బోతడోనని భయం. చదువు.. మా అసొంటి పేదోళ్లకు ‘గాజు గది’లాంటిదే అనుకునేటోడు. అన్నీ కనవడ్తయ్‌ కనీ, ఏదీ ముట్టుకోలేం కదా.. పెండ్లీడుకొచ్చిన ఇద్దరు బిడ్డలను సాగదోలుడెట్లన్నదే ఆయన ముందటున్న లక్ష్యం.
పది పాస్‌ కాంగనే ఎవుసం చేసుకుంట, కైకిలి కూలి దొరికినప్పుడు చేసుకుంట ఇంటిపట్టునే ఉండాలన్నది ఆయన ఉద్దేశ్యం. కానీ, నేను ఎవరితో చెప్పిస్తే ఆయన మనసు మారుతదో వాళ్లందరితోని చెప్పి పిచ్చిన.
శివరాఖరున ఒప్పుకొన్నడు. అదీ ఒక ఒప్పందం మీద.. ‘ముందుగాల ఎవుసం..’. మా నాయిన పనులు నేను చేస్తే, నా చదువుకు అడ్డు పడడని అర్థమైంది. అది చాలు నాకు. పిట్ట రెక్క చిన్నదైనా ఆకాశం అనంతం కదా.. ఎంతైనా ఎగురవచ్చు.
అప్పుడు తెల్సింది, కోటిగాడు ఏదో పెద్ద కాలేజీలకు పోతండనీ. పైసలు కట్టాలంట. పొట్ట కోస్తే అక్షరం ముక్క కనవడదీ.. ‘బార్డర్‌’ల పాసైనోడు గంత దూరం పోయి పైసలు ఖర్సు వెట్టించి సదువుడవసరమా?
వాడంటే నాకేం కండ్లమంటతనం లేదు. కోపమూ కాదు. వాడికే నామీద ద్వేషం. పక్కోడి అభివృద్ధిని చూసి ఓర్వలేని గుణం వాడిది. నా బాల్యం.. వాడి ‘రంకుల’ చేష్టలతో ఎంత కష్టపడ్డదో.. అప్పుడు ‘పలక’ ఇప్పట్లా ఇనుప రేకు కాదు. కిందవడితే పలుగుడే! వాడు దొంగతనంగా నా పలకలను ఎన్ని పగులగొట్టిండో.. కోపమొచ్చి కొనిచ్చిడు బంజేసిండు మా నాయిన. పగిలిన పలక ముక్కలమీదే రాసుకొనేటోణ్ణి. నన్ను చూసుకుంట నవ్వేటోడు.. కోటి గాడు.
నేను క్లాస్‌ల ఫస్టు. గందుకే చెయ్యెత్తి దెబ్బ కొట్టడానికి చేతులు రాకుండే మా సార్లకు. టీచర్లు నన్ను మెచ్చుకున్నప్పుడల్లా వాడి ముఖం బాగా మాడిపోయిన ‘సర్వపిండి’ లెక్క అయ్యేది. మా ‘ఊటూరు’ బడికి చుట్టుపక్కల నాలుగూర్ల నుండి వచ్చేటోళ్లు పోరగాండ్లు. అందరికీ నేనంటే అభిమానమే! వాళ్లంతా నా మేధస్సును గౌరవిస్తుంటే.. వీడొక్కడే నా పేదరికాన్ని ప్రచారం చేయడానికి బడిని ‘ప్రదర్శన’శాల జేసెటోడు. నాకు బట్టలు సక్కగా ఉండేటివి కాదు. జేబుకు ‘చారాణ’ పైసలు గూడ తెల్వది. నేనెవ్వర్నీ నొప్పించేటోన్ని కాదు. దోస్తాన్ల రేణివండ్లో, జాంపండ్లో ఎవరన్నా ఇచ్చినా తీసుకొనేటోన్ని కాదు. గంత మొండిగటం.. మా నాయిన ఆస్తులు సంపాదించి పెట్టకున్నా.. అభిమానంగా బతుకుడు నేర్పిండు.
కోటిగాడికి నా ‘తీరు’ నచ్చకపొయ్యేది. మా ఊళ్లే కోమటి రామన్న దుకాణం నడిచేది వీని శిరుదిండ్ల కొనుగోళ్లతోనే.. ఏది అడిగితే అది వాని చేతిలో ఉండాల్సిందే! వాళ్లింట్ల కోటిగాని మాటే నడుస్తది.
పదిదాకా వాడెంత టిప్‌టాప్‌గా బడికొచ్చినా.. నా చదువు ముందర ‘స్ట్రీట్‌ లైట్‌’ కింద ‘టార్చిలైట్‌’ లెక్కవాడు. నా ‘లేని’తనమంతా చదువులో వెతుక్కొని సంపాదించేటోన్ని.
ఇంటర్‌ టైంల మా పెద్దక్క పెండ్లి జేసినం. నేను ఇంటర్‌ల కాలేజీ టాపర్‌గా వచ్చిన. కానీ, నా డిగ్రీ చదువు ఆగింది.
“నాకు మునుపటి లెక్క సాతనైత లేదు. ఇగ సాలు నీ సదువుడు..” అన్న మా నాయినే ఈసారి గెలిశిండు.
ఏం జేస్తం.. మరి. నాక్కూడా అర్థమైంది. కండ్లళ్ల నీళ్లు కుక్కుకుంట ‘సరే’ అన్న. ఇగ సూడు.. కనవడ్డోడల్లా “ఫెయిలైనవారా.. రాజన్నా” అనుడు వెట్టిర్రు. పాసై సదువుత లేనంటే మా నాయినకు శిన్నతనమని ‘ఫెయిలైన’ అన్నట్టు సప్పుడు జేయకుండ ఉండేటోన్ని.
ఆ ఏడాది సదువుకు దూరమైనందుకు ఉక్కిరి బిక్కిరైంది. గొడ్డులెక్క పని జేసినా.. పేర్ల వెట్టుడు, ముసిముసి నవ్వుడు అంతా అర్థమవుడు వెట్టింది.. నాకు.
ఇంతలో చిన్నక్కకు దొరింపైంది. ఆ పైసలు, ఈ పైసలు కలిపి ఓ ఎకరం పొలం తీసేస్తే గానీ పెండ్లికి నిండలేదు.
ఇగ మా నాయిన ఒడ్డుకు వడ్డట్టే! నా ‘సదువు’ మళ్లా సురువు జేసుడే! ఈసారి వాళ్లో.. వీళ్లో కాదు, నేనే అడిగిన.
“రాజన్నా.. యాడాది ఆపుజేసినంక మల్ల సదువుకుంట అంటన్నవా? బిడ్డా.. అప్పు నీదే! కుప్ప నీదే! బుద్దిగా పనిచేసుకుంట.. సదువుకుంటె సదువుకో” అన్నడు మా నాయిన.
మళ్లీ చేపపిల్లకు ఈదడానికి సముద్రం దొరికింది. ఈసారి కోటిగాడు నేనూ మళ్లీ ఒక్కటే కాలేజీ. వాడు ఇంటర్‌ మూడేండ్లు తీసుకున్నడు. వాళ్ల నాయిన ఎకరం భూమి అమ్మిండు వీడికోసం. డిగ్రీ.. ఫైనలియర్లో ఉండగా మా తాత కిందిమీద జేసుడు వెట్టిండు. మనువడి లగ్గం చూసి పోతడట.
‘దేవుడా.. నా సదువుకు మళ్లీ ఓ గండం’
అనుకున్న.
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే అల్లుడు లెక్క మా మామకు దొరికి పోయిన. మా అమ్మకు తమ్ముడి బిడ్డనే కోడలైందని సంబురం. మా నాయినకు కొడుకు పెండ్లికూడా జేసిన అని నిమ్మలం. ముసలోడే గెలిశిండు. గింత జేసినా మా తాత డిఫెన్స్‌ ఆడుకుంట, ఆడుకుంట.. మొన్నమొన్ననే ఔటయ్యిండు. గిదెంత మోసమో కదా! మా తాతకు నేనేం అన్యాయం జేసిన!
***
అటు సంసారం, ఇటు సదువు, ఇంకా వ్యవసాయం. అయినా డిగ్రీ ఫస్టు క్లాసులో పాసైన. కానీ, యూనివర్సిటీల చదువాలనుకున్న నా ఆశ తీరలేదు. బాధ్యతల మధ్య ‘బందీ’ని కదా! నేను డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ల పీజీల జాయినయ్యా. కోటిగాడు డిగ్రీ పాస్‌ కాలేక వాళ్ల మామల దగ్గరికి పోయిండు. నా చదువు పూర్తవుతుండగానే మా నాయిన అమ్మిన ఎకరం పొలంతోపాటు ఇంకో మూడెకరాల పొలం కొన్నం. ఇపుడు మా నాయిన ఆరెకరాల ఆసామి!
ఇగ ‘నౌకరీ’మీద మనసు వెట్టుకొని ఇంటిపట్టునే చదివితే.. రెండుసార్ల్లు ఇంటర్వ్యూ చేసిన. కానీ, నౌకరీ చేతికి రాలేదు. పచ్చ పెన్నుమీద చిన్నప్పటి సందీ నా కన్ను వడ్డది. కానీ, అందలే! గిట్ల.. నా బతుకేదో నేను బతుకుతున్న. అయినా కోటిగాడు నామీద బురద జల్లుడు మానుకోలేదు. వాడి దర్పం, వాడి సుఖభోగాలు, జల్సాలు చూసి నేనెప్పుడూ బాధ పడలే. నా తొవ్వ నాదే! నా కష్టం నాదే!
నిన్న జెండా గద్దెకాడ కూసొని.. “రాజుగాడు గంత సదివి బురద పిసుక్కుంటండు. అన్నిట్ల ఫస్టు అచ్చినోడు పొలంల పల్టీలు కొడుతండు. బతుకుడు అందరికి రాదురా.. నన్ను సూడుర్రి. ఇగో గీ ప్యాంట్‌కే ఐదువేలు తెలుసారా? నా బండికి రెండు లచ్చలు. వాడు ఇంకెప్పుడు మారుతడో ఏమో? వాడెందుల కల్వడు. రూపాయి ఖర్సు వెట్టడు..” అని నన్నక్కడ అందరి ముందట గంజిలీగను తీసేసినట్లు తీసేసిండట.
మనసంతా ఖరాబైంది. గింత కష్టపడితి, చదివితి, పని చేస్తి, చేతులు కాయలు కాసేటట్లు చెమటడ్పితి. ఏం లాభం? కష్టమంటే తెల్వని కోటి గాడు హీరో లెక్క తిరుగవట్టే! ఎప్పుడూ నా దరికి రాని గీ ‘చిన్నతనం’ నిన్నటి సంది సంపుతంది.


ఉలిక్కిపడి లేచి కూసున్న.
“ఓ సారు.. ఓ సారూ..”
తలాపులో కూసొని పిలుస్తున్నడు.. సీపల్లె కొమురయ్య. గొర్లకు నీళ్లు వెట్టడానికి అచ్చినట్టున్నడు.
“మంచి నిద్ర తీసినవ్‌ గానీ, బాయిల నీళ్లొడిసినయ్‌. మోటరు మొత్తుకుంటందని బంజేసిన..” అన్నడు.
‘సరే’ అన్నట్లు తలూపిన.
“నీ రంది ఒడువని ముచ్చట. మా లెక్క ఏలుముద్ర కాదాయే. గింత సదివి నౌకరు రాకపాయె. ఇక నీ పాణానికి తుర్తిలేదు పో..” అన్నడు.
అది పరామర్శనా..? విమర్శనా..? వినీవినీ నాకు చెవులు చిల్లులు వడ్డయ్‌. ఓ సావు నవ్వు నవ్వి నిట్టూర్పు వినబడకుండా లేచి ఇంటి ముఖం
పట్టిన.


ఇంటికొచ్చి బండి ఆపంగనే.
“చెన్నయ్య సార్‌ రమ్మన్నడట బిడ్డా..!” అంటూ దగ్గరికొచ్చి చెప్పిండు మా నాయిన.
“ఎలక్షన్ల టైం గదా! ఏదో పనుంటదిలే..” అని ముభావంగా అనుకుంట ఇంట్లకు పోయిన.
“నిన్నూ, నన్నూ.. ఇద్దరినీ రమ్మనడట..”
.. చెన్నయ్య సార్‌ మా ఊరి సర్పంచ్‌. అంతకంటే ముందు మాకు సదువు చెప్పిన సార్‌. మా ఊరు సారే! రిటైర్‌ అయినంక ఊరు ఊరంతా కల్సి సారును సర్పంచ్‌గా ఉండుమని ఏకగ్రీవం చేసుకున్నరు. సార్‌ పుణ్యంతోనే ఊర్లో అందరూ కనీసం పదిదాకా సదివిండ్రు. ఇగ నాకైతే సార్‌ దేవుడే! నా సదువాగినప్పుడు దైర్యం జెప్పిండు. పదిల మండలంల ఫస్టొస్తే నాకు కొత్త డ్రెస్సు కుట్టిచ్చిండు.
‘పది’ అయినంక ఇంటర్‌ వద్దని మా నాయిన అన్నప్పుడు ఈ సారు మాటమీదనే మళ్ల మనసు మార్సుకున్నడు. ఏం ముచ్చటకు రమ్మన్నడో ఆలోచిస్తూ.. సార్‌ ఇంటి ముందట బండి ఆపిన. మా నాయిన దిగిండు. ఊళ్లె పెద్ద మనుషులంతా అక్కడే ఉన్నరు. మమ్ములను చూడంగానే చిన్నగ నవ్వుకుంట లేచి నిలవడ్డరు.
‘గీ మర్యాదేంది..?’ నాకేం అర్థం కాలేదు.
నాలుగైదు నిమిషాలకు అక్కడున్నోళ్లంతా వెళ్లిపోయిన్రు. అప్పటిదాకా సార్‌ ఒక్క మాటకూడా పలుకలే! వాళ్లంతా పోంగనే.. ‘కూసో’ అన్నట్లు చూసిండు. చాయ్‌ తెప్పిచ్చిండు. ముగ్గురం తాగుతున్నం.
“రాజన్నా.. కనవడ్తలేవు ఏందిరా? ఈ నడుమ.. శిన్నబోయి కనవడుతున్నవ్‌.. ఏమన్నా అనుకున్నరా ఏంది? మీ అయ్యా కొడుకులు..” చిరునవ్వు నవ్వుకుంట అన్నడు సార్‌.
నిన్న జరిగిందంతా సారుకు చెప్పిన. ప్రశాంతంగా విని, దీర్ఘంగా ఓ నిట్టూర్పు విడిచిండు.
“నువ్వింకా శిన్నపిల్లగాని లెక్క చేస్తున్నవేందిరా? కోటి గాడన్నడు. శీను గాడన్నడని, కుక్కల మొరుగుడుకు బాధ పడుతరారా? అసలు నీకూ ఆనికి పోలికుందారా ఏమన్న..?”
నేను తల దించుకొని వింటున్న.
