ఆదివారం 17 జనవరి 2021
Sports - Jan 05, 2021 , 11:04:32

అతి చిన్న బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలుసా?

అతి చిన్న బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరో తెలుసా?

ముంబై : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని కుమార్తె నాలుగేండ్ల వయసులో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. తండ్రితో కలిసి ఓరియో బిస్కెట్లను ప్రచారం చేసింది. సదరు ప్రకటనను ఓరియో సంస్థ విడుదల చేసిన తర్వాత తండ్రీకుమార్తెలు విపరీతమైన సంచలనంగా మారారు. ఇప్పటికే ఎంఎస్‌ ధోని అతిపెద్ద బ్రాడ్‌ అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలో ఆయన కుమార్తె జీవా కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారడంతో.. ఒకే ఇంట్లో ఇద్దరు అంబాసిడర్లు తయారై కొత్త రికార్డును నెలకొల్పారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తరువాత కూడా ఎంఎస్‌ ధోనికి లభించే ఆఫర్లు ఏమాత్రం తగ్గలేదు. పెండ్లయిన తొలినాళ్లలో భార్య సాక్షితో కలిసి అడపాదడపా ప్రకటనలు చేసిన ధోని.. అడ్వర్‌టైజ్‌మెంట్ల ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్‌గా నిలిచారు. ఇప్పుడు కుమార్తె జీవా కూడా ప్రకటనల్లో నటించడం ప్రారంభించింది. కేవలం నాలుగేండ్ల వయసులో జీవా అభిమానుల సంఖ్య కోట్లలో ఉన్నది. ఇన్‌స్టాగ్రామ్‌లో జీవాకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫొటోలు, వీడియోలతోపాటు తండ్రి ఎంఎస్ ధోని, తల్లి సాక్షితో ఉన్నవి కూడా పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. అయితే, క్యాడ్బరీ ఓరియో బిస్కెట్స్ ప్రకటన ద్వారా జీవా మొదటిసారి ప్రొఫెషనల్ వీడియోలో కనిపించింది. ధోని, జీవ ఆడ్స్‌ చేస్తున్నట్లు సదరు సంస్థ ఇటీవల సోషల్ మీడియాలో నివేదించింది. ఇప్పుడు ఈ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు ధోనికి ప్రకటనల ప్రపంచంలో విరామం లేదు. సెలెబ్రిటీవర్త్ ప్రకారం, ధోని ప్రస్తుతం 170 మిలియన్ల డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు. ధోని ఇంకా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) లో లేనప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతూ ప్రతి సంవత్సరం సుమారు రూ.15 కోట్లు సంపాదిస్తున్నాడు. ధోని గురించి తాజా వార్త ఏమిటంటే.. ఇప్పుడు అతను వ్యవసాయం ప్రారంభించాడు. రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో  పండించిన కూరగాయలను దుబాయ్‌లో విక్రయించేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పదవీ విరమణ చేసిన తరువాత మహేంద్ర సింగ్ ధోని యొక్క క్రికెట్ ప్రయాణం ముగిసి ఉండొచ్చు. కాని అతని బ్రాండ్‌ వర్త్‌ మాత్రం రోజురోజుకు పెరుగుతుండటం విశేషం.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.