శనివారం 30 మే 2020
Sports - Apr 10, 2020 , 18:38:22

అక్తర్​ను అందుకే తిట్టా: ఫ్లింటాఫ్

అక్తర్​ను అందుకే తిట్టా: ఫ్లింటాఫ్

లండన్: తనకు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్​ అక్తర్​కు మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఇంగ్లండ్ మాజీ ఆల్​రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్​ వెల్లడించాడు. 2005లో పాకిస్థాన్ పర్యనటకు ఇంగ్లండ్​ రాగా.. ఓ టెస్టులో ఫ్లింటాఫ్​, అక్తర్​ మధ్య వాగ్వాదం సాగింది. దాదాపు 15ఏండ్ల తర్వాత ఈ విషయంపై టాక్​స్పోర్ట్స్​ కార్యక్రమంలో ఆండ్రూ మాట్లాడాడు.

“చూడండి నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. అతడు(అక్తర్) తరచూ నావైపు దూసుకొచ్చాడు. లావు(ఫ్యాట్​)గా ఉన్నావంటూ తరచూ కవ్వించాడు. దీంతో నాకు తీవ్రంగా కోపమొచ్చింది. బుద్ధి చెప్పాలనుకున్నా. ఆ తర్వాత అతడు నా దగ్గరికి వచ్చాక… చూడడానికి టార్జాన్​లా ఉన్నావు.. కానీ చేతకాని వాడిలా బౌలింగ్ చేస్తున్నావు అని అన్నా” అని ఫ్లింటాఫ్ వెల్లడించాడు. అయితే ఆ తర్వాత అక్తర్ బౌలింగ్​లోనే ఫ్లింటాఫ్ ఔటయ్యాడు. “ఆ తర్వాత మొదటి బంతికో.. రెండో బంతికో బౌల్డయ్యా. అప్పుడు పెవిలియన్​కు వెళుతున్న నన్ను చూసి అక్తర్ హో అని గట్టిగా అరిచాడు” అని ఫ్లింటాఫ్ చెప్పాడు.

ఫ్లింటాఫ్​ ఆటగాళ్ల గొడవలు పెట్టుకొని చాలాసార్లు మూల్యం చెల్లించుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్​లో యువరాజ్​ను అతడు కవ్వించాడు. దీంతో ఉగ్రరూపం దాల్చిన యువీ ఆ తర్వాత బ్రాడ్​ ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత ఫ్లింటాఫ్ ముఖం వాడిపోయిన సంగతి తెలిసిందే. 


logo