“.. వానిదీ ఓ బతుకారా..? చదువు పేరు జెప్పి ఉన్న పొలం హారతి కర్పూరం కానిచ్చిండు. మామల దగ్గరికి పోయి ఏదో ఉద్దరిత్తడనుకుంటే తన్నుల వడి ఇక్కడికొచ్చిండు. పూలరంగని లెక్క తిరుగుతూ ఊరంతా అప్పులు జేసిండు. కన్న తండ్రనికూడా చూడకుండా వాళ్ల నాయినను కొట్టిండు. అత్తగారు గట్టిగుంటే చాలని.. సింగరేణి నౌకరున్నోని అందులోనూ ఒక్క బిడ్డే ఉన్న ‘సంబంధం’ కలుపుకొని లగ్గం జేసుకున్నడు. అత్తగారింట్ల వాని బతుకు నీకు తెల్వది గానీ, బైటనే వాని బడాయి. వట్టి బానిస బతుకు బతుకుతుండు. వీసమెత్తు పని చేయనోడట.. నేను వీరాధి వీరున్నని డప్పు కొట్టుకున్నడట. వాళ్ల మామ పైసలు ఎత్తుకొచ్చి ఆ బండి కొన్నడట.. వారం కిందటే వాని మామ నాకు ఫోన్‌ చేసి ఏడ్వబట్టిండు..”
సార్‌ చెప్పుతుంటే.. నేను బండబారి పోయి వింటున్న..
“.. వాడు ఓడిపోతూ తన వాళ్లందరినీ ఓడిస్తూ బతుకుతుండు. నువ్వు గెలుస్తూ.. నీ వాళ్లను గెలిపిస్తూ జీవిస్తున్నవ్‌. అరేయ్‌.. రాజన్నా! లోకమన్నప్పుడు నిన్ను పొగిడేటోడుంటడు.. తిట్టెటోడూ ఉంటడు. వాడేమో అన్నడని బాధ పడకు.. నలుగురు నాలాంటోళ్లు జమై మాట్లాడుకుంటుంటే.. మీ నాయిన జోలి తప్పకుండ వస్తది. ఈ ఊళ్లె మీ నాయినంత అదృష్టవంతుడు లేడని ముచ్చట పెట్టుకుంటున్నరు..” నన్నే చూస్తున్నాడు సార్‌.
రెండు, మూడు నిమిషాలు మాటలకు బదులు మౌనం.. అక్కడ. ఏదో ఫైల్‌ తయారు చేస్తున్నడు సార్‌.
“వచ్చినంక నా ముచ్చట బదులు నీ ముచ్చట నడిసె.. నీకు ఒక మంచి పని ఇస్తున్న.. చేస్తవా..?”
“చేస్తా సార్‌! మీ మాట కాదంటనా..?”
నా చేతిలో ఒక పేపర్‌ పెట్టి.. “సదువు” అన్నడు.
“ఏంది సార్‌.. గిది..?”
“మినిస్టర్‌ సారు ఫోన్‌ చేసి గా తీర్మానం చేయమన్నడు. జల్లెడ వట్టినట్లు ఊర్నీ గాలించిండట.. ‘మోడల్‌ విలేజ్‌’ చేయాలంటే, అప్పటికే అంతో ఇంతో ముందటున్న ఊరు గావాల్నట.. ఇగ సర్పంచ్‌ ఎన్నిక ఏకగ్రీవం కావాలంట. గిన్ని కండిషన్లు ఉండంగా మన ఊరును తీసుకున్నడు. నిన్ను ఏకగ్రీవంగా సర్పంచ్‌ని చేసినట్టు తీర్మానం చేసి, రేపు కరీంనగర్‌ రమ్మన్నడు.. నిన్ను తోలుకొని..”
నా నోరు మూగవోయినంత పనైంది.
