శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 08, 2020 , 11:24:30

ఔర్‌ ఏక్‌ ధక్కా..ప్రపంచకప్‌ పక్కా

ఔర్‌ ఏక్‌ ధక్కా..ప్రపంచకప్‌ పక్కా

ఎన్నో ఏండ్ల నిరీక్షణ.. ఎందరో ప్లేయర్ల జీవిత కాల స్వప్నం.. చాన్నాళ్ల తర్వాత వచ్చిన చాన్స్‌.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన భారత్‌..మరొక్క మ్యాచ్‌ గెలిస్తే విశ్వవిజేతగా ఆవిర్భవించే అరుదైన సందర్భం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంనాడు ఆసీస్‌ను మట్టికరిపించి మన అమ్మాయిలు..సగర్వంగా కప్పును ముద్దాడాలని 133 కోట్ల మంది భారతీయులు ఆశిస్తున్నారు.

మెల్‌బోర్న్‌: అంతర్జాతీయ మహిళల దినోత్సవంనాడు చరిత్ర తిరగరాసేందుకు టీమ్‌ ఇండియా సిద్ధమైంది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో అదిరిపోయే ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌ చేరిన భారత జట్టు.. మరొ క్క విజయం సాధించి మొదటిసారి కప్పును ముద్దాడాలని చూస్తున్నది. ఇప్పటి వరకు ఏడు వరల్డ్‌కప్‌లు జరగ్గా.. అందులో ఒక్కసారి కూడా ఫైనల్‌ చేరలేకపోయిన టీమ్‌ఇండియా.. తుదిపోరుకు అర్హత సాధించిన తొ లిసారే విజేతగా నిలువాలని తహతహలాడుతున్నది. మరోవైపు మహిళల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్‌ను ఓడించడం భారత ప్లేయర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. మ్యాచ్‌కు ముందే మైండ్‌గేమ్‌ మొదలెట్టిన కంగారూలను కసిదీర కొట్టి కప్పు పట్టుకొస్తే.. హర్మన్‌ బృందానికి బ్రహ్మరథం పట్టేందుకు యావత్‌ భారతావని ఎదురుచూస్తున్నది. 


వాళ్లపైనే ఆశలు..

లీగ్‌దశను అజేయంగా ముగించి.. తుది సమరానికి సిద్ధమైన టీమ్‌ఇండియా వారం రోజు ల విరామం అనంతరం తిరిగి మైదానంలో అడుగుపెట్టనుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దుమ్మురేపిన పదహారేండ్ల యంగ్‌గన్‌ షఫాలీ వర్మపైనే అందరి దృష్టి నిలువనుంది. మరో ఓపెనర్‌ స్మృతి మంధానతో కలిసి షఫాలి ఇచ్చే ఓపెనింగ్‌పైన భారత్‌ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. టోర్నీలో ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. తల్లిదండ్రుల సమక్షంలో పుట్టినరోజు (ఆదివారం) నాడు మెరుపులు మెరిపిస్తే టీమ్‌ఇండియాకు తిరుగుండదు. జెమీమా, దీప్తి, వేద, తానియా కూడా తలో చేయి వేస్తే.. భారీ స్కోరు ఖాయమే! బ్యాటింగ్‌తో పోల్చుకుంటే.. బౌలింగ్‌లో భారత్‌ బలంగా కనిపిస్తున్నది. పూనమ్‌, రాధ, రాజేశ్వరి, దీప్తితో కూడిన స్పిన్‌ విభాగం మంచి జోరుమీదుంటే.. శిఖా పాండే పేస్‌ భారాన్ని మోస్తున్నది.


ఐదో కప్పుపై కన్ను

ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడటంలో కంగారూలది అందె వేసిన చేయి. ఒత్తిడిని జయించడం.. క్లిష్ట పరిస్థితుల నుం చి పుంజుకోవడంలో ఆసీస్‌ను కొట్టేవారే లేరనేది నిర్వివాదాంశం. లీగ్‌దశ తొలి మ్యాచ్‌లో భారత్‌ చేతిలో ఓడిన లానింగ్‌ బృందం.. ఆ తర్వాత వరుస విజయాలతో నాకౌట్‌కు చేరింది. బ్యాటింగ్‌లో మూనీ, హేలీ, లానింగ్‌, హైన్స్‌ కీలకం కానుండగా.. బౌలింగ్‌లో షుట్‌, సోఫియాదే భారం.


అంతర్జాతీయ మహిళా  దినోత్సవం రోజు మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ కంటే పెద్ద విషయం ఇంకేముంటుంది. భారత్‌, ఆస్ట్రేలియా జట్లకు నా శుభాకాంక్షలు. ఉత్తమ జట్టే విజయం సాధిస్తుంది. ఎంసీజీ రేపు నీలిరంగు అద్దుకుంటుంది.

-మోదీ, భారత ప్రధాని


తుది జట్లు (అంచనా)

భారత్‌: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), షఫాలీ వర్మ,స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, తానియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌, రాజేశ్వరి.

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌  (కెప్టెన్‌), మూనీ,ఎలీసా హేలీ, గార్డ్నర్‌, హైన్స్‌, జెస్‌ జాన్సన్‌, నికోలా, దిలిస్సా, జార్జియా/స్ట్రానో, సోఫియా, మెగన్‌ షుట్‌.


ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు..!

మహిళా క్రికెట్‌ రూపురేఖలు మారడానికి..

ఒక్క విజయం.. ఒకే ఒక్క విజయం..!

అబ్బాయిలతో సమానంగా పేరొచ్చేందుకు..

ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు..!

యావత్‌ భారతావని పులకించిపోయేందుకు..

ఒక్క మ్యాచ్‌.. ఒకే ఒక్క మ్యాచ్‌..!

ఆసీస్‌ మెడలు వంచేందుకు..

ఒక్క కప్పు.. ఒకే ఒక్క ట్రోఫీ..!

అమ్మాయిలకు ఆటలెందుకు అన్నవాళ్ల

నోళ్లు మూయించేందుకు..

మరిక ఆలస్యమెందుకు అమ్మాయిలూ 

జయీభవ.. దిగ్విజయీభవ..!


పిచ్‌, వాతావరణం

మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ కోసం ఫ్లాట్‌ పిచ్‌ను సిద్ధం చేశారు. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు. వికెట్‌ బ్యాటింగ్‌కు సహకరించే అవకాశాలు ఉన్నాయి.90 వేల మంది ప్రేక్షకులతో కిక్కిరిసిన స్టేడియంలో బరిలో దిగనుండటం కొత్తగా అనిపిస్తున్నది. జట్టు సభ్యులందరికీ ఇది సువర్ణావకాశం. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నిస్తాం.

- హర్మన్‌, భారత కెప్టెన్‌


మెల్‌బోర్న్‌ హౌస్‌ఫుల్‌..

ప్రపంచంలో అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు ఉన్న ఎమ్‌సీజీలో ఆదివారం జరుగనున్న ఫైనల్‌కు అనూహ్య స్పందన వస్తున్నది. మ్యాచ్‌కు రెండు రోజులు మిగిలుండగానే 75 వేల టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. ఆట మొదలయ్యేసరికి మొత్తం 90 వేల టికెట్లు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని టోర్నీ నిర్వాహకులు

అంటున్నారు.logo