e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home కథలు ఈవారం కథ.. అడివి బతుకులు

ఈవారం కథ.. అడివి బతుకులు

“అరే.. ఓరారీ! నిమ్మలోల్ల పొల్ల పెద్ద మనిషైందటరా!” పెంటకు చెందిన గజ్జెలు పక్కోనికి చెప్పిండు.ఆనోటా ఈనోటా ఆ వార్త పెంటల గుప్పుమన్నది.ఆ పిల్లను గుడిసెకు దూరంగా ఒక చెట్టుకింద కూసోబెట్టింది తల్లి. వెదురు బియ్యం బువ్వా, ఎరవలగడ్డలు, కొండగడ్డలు, తేవరగడ్డలు, వండిన పైలికూర, సిర్రికూర, దుగ్గలకూర, చెంచులకూర అసుంటి పదార్తాలన్నీ సిబ్బిలవెట్టి, ఆ పిల్లకు అంటుకోకుంట దూరంగా పెట్టి అచ్చింది.బగ్గబగ్గ మండే ఎండలే కాయనీ, ఉరుములు మెరుపుల తోటి పిడుగులే పడనీ, ఇయ్యరమయ్యర వానే దంచనీ ఆ చెట్టుకింది పిల్ల గట్లనే ఒంటరిగనే ఉండాలె. బిక్కుబిక్కుమనుకుంట, భయం భయంగా గట్ల మూడు దినాలు గడపాలె. మూడో రోజున, మొగోళ్ల కంట బడకుంట తానమాడిచ్చి ఇంట్లెకి తీసుకొత్తరు.ఆ పిల్ల సమర్తయి గప్పుడు రెండు నెలలైంది. అయ్యా అవ్వా ఇంగ లగ్గం చేసే పనిల వడ్డరు.


కోనమ్మ దోరజాంపండు లెక్క, దోర వయసుల మిసమిసలాడుతాంది. విరగబూసిన రేలకొమ్మ లెక్క సక్కదనంగ ఉన్నది. మత్తెక్కించే ఇప్ప పువ్వులెక్క ఉన్నది. అడివి దేవత చెంచుపిల్ల రూపంల అచ్చినట్టున్నది. నున్నగ అంట దువ్వి కొప్పు ముడుసుకున్నది. ఎడమ చెవి పక్కన కొండగోగు పువ్వు పెట్టుకున్నది. పోత పోసిన అమ్మోరి కంచు విగ్రహం లెక్క ఉన్నది. వయసు తెచ్చిన మిడిసిపాటుతో నవ్వుకుంట, తుళ్లుకుంట, ఒక్కాడ కుదురుగా ఉండక చెంగు చెంగున ఎగిరే లేడిపిల్ల లెక్క ఉన్నది.ఒగరోజు కుండ సంకన బెట్టుకొని మంచినీళ్ల కోసం బయలెల్లింది కోనమ్మ. పెంటకు కోసెడు దూరంల కొండవాగు ఉంది. పెంటవాళ్లు మంచినీళ్ల కోసం అంత దూరం నడవాల్సిందే.
వాగు ఎండిపోయినట్టు ఉన్నది. నడ్మనడ్మ ఉస్కె దిబ్బలున్నయ్‌. వాటి సుట్టూ నీటిపాయలు పారుతున్నయ్‌. కోనమ్మ వాగు లోతట్టు సోటుకు పోయింది. కుండ పక్కనబెట్టి మోకాళ్ల మీద కూసున్నది. వంగి చెలిమె తీసుడు మొదలువెట్టింది.

