శనివారం 11 జూలై 2020
Sports - Jun 01, 2020 , 19:05:05

విరాట్‌ను అభిమానిస్తా: స్టీవ్‌ స్మిత్‌

విరాట్‌ను అభిమానిస్తా: స్టీవ్‌ స్మిత్‌

సిడ్నీ:  టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాడని, క్రికెట్‌కు అతడు చాలా చేశాడని ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. అందుకే తనకు విరాట్‌ అంటే ఎంతో ఇష్టమని, అతడి ఆట తీరును అభిమానిస్తానని అన్నాడు. లక్ష్యచేధనలో ఎంత ఒత్తిడి ఉన్నా.. కోహ్లీ ఎంతో ప్రశాంతంగా అద్భుతంగా ఆడతాడని సోమవారం ఓ టీవీ ఇంటర్వ్యూలో స్మిత్‌ అన్నాడు. కాగా ఎంతో కాలంగా కోహ్లీ, స్మిత్‌ని పోలుస్తూ చాలా మంది వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

'విరాట్‌ కోహ్లీని నేను ఎంతో గౌరవిస్తా. అతడో అద్భుతమైన ప్లేయర్‌. అతడి రికార్డులు చూడండి. అసాధారణంగా ఉన్నాయి. భారత క్రికెట్‌కు అతడు ఎంతో చేశాడు. టీమ్‌ఇండియా తరఫున విరాట్‌ ఎంతో అంకితభావంతో ఆడతాడు. మరింత మెరుగయ్యేందుకు నిరంతరం ఆరాటపడతాడు. అతడు శరీరాన్ని ఎంతలా మార్చుకున్నాడో చూడొచ్చు. విరాట్‌ ఇప్పుడు ఎంతో ఫిట్‌గా, బలంగా, శక్తిమంతంగా ఉన్నాడు. మొత్తంగా కోహ్లీ ఓ అద్భుతమైన క్రికెటర్‌. ఇక వన్డేల్లో లక్ష్యచేధనలో అతడి ఆట అమోఘం. వన్డేల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ టార్గెట్‌ చేజింగ్‌లో అతడి సగటు అద్భుతంగా ఉంది. ఎంత ఒత్తిడి ఉన్నా ప్రశాంతంగా చేయాల్సిన పని చేస్తాడు. అందుకే కోహ్లీ లాంటి ఆటగాళ్లను తప్పకుండా ప్రశంసించాలి" అని స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో మళ్లీ బౌలింగ్‌ చేయాలనుకుంటే.. విరాట్‌ను ఔట్‌ చేయాలని అనుకుంటానని స్మిత్‌ చెప్పాడు. కాగా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన స్మిత్‌ సోమవారం మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు.  


logo