ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 20, 2021 , 13:19:54

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మోతేరా

ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం.. మోతేరా

హ్మదాబాద్‌: క్రికెట్‌ అంటే భారత్‌.. భారత్‌ అంటే క్రికెట్‌.. అనేంతగా దేశ ప్రజల్లో క్రికెట్‌ అంతగా నాటుకుపోయింది. అయితే, ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో క్రికెట్‌కు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవనే చెప్పాలి. ఉన్న వనరులను ఉపయోగించుకుని చెమటోడుస్తున్న క్రికెటర్లు.. ప్రపంచం మెచ్చే స్థాయికి చేరుకుంటున్నారు. దేశ క్రికెట్‌ అభిమానులకు సంతోషాన్నిచ్చే మరో తీపి కబురు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతేరా.. టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నది. మరో నాలుగు రోజుల్లో ఈ స్టేడియంలో భారత్‌-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. నాలుగో టెస్ట్ కూడా మార్చి 3 నుంచి ఇదే స్టేడియంలో జరుగనున్నది.

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పరిమల్ నాథ్వానీతో జరిగిన ఒక సంభాషణ సందర్భంగా.. అహ్మదాబాద్‌లోని పాత స్టేడియంను పునరుద్ధరించి అత్యాధునిక స్టేడియంను నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దాంతో ప్రపంచలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంకు ఆరోజే భీజం పడింది. మోతేరా స్టేడియంను పునరుద్ధరించి ఎన్నో విశేషాలతో కొత్త స్టేడియంను సిద్ధం చేశారు.  ప్రపంచస్థాయి స్టేడియంగా తీర్చిదిద్దిన మోతేరా స్టేడియం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

360 డిగ్రీల స్టేడియం


సాధారణంగా క్రికెట్ స్టేడియంలో ప్రేక్షకులు ముందు వరుసలో కూర్చొని మ్యాచ్‌ చూసేందుకు ఇష్టపడతారు. అక్కడ కూర్చోవడం వల్ల మ్యాచ్‌ను ఆసాంతం ఎలాంటి అంతరాయాలు లేకుండా తిలకించవచ్చు. మోతేరా స్టేడియం ప్రత్యేకత ఏమిటంటే.. స్టేడియం మధ్యలో ఒక్క స్తంభంగానీ, మరే ఇతర అడ్డంకులుగానీ లేవు. అంటే ఏ స్టాండ్‌లో కూర్చోని అయినా మ్యాచ్‌ను అడ్డంకులు లేకుండా ఆస్వాదించవచ్చు. మోతేరా స్టేడియంలో 11 పిచ్‌లను నిర్మించారు. వీటిలోని ఐదింటిని ఎర్ర బంకమట్టి, నల్ల మట్టిని ఉపయోగించబడ్డాయి. మోతేరాలోని ప్రధాన మైదానంతో పాటు రెండు ప్రాక్టీస్ మైదానాలు కూడా ఉన్నాయి. ఈ రెండు ప్రాక్టీస్‌ మైదానాల్లో కూడా 9 చొప్పున పిచ్‌లు ఉన్నాయి. వీటిలో 5 పిచ్‌లు ఎర్రమట్టితో, 4 పిచ్‌లు నల్ల బంకమట్టితో తయారయ్యాయి.

వ్యయం రూ.700 కోట్లు

మోతేరా స్టేడియం పునరుద్ధరణ, ఆధునీకరణకు రూ.700 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తున్నది. స్టేడియం కాంప్లెక్స్ మొత్తం 63 ఎకరాల్లో ఉన్నది. ఒలింపిక్ సైజు స్టేడియం ఈత కొలను కూడా ఉండటం ఈ స్టేడయం ప్రత్యేక. ఈ స్టేడియంలో 4 డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతి డ్రెస్సింగ్ రూంకు జిమ్నాసియంను జతచేశారు. స్టేడియంలో 6 ఇండోర్ పిచ్‌లు ఉన్నాయి. ఇక్కడ బౌలింగ్ యంత్రాల సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బాక్సింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్ కోసం ప్రత్యేక కోర్టులు ఉన్నాయి. హాకీ, ఫుట్‌బాల్ మైదానాలు కూడా ఈ క్యాంపస్‌లో ఉన్నాయి.

మెల్‌బోర్న్‌ను మించిన స్టేడియం


ఇప్పటివరకు ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ) ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉండేది. మోతేరా స్టేడియంలో 1.10 లక్షల మంది కూర్చుని వీక్షించే సామర్థ్యం ఉన్నది. ఆస్ట్రేలియాకు చెందిన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లక్ష ప్రేక్షకుల సామర్థ్యాన్ని మాత్రమే కలిగి ఉన్నది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించేందుకు గుజరాత్‌ క్రికెట్‌ సంఘం పెద్దలు కృషిచేస్తున్నారు. ఈ స్టేడియం పరిధిలో దాదాపు 13 వేల వాహనాలు నిలుపుదల చేసేందుకు పార్కింగ్‌ సౌకర్యం ఉన్నది. 

76 కార్పొరేట్ బాక్సులు

వీఐపీలు కూర్చిన మ్యాచ్‌ వీక్షించేందుకు వీలుగా ఈ స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్సులు ఉన్నాయి. ప్రతి పెట్టెలో 25 సీట్లు ఉంటాయి. అంటే స్టేడియంలో పెద్ద సెలబ్రిటీల కోసం 1,900 సీట్లు కేటాయించారన్నమాట. ప్రతి స్టాండ్‌లో ఫుడ్‌, సర్వీసెస్‌ సెక్షన్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏ మూలలోనైనా కూర్చున్న ప్రేక్షకులకు ఫుడ్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

వర్షం వచ్చినా మ్యాచ్‌ ఆగదు..

ఇప్పటివరకు వర్షం కురవడం నిలిచిన తర్వాత కూడా పలు మ్యాచులు ప్రారంభం కాని దుష్టాంతాలు ఉన్నాయి. వర్షం నీరు బయటకు వెళ్లిపోయేందుకు, మైదానాన్ని ఎండబెట్టేందుకు చాలా సమయం తీసుకునేవారు. దాంతో మ్యాచులు చాలా వరకు వాయిదా పడటం, రద్దు చేయడం జరిగేది. ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మోతేరా స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. కేవలం 30 నిమిషాల్లోనే మైదానం ఎండిపోయే విధంగా వ్యవస్థను రూపొందించారు. 8 సెం.మీ వర్షం కురిసినా మ్యాచ్ రద్దు చేయకుండా ఉండేలా వ్యవస్థను సిద్ధం చేశారు.

తొలిసారి ఎల్‌ఈడీ లైట్ల వాడకం


ఇప్పటివరకు, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో మాత్రమే స్టేడియంలో ఎల్‌ఈడీ లైట్ల వాడకాన్ని చూశాం. ఇప్పుడు మోతేరా స్టేడియంలో కూడా ఎల్‌ఈడీ లైట్లను భిగించారు. ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించిన భారతదేశంలోని  మొదటి స్టేడియం ఇదే అవనున్నది. ఎల్‌ఈడీ లైట్ల వాడకం వల్ల నీడ ప్రతిబింబం రాదు.

మోతేరా క్లబ్ హౌస్

మోతేరాలో అత్యాధునిక క్లబ్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 50 డీలక్స్ గదులు, ఐదు సూట్లు, ఇండోర్, అవుట్‌ డోర్ గేమ్స్, రెస్టారెంట్లు, పార్టీ ఏరియా, 3 డీ ప్రొజెక్టర్ థియేటర్ / టీవీ రూమ్ వంటివి ఉన్నాయి. భవిష్యత్ ప్రతిభావంతులైన ఆటగాళ్లను సిద్ధం చేయడానికి ఇక్కడ శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. క్రికెట్‌తోపాటు ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, లాన్ టెన్నిస్, రన్నింగ్ ట్రాక్ వంటి ఇతర క్రీడలకు స్పోర్ట్స్ అకాడమీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఇండియాకు స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటన్‌ ప్రధాని.. చరిత్రలో ఈరోజు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo