కోహ్లియే మా కెప్టెన్.. మీకు మసాలా ఏమీ దొరకదు: రహానే

చెన్నై: విరాట్ కోహ్లియే మా కెప్టెన్‌గా ఉంటాడు. మీరు మసాలా కోసం ఎదురు చూస్తుంటే.. అది నా దగ్గర నుంచి పొందలేరు అని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మీడియాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా సిరీస్ గెలిచి వచ్చిన తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మళ్లీ విరాట్ కోహ్లి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తొలి టెస్ట్‌లో టీమిండియా దారుణంగా ఓడింది. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజీ సరిగా లేదని మ్యాచ్ తర్వాత కోహ్లి అన్నాడు.
దీనిపై రహానే స్పందించాడు. అవును, అది నిజమే, కొన్నిసార్లు ఆటగాళ్లకు ఫీల్డ్‌లో అంతగా ఎనర్జీ ఉండదు. అది కెప్టెన్ మారినందుకు కాదు. మీరు ఏమైనా మసాలా కోసం చూస్తుంటే.. అది ఇక్కడ దొరకదు అని రహానే అనడం విశేషం. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌కు ముందు రహానే ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. తన ఫామ్‌పై తనకు ఎలాంటి ఆందోళన లేదని చెప్పాడు. రెండో టెస్ట్‌లో ఎవరు ఆడతారన్నదానిపై రహానే ఏమీ చెప్పకపోయినా.. అక్షర్ పటేల్ ఫిట్నెస్ తమకు గుడ్‌న్యూస్ అని అన్నాడు.