శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Feb 20, 2020 , 00:23:03

మూడేండ్ల తర్వాత ఓ నిర్ణయానికొస్తా

 మూడేండ్ల తర్వాత ఓ నిర్ణయానికొస్తా

వెల్లింగ్టన్‌: విరాట్‌ కోహ్లీ..భారత క్రికెట్‌ జట్టుకు వెన్నెముక. అరంగేట్రం చేసినప్పటి నుంచి నిర్విరామంగా మూడు ఫార్మాట్లు ఆడుతున్న కోహ్లీ తన మనసులోని మాటను బయటపెట్టాడు. న్యూజిలాండ్‌తో శుక్రవారం నుంచి మొదలవుతున్న తొలి టెస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘మరో మూడేండ్లు అన్ని ఫార్మాట్లు ఆడుతానన్న నమ్మకముంది. ఆ తర్వాత వయసును బట్టి ఆటతీరులో మార్పు రావచ్చు. అవును.. ఎందుకంటే గత ఎనిమిదేండ్ల నుంచి దాదాపు ప్రతి ఏడాదిలో 300 రోజులు క్రికెట్‌ ఆడుతున్నాను. ఇందులో ప్రాక్టీస్‌ సెషన్లకు తోడు పర్యటనలు ఉన్నాయి. ఇది ఒక రకంగా మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కానీ ఆటగాళ్లు దీని గురించి అంతగా ఆలోచించడం లేదు. విరామం తీసుకుని ఆడిన ప్రతిసారి నాలో కొత్త ఉత్తేజాన్ని నింపుకున్నాను. కొంత సేదతీరాలని ఎవరికైనా ఉంటుంది. కానీ బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా అన్ని ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు సాధ్య పడటం లేదు. మిగతావారితో పోల్చుకుంటే కెప్టెన్‌గా మరింత ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. ప్రత్యర్థి జట్లపై వ్యూహరచనలు, ఎత్తులకు పైఎత్తులు, ఆటగాళ్ల ఎంపిక ఇలా అన్ని అంశాల్లో కెప్టెన్‌ భాగం కావాల్సి ఉంటుంది.  మరో మూడేండ్లు ఆటలో ఇదే దూకుడు కొనసాగిస్తా. ఎందుకంటే జట్టుకు నా అవసరం చాలా ఉంది. ఆ తర్వాత ప్రాధామ్యాలు మారిపోతాయి’ అని కోహ్లీ అన్నాడు. 


టెస్టు చాంపియన్‌షిప్‌ బెస్ట్‌  

అన్నింటితో పోల్చుకుంటే టెస్టు చాంపియన్‌షిప్‌ అత్యుత్తమమైందని భారత కెప్టెన్‌ కోహ్లీ అన్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు మరింత వన్నెలద్దాలనే ఉద్దేశంతో ఐసీసీ తీసుకొచ్చిన భవిష్యత్‌ ప్రణాళికల్లో భాగంగా టెస్టు చాంపియన్‌షిప్‌ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో టాప్‌-2లో నిలిచిన జట్లు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ కోసం తలపడుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న భవిష్యత్తులో టీ20 చాంపియన్స్‌ కప్‌(2024-28), వన్డే చాంపియన్స్‌ కప్‌(2025-29) ప్రతిపాదనలను తీసుకురాబోతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో విరాట్‌ మాట్లాడుతూ ‘మిగతా ఫార్మాట్లతో పోల్చుకుంటే టెస్టు చాంపియన్‌షిప్‌ అత్యుత్తమం. చారిత్రక లార్డ్స్‌ మైదానంలో టైటిల్‌ కోసం తలపడాలనేది ప్రతి ఒక్కరి కల. దానికి మేము అతీతులం కాదు. త్వరలోనే మేము అర్హత సాధిస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటి వరకు సొంతగడ్డపైనే టెస్టులు ఆడాం. తొలిసారి కివీస్‌తో ఆడబోతున్నాం. పాయింట్లు కీలకమైనందున ప్రతి మ్యాచ్‌ ప్రతిష్ఠాత్మకమే. ఇటీవల ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్‌ ఎంత రసవత్తరంగా సాగిందో చూశాం’ అని విరాట్‌ అన్నాడు.  


logo