ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రోజే సంచలనం నమోదైంది. మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ తొలి రౌండ్లోనే అన్‌సీడెడ్ చేతిలో ఖంగుతిన్నాడు. పక్షం రోజుల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు చెమటలు పట్టించిన సిట్సిపాస్ పచ్చిక కోర్టులో చతికిలపడి షాక్‌కు గురయ్యాడు. సెర్బియా వీరుడు జొకోవిచ్ తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత అదరగొట్టి ముందడుగేశాడు. మహిళల సింగిల్స్‌లో సంబలెంక, ముగురుజ తొలి మెట్టు దాటగా.. క్విటోవాకు నిరాశఎదురైంది.
లండన్: ఏడాది విరామం తర్వాత.. అభిమానుల సమక్షంలో.. వర్షం ఆటంకాల మధ్య పచ్చిక కోర్టు టెన్నిస్ సమరం వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మొదలైంది. తొలి రోజే స్టార్ ఆటగాడు, గ్రీకు ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్‌కు షాక్ ఎదురైంది. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సిట్సిపాస్ 4-6, 4-6, 3-6 తేడాతో అన్‌సీడెడ్ అమెరికన్ ఫ్రాన్సెన్ టిఫోయ్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో ఓ దశలోనూ ఫ్రాన్సెస్కు పోటీనివ్వలేక పచ్చికకోర్టులో తన బలహీనతను సిట్సిపాస్ మరోసారి ప్రదర్శించాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ 4-6, 6-1, 6-2, 6-2 తేడాతో జాక్ డ్రాపెర్పై గెలిచాడు. తొలి సెట్ కోల్పోయినా ఆ తర్వాత తన మార్క్ దూకుడు ప్రదర్శించిన జొకో సరిగ్గా 2 గంటల పాటు సాగిన మ్యాచ్‌లో ఏకంగా 25 ఏస్‌లు బాదడంతో పాటు 47 విన్నర్లు సాధించాడు. ఈ టోర్నీ గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (20) నాదల్, ఫెదరర్ రికార్డును సమం చేయాలని పట్టుదలగా ఉన్న జొకో ఆ దిశగా అడుగువేశాడు.
సబలెంక సునాయాసంగా..
మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ అర్యానా సబలెంక (బెలారస్) 6-1, 6-4 తేడాతో మొనికా నిక్లెస్కూపై అలవోక విజయం సాధించింది. మ్యాచ్ ఆసాంతం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంక ఆరు ఏస్‌లు బాదగా.. ప్రత్యర్థి సున్నాకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 3-6, 4-6 తేడాతో అన్‌సీడెడ్ స్లోయెన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. నాలుగో సీడ్ సోఫియా కెనిన్, గాబ్రిన్ ముగురుజ, ఇగా స్వియాటెక్ తొలి రౌండ్లో విజయాలు సాధించారు. 6-4, 6-2 తేడాతో వాంగ్ షిన్యూపై కెనిన్, ఫియానో ఫెర్రోపై 6-0, 6-1తో ముగురుజ గెలిచారు.