- Advertisement -

కోనమ్మ కూసున్న సోటుకు ఎగువన మడుగు లెక్క నీళ్లు నిల్శివున్నయి. గా మడుగల రెండు మూడు గాలాలతోని చేపలు పట్టుతున్నడు కొండడు. ఎంతసేపటికీ ఒక్కగాళం బెండూ మున్గుత లేదు. కొండనికి యాష్టకొత్తన్నది. ఇసుక్కుంట దిక్కులు సూసుడు మొదలువెట్టిండు ఇంక యాడనైన మంచి సోటున్నదేఁవోనని. మడుగులైతే కన్పించలేదుగనీ శెలిమె తీత్తున్న కోనమ్మ మెరుపు మెరిసినట్టుగా కన్పించింది.వాల్గరెబ్బ లెక్క ఉన్న కోనమ్మను సూడంగనే కొండని యిసుగంత మాయమై పోయింది. రెండు మూడు సీసాల యిప్పసార తాగినంత వుషారు వచ్చింది. గాళాలు ఒడ్డున పారేశిండు. గట్టిగ పెయ్యి యిర్సుకొని కోనమ్మ దగ్గరికి పోయిండు.గంత దగ్గర కొండణ్ని సూడంగనే కోనమ్మ పెయ్యి జల్లుమన్నది. గుండె బురద మట్ట లెక్క కొట్టుకుంటున్నది. పెయ్యంతా శెమటలు పట్టినయ్‌. గండె పరకల్లెక్కున్న కండ్లను టపటపలాడించుకుంట సూశీ సూడనట్టుగ కొండని దిక్కు సూశింది. సిగ్గు ముంచుకొచ్చిందేఁవో ఎంబడే కండ్లు వాల్సుకున్నది. గట్ల కండ్లు వాల్సుకున్నా కొండని ఇగ్గరమే కండ్ల బడ్తాంది.

కోనమ్మను సూడంగనే కొండని మనసు నెమలిలెక్క పురియిప్పుకున్నది. నరనరాల్లో ఏదో కరెంటు ఉరుకులు తీత్తన్నట్టుగుంది. గుండె కుందేలు పిల్లలెక్క చెంగు చెంగున గంతులు ఎయ్యబట్టింది.
బలంతంగ గుండెను సిక్కబట్టుకొని శిన్నగ గొంతు సరాయించిండు కొండడు.“ఏం పిల్లా! ఏం జేత్తన్నవ్‌?” గొంతు పెకిలించుకొని అన్నడు.“శెల్మె దీత్తాన్న. కండ్లబడ్తలేదా?” గడ్సుగ అన్నది కోనమ్మ.“ఎట్ల కండ్లబడ్తది? కండ్లనిండ నువ్వేగదా?” కోనమ్మకెల్లి సిలిపిగ సూస్కుంట అన్నడు కొండడు.“గదేందీ? నీ కండ్లల్ల నేనుండుడేంది?” అనుకుంట కిసుక్కున నవ్వింది కోనమ్మ.
“నువ్వు నవ్వుతాంటె ఎంత బాగున్నదో ఎర్కేనా? బువ్వా, నీళ్లు యిడ్శి ఎంతకాలమైనా ఉండొచ్చు నీ నవ్వు సూస్కుంట” కోనమ్మకెల్లి సూస్కుంట కొంటెగ అన్నడు కొండడు.శివ్వున తలెత్తి కొండనికెల్లి సూశింది కోనమ్మ. కొండని కండ్లల్ల తనకు కావాల్శినదేందో ఉన్నదనిపించింది కోనమ్మకు. మనసు కొండని సుట్టే తిరుగుతున్నట్టు అనిపిచ్చింది. ఆ ఆలోశెన రాంగనె ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. శెల్మె దీసుడు లేదు ఏం లేదు. చేతివేళ్లు పైపైన్నే ఉష్కెను గీకుతున్నయి.
“వో.. గిట్టయితే మూడు నాల్గు దినాలకు సుత శెల్మె దియ్యలేవు. జర్గు.. నేను దీత్త” అని కోనమ్మను జరిపి తను కూసున్నడు.

