మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 08, 2020 , 16:48:36

బిగ్‌బాష్‌లోకి యువరాజ్‌సింగ్‌!

బిగ్‌బాష్‌లోకి యువరాజ్‌సింగ్‌!

సిడ్నీ:  ఆస్ట్రేలియా టీ20 లీగ్‌ బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా  స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌  నిలువనున్నాడు. బీబీఎల్‌లో ఆడేందుకు యువీ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది.  ప్రపంచకప్‌ల హీరో యువీ కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ)  ఓ ఫ్రాంఛైజీని కూడా ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.    భారత్‌కు చెందిన పలువురు మహిళా క్రికెటర్లు  ఇప్పటికే బీబీఎల్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 

ఐతే బీసీసీఐ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ లేదా దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ఆటగాళ్లు మాత్రమే విదేశీ లీగుల్లో  ఆడేందుకు అనుమతి ఉన్నది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ..బీసీసీఐ నుంచి ఎన్‌వోసీ తీసుకొని ఇప్పటికే కెనడా టీ20 లీగ్‌, టీ10 వంటి టోర్నీల్లో పాల్గొన్నాడు.  ఖరీదైన లీగ్‌ల్లో ఒకటిగా పేరున్న బిగ్‌బాష్‌లో  ఆడేందుకు యువీ నిర్ణయించుకున్నాడని  సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ ఓ కథనం ప్రచురించింది.  

38 ఏండ్ల  భారత మాజీ క్రికెటర్‌ కోసం ఫ్రాంచైజీని వెతికేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రయత్నిస్తోందని  యువరాజ్‌ మేనేజర్‌( డబ్ల్యూ స్పోర్ట్స్‌, మీడియా)  జేసన్‌ వార్న్‌ ధ్రువీకరించారు.    అతని కోసం  ఓ టీమ్‌ను ఎంపిక చేసేందుకు సీఏతో కలిసి పనిచేస్తున్నామని వార్న్‌ పేర్కొన్నారు. బీబీఎల్‌లో భారత ఆటగాళ్లు పాల్గొనాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు షేన్‌ వాట్సన్‌ ఆకాంక్షించాడు.   వీళ్లు ఆడితే టోర్నీకి మరింత విలువ పెరుగుతుందని అన్నాడు. 

    


logo