“నీ లెక్క నేనుకూడా నమ్మలేదురా! నీ గురించి పూస గుచ్చినట్లు అన్ని ముచ్చట్లు చెప్పుతుంటే నాకైతే మస్తు సంతోషమైంది. నువ్వున్నవనే మన ఊరును సెలెక్ట్‌ చేసుకున్నడట. ‘రాజన్న ఎంతైనా మీ శిష్యుడు కదా సార్‌..’ అన్నడు మినిస్టర్‌ సార్‌. ఆ ఒక్క మాటతోని నా వృత్తి ధర్మం.. ధన్యమైనట్టే ఇగ!”
“సార్‌.. నాకు రాజకీయాలు చేయడం రాదు..” అన్నాన్నేను.
“అందుకే కదా.. నిన్ను సెలెక్ట్‌ జేసుకున్నరు మినిస్టర్‌ సార్‌. పరిపాలన, పనులు చేసేటోడు గావాలె గానీ, ఖద్దరు వేసి గాలికి తిరుగేటోడు కాదు..” సారు బదులిచ్చిండు.
మా నాయినకు కలో, మాయో.. అన్నట్లుంది.
“గంగిరెద్దు, గానుగెద్దు.. రెండూ ఎడ్లేరా! గంగిరెద్దును అలంకరించి కనబడ్డోడికల్లా దండం పెట్టిస్తరు. గానుగెద్దు పొద్దంతా మెడమీద ‘కాని’ పెట్టుకొని పనిచేస్తది. వాట్ని రెండిటినీ ‘అంగడి’కి అమ్మబోతే.. గంగిరెద్దును ఎవరూ కొనరు. అది కండవట్టి పోతపోసినట్లు ఉన్నాకూడా.. గానుగెద్దునే కావాలంటరు.. బక్కగా బొక్కలు తేలి కనవడుతున్నా..! పనిగల్ల్లోడు ప్రపంచంల ఎట్టనన్న బతుకుతడు..” సార్‌ నన్నుద్దేశించే కథ చెప్పిండని అనిపించింది.
నాకోవైపు నన్ను గుర్తించి పదవిస్తున్నందుకు ఆనందం.. మరోవైపు తాహతు.. అర్హత లేనివి నెత్తినేసుకుంటున్ననా..? అని భయం!
నా మనసును చదివినట్లున్నడు సార్‌.
“నేను సర్పంచ్‌గా ఉన్నట్లే గానీ, నీ ఆలోచనలు, నీ సలహాలు సాయం లేకుండా పనులవునారా.. రాజన్న? ఊరుకు అవార్డు ఇప్పిస్తివి.. నీ ఐడియాలతోటి! నీ వంటి శిష్యుణ్ని తయారు చేసినందుకు ఏడకు పోయినా నన్ను చూసి భక్తితో మినిస్టరు సారే లేచి నిలబడుతడు.. నా వెంట ఉండి ఊరికెంతో చేయించినవ్‌.. ఇప్పుడు నువ్వు సొంతంగా చేసుకోలేవా..”
నేను తల వంచుకొని ఆలోచిస్తున్న. నా మెడలో ఏదో వేస్తుండు సార్‌.. బంగారు గొలుసు!!
“సార్సార్‌.. వద్దు వద్దు..” అనుకుంటనే లేచి నిలబడ్డ.
“నా మాట కాదంటవారా నువ్వు..!” అంటూ వీపుల ఒక్కటిచ్చి, దగ్గరికి తీసుకున్నడు.
“ఎంత మంచి కొడుకును కన్నవయ్యా..” మా నాయినవైపు తిరిగి సార్‌ అనేసరికి, కండ్ల నీళ్లు తెచ్చుకున్నడు మా నాయిన.
ఆ ఆనందంలో ఇంటికొస్తున్నం.. మా నాయిన, నేను.
‘..డుడ్‌డ్‌డ్‌.. డుడ్‌డ్‌డ్‌డ్డు.. డుడ్‌డ్‌డ్‌..’ చప్పుడు.
ఎదురువడ్డడు కోటిగాడు. వాడు కనబడితే తల వంచుకొనుడో.. తల తిప్పుకొనుడో చేసేటోన్ని.
‘సార్థకత కావడానికి బతుకు మనకు సాన పెట్టేటప్పుడు ఇగ సాలని ఎప్పుడూ అనొద్దురా..’ అని సార్‌ నన్ను సాగదోలిన దృశ్యం గుర్తుకొచ్చి, నవ్వుకున్న చిన్నగా!
కోటి గాడు తల తిప్పుకున్నడు. నేను పడ్డ బాధలన్నీ దూదిపింజ లెక్క ఎగిరి పోతున్నయ్‌. చిన్నప్పటి నుండి ‘బరువు’లు మోసిన నేను, ‘బతుకు’ అలుకగ అయినట్లు అనిపించింది. ఇప్పుడు నా మనసు తృప్తిల వడ్డది.

చెన్నయ్య సార్‌ మా ఊరి సర్పంచ్‌. అంతకంటే ముందు మాకు సదువు చెప్పిన సార్‌. మా ఊరు సారే! రిటైర్‌ అయినంక ఊరు ఊరంతా కల్సి సారును సర్పంచ్‌గా ఉండుమని ఏకగ్రీవం చేసుకున్నరు. సార్‌ పుణ్యంతోనే ఊర్లో అందరూ కనీసం పదిదాకా సదివిండ్రు.
ఇగ నాకైతే సార్‌ దేవుడే! నా సదువాగినప్పుడు దైర్యం జెప్పిండు. పదిల మండలంల ఫస్టొస్తే నాకు కొత్త డ్రెస్సు కుట్టిచ్చిండు.

చిప్పబత్తుల శ్రీనివాస్‌
రచయిత పూర్తి పేరు చిప్పబత్తుల శ్రీనివాస్‌. కలం పేరు సుగంధ . శ్రీనివాస్‌ స్వస్థలం కరీంనగర్‌ జిల్లా మానకొండూరు మండలం ఊటూరు. ప్రస్తుతం వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌ పాఠశాలలో పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఆసక్తి. 1999లో వికారాబాద్‌లో టీటీసీ చదివేటప్పుడు తెలుగు మాస్టారు దొరవేటి (వి. చెన్నయ్య) బాగా ప్రోత్సహించారు. 2003లో ఆంధ్రభూమి వీక్లీలో తొలికథ ‘మళ్లీ మళ్లీ పూసే పూలు’ ప్రచురితమైంది. 2003-06 మధ్య
19 కథలు, డజనుకు పైగా కవితలు, ఎనిమిది వ్యక్తిత్వ వికాస వ్యాసాలు ప్రచురితమయ్యాయి. ‘ప్రియదత్త’ వీక్లీ 2004లో నిర్వహించిన కథల పోటీలో రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి, ఆంధ్రభూమి ఉగాది కథలు పోటీలో ప్రోత్సాహక బహుమతి గెలుచుకున్నారు. 2007 నుంచి సాహిత్య సేవకు విరామం పలికి, పోటీ పరీక్షలవైపు వెళ్లారు. అదే సమయంలో చరిత్ర విషయ నిపుణులుగా పనిచేశారు. కూతురు ఆరాధ్య కథ చెప్పమని అడిగినందుకు 14 ఏండ్ల తర్వాత నమస్తే తెలంగాణ, ముల్కనూర్‌ గ్రంథాలయం కథల పోటీకి ఈ ‘గంగిరెద్దు గానుగెద్దు’ కథ రాశారు.

నమస్తే తెలంగాణ, ముల్కనూరు
ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా
నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో విశిష్ట బహుమతి పొందిన కథ.

-సుగంధ శ్రీనివాస్‌
7730065637

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గంగిరెద్దు.. గానుగెద్దు
గంగిరెద్దు.. గానుగెద్దు
గంగిరెద్దు.. గానుగెద్దు

ట్రెండింగ్‌

Advertisement