బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 13:29:18

కుర్రాళ్లూ.. కొట్టేయండి

కుర్రాళ్లూ.. కొట్టేయండి

ఒకే ఒక్క అడుగు అంతర్జాతీయ యవనికపై తమదైన ముద్ర వేసేందుకు..ఇంకొక్క అడుగు ఐదోసారి అండర్‌-19 ప్రపంచకప్‌ ఒడిసి పట్టేందుకు..మరొక్క అడుగు సీనియర్‌ జట్టు తలుపు తట్టేందుకు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన భారత అండర్‌-19 జట్టు.. వరుస విజయాలతో విజృంభిస్తూ తుదిపోరుకు చేరింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో ప్రియం గార్గ్‌ సేన.. బంగ్లాదేశ్‌ను ఢీకొననుంది. ఇప్పటికే ఆరుసార్లు ఫైనల్‌ ఆడి.. అందులో నాలుగు సార్లు విజేతగా నిలిచిన యువ భారత్‌ ఏడోసారి సమరోత్సాహంతో బరిలో దిగనుంటే.. తొలిసారి ఫైనల్‌ చేరిన బంగ్లా చరిత్ర సృష్టించాలని చూస్తున్నది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న గార్గ్‌ గ్యాంగ్‌ ఆఖరి పోరులోనూ అదే జోరు కొనసాగించి కప్పును ముద్దాడాలని ఆశిద్దాం..!

  • అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో నేడు బంగ్లాదేశ్‌తో యువ భారత్‌ ఢీ

పోచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ.. అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన యువ భారత జట్టు ఆదివారం బ్లంగాదేశ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. లీగ్‌ దశను అజేయంగా ముగించిన ప్రియం గార్గ్‌ సేన క్వార్టర్స్‌లో పటిష్ఠ ఆస్ట్రేలియాను మట్టికరిపించి.. సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుకింద కొట్టి తుదిపోరుకు దూసుకొచ్చింది. మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా మెగాటోర్నీలో అడుగుపెట్టిన బంగ్లా.. ప్రత్యర్థులను బెంబేలెత్తించే ఆటతీరుతో చరిత్ర తిరుగరాసేందుకు అడుగు దూరంలో నిలిచింది. యువ భారత్‌కు ఇది ఏడో ఫైనల్‌ కాగా.. బంగ్లా తుదిపోరుకు చేరడం ఇదే మొదటిసారి. ఓవరాల్‌గా ఐసీసీ మెగా టోర్నీల్లో బంగ్లా జట్టు ఫైనల్‌కు చేరడం కూడా ఇదే ప్రథమం. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పెద్దగా పోటీ లేకుండానే ఇక్కడి వరకు వచ్చిన యువ భారత జట్టుకు ఫైనల్లో అసలు సిసలు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. జూనియర్‌ లెవల్లో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ చక్కటి ప్రదర్శన కనబరుస్తుండటంతో.. ప్రియం గార్గ్‌ సేన అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉంది.


యశస్వి, కార్తీక్‌ కీలకం

గత ప్రపంచకప్‌లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఇప్పటికే సీనియర్‌ జట్టు నుంచి పిలుపందుకున్నారు. వారినే ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్న ప్రస్తుత ఆటగాళ్లు కూడా త్వరలోనే టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌, బౌలింగ్‌లో రవి బిష్ణోయ్‌, కార్తీక్‌ త్యాగి మెగాటోర్నీలో అదుర్స్‌ అనిపించుకుంటున్నారు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జూనియర్‌ లెవల్‌ నుంచి చక్కటి మౌలిక వసతులు కల్పిస్తుండటంతో.. అంతర్జాతీయ స్థాయిలో మన జట్టు తిరుగు లేకుండా దూసుకెళ్తున్నది. మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశంలో అదరగొడుతున్న యువ భారత్‌ మరో విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌ మన ఒడిలో చేరనుంది. యశస్వితో పాటు దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్‌ వర్మ, ప్రియం గార్గ్‌, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌ బ్యాటింగ్‌లో మెరిస్తే.. భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో కార్తీక్‌ త్యాగికి రవి బిష్ణోయ్‌, అథర్వ అంకొలేకర్‌, ఆకాశ్‌ సింగ్‌ సహకరిస్తే.. యువభారత్‌కు తిరుగుండదు.


పోటీనిచ్చేనా..

మరోవైపు పోరాటానికి మారుపేరైన బంగ్లాదేశ్‌ ఫైనల్‌ చేరిన తొలిసారే కప్పు కొట్టాలని తహతహలాడుతున్నది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట యువ భారత్‌ నెగ్గగా.. ఒకసారి బంగ్లాది పైచేయి అయింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుచేసిన అక్బర్‌ అలీ నేతృత్వంలోని బంగ్లా జట్టు ఫైనల్లోనూ తమ అత్యుత్తమ ఆటను కొనసాగించాలని భావిస్తున్నది. అక్బర్‌తో పాటు పర్వేజ్‌, తన్జిద్‌, మహ్ముదుల్‌ హసన్‌, తౌహిద్‌, షహాదత్‌ రాణిస్తే.. బంగ్లా భారీ స్కోరు చేయ డం ఖాయమే. అయితే కార్తీక్‌, ఆకాశ్‌ సింగ్‌ బౌలింగ్‌ను వారు ఎలా ఎదుర్కుంటారనేదానిపైనే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉన్నది. 


తుది జట్లు (అంచనా)

భారత్‌: ప్రియం (కెప్టెన్‌), యశస్వి, దివ్యాన్ష్‌, తిలక్‌ వర్మ, ధృవ్‌, సిద్ధేశ్‌, అథర్వ, రవి, సుశాంత్‌, కార్తీక్‌, ఆకాశ్‌.

బంగ్లాదేశ్‌: అక్బర్‌ (కెప్టెన్‌), పర్వేజ్‌, తన్జిద్‌, మహ్ముదల్‌, తౌహిద్‌, షహాదత్‌, షమీమ్‌, రకీబుల్‌, షరీఫుల్‌, తన్జీమ్‌, మురాద్‌.


1
మెగాటోర్నీలో ఇప్పటివరకు 312 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ అత్యధిక పరుగుల జాబితా టాప్‌లో ఉన్నాడు.గత ఐదు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో టార్గెట్‌ ఛేజింగ్‌ చేసిన జట్లు నాలుగుసార్లు గెలుపొందాయి.logo
>>>>>>