గువాహటి : 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో మొత్తం 946 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) తెలిపారు. రాష్ట్రంలో మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలి విడత ఎన్నికలు ఈ నెల 27న జరుగనున్నాయి. ఏప్రిల్ 1న రెండు, 6న మూడో విడత పోలింగ్ జరుగనుంది. తొలి దశలో 47 నియోజకవర్గాల్లో ఓట్ల పండుగ జరుగనుండగా.. 264 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అధికారులు పేర్కొన్నారు. రెండో దశలో 39 స్థానాల్లో 345 మంది, మూడో దశలో 40 నియోజకవర్గాల పరిధిలో 337 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాష్ట్రంలో 2,33,74,087 మంది ఓటర్లు ఉన్నారని.. ఇందులో 1,18,23,286 మంది పురుషులు, 1,15,50,403 మంది మహిళలు, 398 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.