గురువారం 13 ఆగస్టు 2020
Sports - Jul 06, 2020 , 00:15:27

పొట్టి ఫార్మాట్‌ నాకిష్టం

పొట్టి ఫార్మాట్‌ నాకిష్టం

  •  టీ20లకు తగ్గట్టు ఆటను మార్చుకొనే వాడిని..  నాట్‌వెస్ట్‌ సిరీస్‌ విజయం అద్వితీయం 
  • 2003 జట్టులోకి కోహ్లీ, రోహిత్‌, బుమ్రాను తీసుకుంటా.. బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ

కోల్‌కతా: బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా వన్డేలు, టెస్టుల్లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌  గంగూలీ.. తనకు టీ20 క్రికెట్‌ అంటే ఎంతో ఇష్టమని చెప్పాడు. పొట్టి ఫార్మాట్‌లో హిట్టింగ్‌ చేస్తూనే ఉండేందుకు అవకాశముంటుందని, అందుకే తాను ఆ ఫార్మాట్‌ ఆడేందుకు ఇష్టపడేవాడినని చెప్పాడు. తాను ఈ తరంలో ఆడి ఉంటే.. పొట్టి ఫార్మాట్‌కు తగ్గట్టుగా తన ఆటను మార్చుకొనే వాడినని తెలిపాడు. టెస్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌తో ఆదివారం  లైవ్‌లో పాల్గొన్న  గంగూలీ.. తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. ‘టీ20లు చాలా ముఖ్యం. మ్యాచ్‌ మొత్తం బ్యాట్‌ను ఎప్పుడూ స్వింగ్‌ చేస్తూ భారీ షాట్లు ఆడేందుకు అనుమతి ఉంటుంది. నేను టీ20 క్రికెట్‌ ఆడేందుకు చాలా ఇష్టపడే వాడిని. ఐపీఎల్‌లో తొలి ఐదేండ్లు ఆడా. పొట్టి ఫార్మాట్‌ను ఆస్వాదించా’ అని దాదా చెప్పాడు. 

సంబురాలను నియంత్రించుకోలేకపోయాం 

లార్డ్స్‌ వేదికగా 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్‌ సాధించిన క్షణాలను సౌరవ్‌ గంగూలీ గుర్తు చేసుకున్నాడు. భారత్‌ ఆ మ్యాచ్‌లో 326పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాక కెప్టెన్‌గా ఉన్న గంగూలీ లార్డ్స్‌ బాల్కనీలో చొక్కా విప్పి సంబురాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ‘అదో అద్భుతమైన సందర్భం. అందరం నియంత్రణలో లేకుండా సంబురాలు చేసున్నాం. క్రీడల్లో ఇదంతా మామూలే. అలాంటి మ్యాచ్‌ గెలిచినప్పుడు.. మరింత ఎక్కువగా సంబురాలు చేసుకుంటాం’ అని దాదా చెప్పాడు. అలాగే 2003 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం కూడా గొప్ప విజయమని దాదా అన్నాడు. ఆస్ట్రేలియా మినహా ఆ టోర్నీలో అన్ని జట్లను ఓడించామని, తుదిపోరులో మాత్రం ఆసీస్‌ బాగా ఆడిందని చెప్పాడు. 

ఆ ముగ్గురిని తీసుకుంటా.. 

2019 ప్రపంచకప్‌ జట్టులోని ఆటగాళ్లలో ముగ్గురిని 2003 విశ్వటోర్నీకి తీసుకోవాల్సి వస్తే ఎవరిని ఎంపిక చేసుకుంటారనే ప్రశ్నకు గంగూలీ సమాధానమిచ్చాడు. ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, స్పీడ్‌ స్టర్‌ జస్పీత్‌ బుమ్రాను తీసుకుంటానన్నాడు. నాలుగో ప్లేయర్‌ను ఎంపిక చేసుకునేందుకు కూడా చాన్స్‌ ఇస్తే మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని ఎంచుకుంటానని సౌరవ్‌  గంగూలీ అన్నాడు. గంగూలీ తన కెరీర్‌లో మొత్తం టీమ్‌ఇండియా తరఫున 311 వన్డేలు ఆడి 11,363 పరుగులు చేయగా.. 113 టెస్టుల్లో 7,212 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. కాగా ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంచైజీ ఏటీకే తదుపరి సీజన్‌కోసం మోహన్‌ బగాన్‌తో చేతులు కలుపగా.. ఆ జట్టు డైరెక్టర్లలో ఒకడిగా గంగూలీ వ్యవహరించనున్నాడు. 


logo