మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 22:21:29

అది నా తప్పే: యువరాజ్‌

అది నా తప్పే: యువరాజ్‌

న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌, టర్బొనేటర్‌ హర్భజన్‌ సింగ్‌ సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే విషయం అందరికీ తెలిసిందే. హర్భజన్‌ సింగ్‌ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పెట్టి ‘అయ్య దొరా దీంట్లో తప్పెవరిదీ’ అనే విధంగా యువరాజ్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేకు సంబంధించిన వీడియోను భజ్జీ ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. ఆ మ్యాచ్‌లో హర్భజన్‌ 17 బంతుల్లో 37 పరుగులు చేయగా.. యువీ 122 బంతుల్లో 103 పరుగులు చేశాడు. వీరిద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నమోదవుతున్న దశలో యువీ రనౌటై పెవిలియన్‌ బాట పట్టాడు. 

ఈ విడియో కింద ‘పాజీ అనవసరంగా పరుగు తీసి వికెట్‌ సమర్పించావు. ఇందులో తప్పెవరిదీ? మొత్తానికి మంచి ఇన్నింగ్స్‌ ఆడావు’ అని వ్యాఖ్య జోడించాడు. దీనిపై స్పందించిన యువరాజ్‌.. ‘అన్నా అందులో నీ తప్పేమీ లేదు. నేనే ముందు పిలిచాను. అందుకే నేనే వెనుదిరిగాను. అయినా నువ్వు మెరుపులు మెరిపిస్తావనే అనుకున్నా’ అని రిప్లే ఇచ్చాడు. కాగా, ఆ మ్యాచ్‌లో భజ్జీ 4 ఫోర్లు, 2 సిక్సర్లతో ధనాధన్‌ షాట్లు కొట్టాడు. టాపార్డర్‌ విఫలమైన చోట యువరాజ్‌, హర్భజన్‌తో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ మాత్రమే చెపుకోదగ్గ స్కోరు చేసిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది.  


logo