e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home కథలు ఈవారం కథ.. లెక్క తేల్చండి

ఈవారం కథ.. లెక్క తేల్చండి

సెల్‌ఫోన్‌ రింగవుతూనే ఉంది గంట గంటకూ.. ఉదయం నుండి. ఉద్దేశపూర్వకంగానే, లిఫ్ట్‌ చెయ్యదలచుకోలేదు రామకృష్ణ. ఆ తరువాత కొంతసేపటికి నందిని ఫోన్‌ రింగయ్యింది.
“ఆ నంబరు నుంచే” అన్నది నందిని.
“ఒక్కసారి మాట్లాడవచ్చు కదా! ఎంత అత్యవసరమై చేస్తున్నారో?” అనునయంగా అన్నది.
“కొన్ని బంధాలు బందాలై మెడకు చుట్టుకొంటే వాటిని ఉంచుకోవాలా? తెంచుకోవాలా నందూ?” అన్నాడు రామకృష్ణ నిస్తేజంగా.
“తెంచుకొన్నా తెగని బంధాలు కొన్ని ఉంటాయ్‌ క్రిష్‌! ఏం కష్టమొచ్చిందో? మనం చెయ్యదగ్గ సహాయం అయితే చేద్దాం. ప్లీజ్‌”
“ఓకే.. మాట్లాడు. నేను ఇంట్లో లేనని చెప్పు.. నాతో మాట్లాడాలి అని అడిగితే!”
నందిని మళ్లీ కాల్‌బ్యాక్‌ చేసింది.
“ఉదయం అమ్మ చనిపోయింది వదినా. అన్నయ్య రాడని తెలుసు. అయినా తెలియజెయ్యాలి కదా!” అని చెప్పి, ఫోన్‌ కట్‌ చేశాడు చంద్రం.
స్థాణువులా బిగుసుకు పోయింది నందిని. నోట మాట రాలేదు.. కొన్ని క్షణాలపాటు.
కంగారుపడ్డాడు రామకృష్ణ.
“ఏమైంది నందూ? ఏమిటట? ఆవిడేనా మాట్లాడింది? చెప్పు నందూ!” ఆదుర్దాను అణిచి పెట్టుకొంటూ అడిగాడు రామకృష్ణ.
“అత్తయ్యగారు చనిపోయారట!” గద్గదమైన గొంతుతో చెప్పింది నందిని.
ఆ మాట వింటూనే సోఫాలో ఒక్కసారిగా వెనక్కి వాలిపోయాడు రామకృష్ణ. మెదడుతోపాటు శరీరమూ మొద్దుబారినట్లయింది.
అంతలోనే తేరుకొన్నది నందిని.
“ఎన్ని గంటలకు బయల్దేరుదాం?” అడిగింది రామకృష్ణను.
“వెళ్లాలా?” అన్నాడు రామకృష్ణ.
“ఏం మాట్లాడుతున్నావ్‌? చనిపోయింది మీ అమ్మ! తెంచేసుకొన్నావనుకొంటున్న బంధం.. నిజానికి ఈ రోజుతో తెగిపోయింది. చివరిసారిగా నువ్వు చేయాల్సిన కర్మలు కొన్ని మిగిలి ఉన్నయ్‌. బయలుదేరు.. బ్యాగ్‌ సర్దుతాను” అంటూ రామకృష్ణ సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి ఇంట్లోకి వెళ్లింది.

నందిని కారు నడుపుతోంది.
రామకృష్ణ మౌనం నందినికి అసహనాన్ని కలిగిస్తున్నా, అతని గుండె లోతుల్లోని అలజడిని గ్రహించగలుగుతున్నది.
“చెడ్డ భర్తలు ఉంటారు, చెడ్డ భార్యలు ఉంటారు. చెడ్డ తండ్రులు ఉంటారు, చెడ్డ కొడుకులు ఉంటారు. కానీ, చెడ్డ తల్లి ఉండదు.. అనేది నా వ్యక్తిగత అభిప్రాయం క్రిష్‌” అన్నది నందిని.
రామకృష్ణ ఏం మాట్లాడలేదు. మళ్లీ తనే..
“అత్తయ్యగారంటే మీకు ఎందుకంత ద్వేషం? సారీ క్రిష్‌. నీ గతం గురించి ప్రస్తావించ వద్దని మన పెండ్లికి ముందే నా నుంచి మాట తీసుకున్నావ్‌. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడే ఉన్నాను. చివరి చూపుకోసం వెళ్తున్నాం. ఎంతో బలమైన కారణం ఉంటేగానీ, కన్నతల్లిని ఒక వ్యక్తి ఇంతగా ద్వేషించడు. నీ వైపునుండే ఆలోచిస్తున్నాను క్రిష్‌” సున్నితంగా అన్నది.
భారంగా నిట్టూర్చాడు రామకృష్ణ.
“నా బాల్యం గాయాలమయం నందూ! గుర్తుకొస్తే మానిన గాయాలు మళ్లీ రేగి, నన్ను నానుంచి దూరం చేస్తాయని నా భయం. నా జీవితంలోకి నువ్వు ప్రవేశించాకే నేను మనిషిని కాగలిగాను. సమాజం మీద, మానవ సంబంధాల మీద, భవబంధాల మీదా నాలో రగిలిన ద్వేషాన్ని సమాధి చేశాను నందూ!” అన్నాడు భారంగా శ్వాస తీసుకొంటూ.
“సారీ క్రిష్‌” నొచ్చుకున్నట్లుగా అన్నది నందిని.
“ఇప్పుడు నువ్వు తెలుసుకొని తీరాలి నందూ. చనిపోయిన వ్యక్తి కోసం ఒక్కచుక్క కూడా కన్నీరు రాల్చని నా మీద ఎక్కడో.. ఏ మూలో కించిత్తు అసహ్యం కలగవచ్చు నీకు. ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో ఎప్పుడైనా!”
“క్రిష్‌! నువ్వు ఎంత సున్నితమైన వ్యక్తివో, ఎంత పాజిటివ్‌గా ఆలోచిస్తావో నాకు బాగా తెలుసు. నీ బాధ వెనుక ఉన్న కథను వినాలన్న ఆసక్తి కూడా నాకు లేదు. ప్లీజ్‌.. రిలాక్స్‌” మంచినీటి బాటిల్‌ ఇవ్వబోతూ అన్నది.
వద్దన్నట్లు సైగ చేశాడు.
“ఇప్పుడు నీకు చెప్పకపోతే ఇంకెప్పుడూ చెప్పాల్సిన అవసరం రాదేమో నందు” అన్నాడు.
“నాకు చెబితే నీకు రిలీఫ్‌ లభిస్తుందనుకొంటే చెప్పు. బాధను పెంచుతుందనిపిస్తే చెప్పనక్కర్లేదు” అన్నదామె.
కొన్ని క్షణాల మౌనం తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు రామకృష్ణ.

- Advertisement -

“నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడు పొలంలో పాము కరిచి మా నాన్న చనిపోయారు. ఒక్కసారిగా మా బతుకుబండి తల్లకిందులైపోయింది. అప్పటికి తమ్ముడు ఏడాది పసికందు. కౌలుకు ఇచ్చిన యజమాని, పొలాన్ని లాగేసుకొన్నాడు. సర్కారు స్థలంలో అక్రమ కట్టడమంటూ ఇల్లును కూల్చేశారు పంచాయతీవాళ్లు. నాన్న ఉన్నంతవరకూ కూలి పనికి వెళ్లడంకూడా తెలియదు మా అమ్మకు. పరామర్శించడానికి వచ్చిన బంధుగణం పట్టెడన్నం పెట్టింది లేదు. ఒక రోజు నన్నూ, తమ్ముణ్నీ ఏరు దగ్గరకు తీసుకెళ్లింది అమ్మ. బోరున ఏడుస్తున్నది. తమ్ముడూ ఏడుస్తున్నాడు. ఏమీ అర్థం కాక, నేనూ ఏడుస్తున్నాను. అటుగా వెళ్తున్న సూర్యం మాష్టారు.. మా దగ్గరకు వచ్చాడు. అమ్మను పలుకరించాడు. మాష్టారుకేదో చెప్పబోయింది అమ్మ. ఆమెను మందలించి మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అన్నం పెట్టాడు. ఆదరించాడు. నన్ను స్కూల్లో చేర్పించాడు” అని చెబుతూ ఒక్క క్షణం ఆగాడు రామకృష్ణ.
“మనుషుల్లో మంచి మనుషులు ఉంటారు క్రిష్‌!”’ అన్నది నందిని.
“నేనూ అలాగే అనుకున్నాను నందూ. ఊరు అలా అనుకోలేదు. ‘మొగుడు పోయి ముప్ఫై రోజులయినా కాలేదు.. పంతులుగారి పక్కలో చేరింది’ అన్నారు. ‘ఉంపుడు గత్తె’ అన్నారు. క్లాసులో పాఠాలు చెవికెక్కేవి కావు. తోటి పిల్లల గేలి మాటలతో చెవులు పోటెక్కేవి. ఒక్కణ్నే కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తుంటే.. ఓదార్చడానికి తల నిమిరే చెయ్యిలేదు. కన్నీరు తుడిచే వేలులేదు. అమ్మ ఏడవడం మానేసింది. అమ్మను చంపేయాలన్నంత కోపం ఒక పక్క.. పాలు మానని తమ్ముడు మరోపక్క. దీంతో అమ్మతో మాట్లాడటం మానేశాను. అతనితో అసలు మాట్లాడే వాడినే కాదు. రెండేళ్లు ఎలా గడిపానో తెలియదు. ఊళ్లో ఉండలేక పోయాను. పారిపోయి వచ్చి, సిటీకి చేరాను. దొరికిన పనల్లా చేశాను. ఓ పెద్దాయన ఇంట్లో పనికి కుదిరి, ఆయన పుణ్యాన చదువును కొనసాగించాను. ఒక్కసారి కూడా ఊరికి తిరిగి వెళ్లాలనిపించలేదు నందూ!” చెప్పడం ముగించాడు
రామకృష్ణ.
“మీ తమ్ముణ్ని కూడా ఆ ఊబి నుంచి బయటకు తీసుకు రావలసింది!” అన్నది నందిని.
“నా కాళ్ల మీద నేను నిలబడ్డాక ఆ ప్రయత్నం కూడా చేశాను నందూ! ససేమిరా రానన్నాడు. అమ్మనూ, నాన్ననూ.. అదే ఆ స్కూలు పంతుల్ని వదిలి రాలేనన్నాడు. వాడి ఖర్మకు వాణ్ని వదిలేశాను. మన ఫోన్‌ నెంబర్లు వాడికి అందేలా చేశాను. ఏదైనా అవసరం వచ్చినప్పుడు చేస్తారేమోనని. ఇదిగో.. ఇప్పుడు చేశాడు” అన్నాడు రామకృష్ణ.
“వదిలెయ్‌ క్రిష్‌! నీ ప్రయత్నం నువ్వు చేశావ్‌. రిలాక్స్‌గా ఉండు” అన్నది రామకృష్ణ చెయ్యి వొత్తుతూ.
“ఇంకొంచెం ముందుకు పోయి లెఫ్ట్‌ తీసుకో! అక్కడి నుండి ఓ ఆరు కిలోమీటర్లు లోపలికి పోవాలి” అన్నాడు రామకృష్ణ.. గతంనుంచి తేరుకొంటూ.
కారు ఊర్లోకి చేరుకొంది.
ఊరు పెద్దగా మారలేదు.. కొన్ని పెంకుటిండ్లు స్లాబులు అవడం తప్పించి.
“రూట్‌ కొంచెం గైడ్‌ చెయ్యి” అన్నది నందిని.. ఇరుకు సందులో నిదానంగా డ్రైవ్‌ చేస్తూ.
“రైట్‌ తీసుకో! రోడ్డు చివరన రామాలయం వస్తుంది” అన్నాడు రామకృష్ణ.
నెమ్మదిగా కారును అక్కడకు చేర్చింది నందిని.
రామాలయం పక్కనే పెంకుటిల్లు. ఇంటి ఎదుట షామియానా, కుర్చీలు, గుమిగూడిన జనాన్ని చూసి.. అదే ఇల్లని గ్రహించింది. ఓపెన్‌గా ఉన్న చోట కారును పార్క్‌ చేసింది.
కారు దిగారు రామకృష్ణ, నందిని.
వీళ్లను చూసిన కొందరు రామకృష్ణను చుట్టుముట్టారు.
వాళ్లందర్నీ తోసుకొంటూ వచ్చాడు చంద్రం. అదాటుగా వాటేసుకొన్నాడు రామకృష్ణను.
“అమ్మ చనిపోయిందన్నయ్యా!” అంటూ బోరున ఏడుస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా రామకృష్ణను ముందుకూ, వెనక్కూ కుదిపేస్తున్నారు.
చంద్రం భుజాన్ని పట్టుకొని సముదాయించే ప్రయత్నం చేశాడు రామకృష్ణ.
“రాయ్యా! బతికినంత కాలం నీ దిగులుతోనే బతికిందయ్యా! సాగనంపడానికైనా వచ్చావు. చాల్లే అయ్యా! ఆ మాత్రం పున్నెం చేసుకొంది ఆ తల్లి” బాధా, ఎత్తిపొడుపూ కలగలిపి ఏడుస్తున్నది ఒకావిడ. నలుగురూ నానా మాటలు అంటూనే ఏడుస్తున్నారు. ఏడుస్తూనే అంటున్నారు.
రామకృష్ణ పక్కకు వచ్చి చేరింది నందిని. ఇద్దరూ కలిసి పార్థివదేహం వద్దకు చేరారు.
నందిని అందించిన గులాబీ దండను తల్లి మెడలో వేసి, దండం పెట్టుకొన్నాడు రామకృష్ణ.
అప్రయత్నంగానే రామకృష్ణ కండ్లు చెమ్మ
గిల్లాయ్‌.
నాన్న వీపుమీద ఎక్కి ‘ఏనుగమ్మ ఏనుగు’ అంటూ ఆడుతూ ఉంటే.. వెంటబడి అన్నం తినిపిస్తున్న అమ్మ జ్ఞాపకం.. గుండె పొరల్లోంచి పెల్లుబికి రామకృష్ణ గుండెను తట్టింది.
తల్లి తల దగ్గర మోకాళ్లపై కూలబడి పోయాడు. గుండె బిగబట్టినట్టు అయ్యింది రామకృష్ణకు.
నందిని అతని భుజం మీద చెయ్యివేసింది.. ఓదార్చుతున్నట్లుగా!
“కావాల్సిన వాళ్లు వచ్చేశారు.. మొదలెట్టండ్రా!” అంటూ పొలికేక వేశాడో పెద్దమనిషి.
తప్పెట్లు, తాళాల మోతతో అంతిమయాత్ర హడావిడి మొదలైంది.
చుట్టూ పరికిస్తున్నాడు రామకృష్ణ. అది గమనించిన చంద్రం అతని చేయిపట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు.
ఓ గదిలో.. మంచం మీద సూర్యం మాష్టారు కనిపించారు.
“సంవత్సరం నుండీ పక్షవాతం వేధిస్తున్నది” అన్నాడు చంద్రం.
లేచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ, లేవలేకపోతున్నాడు.
ఏవో సంజ్ఞలతో చంద్రాన్ని దగ్గరకు పిలిచాడు. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.. మాట రావడం లేదు. తలగడ మీద చేయి పెట్టాడు. చంద్రానికి అర్థమయినట్లుంది. తలగడ కిందనుండి ఓ పుస్తకం తీసి, అందులో నుంచి ఓ కవరు తీశాడు. దాన్ని రామకృష్ణ చేతిలో పెట్టాడు.
“ఇది నీకు అందజెయ్యమని రెండేండ్ల నుండి పోరు పెడుతున్నారు నాన్న” అన్నాడు చంద్రం.
అయోమయంగానే ఆ కవర్ను జేబులో పెట్టుకొన్నాడు రామకృష్ణ. మౌనంగానే బయటకు వచ్చేశాడు. తప్పెట్ల మోత తారాస్థాయినందుకుంటుండగా అంతిమ యాత్ర మొదలయ్యింది.

“ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కబురు చెయ్యి” అంటా నందిని హ్యాండ్‌ బ్యాగ్‌ నుండి తీసిన డబ్బు కట్టలు, విజిటింగ్‌ కార్డు చంద్రానికి ఇవ్వబోయాడు రామకృష్ణ.
‘డబ్బు అక్కర్లేదు’ అన్నట్టు చెయ్యి ఊపి, విజిటింగ్‌ కార్డు ఒక్కటే తీసుకొన్నాడు.
“పెద్దకర్మ గురించి కబురు చేస్తాను. వస్తే.. ఎక్కడ ఉన్నా అమ్మ సంతోషిస్తుంది. నలుగురిలో ఆమెకు కాస్తంత గౌరవం దక్కుతుంది” అన్నాడు చంద్రం.
మారు మాట్లాడకుండా కారు దగ్గరకొచ్చాడు రామకృష్ణ. అతన్ని అనుసరించింది నందిని. కారు స్టార్ట్‌ చేశాడు. ఊరి పొలిమేర దాటుతుండగా, జేబులోంచి కవరు తీసి, నందినికి ఇచ్చాడు.. చదవమన్నట్టుగా!
కవరు చించింది నందిని. అందులో ఒకే ఒక్క పేపర్‌ ఉన్నది.
రామకృష్ణను సంబోధిస్తూ రాసిన ఉత్తరం. నందిని కండ్లు అక్షరాల వెంట పరిగెడుతున్నాయ్‌.

ఎప్పటికైనా నువ్వు తిరిగివస్తావని.. అమ్మను అక్కున చేర్చుకొంటావని నాకు తెలుసు నాయనా. ఆసరాలు అవసరాలకు, అవసరాలు ఆసరాలకు అనుబంధాలవుతాయి కొందరికి. పిల్లల్ని యేట్లో విసిరేసి, తనూ దూకేద్దామని సిద్ధమైన మీ అమ్మకు ధైర్యం చెప్పాను. నీడను ఇవ్వాలనిపించింది. పిల్లల్ని బతికించుకోలేకే చావాలనుకుంది. పిల్లల కోసమే బతకడానికి ఊతమిచ్చాను. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ నేను.. సంసారానికి పనికిరాని ఒక కొయ్యను మాత్రమే అయ్యుండొచ్చు. అమ్మకు ఆలంబనగా, లతలా అల్లుకోవడానికి ఓ పందిరి నయ్యానన్న తృప్తి చాలు ఈ జీవితానికి. రాళ్లు విసిరే చేతులకూ, నిందలు వేసే నోళ్లకూ ఎదురొడ్డి నిలబడ్డాం గానీ.. నీకు అర్థమయ్యేటట్లు చెప్పడంలో విఫలమయ్యాం. తప్పు మాదే! అమ్మకూ, తమ్ముడికీ ఆసరాగా నిలబడతావని నా ఆశ. వమ్ము చెయ్యకు నాయనా!
నీకు ఏమీ కాని..
సూర్యం మాష్టారు.


“క్రిష్‌!” చదవడం పూర్తవ్వడంతోనే కేక పెడుతున్నట్టుగా అరిచినంత పనిచేసింది నందిని.
కంగారుపడ్డ రామకృష్ణ.. కారును పక్కకు తీసి ఆపాడు. ఉత్తరం అతని చేతిలో పెట్టింది.
అతను చదవడం.. క్షణాల్లో జరిగిపోయింది. రామకృష్ణలో వణుకు ప్రారంభమైంది. కంగారు పడింది నందిని.
కారును సర్రున వెనక్కి తిప్పాడు. నిశ్చేష్టురాలయ్యింది నందిని. చూస్తూ ఉండగానే కారు ఊరివైపు దూసుకుపోయింది.
పొలిమేరల్లో ఉన్న శ్మశానం ముందు కారు ఆగింది.
నందిని వారించేంతలోనే ఒక్క ఉదుటున కారు దిగిన రామకృష్ణ.. శ్మశానంలోకి పరిగెడుతున్నాడు. కాళ్లు తడబడుతున్నాయి. కండ్లు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. కాలి బూడిదైన కుప్ప ముందు కూలబడిపోయాడు. బూడిదను ఎత్తి పోస్తూ..
“అమ్మా! అమ్మా! లే అమ్మా! నా చెంపలు పగల కొట్టమ్మా! లేచొచ్చి నా జుట్టు పట్టుకొని నా వీపు పగల కొట్టమ్మా! లేమ్మా! బతికున్నంతకాలం ఈ భారం నేనెట్లా మోసేదమ్మా? నేనూ వస్తానమ్మా.. నన్నూ తీసుకెళ్లమ్మా!” అంటూ గుండెలవిసేలా ఏడుస్తున్నాడు రామకృష్ణ.
అతని రెండు భుజాలను పట్టుకొని పైకి లేపింది నందిని. పొదివి పట్టుకొంది.
“జీవితాంతం ఈ క్షోభను నేనెట్లా మొయ్యగలను నందూ! చెప్పు నందూ..” అంటూ పసిపిల్లాడిలా ఏడుస్తున్నాడు.
అంతా గమనిస్తున్న కాటికాపరి వారిద్దరినీ సమీపించాడు. జానకమ్మ కొడుకని గ్రహించాడు.
“పోయినోళ్లను తిరిగి తెచ్చుకోలేం బాబూ! ఆళ్లతో ఎల్లిపోనూలేం! ఆళ్ల రుణం తీర్చుకోడానికి.. నీ భారం దించుకోడానికి ఆళ్లు మనకు ఏదో ఒక పని మిగిల్చే ఎల్తారు బాబూ! అదేదో ఎరిగి పూర్తిసెయ్‌ బాబూ.. లెక్క సరిపోద్ది” అనుభవంతో కూడిన నిబ్బరత అతని మాటల్లో స్పష్టమవుతున్నది.
“క్రిష్‌! ప్లీజ్‌.. నేనున్నాను. అన్నీ సర్దుకొంటాయి. నీ క్షోభ తీరుతుంది. నేను చూసుకొంటాను క్రిష్‌” అని ఓదారుస్తూ, రామకృష్ణను కారు దగ్గరకు తీసుకొచ్చింది నందిని. వాటర్‌ బాటిల్‌ తీసుకొని అతని ముఖం కడిగింది. తిరిగి కారులో కూర్చోబెట్టింది. నందిని డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చుంది.

“తాతగారూ! నా హోం వర్క్‌ అయిపోయింది. ఇక మీరు కథ చెప్పాల్సిందే!” అంటూ సూర్యం మాష్టారు మెడను చుట్టేసింది జానకి.
“తాతయ్యకు రెస్ట్‌ ఇస్తావా? లేదా?” అంటూ తన కూతుర్ని సున్నితంగా మందలించింది నందిని. టాబ్లెట్‌, మంచినీళ్లు సూర్యం మాష్టారుకు అందించింది.
“నా తల్లితో ఆడుకోవడమే నాకు రెస్టమ్మా!” అంటూ మనవరాలిని ఒళ్లోకి తీసుకున్నాడు.
తాతా, మనవరాలి సరదాల్ని గమనిస్తూ.. లాప్‌టాప్‌లో ప్రశాంతంగా వర్క్‌ చేసుకొంటున్నాడు రామకృష్ణ.
లెక్క తేల్చేసిన గణితకారుడిలో కనిపించే ఆనందం.. ఇప్పుడు రామకృష్ణ మనసంతా, ఇల్లంతా, హృదయమంతా, లోకమంతా.. అదే ఆనందం.

ఈమని కోటేశ్వర రావు
ఈమని కోటేశ్వర రావు స్వస్థలం గుంటూరు జిల్లాలోని బాపట్ల. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది. కథా రచనను ప్రవృత్తిగా ఎంచుకొన్నారు. ఇప్పటివరకూ 30కిపైగా కథలు రాశారు. ఓ గాడ్‌! మీల్స్‌ రెడీ!, పురుష జాలం, హంతకుడు, గెలుపు నీదేనోయ్‌.. కథలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. వీరు రాసిన పలు కథలు వివిధ వార పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘నీలి నీడలు’ నాటకం, అనేక పరిషత్తులలో ప్రదర్శితమైంది. అనేక బహుమతులు గెలుచుకున్నది. ‘కథ’కు
ఆదరణ కొరవడుతున్నదన్న మాట అసత్యమని కోటేశ్వర రావు అభిప్రాయం. వ్యథలున్నంత వరకూ కథలుంటాయని చెబుతున్నారు. సాహిత్యానికి సమయం కేటాయిస్తున్న రసజ్ఞులు ఉన్నంత వరకూ ‘కథ’ సజీవమని అంటున్నారు.

ఈమని కోటేశ్వర రావు , 98485 47981

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement