e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 23, 2021
Home కథలు ఈవారం కథ: ఊరు పొమ్మంది.. రమ్మంది

ఈవారం కథ: ఊరు పొమ్మంది.. రమ్మంది

ఎక్కడి మహారాష్ట్ర సరిహద్దు. ఎక్కడి హైదరాబాద్‌. పొట్ట చేతితో పట్టుకొని వచ్చిందా కుటుంబం. ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ పల్లెటూరు వాళ్లది. బతుకు దెరువుకు భాగ్యనగరానికి వచ్చాడు మల్లయ్య. కొడుకు చిన్నవాడు. కుటుంబ పోషణ కోసం పట్నం బాట పట్టాడు. ఊళ్లో ఉన్నది రెండెకరాలు.. ఒక్కో ఏడాది కరవు. తల్లీదండ్రీ ఉన్నచోటే ఉండి, పొలాన్ని సాగుచేసుకొంటూ కలో, గంజో తాగి బతుకుతామన్నారు. ‘అదీ మంచిదే’ అనిపించింది మల్లయ్యకు. ఎందుకంటే, తమకే తాడూ, బొంగరం లేదు. మరో ఇద్దరు జీవుల పోషణంటే కష్టమే! విపరీతంగా విస్తరిస్తున్న నగరంలో ఎక్కడెక్కడినుంచో వలసలు పెరిగాయి. సుదూర ప్రాంతాల నుండి జనం నగరంపై వాలసాగారు. హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడ్డాడు మల్లయ్య. కరువు సమస్యలతో, ఇంటిల్లిపాదికీ గ్రాసం సరిపోక వలసవచ్చిన కుటుంబాల్లో మల్లయ్య కుటుంబం కూడా ఉంది. ప్రతిరోజూ ఉదయం అడ్డా మీద నిలబడేవాడు. అలా నాలుగు రోజులు వేచి చూశాక ఒక మేస్త్రీ పని ఇచ్చాడు. అది మొదలు.. కష్టించి పని చేయసాగాడు. అదే మేస్త్రీలో అభిమానం పెంచింది.. అతనంటే. దాంతో రెగ్యులర్‌గా పని కల్పించసాగాడు మల్లయ్యకు. భార్య లక్ష్మి కూడా.. తనూ ఏదైనా పనిచేస్తానని చెప్పింది. ఉన్న ఊళ్లోనయితే కలుపు తీతకు వెళ్లేది. ఇక్కడ ఏ పని చేయగలదు? అదీగాక వయసులో ఉన్న లక్ష్మి, చామనఛాయ రంగులో కళగల మొహంతో అందంగా ఉంది. చూపరులను ఇట్టే ఆకర్షించే మొహం ఆమెది. ఈ నగరంలో ఎన్నో ఘోరాలు జరుగుతుంటాయి. భయపడ్డాడు మల్లయ్య.. సర్ది చెప్పింది లక్ష్మి.“నా పైలంల నేనుంటనయ్యా.. పొద్దుగాల్నే రెండు మూడు ఇండ్లల్లకు పనికెళ్తా. నాకేంగాదు.. ఈ సుట్టు పక్కల్నే పని చేస్తనయ్యా! అప్పటిదాంకా బుడ్డోడు పక్కింటి పిల్లతో ఆడుకొంటడు” అని. అయిష్టంగానే ఒప్పుకొన్నాడు మల్లయ్య. వచ్చే ఏడు బుడ్డోడిని ఇంగ్లీషు మీడియం బడికి పంపాలి. ఖర్చులుంటాయి. ఏదో.. ‘వేడి నీళ్లకు చన్నీళ్లు’ అనుకొన్నాడు. “జరంత పైలం లచ్చిమీ” అని పదేపదే చెప్పసాగాడు. మొగుడి భయానికి నవ్వుకొన్నది లక్ష్మి. తను నిప్పు. ఆ భరోసా తనకుంది.

