బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 00:21:25

ఏ కొప్పులోకో ఈ కప్పు

ఏ కొప్పులోకో ఈ కప్పు

రెండు గ్రూప్‌లు.. నాలుగు వేదికలు.. పది జట్లు.. 17 రోజులు.. 23 మ్యాచ్‌లు.. క్రికెట్‌ అభిమానులను అలరించేందుకు మరో మెగాటోర్నీ సిద్ధమైంది. ఆస్ట్రేలియా వేదికగా నేటి నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అడుగుపెడుతున్న ఆస్ట్రేలియా.. ట్రోఫీ నిలబెట్టుకోవాలని తహతహలాడుతుంటే.. రెండు సార్లు అందినట్లే అంది చేజారిన కప్పును ఈ సారైనా ఒడిసిపట్టాలని న్యూజిలాండ్‌ కృతనిశ్చయంతో ఉంది. మొదట్లో మురిపించి తొలిసారి చాంపియన్‌గా అవతరించిన ఇంగ్లండ్‌.. ఆ తర్వాత ఒకటికి మూడుసార్లు ఫైనల్‌ చేరినా.. మలి కప్పు కల నెలవేరలేదు. గతేడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ సొంతమవడంతో ఆ దేశంలో క్రికెట్‌ క్రేజ్‌ రెండింతలైంది. మరి ఈ సారైనా ద్వితీయ విఘ్నాన్ని దాటుతుందా చూడాలి. మూడుసార్లు సెమీస్‌లోనే వెనుదిరిగిన భారత మహిళల జట్టు.. సీనియర్లు లేకుండానే మెగాటోర్నీకి సిద్ధమైంది. ఇటీవల చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న హర్మన్‌ప్రీత్‌ బృందం ఈ సారి చరిత్ర తిరుగరాసేందుకు రెడీ అయింది. మరి ఈ పది జట్లలో.. కప్పు ఏ కొప్పులోకి చేరుతుందో చూడాలి..!

  • నేటి నుంచి మహిళల టీ20 ప్రపంచకప్‌
  • తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఢీ

సిడ్నీ: పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి పురుషుల ప్రపంచకప్‌ (2007) జరిగిన రెండేండ్ల తర్వాత మహిళల విభాగంలోనూ విశ్వసమరానికి తెరలేచింది. ఇప్పటి వరకు విజయవంతంగా ఆరు టోర్నీలు ముగించుకున్న వరల్డ్‌కప్‌.. ఏడోసారి మన ముందుకొచ్చింది. మెగాటోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. అందులో ఎనిమిది టీమ్‌లు నేరుగా అర్హత సాధిస్తే.. మరో రెండు జట్లు (బంగ్లాదేశ్‌, థాయ్‌లాండ్‌) క్వాలిఫయింగ్‌ టోర్నీలో సత్తాచాటి విశ్వసమరంలో అడుగుపెట్టాయి. థాయ్‌లాండ్‌ తొలిసారి ప్రపంచకప్‌ బరిలో నిలువగా.. మిగిలిన తొమ్మిది జట్లు ఇదివరకే మెగాటోర్నీలో తలపడ్డాయి. గతేడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ నిర్వహించిన రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలోనే.. ఈ టోర్నీ జరుగనుంది.  


ఆసీస్‌కు ఎదురుందా!

పురుషుల క్రికెట్‌లో మాదిరిగానే.. మహిళల క్రికెట్‌లోనే ఆస్ట్రేలియాదే ఆధిపత్యం అనడంలో  సందేహం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఆరు టోర్నీల్లో ఐదుసార్లు ఫైనల్‌ చేరిన ఆసీస్‌ నాలుగు సార్లు కప్పు ఎగరేసుకెళ్లింది. సొంతగడ్డపై జరుగనున్న ఈ టోర్నీలోనూ నెగ్గి పాంచ్‌ పటాకా మోగించాలని చూస్తున్నది. ఇక తొలి ఎడిషన్‌లో జగజ్జేతగా నిలిచిన ఇంగ్లండ్‌ మరో మూడు సార్లు ఫైనల్‌ చేరినా.. రిక్తహస్తాలతోనే వెనుదిరుగాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్లతో అలరారుతున్న ఇంగ్లిష్‌ జట్టు ఈసారి విశ్వకప్పును ముద్దాడాలని ఉత్సుకతతో ఉంది. ఫైనల్‌ చేరిన తొలిసారే కప్పు కొ ట్టిన విండీస్‌ అమ్మాయిలను తక్కువ అంచనా వేసేందుకు లేదు. తమదైన రోజు ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగల సత్తా కరీబియన్ల సొం తం. తొలి రెండు ఎడిషన్‌లలో తుదిమెట్టుపై బోల్తా కొట్టిన న్యూజిలాండ్‌ కూడా ప్రమాదకర జట్టే. పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ సంచలనాలపై కన్నేశాయి.


డిఫెండింగ్‌ చాంపియన్‌తో ఢీ..

  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..


రెండు పటిష్ఠ జట్ల మధ్య జరుగనున్న హై వోల్టేజ్‌ మ్యాచ్‌తో మెగాటోర్నీ ఆరంభం కానుంది. ప్రపంచకప్‌ మొదటి మ్యాచ్‌లో శుక్రవారం డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల ఆసీస్‌ వేదికగా జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీలో ఫైనల్‌ చేరిన హర్మన్‌ప్రీత్‌ బృందం తుదిమెట్టుపై ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆ మ్యాచ్‌లో చేసిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్నామంటున్న హర్మన్‌ గ్యాంగ్‌ తొలి పోరులోనే కంగారూలకు చెక్‌ పెట్టి అదిరిపోయే బోణీ కొట్టాలని భావిస్తున్నది. మిడిలార్డర్‌లో అనుభవలేమితో ఇబ్బంది పడుతున్న భారత్‌.. టాపార్డర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తప్ప మిగిలినవారు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారనేది ముఖ్యం. 


బ్యాటింగ్‌లో వీరిద్దరితో పాటు యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ కీలకం కానున్నారు. విధ్వంసకర ఓపెనర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న పదహారేండ్ల కొత్త కెరటం షఫాలీ.. మంచి ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్మృతి నిలకడ కనబరుస్తుంటే.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ మాత్రం ఇటీవలి కాలంలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. భారీ షాట్లకు పెట్టింది పేరైన కౌర్‌.. ఆసీస్‌ గడ్డపై అదరగొట్టాలని జట్టు యాజమాన్యం కోరుకుంటున్నది. వెటరన్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత లోయర్‌ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గ ప్లేయర్లు లేకపోవడంతో ఇన్నింగ్స్‌ను నడిపించాల్సిన గురుతర బాధ్యత హర్మన్‌ భుజాలపై ఉంది. రిచా ఘోష్‌, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ ఆకట్టుకుంటే భారీ స్కోర్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు.


స్పిన్నే ప్రధానాస్త్రంగా.. 

సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి అందుబాటులో లేకపోవడంతో భారత జట్టు మరోసారి స్పిన్నే ప్రధానాస్త్రంగా బరిలో దిగనుంది. పూనమ్‌ యాదవ్‌, రాధ యాదవ్‌, దీప్తి శర్మ బంతితో ప్రత్యర్థిని బెంబేలెత్తించేందుకు రెడీ అవుతున్నారు. ఇద్దరు పేసర్లతో బరిలో దిగాలనుకుంటే శిఖా పాండేతో పాటు తెలుగమ్మాయి అరుధంతి రెడ్డికి జట్టులో చోటు దక్కుతుంది. ఆసీస్‌ పిచ్‌లపై 150 పరుగులు చేస్తే.. లక్ష్యాన్ని కాపాడుకోవచ్చని పేసర్‌ శిఖ అంటున్నది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో పటిష్ఠంగా కనిపిస్తున్న కంగారూలను నిలువరించాలంటే.. హర్మన్‌ సేన శక్తికి మించి పోరాడక తప్పదు.logo