కొండని చెయ్యి తగలంగనె కోనమ్మ నరాలు జివ్వుమన్నయి. కన్నార్పకుంట కొండణ్నే సూత్తాంది. కొండని బలమైన చేతివేళ్లు ఉష్కెను సులాగ్గా తీస్తున్నయి. కొంచెం సేపట్లనే శెల్మల నీళ్లు ఊరినయ్‌. కుండ లోపట్ల ఉన్న సత్తు గళాసు తీసి కొండనికి అందిచ్చింది కోనమ్మ. కొండడు గబ్బగబ్బ గళాసు తోటి నీళ్లు తోడి కుండ నింపిండు.కోనమ్మ కండ్లు కొండణ్ని మెచ్చుకుంటున్నట్లు మిలమిల మెర్శినయి.కొండని మనసులోపట కోరిక అగ్గి లెక్క రాజుకుంటాంది. బలంతంగ ఆపుకొంట..“అనే కోనీ! నన్ను మనవాడుతవా?” సాజ్జిగ కోనమ్మ కండ్లలోపట్లెకి సూస్కుంట అడిగిండు.కోనమ్మ పెయ్యి జలదరిచ్చింది. ఒక్కటన్లె, రెండన్లె.“మాట్లాడవు? సమ్మతైతే చెప్పు. ఇద్దరం మన కులపెద్ద అంజన్న కాడికి పోదం. మనిద్దరికి ఇట్టమైనంక గాయన సుత సరే అంటడు. మన కుల కట్టుబాటు నీకెర్కే కదా? మూడు దినాలు ఇద్దరం అడివిల్నే ఉండాలె. నేను పొయ్యి అడ్విల మనం ఉండేటందుకు గుడ్శేత్త. అటెంక మనం పెంటకొచ్చి కల్శివున్నా ఎవ్వలేమనరు” ఆశగా అన్నడు కొండడు.

ఒక్కపాలె కోనమ్మ మనసు బెదిరింది.“మా అవ్వ, అయ్యకు ఎర్కలేకుంటనా?” భయం భయంగా అన్నది కోనమ్మ.“ఆఁ..” అన్నడు కొండడు. కోనమ్మ కుండ నెత్తిమీదికి ఎత్తుకున్నది.
“గట్ల సాటు మాటుంగ ఎందుకు? నేటుగనే మనువాడుకుందాం. నేను మా అవ్వ అయ్యకు ఎర్కజేత్త. నువ్వు మన కుల కట్టు పెకారం మీ వోళ్లను తోల్కరా. అందరి సమ్మతి అయినంక లగ్గమైతది. గప్పుడు పెద్దలు సుత మెచ్చుతరు. మర్శిపోకు. మీవోళ్లను తోల్కరా” అని ఎనిక్కి ఎనిక్కి కొండణ్నే సూస్కుంట ఇంటిదారి వట్టింది కోనమ్మ.


“ఓరారీ! కొండా! నిమ్మలోల్ల తానికి లగ్గం సూపులకు బోవాలె. జప్పున రారా!” అని కొండని అయ్య కేకేశిండు.“ఏందీ?” అన్నడు కొండడు ఏం ఎర్కలేనట్టు.నిమ్మలోల్ల తానికి అంటే కోనమ్మ కోసవేఁ.. కొండని మనసు కోడెగిత్త లెక్క రంకేసింది సంబురం ఆపుకోలేక.“లగ్గం సూపులకురా! నిమ్మలోల్ల యింటికి..” అన్నడు కొండని తండ్రి.“నేను బొయ్యి కులపోల్లు ఒగ తొమ్మండుగుర్ని, పెంటకు పెద్దయిన తోకల అంజన్నను తోల్కొనత్త. గీలోపట్ల నువ్వు జర మంచిగ గుడ్డలేస్కో” అని కొడుక్కి చెప్పి పెంటలకు బోయిండు.ఉన్నంతల మంచిపంచె కట్టుకున్నడు. శేతుల బనీను తొడుక్కున్నడు. జిడ్డోడంగ నెత్తికి ఆముదం పట్టిచ్చిండు. భుజమ్మీద తువ్వాలేసుకున్నడు. గూట్లె ఉన్న అద్దం ముక్కను శేతిలకు తీసుకున్నడు. అక్కడక్కడ పండ్లు యిరిగిపోయిన దువ్వెన తోటి నున్నగ దూస్కున్నడు. అద్దంల సూస్కుంట..‘వో.. గప్పుడే పెండ్లి పిలగాని లెక్కగొడ్తున్నవ్‌ పో’ అని ముసిముసిగ నవ్వుకుంట అనుకున్నడు.ఇంతల అయ్యరానే అచ్చిండు. ఆల్లతోపాటుగ తోకల అంజన్న సుత అచ్చిండు.అందరు కల్శి నిమ్మలోల్ల గుడ్శెకు పోయిండ్రు. ఎంట తలా ఒక సీసా ఇప్పసారా తెచ్చుకునుడైతే మర్శిపోలేదు. గుడ్శె ముందుకు పోంగనే రెండు చింకి చాపలు దెచ్చి గుడ్శెముందు పర్శిండ్రు పిల్లోల్లు. పెంటకు పెద్దయిన తోకల అంజన్న గొంతు సరాయిచ్చుకున్నడు.“అరే..! ముందుగాల గిది జెప్పుండ్రీ. నిమ్మలోల్లు, పులచెర్లోల్లు ఒక్క గోత్రపోల్లు కాదుగదా?” అని అడిగిండు అంజన్న.

“ఒక్క గోత్రపోల్లు అయితే ఏందే?” అని అడిగిండు తొమ్మండుగురిలో ఒకాయినె.
“అరే..! మన చెంచులల్ల ఇర్వయారు గోత్రాలుంటయి. ఒక్క గోత్రపోల్లు మనువాడొద్దు. అది మన కట్టుబాటు. గదిగాక చెంచులల్ల సుత నాల్గు రకాలోల్లు ఉంటరు. అడివి చెంచులు, దేవ చెంచులు, బొంత చెంచులు, ఊర చెంచులు. గీల్లుగూడా ఒక చెంచోల్లతోని ఇంగొక చెంచోల్లు ఇయ్యమందుకోరు. ఊర చెంచులు ఊర్లల్ల అడుక్కొని తింటరు. ఊరోల్లిచ్చిన బట్టలు కట్టుకుంటరు. రంగురంగు బట్టలతోని నెమిలీకలతోని యిసిత్రంగా ఏశాలు గడుతరు. కంచుగంట కొట్టుకుంట ఊర్లల్ల తిరుగుతరు” అని శెప్పిండు అంజన్న.“గట్లనా!” అని నోరెల్ల బెట్టిండ్రు అక్కడున్నోళ్లు.
“అయితె మాయెగని పిల్లను, పిలగాన్ని ఒగలనొగల్ని సూపిచ్చుండ్రి” అని అన్నడు అంజన్న.
“గట్లనే!” అని రెండేపులోల్లు పిల్లను, పిలగాన్ని ఎదురెదురుగ కూసుండబెట్టిండ్రు.
ఇదివరకే పిల్లా, పిలగాడు ఒగలకు ఒగలు ఎర్కే అయినా గంతమందిల సూస్కోవాల్నంటే జర సిగ్గే అనిపిచ్చింది.

“ఇద్దరికీ సమ్మతేనా?”.. అడిగిండు అంజన్న.కొండడు ఓరగా కోనమ్మకెల్లి సూశి ‘ఏంటీ?’ అన్నట్టుగా కనుబొమ్మలెగరేసిండు.కోనమ్మ కనురెప్పలు వాలిపోయినయి. సిగ్గుతో ముడ్సుకపోయింది.
“మూగి ముత్తాలమ్మ లెక్క కూసున్నరు. చెప్పరేందుల్లో” అని కసురుకున్నట్టు అన్నడు అంజన్న.
‘సమ్మతే!’ అన్నట్టుగా తలూపిండ్రు ఇద్దరూ.గట్లనే రెండేపోల్లను సుత అడిగిండు అంజన్న.
గాల్లు సుత “సమ్మతే!” అన్నరు.అటెంక జరగాల్సిన జరుగూరు పని మొదలైంది.అటేపోల్లు, ఇటేపోల్లు సారాసీసాలు బయిటికి తీసిండ్రు. అంతకుముందే వొండిన ఉడుం మాంసం ముక్కలు సత్తు తలెల పెట్టి ముందుకు తోసిండు పిల్ల తండ్రి. రెండేపులోల్లు మాంసం ముక్కలు నంజుకుంట ఇప్పసారా తాగిండ్రు.పెండ్లి కరారు అయింది. పలానా నాడు లగ్గం అని అనుకున్నరు.
అనుకున్నదినం రానే వచ్చింది.

‘కల్లానమొచ్చినా, కక్కొచ్చినా ఆగుతాది’ అనుకున్నరు.కొండడు, అతని తమ్ముడు గజ్జెలు, తండ్రి కలిసి అడివిల వడ్డరు. మంచి మంచి సండ్ర గుంజలు నరికిండ్రు. కొన్ని ఎదురుబొంగులు నరికిండ్రు. గవ్విటిని తీసుకొని గుడిశెకు చేరుకున్నరు.ఆస్మానంత పందిరి, బూదేవంత అరుగులు గాకున్నా మాంచి వాటమైన పందిరేసిండ్రు. తీరొక్క అడివి పూలతోని పందిరికి పెండ్లికళ తెచ్చిండ్రు. ఇల్లంతా సుట్టపక్కాలతోని సందడిగున్నది.తెల్లారింది. పిల్లోల్లు, పిలగానోల్లు అంకాలమ్మ గుడికాడ్కి చేరుకున్నరు. పెంటలోని పది కుటుంబాలు సుత లగ్గం సూడనీకె వచ్చినయి. తోకల అంజన్న పూజారై లగ్గం తంతు జరిపిచ్చిండు.

కుల బంతి మొదలైంది. పిల్లోల్లు యాటను గోసిండ్రు. రెండేపులోల్లు లగ్గానికొచ్చినోల్లందరికి నపరొక సారా సీసా యిచ్చిండ్రు. సారా తాగి యాటకూర తోటి పెండ్లి బువ్వ తిన్నరు.
ఒక్కొక్కల్లకు ఇప్పసారా నిశా నెత్తికెక్కింది. తూలుకుంట, ఒగల్లనొగల్లు తోసుకుంట వరుసైనోల్లతోటి పరాష్కాలాడిండ్రు.ఇంతల ఒగ కోడెకారు వయసు పొలగాడు డప్పు అందుకున్నడు. చిర్రా, చిటికెన పులా డప్పుమీద జోరుగ సప్పుడు జేస్తన్నయి. డప్పు దరువుకు తగ్గట్టుగా వొయ్షు ఆడపొలగాండ్లు, మొగపొలగాండ్లు సుట్టూతా తిర్గుకుంట, అడుగులేసుకుంట, ఒంగుకుంట లేసుకుంట నెమిలాట ఆడబట్టిండ్రు.వాళ్ల ఎన్క, సుట్టూత ఉన్న కోడెకారు పొలగాండ్లు యీలలేసుకుంట సప్పుట్లు కొట్టుకుంట లొల్లి లొల్లిగ కేకలు వెడుతుండ్రు. నెమిలాట ఆడేటోల్లకు వుషారెక్కిత్తాండ్రు.
ఆడి పొలగాండ్లు ఇంకా రెచ్చిపోయి ఆడటం మొదలు పెట్టిండ్రు. వాల్ల ఆటా పాటలల్ల ఎంత పొద్దుబోయిందో ఎవలకూ సోయిలేదు. ఓ గంటా, రెండు గంటలు గట్ల పూనకం వచ్చినట్టు ఎగిరిండ్రు.

అటెంక మరో వాయి సారా పట్టించిండ్రు.
డప్పులు మల్లా కణకణమోగినయి.
ఆ పాలి ఆట మారిపోయింది.
తాగిన సారా లోపట్ల బుస్సున పొంగుతాంది.
శివాలెత్తి మొగ పొలగాండ్లు వూగ బట్టిండ్రు. కైపెక్కిన కండ్లు సింత నిప్పుల్లెక్క ఎర్రగ మండుతున్నయి. డప్పు దరువు ఒక్కెల్లి పోతాంటె పొలగాండ్ల అడుగులు ఒక్కెల్లి పోతాన్నయి.
“అరే! కోతాట ఆడుండ్రా!” అన్నడు అంజన్న.
వైసు పోరగాండ్ల ఎంబటే అందుకున్నరు. కోతాట ఆడుతాంటె అక్కడున్నోల్లంత పొట్ట శెక్కలయేటట్టుగ నవ్వబట్టిండ్రు.
గట్ల ఆటాపాటలతోటి పొద్దుగూకింది.


కాలం ఆగుతాది? ఎండాకాలం, వానాకాలం, సలికాలం ఒగదానెంబటి ఒగటి గిర్రు గిర్రున తిర్గుతనే ఉన్నయి. ఇంతల కోనమ్మ నీల్లు బోసుకుంది. నెలలు నిండంగనే ఉత్కలాడటానికి పుట్టింటికి అచ్చింది. అచ్చిన ఒగటి రెండ్రోజులకే నొప్పులు మొదలైనయి. గుడిశె ముందు కూకొని ఎదురు బియ్యం చెరుగుతున్నది లశ్మమ్మ. గుడిసె లోపట్లకెల్లి అంతకంతకూ మూల్గులు పెద్దగైతాన్నయి. మూల్గులు యినబడినప్పుడల్లా తల్లిపానం గదా లశ్మమ్మ గుండెను ఎవలో మెత్తటి కత్తితోని కోస్తున్నట్టు అనిపిత్తాంది. ఇంట్లె ఉన్న మొగోల్లంత అడివికి యేటకు బోయిండ్రు. లశ్మమ్మకు కాల్లు శేతులు ఆడటం లేదు. ఏం చేద్దునురా దేవుడా అనుకుంట అల్లడం తల్లడం అయితాంది. ఎవలన్న అస్తరేమో అని అటు ఇటు సూత్తాంది. గుడ్శె ముంగట బూడ్దెల దంచిన సింతపండు తినుకుంట ఉన్న శిన్న పోరగాండ్లు తప్ప ఎవలూ కండ్లబడలేదు. జరసేపటికి ఎవలో నడ్సుకుంట పోతున్న అలికిడయింది. అటుకెల్లి సూశింది. ఎల్లమ్మ యాడికో పోతాంది.“ఓ.. ఎల్లవ్వా! యాడ్కివోతున్నవే” అని లాశిగ పిలిశింది.

“కట్టెలకు పోతాన్న” అని అన్నది ఎల్లమ్మ.“పోత పోత గా మంత్రసాని బుచ్చవ్వకు శెప్పిపోవా. మా కోనవ్వకు నొప్పులు జాస్తి అయితాన్నయి. అవ్వవ్వా! సచ్చి నీ కడుపున పుడ్త. జరశెప్పి పోవా” అని బతిలాడింది లశ్మమ్మ.“గట్లనే శెప్పుత తీ!” అని అన్నది ఎల్లమ్మ.“కట్టెలకు అడ్విలకే గదా పోతన్నవ్‌? గట్లనే మావోల్లు కనిపిత్తే ఆల్లకుసుత జర జెప్పవా?” అని జాలిగ అన్నది లశ్మమ్మ.
“శెప్పుతలే వొదినా! నువ్వేం పికరు పడకు” అనుకుంట తన దారిన పోయింది ఎలమ్మ.
జర సేపట్కి మంత్రసాని బుచ్చమ్మ అచ్చింది.ఏ శెట్టూ లేని కాడ ఆఁవుదం శెట్టే మావృచ్చమన్నట్టు బుచ్చమ్మ వున్నది. బుచ్చమ్మ లేకపోతే ఆ కాత్త నాటు వైద్గమో, మోటు వైద్గమో సుత ఉండది చెంచు ఆడోల్లకు.వొత్త వొత్తనే ‘ఎవలకు తప్పినా నాకు తప్పుతాది? మంత్రసాని తనం వొప్పుకున్నంక పిల్లొచ్చినా పట్టాలె, పియ్యొచ్చినా పట్టాలె’ తనలో తనే పెద్ద రావాండం సదూకుంట అచ్చింది. ఇంతల యీ లొల్లికి పక్క గుడిశె ముత్తమ సుత అచ్చింది.