రోజులు ప్రశాంతంగాగడుస్తున్నాయి. ఏడాదికోసారి మల్లయ్య తల్లిదండ్రులు వస్తారు. రెండు రోజులు ఉంటారు. ఉండేది రెండు చిన్న గదుల పోర్షన్‌.. రేకులది. దాని అద్దెనే మల్లయ్యకు ఎక్కువ. మల్లయ్య మాత్రం ఎన్ని పనులున్నా ఏటా తమ ఊరికి దగ్గరలో జరిగే ‘నాగోబా’ గిరిజన జాతరకు హాజరవుతాడు. వారి ఆచారం ప్రకారం ఘనంగా జరుగుతుంది జాతర. కెస్లాపూర్‌ గ్రామంలో జరిగే ఆ వేడుక, దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర. నియమానుసారం మొక్కులు చెల్లించుకొంటుంది మల్లయ్య కుటుంబం.
మధ్యమధ్యలో ఊరికి వెళ్లాలంటే ఖర్చుతోపాటు ఒకరోజు పని లేకపోతే అదో నష్టం. అందుకే, మల్లయ్య సొంత ఊరికి వెళ్లడానికి ఇష్టపడడు. ఏడాదిలో ఒక పండుగకు తల్లిదండ్రులను పిలిపించుకొంటాడు. తండ్రికి వయసు మీద పడుతోంది. తన దగ్గరకు పిలిపించుకొని కొడుకుగా బాధ్యత తీర్చుకొందామనుకొంటే.. ఆర్థిక సమస్యలు.
ఒక్కోసారి అనిపిస్తుంది.. ‘ఏంటో ఈ బతుకు’ అని. రెక్కాడితేకానీ డొక్కాడదు. నగరంలో భవన నిర్మాణరంగం బాగా పుంజుకుంటోంది. మల్లయ్యకు రోజూ పని దొరుకుతోంది. బుడ్డోడిని ఇంటికి దగ్గర్లోనే ఓ కాన్వెంట్‌లో చేర్పించారు. ఆ ఫీజులు చూస్తేనే మల్లయ్య గుండె ఝల్లుమంది. ‘వామ్మో’ అనుకొన్నాడు. అయితే, కొడుకును బాగా చదివించాలనీ, తమలాంటి మట్టి బతుకులు వాడికొద్దనుకొంటూ.. వాడే ఆశగా, శ్వాసగా బతుకీడుస్తున్నారు. లక్ష్మి మరో రెండిండ్లలో పాచి పనులు కుదుర్చుకొంది. వారి వారి ఇండ్లలో మిగిలిన అన్నం, కూరలను ఆయా యజమానురాళ్లు లక్ష్మికి ఇస్తుంటారు. చాలాసార్లు వంట పని చేయాల్సిన అవసరం తప్పుతుంది లక్ష్మికి. ఇదిలా ఉండగా, ఒకరోజు తను పనిచేసే అపార్ట్‌మెంట్‌కు పనికి వెళ్లింది లక్ష్మి. బుడ్డోడిని రెడీ చేసి, మరీ వెళ్లిందామె. ఆ ఇంట్లో పనిచేసి వచ్చేసరికి బుడ్డోడి స్కూల్‌ టైమ్‌ అవుతుంది. తను దించి వస్తుంది. అందరి ఇండ్లలోనూ పనులు ముగించేసరికి స్కూల్‌కు లంచ్‌ బ్రేక్‌ ఇస్తారు. అప్పుడు లక్ష్మి బుడ్డోడికి బాక్స్‌ తీసుకొని వెళ్లి, తినిపించి వస్తుంది. ఇలా దినమంతా అలుపెరుగక కష్టపడుతుంది లక్ష్మి. మల్లయ్య పొద్దున్నే చద్ది కట్టుకొని వెళ్తాడు. ఆరోజూ మామూలుగానే పద్మావతమ్మ ఇంటికి పనికి వెళ్లింది లక్ష్మి. “అమ్మగారు.. అమ్మాయి దగ్గరికి వెళ్లింది. ఇల్లు మాత్రం ఊడ్చి వెళ్లు” అని చెప్పాడు ఇంటాయన. ఆయనకు అరవై ఏండ్ల వయసు ఉంటుంది.

- Advertisement -

ఇల్లు ఊడ్చటం మొదలు పెట్టింది లక్ష్మి. “ఇదుగో లక్ష్మీ.. ఒకసారి ఇటు వస్తావ్‌” పిలిచాడు ఆ పెద్దాయన.“ఏంటయ్యగోరూ..” అంటూ ఆయన ఉన్న బెడ్రూమ్‌లోకి వెళ్లింది.
“ఇదిగో చూడు.. ఈ మూలన దుమ్ము పోలేదు” అంటూ ఒక వేపు చూపించాడాయన.చీపురు పట్టుకొని అటువేపు చూసింది లక్ష్మి. చాలా శుభ్రంగా ఉందక్కడ. “ఇక్కడేం లేదయ్యగోరూ..” అంటూ వెళ్లబోయింది. “ఇదిగో ఇటు చూడు. ఇది చాలా బాగుంది కదూ!” అంటూ చేతిలోని సెల్‌ఫోన్‌ చూపించాడు.. డోర్‌ దగ్గర నిలబడి.
చూసింది లక్ష్మి. “ఛీ.. ఏంటిది అయ్యగోరు. తప్పుగాదు!” అంటూ విసురుగా వెళ్లబోయింది. ఫోన్‌లో ఉన్నది.. నీలిచిత్రం. ఆమె చేయి పట్టుకొని ఆపాడాయన.
“లక్ష్మీ.. ఒక్కసారి. ఈ అవకాశం మళ్లీ రాదు. అమ్మగారు కూడా లేదు. నీకు ఎంతంటే అంత ఇస్తాను. నువ్వు కష్టపడితే నీకేం వస్తుంది చెప్పు” బతిమాల సాగాడు.
“నేనసొంటి దాన్ని కాదు. ఇడ్సిపెట్టండి. లేకపోతే కేకలు వెడుత.. మీ..” అంటూ విడిపించుకొని, విసవిసా బయటకు వచ్చింది లక్ష్మి. వగరుస్తూ ఇంటికి చేరుకొన్న లక్ష్మికి, తేరుకోవడానికి అరగంట పట్టింది.

దుఃఖం తన్నుకొస్తుందామెకు. ఛీ.. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా?‘పెద్దాయన కదా!’ అని ఎంత గౌరవంగా చూసింది. రెండు రోజుల తర్వాత, వాచ్‌మన్‌తో కబురు పెట్టింది పద్మావతమ్మ. “ఏంటి లక్ష్మీ పనికి రావడం లేదు? చెప్పాలని తెలియదా?” తీక్షణంగా అడిగిందామె. సోఫాలో కూర్చొని పేపరులోంచి తల ఎత్తకుండా, దొంగ చూపులు చూడసాగాడు ఆవిడ భర్త. “మన్నించండి అమ్మగోరూ! నాకు శాతనైతలేదు. నేనిక పనికి రాను. వేరేటోళ్లను చూసుకోండి!” అని చెప్పింది లక్ష్మి. “ఆ విషయం నువ్వు చెప్పనవసరం లేదుకానీ, ఏమయిందే.. వయస్సులో ఉన్నదానివి. నీకేం తక్కువ చేశాను” “వద్దు.. అమ్మగోరూ. గవ్వన్నీ అడక్కండి. నాకు శాతనైతలేదు.. గంతే!”
“నిజం చెప్పవే! నేను ఊర్లో లేనప్పుడు పని మానేశావ్‌. ఏం జరిగిందసలు?” అంటూ భర్తవేపు దృష్టిసారించిందా ఇల్లాలు. జవాబు చెప్పలేక, తల పక్కకు తిప్పుకొని..
“దయుంచండమ్మా.. ఇక పోతా” అంటూ వెనుదిరిగింది లక్ష్మి.

ఆ సాయంత్రం మల్లయ్యతో చెప్పింది లక్ష్మి. “మనూరుకు ఎళ్దామయ్యా.. కలో, గంజో తాగుదం. మనూరుకు గూడ పట్నం నుంచి స్కూల్‌ బస్సులు వస్తయట! బుడ్డోణ్ని ఆణ్నే సదివిద్దాం”“సరేగనీ, అక్కడెట్ల బతుకుతమే! ఆడ బతుకలేకనే గద ఈడికి అచ్చింది. ఏమైందే! నీ బుర్రల పురుగు గిట్ల మెసుల్తందా ఏంది?” అని అడిగాడు.
ఇక ఉండబట్టలేక జరిగింది చెప్పి.. చేతుల్లో మొహం దాచుకొని ఏడవ సాగింది లక్ష్మి. “ఓస్‌.. ఊకోయే! పట్నంల తోడేలు మందలుంటయే! మనమే జరంత పైలంగ ఉండాలె” అంటూ ఊరడించ సాగాడు. “నేనిక్కడ ఉండలేనయ్యా! నాకు భయంగా ఉందయ్యా” అంటూ మొగుడిని కావలించుకొంది. “ఇప్పటికిప్పుడు ఎలాగే! బుడ్డోడిని ఇక్కణ్నే స్కూల్లో చేర్పించినం. మళ్ల మస్తు ఖర్సు. నేను పొయ్యి పంచాయితీ పెట్టుకొని వస్తా ఉండు”“గీ లొల్లులు మనకద్దయ్యా! మనమసలే గరీబోళ్లం. ఆ ఇంట్లో పని మానేసిన. నా పైలంల నేనుంటా” అని చెప్పింది. మరుసటి రోజు పద్మావతమ్మ కొంత డబ్బు పంపింది.. వాచ్‌మన్‌ ద్వారా. లక్ష్మి అర్థం చేసుకొన్నది. ఈ విషయం బయటకు తెలిస్తే, ఆయమ్మగారి పరువే పోతుందని అనుకుందేమో! అదేరోజు పద్మావతమ్మ భర్త తన ఇంటి ముందునుంచే తల వంచుకొని పోవడం గమనించింది లక్ష్మి. తలకూడా ఎత్తి చూడలేదు ఆ పెద్దాయన.
‘తప్పుడు ఆలోచన చేసింది ఆయన.. మేమెందుకు ఇక్కడి నుంచి వెళ్లాలె’ అని ధైర్యం చిక్కబుచ్చుకొంది లక్ష్మి. నగర జీవనానికి అలవాటు పడుతున్నారు మల్లయ్య, లక్ష్మి. బుడ్డోడిని సీమ చదువులు చదివిస్తున్నారు. మల్లయ్యకు చేతినిండా పని దొరుకుతోంది. రోజూ పనికి వెళ్తున్నాడు. ఒక్క ఇల్లు పోతేనేం.. మరో ఇల్లు చూసుకుంది లక్ష్మి. పని చేయాలే కానీ, పని మనుషులకు డిమాండ్‌ బాగానే ఉంది ఈ సిటీలో. ఏదో బుడ్డోడికి చదువు బాగా వస్తే చాలు. ‘ఊరిలో ఏముంది? గందుకే తొందర పడద్దు. ఇక్కణ్నే ఉండి కాళ్లు ముడ్సుకోవాలె’.. ఇలా ఆలోచనల్లో నిమగ్నమైంది లక్ష్మి.

రోజులు సాఫీగా జరిగితే కాలానికి కూడా కుళ్లే. ప్రపంచం మొత్తం పడగవిప్పింది మహమ్మారి ‘కరోనా’.. నగర జీవితాలను అతలాకుతలం చేయసాగింది ఆ రక్కసి. జన జీవనం స్తంభించింది. పనులు మూలన పడ్డాయి. చిన్నాచితకా పనులు చేసుకొనేవారు పస్తులుండటం మొదలుపెట్టారు. అందరిలాగే మల్లయ్య కూడా.. నిర్మాణరంగం పడకేసింది. పదేను దినాలైంది మల్లయ్య పనికెళ్లి. పని మనుషులను కూడా ఇళ్లలోకి రానివ్వడం లేదు. భయం.. భయం.. అంతా భయం. బుడ్డోడి చదువూ బందయ్యింది. ఇంట్లో ఉన్న సరంజామా అడుక్కొచ్చింది. వచ్చే నెల ఇంటి కిరాయి ఎలా ఇవ్వాలో తెలియదు. ఇద్దరూ పనిచేస్తేనే బొటాబొటిగా గడుస్తుంది. భవన నిర్మాణ కార్మికుల్లో అత్యధిక శాతం తమ సొంతూళ్లకు వెళ్లాలని నిర్ణయించుకొన్నారు. అక్కడ ఉంటే కలో, గంజో తాగొచ్చు. లేదా ఉపవాసం ఉండొచ్చు. ఇక్కడే ఉంటే, చచ్చినా పట్టించుకొనే దిక్కులేదు. పనీపాటా లేకుండా ఇక్కడ ఉండి చేసేదేముంది. అద్దె కొంపల్లో యజమానులు ఊరికే ఉండనిస్తారా?పోదామంటే బస్సులు, రైళ్లు బందైనయ్‌. ఒక్క గోస కాదు. ఓరి భగవంతుడా.. ఏమిటయ్యా ఈ పరిస్థితులు తెచ్చావు. కరోనా బారిన పడితే, జరగకూడనిది ఏదైనా జరిగితే..అప్పటికే వార్తలు వస్తున్నాయి.. కరోనా చావుల గురించి. ఎవరయినా చస్తే ఈడ్చి పారేస్తున్నారు. అటు నుంచి అటే వల్లకాడికి తీసుకెళ్తున్నారు. కడసారి చూపు కూడా కరువే! అయినవాళ్లు, కన్నవాళ్లు, చివరకు కట్టుకున్న వాళ్లు కూడా నోచుకోవడం లేదు. రాజు – పేద తేడా లేదు.
ఒకవేళ సాధారణ చావే అయినా, చూడటానికి ఎవరూ రావడం లేదు. బతుకు భయం పీడించసాగింది.. అందరినీ.

తిందామంటే.. తిండిలేదు. చేద్దామంటే.. పనిలేదు. “ఏం చేద్దామయ్యా!” భర్తను అడిగింది లక్ష్మి. “అదే అర్థమైత లేదే! బతుకు కనాకట్టంగా ఉంది. ఎట్లనో ఏమో!” దిగులుగా చెప్పాడు మల్లయ్య. “ఇక్కడుండి చేసేదేముందయ్యా! మనూరెల్దాం” సలహా చెప్పింది. “నిజమేనే! మా నాయినకు గూడా శాతనైతలేదు. ఉన్న రెండెక్రాలు మనమే జేసుకుందాం”“అవునయ్యా! గిప్పుడిప్పుడే ఈ రోగం తగ్గెటట్టు లేదు. సావో, బతుకో.. అక్కణ్నే ఉందామయ్యా! అందరం కలిసే ఉందాం. లేకపోతే ఎవలు సచ్చినా కబురు వోదు. ఎల్దామయ్యా! బతికుంటే బలుసాకు తినొచ్చు” స్థిరంగా చెప్పింది. “మరి బుడ్డోడి సదువు?”“ఇంకేం సదువయ్యా! బడులన్నీ మూతవడ్డయ్‌. అక్కడ పట్నంల సదివిద్దాం”“ఎట్ల ఎల్తదే?”“ఎట్లనో అట్ల నడిపిద్దం. మనం పస్తులుండైనా, వాణ్ని సదివిద్దం. రేపు ఆడే మనకు దిక్కైతడు” ఆమె కళ్లలో ఒక విధమైన వెలుగు. ఆమెకు స్వతహాగా ఈ నగర జీవితం నచ్చలేదు. కాలనీలో మగ జనాల చూపులను ఆమె భరించలేక పోతున్నది. కాలనీ చివర ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ బిడ్డను మానభంగం చేశారు. డబ్బున్న మారాజులు దాన్ని కప్పి పెట్టారు. వామ్మో.. ఈ తోడేళ్లను తలచుకొంటేనే భయం వేస్తున్నది. తనను తాను ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇంకా నయం.. భర్తకు చెబితే బాధ పడుతాడని చెప్పడం లేదు.

ఎవరి దారి వారిదే. మాయదారి రోగం కబళిస్తే.. అందరిలాగే తామూ తట్టుకోలేరు. అప్పటికే.. వలసలు ప్రారంభమయ్యాయి. చిన్న చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. బస్సులూ, రైళ్లూ సర్వం బందయ్యాయి. అంతదూరం ఉన్న తమ ఊరికి ఎలా, ఏ విధంగా వెళ్లాలో అంతుచిక్కడం లేదు. తమ ఊర్లు వేల కిలోమీటర్ల దూరం ఉన్నా, నడక సాగిస్తున్నారు ఎంతోమంది. భయం.. భయం.. అందరిలోనూ భయం. అంతంత దూరం నడవాలంటే.. మాటలా?బతుకు భయం నడిపిస్తోంది.. అందర్నీ!పొట్ట చేత్తో పట్టుకొని వచ్చినవాళ్లు.. ఆ పొట్ట నింపుకొనే దారులు మూసుకుపోయిన వేళ.. నగరం ఖాళీ అవసాగింది. చీమల బారుల్లా మూటాముల్లే తలపై పెట్టుకొని, చంటోళ్లను చంకన ఇరికించుకొని పుట్టినూరి బాటపట్టారు. ‘ఇక, తమకూ అదే దారి’ అనుకొన్నారు మల్లయ్య, లక్ష్మి. ఏడుపు తన్నుకొస్తోంది.. ఇక వేరే మార్గం లేదు. తమ ఊరు కొన్ని వందల కిలోమీటర్లు. నడక సాగిస్తే.. ఎన్ని రోజులు పడుతుందో!కొద్దిపాటి చిల్లర ఉంది. దారిలో దయగల దాతలు అక్కడక్కడా తిండీ, తిప్పల సంగతి చూస్తున్నారన్న సంగతి తెలిసింది. ఇక, నడక ప్రస్థానం మొదలుపెట్టారు. కాళ్లు తీపులు పెడ్తున్నాయి. అక్కడక్కడా ఆగుతున్నారు. చెట్ల నీడన సేద తీరుతున్నారు. ఎవరో మనసున్న మారాజులు అక్కడక్కడా దూప తీరుస్తున్నారు.
బతుకుదామని పట్నం వస్తే, ఆశలను నిరాశలు చేసిన ఈ మహమ్మారిని దుమ్మెత్తి పోస్తూ, దారిలో గుడిలో దాక్కున్న దేవుళ్లకు దూరం నుంచే దండాలు పెడుతూ నడక సాగించారు. పుట్టిన ఊరినీ, కన్నవారినీ వదిలి బతుకు ఛిద్రమైన ఆ వ్యధార్త జీవులను ఆ ఊరే అక్కున చేర్చుకోవడానికి రమ్మంటున్నది. ఒకవిధమైన బతుక్కు అలవాటు పడ్డవారు, విధి పరిహాసం చేయగా.. విపత్కర పరిస్థితుల్లో తమ ఊరి బాట పట్టారు. కన్న కలలు కరిగిపోగా, బతుకుమీద అపేక్ష వారిని ఊరి బాట పట్టిస్తోంది.
ఎంత కాలానికో మళ్లీ పరిస్థితులు చక్కబడ్డా.. స్వార్థంతో పుట్టిన ఊరిని వదలొద్దనీ, ప్రకృతి గాలి పీలుస్తూ.. ఉన్నంతలోనే హాయిగా బతకాలనీ, చస్తే.. అందరి మధ్యే చావాలనీ, దిక్కులేని చావు చావొద్దనీ లక్ష్మి నిర్ణయించుకొన్నది. అందుకే, మధ్య మధ్యలో సొమ్మసిల్లే పరిస్థితి వస్తున్నా, లేని ఓపిక తెచ్చుకొంటున్నది. వదిలిన ఊరి పొత్తిళ్లలో సేద తీరాలనే తాపత్రయంతో అలా అలా నడుస్తూనే ఉన్నారు.. లక్ష్మి, మల్లయ్య! బుడ్డోడితో పాటుగా.. వాడి తోడుగా..

పంతంగి శ్రీనివాస రావు
పంతంగి శ్రీనివాస రావు స్వస్థలం సూర్యాపేట. విద్యుత్‌ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి, పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. సాహిత్యాభిలాషతో రచనా వ్యాసంగాన్ని అలవాటుగా మలుచుకొన్నారు. ఇప్పటివరకు 30కిపైగా కథలు రాశారు. ఇందులో 20 కథలు.. వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా బతుకమ్మలో ప్రచురితమైన ‘జ్ఞాపకం’ కథ, వీరికి విశేషమైన పేరును తీసుకొచ్చింది. దీంతో, అదే పేరుతో తన మొదటి కథా సంకలనాన్ని వెలువరించారు. నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’ కోసం ఈయన రాసిన ‘ఊరు పొమ్మంది..రమ్మంది’ కథ, బతుకమ్మలో సాధారణ ప్రచురణకు ఎంపికైంది. హృదయాన్ని కదిలించే కథలు రాయడాన్ని శ్రీనివాస రావు ఇష్టపడతారు. ఎందుకంటే, అవే పాఠకుల స్పందనకు నోచుకుంటాయని ఆయన బల్లగుద్ది చెబుతున్నారు.

-పంతంగి శ్రీనివాస రావు , 9885112517

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement