గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 06, 2020 , 03:20:58

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు భారత్‌

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు  భారత్‌

నాకౌట్‌ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు విజృంభిస్తారనుకున్న చోట వరుణుడు దంచికొట్టడంతో ఒక్క బంతి కూడా పడకుండానే తొలి సెమీఫైనల్‌ రైద్దెంది. గత టోర్నీ సెమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకోవాలనుకున్న హర్మన్‌ బృందానికి వర్షం కూడా సహకరించడంతో టీమ్‌ఇండియా తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరింది. గ్రూప్‌ దశలో సాధించిన వరుస విజయాలు ఫలితాన్నిచ్చాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అద్వితీయ విజయంతో ప్రపంచకప్‌ వేటను మొదలుపెట్టిన మన అమ్మాయిలు ఆదివారం జరిగే తుదిపోరులో మరోసారి ఆ జట్టునే ఢీకొట్టనున్నారు.

  • ఇంగ్లండ్‌తో సెమీస్‌ మ్యాచ్‌ వర్షార్పణం
  • మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలుపు
  • ఆదివారం ఫైనల్లో భారత్‌, ఆసీస్‌ అమీతుమీ

సిడ్నీ: మహిళల పొట్టి ప్రపంచకప్‌ చరిత్రలో భారత జట్టు తొలిసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటివరకు ఆరుసార్లు మెగాటోర్నీ బరిలో దిగి మూడుసార్లు సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమ్‌ఇండియా.. గురువారం ఇంగ్లండ్‌తో జరుగాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ వర్షార్పణం కావడంతో ముందడుగేసింది. గ్రూప్‌-ఏలో ఆడిన ఆన్ని మ్యాచ్‌ల్లో నెగ్గి 8 పాయింట్లతో నాకౌట్‌కు చేరిన హర్మన్‌ గ్యాంగ్‌.. ఇంగ్లిష్‌ జట్టు (6 పాయింట్లు)తో తలపడాల్సి ఉండగా.. భారీ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్‌ రైద్దెంది. దీంతో గ్రూప్‌ దశలో సాధించిన పాయింట్ల ఆధారంగా భారత్‌ తుదిపోరుకు అర్హత సాధించింది. నాకౌట్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారమైన హృదయాలతో ఇంగ్లండ్‌ జట్టు ఇంటి బాటపట్టింది. మ్యాచ్‌ ఆడకుండా ఫలితం రావడం సరైంది కాదన్న భారత సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. ఇక ముందైనా కీలక మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే కేటాయిచడం మంచిదని పేర్కొంది. మరో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఆదివారం మెల్‌బోర్న్‌ వేదికగా జరుగనున్న తుదిపోరులో భారత్‌, ఆసీస్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి.


టాస్‌ కూడా పడకుండానే..

గురువారం ఉదయం నుంచే సిడ్నీలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో మొదట టాస్‌ను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా వరుణుడు శాంతించకపోవడంతో పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన తొలి సెమీఫైనల్‌ చివరకు టాస్‌ కూడా పడకుండానే ముగిసింది. దీంతో భారత్‌ ముందంజ వేసింది. అదే మైదానంలో జరగాల్సిఉన్న రెండో సెమీఫైనల్‌కు కూడా వర్షం అడ్డుపడేలా కనిపించినా.. చివరకు కాస్త తెరిపినివ్వడంతో మ్యాచ్‌ సాగింది. 


ఆసీస్‌ ఆరోసారి 


మహిళల క్రికెట్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి పొట్టి ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీఫైనల్లో డక్‌వర్త్‌ లూయిస్‌ (డ/లూ) పద్ధతి ప్రకారం ఆసీస్‌ 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. రెండు సెమీఫైనల్స్‌కు ఒకే మైదానం కావడంతో ఈ మ్యాచ్‌ కూ డా వర్షార్పణం అయ్యే సూచనలు కనిపించినా.. చివరకు వరుణుడు శాంతించడంతో మ్యాచ్‌ సాగింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (49 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌. సఫారీ బౌలర్లలో డిక్లెర్క్‌ (3/19) రాణించింది. అనంతరం మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డ/లూ ప్రకారం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 13 ఓవర్లలో 98 పరుగులకు కుదించగా.. ప్రొటీస్‌ జట్టు 92/5తో నిలిచింది. 


ప్రపంచకప్‌ను ఇలా ముగించడం నిరాశ పరిచింది. సెమీఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంటే బా గుండేది. గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓడటం వల్లే ఈ పరిస్థితి ఎదురైంది. ఈ విషయంలో ఇంతకంటే చేసేదేమీ లేదు. 

- హీతర్‌ నైట్‌ , ఇంగ్లండ్‌ కెప్టెన్‌


ఎక్కడ మొదలుపెట్టామో..తిరిగి అక్కడికే.. 

టీ20 విశ్వకప్‌లో భారత అమ్మాయిల పోరాటం ఎక్కడ ఆరంభమైందో.. ఆఖరుకు అక్కడికే చేరింది. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి శుభారంభం చేసిన టీమ్‌ఇండియా.. ఫైనల్లో మరోసారి ఆసీస్‌ను ఎదుర్కునేందుకు రెడీఅయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) నాడు జరుగనున్న పొట్టి ప్రపంచకప్‌ తుదిపోరులో హర్మన్‌ గ్యాంగ్‌ కంగారూ బృందాన్ని ఢీకొననుంది. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం పెద్దగా లేని భారత జట్టు.. కీలక పోరులో ఆసీస్‌ను ఎలా ఎదుర్కుంటుందో చూడాలి. మహిళల టీ20ల్లో ఇది ఏడో ప్రపంచకప్‌ కాగా.. అందులో ఆస్ట్రేలియా ఆరోసారి ఫైనల్‌ చేరిందంటేనే.. ఆ జట్టు ఆధిపత్యం ఎలా సాగుతుందో చెప్పొచ్చు. అయితే, తొలి మ్యాచ్‌లో కంగారూలపై నెగ్గడం హర్మన్‌ గ్యాంగ్‌లో ఆత్మవిశ్వాసం నింపే విషయం.


బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేయకున్నా.. బౌలర్లు విజృంభించడంతో ప్రపంచకప్‌ మొద టి మ్యాచ్‌లో భారత్‌.. ఆసీస్‌పై ఆధిపత్యం కనబర్చింది. యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ మెరుపులకు.. జెమీమా రోడ్రిగ్స్‌, దీప్తి శర్మ నిలకడ తోడవడంతో ఓ మోస్తరు స్కోరు చేసిన టీమ్‌ఇండియా.. ఆనక బౌలింగ్‌లో సత్తాచాటింది. లెక్క కు మిక్కిలి ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉన్న ఆసీస్‌కు  ఒత్తిడిని జయించడం వెన్నతో పెట్టిన విద్య.  మరి తొలిసారి ఫైన ల్‌ చేరిన టీమ్‌ఇండియా.. ఒత్తిడికి తలొగ్గుతుం దా..? ఆస్ట్రేలియాను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ముద్దాడుతుందా తెలియాలంటే మహిళల దినోత్సవం వరకు ఆగాల్సిందే!


చిన్నప్పటి నుంచి నేను మ్యాచ్‌ ఆడటం మా అమ్మ ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్లకు ఆమె నా ఆట ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వస్తే.. వర్షం కారణంగా అసలు మ్యాచే జరుగలేదు. వాతావరణం అనుకూలించక మ్యాచ్‌ జరుగకపోవడం దురదృష్టకరం. నాకౌట్‌ మ్యాచ్‌లకు భవిష్యత్తులో రిజర్వ్‌ డేలు ఉంటే బాగుంటుంది.  షఫాలి, స్మృతి చక్కటి ఆరంభాలు ఇస్తున్నారు. ఫైనల్లో కూడా వాళ్లు ఇలాగే రాణిస్తారని ఆశిస్తున్నా.    

- హర్మన్‌, భారత కెప్టెన్‌


logo
>>>>>>