ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 05, 2020 , 00:19:02

ఈ సారైనా..

ఈ సారైనా..

మహిళల పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటి వరకు నాలుగుసార్లు సెమీఫైనల్‌ చేరిన టీమ్‌ఇండియా ఒక్కసారి కూడా ఆ అడ్డంకిని దాటి ముందుకెళ్లలేకపోయింది. గత టోర్నీ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలోనే ఓడి ఇంటిబాటపట్టిన హర్మన్‌ గ్యాంగ్‌.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవడంతో పాటు.. తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించేందుకు సిద్ధమవుతున్నది. లీగ్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దుమ్మురేపి అజేయంగా నాకౌట్‌ చేరిన హర్మన్‌ప్రీత్‌ బృందం ఇంగ్లండ్‌పై కూడా అదే జోరు కనబరిస్తే.. భారత జట్టు చరిత్ర తిరగరాయడం ఖాయమే! మెగాటోర్నీలో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టిస్తున్న యంగ్‌గన్‌ షఫాలీ వర్మపై టీమ్‌ఇండియా భారీ ఆశలు పెట్టుకుంది. మిగిలిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సమయంలో మెరుపు ఆరంభాలనిస్తూ ఒంటిచేత్తో జట్టును సెమీస్‌కు చేర్చిన ఈ హర్యానా చిన్నది.. ఇంగ్లండ్‌పై కూడా అదే దూకుడు కొనసాగిస్తే.. టీమ్‌ఇండియాకు తిరుగుండదు. స్టార్‌ ప్లేయర్లు స్మృతి మంధాన, హర్మన్‌, జెమీమా రోడ్రిగ్స్‌ కూడా రాణిస్తే.. 2018లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు. బౌలింగ్‌లో మరోసారి స్పిన్నర్లపైనే భారం.

  • ఫైనల్‌ చేరాలని భారత్‌ తహతహ
  • ఉదయం 9.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..
  • మహిళల టీ20 ప్రపంచ కప్‌

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు.. అంచనాలకు మించి అదరగొడుతూ అజేయంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరుగనున్న సెమీస్‌లో పటిష్ఠ ఇంగ్లండ్‌తో హర్మన్‌ప్రీత్‌ గ్యాంగ్‌ తలపడనున్నది. గత ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమ్‌ఇండియా.. ఈసారి ఇంగ్లిష్‌ జట్టును మట్టికరిపించి తుదిపోరుకు చేరడంతోపాటు ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని చూస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన మ్యాచ్‌లో ఆడిన ఏడుగురు ఆటగాళ్లు ప్రస్తుత భారత జట్టులోనూ ఉన్నారు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చెత్త రికార్డు ఉండటం భారత్‌ను కలవరపెట్టే అంశం. ఇప్పటివరకు మెగాటోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరుగగా.. ఐదింటా ఇంగ్లండ్‌దే పైచేయి అయింది. అయితే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ముక్కోణపు టీ20 టోర్నీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించడం టీమ్‌ఇండియాకు సానుకూలాంశం. గురువారమే జరుగనున్న మరో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికాతో తలపడనున్నది.


షఫాలిపైనే భారం 

మెగాటోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి ఎక్కడ విన్నా.. షఫాలీ పేరే మారుమోగుతున్నది. తొలిసారి ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఈ పదహారేండ్ల చిన్నది.. ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 161.00 స్ట్రయిక్‌రేట్‌తో 161 పరుగులు చే సింది. టోర్నమెంట్‌లో పది పరుగులకు మిం చి చేసిన ప్లేయర్లలో ఇదే అత్యధిక స్ట్రయిక్‌రేట్‌ కావడం గమనార్హం. ఓవరాల్‌గా అత్యధిక పరుగుల జాబితాలో ఇంగ్లండ్‌ ప్లేయర్లు స్కీవర్‌ (202), హీతర్‌ నైట్‌ (193) తర్వాత షఫాలి మూ డో స్థానంలో ఉంది.  షఫాలితో పాటు మంధా న, జెమీమా, హర్మన్‌ చెలరేగితే భారత్‌ భారీ స్కోరు చేయడం ఖాయమే. బౌలింగ్‌లో పూనమ్‌, రాధ, శిఖ కీలకం కానున్నారు.


టాప్‌ లేపిన షఫాలి 

సిడ్నీ: మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత యువ సంచలనం షఫాలీ వర్మ ర్యాం కింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 2018 అక్టోబర్‌ నుంచి టాప్‌ ర్యాం కులో కొనసాగుతున్న కివీస్‌ ప్లేయర్‌ సుజీ బేట్స్‌ను వెనక్కి నెట్టి నంబర్‌వన్‌ స్థానానికి చేరుకుంది. ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన షఫాలి మెరుపువేగంతో 161 పరుగులు చేసి అదరగొట్టింది. దీంతో మిథాలీ రాజ్‌ తర్వాత మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచింది. బుధవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌లో స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రెండు స్థానాలు కోల్పోయి ఆరో ర్యాంక్‌కు పరిమితమైంది. బౌలింగ్‌లో ఇంగ్లం డ్‌ స్పి న్నర్‌ సోపియా ఎక్లెస్టోన్‌ టాప్‌ ప్లేస్‌కు చేరగా.. మెగాటోర్నీలో అదరగొడుతున్న టీమ్‌ఇండియా లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ ఎనిమిదో ర్యాంక్‌కు ఎగబాకింది. భారత స్పిన్నర్లు దీప్తి శర్మ, రాధా యాదవ్‌ వరుసగా ఐదు, ఏడు ర్యాం క్‌ల్లో కొనసాగుతున్నారు.


నేడు సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ తుది జట్లు (అంచనా)

భారత్‌: హర్మన్‌(కెప్టెన్‌), షఫాలీ వర్మ, మంధాన, జెమీమా, దీప్తి, వేద, తానియా, శిఖ, రాధ, పూనమ్‌, రాజేశ్వరి.

ఇంగ్లండ్‌: హీతర్‌ (కెప్టెన్‌), వ్యాట్‌, బ్యూమాంట్‌, స్కీవర్‌, ఫ్రాన్‌ విల్సన్‌, అమీజోన్స్‌, క్యాథరిన్‌, ష్రబ్‌సోల్‌,  మ్యాడీ, సోఫియా, సారా.


వానొస్తే.. నేరుగా ఫైనల్‌కే..

పిచ్‌, వాతావరణం

ఆస్ట్రేలియాలోని ఇతర పిచ్‌లతో  పోల్చుకుంటే.. ఇక్కడ స్పిన్నర్లకు కాస్త సహకారం లభించే చాన్స్‌ ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో వర్షం కురిసే అవకాశాలున్నాయి.

గురువారం సిడ్నీలో వర్షం కురిసే అవకాశాలు ఉండటంతో.. ఒకవేళ మ్యాచ్‌ రైద్దెతే.. గ్రూప్‌ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన జట్లు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాయి. ఈ లెక్క ప్రకారం గ్రూప్‌-ఏ నుంచి భారత్‌ (8 పాయింట్లు), గ్రూప్‌-బి నుంచి దక్షిణాఫ్రికా (7 పాయింట్లు) ముందడుగేస్తాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించాలన్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రతిపాదనను ఐసీసీ తిరిస్కరించిన విషయం తెలిసిందే.


సెమీస్‌కు చేరారిలా..

భారత్‌ (గ్రూప్‌-ఏ )

ఆస్ట్రేలియాపై 

17 పరుగులతో గెలుపు

బంగ్లాదేశ్‌పై 

18 రన్స్‌తో విజయం

న్యూజిలాండ్‌పై 

3 పరుగులతో గెలుపు

శ్రీలంకపై 7 వికెట్ల 

తేడాతో జయభేరి


ఇంగ్లండ్‌ (గ్రూప్‌-బీ )

దక్షిణాఫ్రికా చేతిలో 

6 వికెట్లతో ఓటమి

థాయ్‌లాండ్‌పై 

98 పరుగులతో విజయం

పాకిస్థాన్‌పై 

42 రన్స్‌తో గెలుపు

వెస్టిండీస్‌పై 

46 పరగులతో విజయం


ఆ మ్యాచ్‌ గుర్తుందా!.. నవంబర్‌ 22, 2018.. 

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌. లీగ్‌దశలో అదరగొట్టి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగకుండా.. అజేయంగా సెమీస్‌ చేరిన టీమ్‌ఇండియాకు ఇంగ్లండ్‌ షాకిచ్చింది. అప్పటివరకు టోర్నీలో బ్యాటింగ్‌ చేసిన రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలతో ఆకట్టుకున్న సీనియర్‌ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ను కీలక మ్యాచ్‌కు పక్కనబెట్టారు. నెమ్మదిగా ఆడుతుందనే కారణంగా అప్పటి కోచ్‌ రమేశ్‌ పొవార్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్‌ అనంతరం ఈ అంశంపై తీవ్ర దుమారం రేగినా.. అప్పటికే టీమ్‌ఇండియాకు భారీ నష్టం వాటిల్లింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 19.3 ఓవర్లలో 112 పరుగులకే ఆలౌటైంది. స్మృతి మంధాన (34), జెమీమా రోడ్రిగ్స్‌ (26) మినహా తక్కినవారు విఫలమయ్యారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అమీ జోన్స్‌ (53 నాటౌట్‌), స్కీవర్‌ (52 నాటౌట్‌) అర్ధశతకాలతో రెచ్చిపోవడంతో ఇంగ్లండ్‌ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 116 పరుగులు చేసింది.

3మహిళల ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్‌ మూడుసార్లు సెమీఫైనల్లోనే ఓటమి పాలైంది. సెమీస్‌ చేరడం ఇది నాలుగోసారి. 

0టీ20 ప్రపంచకప్‌ల్లో ఇంగ్లండ్‌పై భారత్‌ ఒక్క మ్యాచ్‌కూడా నెగ్గలేదు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. ఐదింటాఇంగ్లండే నెగ్గింది.

1ఈ మెగాటోర్నీలో షఫాలీ (161.00)దే అత్యధిక స్ట్రయిక్‌రేట్‌.


logo