“అనే లశ్మమ్మా! ఆఁవుదమున్నాదె?” అని అడిగింది బుచ్చమ్మ.గుర్గిల ఉన్న ఆఁవుదం తీసి యిచ్చింది లశ్మమ్మ. బుచ్చమ్మ రెండు శేతులకు ఆఁవుదం పూసుకుంది.“అనే లశ్మమ్మా! ముత్తవ్వా! మీరు శెరొక్కలు కాల్లను అదిమి పట్టుండ్రి” అని శెప్పింది.ఆల్లు గట్లనే అదిమి పట్టిండ్రు. ఆఁవుదం శేతుల తోటి బుచ్చమ్మ పునకటం మొదలుబెట్టింది. యాడ పిండం జాడ కనిపిత్తలేదు.
బుచ్చమ్మ గట్ల పునుకుతాంటె కోనమ్మ నొప్పులతోని మొత్తుకోబట్టింది.“లశ్మమ్మా! పిండం తగుల్తలేదు. ఒగ బాణం ముక్క ఉంటే ఇయ్యే” అని అడిగింది బుచ్చమ్మ.దడికి చెక్కిన బాణం తీసింది లశ్మమ్మ. ములికికి పట్టిన మకిలిని గుడ్డతోని సుబ్బరంగ తుడ్శి బుచ్చమ్మకిచ్చింది. బుచ్చమ్మ ఆ బాణం ముక్కతోని లోపల కెలకబట్టింది. అటూ ఇటూ తిప్పుకుంట దారి చెయ్యటం మొదలుపెట్టింది.బుచ్చమ్మ బాణం ములికిని తిప్పుతాంటె, కత్తితోని కోత్తన్నట్టు విలవిలలాడింది కోనమ్మ. కోనమ్మ పైపానాలు పైన్నే పోతాన్నయ్‌. భరించలేక పెడబొబ్బలు పెడ్తాంది. గావు కేకలతో బొబ్బరిల్లుతాంది. కోనమ్మ కేకలతో అడివి దద్దరిల్లుతాంది. బాణం రాపిడితోని నెత్తురు సుత కార్తాంది.అటు జేసి ఇటు జేసి ఒగ గంట గడ్శింది.బుచ్చమ్మకు దిగశెమటలు పట్టుతాన్నయి.
“అనే..! పిండం అడ్డం తిర్గినట్టున్నది. ఇగ నావల్ల కాదు. దవాకానకు తీస్కపోండ్రి” అని చేతులెత్తేసింది బుచ్చమ్మ.

లశ్మమ్మ నెత్తిమీద పిడుగు పడ్డట్టు అదిరి పడింది.“సీసైలం మల్లన్నా నువ్వే ఆదుకోవాలె నా బిడ్డెను. కులదేవరా బయ్యన్నా నా బిడ్డెను రచ్చించు తండ్రీ” అని శేతులెత్తి మొక్కుకుంటాంది లశ్మమ్మ.ఇంతల యేటకు బోయిననోల్లకు వార్త అందించింది ఎల్లమ్మ. కోనమ్మ తండ్రీ, అన్నదమ్ములూ, అటు కొండని తండ్రీ, కొండడూ, అన్నదమ్ములు ఉరుక్కుంట అచ్చిండ్రు.“అరే! ఒగ పెద్ద కర్ర తీసుకురాండ్రి. దానికి చీరెలతోని జోలికట్టి కోనమ్మను దవాకానకు తీస్కపోదం” అని అన్నడు కోనమ్మ తండ్రి.“గీ మద్దెల దంచి కొట్టిన వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతాన్నయి. జోలితోని కుదరిది. మంచం మీద తీస్కపోదాం” అన్నడు కొండడు.ఎదురు బొంగుల నుల్క మంచంల రెండు మూడు పాత శీరెలు ఏసిండ్రు. కోనమ్మను దానిమీద పండుకోబెట్టిండ్రు. నాల్గేపుల నలుగురు మంచం కోళ్లను పట్టుకొని భుజాలమీదకెత్తుకున్నరు. అడ్విలకెల్లి దారి సేస్కుంట దవాకానకు బయల్దేరిండ్రు. సర్కారు దవాకాన ఎనిమిది తొమ్మిది కోసుల దూరంల ఉన్నది. ఒగ అంబులెన్సు లేదు. చెంచులకు ఏవన్నా రోగాలు రొష్టులు అత్తే వాల్ల సావు వాల్లు సావాల్సిందే.

కోనమ్మ నొప్పితోని గిలగిల కొట్టుకుంటాంది. పాము లెక్క మెలికలు తిరుగుతాంది. నడుము ఎగిరెగిరి పడతాంది. లబ్బలబ్బ మొత్తుకుంటాంది. వశం కాని నొప్పులతోని అల్లడం తల్లడమైతాంది. పెద్దగా కేకలు పెడ్తాంది.అప్పటికే నాలుగైదు వాగులు దాటిండ్రు. వాగుల్ల, మెడల కాడ్కి నీల్లు పారుతున్నయ్‌. మంచాన్ని చేతులమీద పైకెత్తి మొండి దైర్నంతోని వాగులు దాటుతాండ్రు.
ఆలిశం అయినా కొద్దీ కోనమ్మకు నొప్పులు ఎచ్చుతాన్నయి. రంపంతో కోస్తున్నట్టు, ఇనుపవేళ్లతో దేవుతున్నట్టు. ఇగ తట్టుకోలేక లాశిగ సావుకేక పెట్టింది. గుడ్లు తేలేసింది. కోనమ్మ పానాలు గాలిల కల్శిపోయినయి.“కోనమ్మా..!” అంట గుండెలవిశి పోయేటట్టుగ కొండడు పెట్టిన పొలికేక.. అలలు అలలుగా కొండా కోనల్ల కల్శిపోయింది.

డాక్టర్‌ దిలావర్‌
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కమలాపురం గ్రామానికి చెందిన దిలావర్‌కు చిన్నప్పటి నుంచే సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ. తల్లిదండ్రులు మహబూబి, నిజాముద్దీన్‌. వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ హైస్కూల్‌లో హెచ్‌ఎస్‌సీ చేశారు. ఆయనకు చదువంటే ప్రాణం. అందుకే, స్వయంకృషితో పీయూసీనుంచి పీహెచ్‌డీదాకా ఇష్టంగా చదివారు. రచనలపై దృష్టి పెట్టిన దిలావర్‌ ఇప్పటివరకు ఆరు కవితా సంపుటాలు వెలువరించారు. ఒక దీర్ఘ కవితా సంపుటి, ఒక పద్య కావ్యం, ఐదు నవలలు రాశారు. ‘ప్రహ్లాద చరిత్ర’, ‘ప్రతిధ్వని విమర్శ గ్రంథాలు’, ‘దూరాల చేరువలో’ వంటి ప్రపంచ సాహిత్య వ్యాసాలు రాశారు దిలావర్‌. ఇప్పటివరకు మూడు కథా సంపుటాలు ప్రచురించారు. 70 వరకు కథలు రాశారు. దిలావర్‌ రాసిన కథలు ఇంటర్మీడియట్‌, డిగ్రీ తరగతుల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. కవితలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉన్నాయి. తన రచనలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, సోమసుందర్‌ అవార్డు, సీపీ బ్రౌన్‌ -బెంగళూరు అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం.. తదితర గౌరవాలు లభించాయి. దిలావర్‌ రచనల మీద అధ్యయనం, పరిశోధనతో ఒకరు ఎంఫిల్‌, ఒకరు పీహెచ్‌డీ చేశారు.

-డాక్టర్‌ దిలావర్‌ ,9866923294

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana