మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 03, 2020 , 00:59:27

ఉబర్‌ కప్‌ టోర్నీకి సింధు దూరం

ఉబర్‌ కప్‌ టోర్నీకి సింధు దూరం

న్యూఢిల్లీ: డెన్మార్క్‌ వేదికగా వచ్చే నెలలో జరిగే ఉబర్‌ కప్‌ టోర్నీకి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు దూరమైంది. వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి సింధు తప్పుకుంటున్నట్లు ఆమె తండ్రి పీవీ రమణ బుధవారం మీడియాకు వివరించారు. థామస్‌, ఉబర్‌ టోర్నీల తర్వాత జరిగే డెన్మార్క్‌ ఓపెన్‌లోనూ సింధు బరిలోకి దిగకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. బీడబ్ల్యూఎఫ్‌ గవర్నింగ్‌ బాడీ గత వారం సవరించిన షెడ్యూల్‌ను అనుసరించి కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత అక్టోబర్‌ 3 నుంచి మొదలవుతున్న తొలి టోర్నీ థామస్‌, ఉబర్‌కప్‌. ‘అర్హస్‌(డెన్మార్క్‌)లో జరిగే ఉబర్‌ టోర్నీలో సింధు పోటీపడటం లేదు. వ్యక్తిగత పనుల మీద టోర్నీ నుంచి తప్పుకుంది. ఆమె నిర్ణయాన్ని జాతీయ బ్యాడ్మింటన్‌ సంఘానికి తెలియజేశాం’ అని పీవీ రమణ తెలిపారు. క్రీడల పునరుద్ధరణలో భాగంగా సాయ్‌-గోపీచంద్‌ అకాడమీలో ప్రస్తుతం సింధు శిక్షణ తీసుకుంటున్నది. 


logo