గురువారం 02 జూలై 2020
Sports - May 01, 2020 , 16:31:33

నేను డ్యాన్స్ చేస్తే చూడలేరు: కమిన్స్​

నేను డ్యాన్స్ చేస్తే చూడలేరు: కమిన్స్​

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్​ ఇటీవల కుటుంబంతో కలిసి డ్యాన్స్​ చేస్తూ తనలోని ప్రతిభను బయటపెడుతున్నాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ విషయంపై ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ సరదాగా స్పందించాడు. వార్నర్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడని, అయితే తాను చేస్తే ఎవరూ చూడలేరని సరదాగా అన్నాడు. ఐపీఎల్​లో తన ఫ్రాంచైజీ కోల్​కతా నైట్​ రైడర్స్.. ట్విట్టర్ ద్వారా నిర్వహించిన లైవ్ సెషన్​లో కమిన్స్ మాట్లాడాడు. వార్నర్​ డ్యాన్స్​పై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. “వాటిని(వార్నర్ డ్యాన్స్ వీడియోలు) మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా? ఒకవేళ నేను డ్యాన్స్ చేస్తే మీరు చూడలేరు.. అతడు బాగా చేస్తున్నాడు. వార్నర్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. అతడిలో సరదా కోణం కూడా ఎక్కువగానే ఉంది. నాకు తెలిసి వార్నర్​ నుంచి మరిన్ని డ్యాన్స్​ వీడియోలు వస్తాయి” అని కమిన్స్ చెప్పాడు.

లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన డేవిడ్ వార్నర్ కుటుంబంతో కలిసి ఇటీవల డ్యాన్స్​ అదరగొడుతున్నాడు. బాలీవుడ్ సినిమా తీస్​మార్ ఖాన్​లోని షీలా కీ జవానీ పాటకు కూతుళ్లతో కలిసి చిందేసిన వార్నర్​.. తెలుగు చిత్రం అల వైకుంఠపురంలోని బుట్టబొమ్మ గీతానికి భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. పిల్లలతో ఆడుకోవడంతో పాటు సమయాన్ని సరదాగా గడుపుతున్నాడు.  ఆ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకొని అభిమానులను సంతోషపరుస్తున్నాడు. 


logo