మంగళవారం 20 అక్టోబర్ 2020
Sports - Sep 19, 2020 , 18:08:27

అప్పుడే అంత కాలమైందా అంటూ ట్వీట్‌ చేసిన యువీ

అప్పుడే అంత కాలమైందా అంటూ ట్వీట్‌ చేసిన యువీ

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో.. ఓవర్‌కు 20 పరుగులు చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ పొట్టి ఫార్మాట్‌ వెలుగులోకి వస్తున్న తొలినాళ్లలో.. అదీ వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీలో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదడం అంటే మాటలా!  పేస్‌కు సహకరించే డర్బన్‌ పిచ్‌పై ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను.. భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఉతికి ఆరేసిన వైనాన్ని క్రికెట్‌ అభిమానులెవరూ మరిచిపోలేరు.  సెప్టెంబర్‌ 19, 2007 యువీవీ కెరీర్లో మరచిపోలేని రోజు.  అత్యంత వేగవంతమైన ఫిఫ్టీతో ప్రపంచ రికార్డు, ఆరు సిక్సర్ల  విధ్వంసానికి నేటితో 13 ఏళ్లు నిండాయి.   ఆనాటి ఆసక్తికర మ్యాచ్‌ విశేషాలను మరోసారి గుర్తు చేసుకుందాం! 

 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడాన్ని మరువక ముందే.. అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా పొట్టి ప్రపంచకప్‌ ప్రారంభమైంది.  స్కాట్లాండ్‌తో జరుగాల్సిన తొలి మ్యాచ్‌ రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై బౌలౌట్‌ పద్ధతిలో ధోనీసేన గెలుపొందింది. మూడో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం.. ఇక ముందుకెళ్లాలంటే ఇంగ్లండ్‌పై తప్పక గెలువాల్సిన పరిస్థితి. టాస్‌ గెలిచిన ధోనీ మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు గంభీర్‌ (58), సెహ్వాగ్‌ (68) అర్ధ శతకాలు కొట్టడంతో టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. ఓపెనర్లతో పాటు ఉతప్ప (6) ఔటయ్యాక 17వ ఓవర్‌లో యువరాజ్‌ (16 బంతుల్లో 58; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) క్రీజులోకి వచ్చాడు.

ప్లింటాఫ్‌తో మాటల యుద్ధం

ఫ్లింటాఫ్‌ వేసిన 18వ ఓవర్లో యువీ వరుసగా రెండు ఫోర్లు అరుసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. తదుపరి ఓవర్‌ వేసేందుకు బ్రాడ్‌ సిద్ధమవుతుండగా.. యువీ పక్కనుంచి వెళ్తున్న ఫ్లింటాఫ్‌ అతడిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువీ అతడి వైపు దూసుకెళ్తూ బ్యాట్‌తో సైగలు చేశాడు. ఈ క్రమంలో 19వ ఓవర్‌ తొలి బంతిని యువీ  మైదానం బయటకు పంపించాడు. 133 కిలోమీటర్ల వేగంతో బ్యాట్‌పైకి వచ్చిన బంతిని 111 మీటర్ల దూరం తరలించాడు. రెండో బంతికి అదే శిక్ష వేశాడు. మూడో బంతికి ముందు తీక్షణమైన కండ్లతో ఓసారి ఫ్లింటాఫ్‌ను ఆ తర్వాత మొత్తం మైదానాన్ని తేరిపారా చూసుకున్న యువీ.. ఈసారి ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ కొట్టాడు.

ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ..

అప్పటికే సగం నీరసించిన బ్రాడ్‌ నాలుగో బంతిని రౌండ్‌ ది వికెట్‌గా వైడ్‌ ఫుల్‌టాస్‌ సంధించాడు. అందుకోసమే కాచుకొని ఉన్నట్లు కనిపించిన యువీ దాన్ని అంతే వేగంగా బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా గీత దాటించాడు. కెప్టెన్‌ కాలింగ్‌వుడ్‌.. బ్రాడ్‌ వద్దకు వచ్చి సూచనలిచ్చినా ఫలితం మాత్రం అదే. ఐదో బంతికి చుక్కలనంటే సిక్సర్‌ బాదిన యువీ.. ఆరో బంతిని మిడాన్‌ మీదుగా ప్రేక్షకులకు చేరువ చేశా డు. దీంతో ఒక్కసారిగా మైదానం మారుమోగిపోయింది. అప్పటికే ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రవిశాస్త్రి, గారీ సోబర్స్‌.. వన్డేల్లో గిబ్స్‌  ఈ ఫీట్‌ సాధించినా.. పొట్టి ఫార్మాట్‌లో ఇదే మొదటిది. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన ఫిఫ్టీ ఇదే కావడం గమనార్హం. యువీ మెరుపులతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 200/6కే పరిమితమైంది.  13ఏండ్లు! అప్పుడే అంత కాలమైందా అంటూ యువరాజ్‌ ట్వీట్‌ చేశాడు. 


View this post on Instagram

13 years! How time flies!! #memories ????

A post shared by Yuvraj Singh (@yuvisofficial) on


logo